శుక్రవారం సాయంత్రం తన 96వ ఏట శివసాయుజ్యం పొందిన పురాణ ప్రవచనకారులూ, తెలుగు, సంస్కృత భాషలలో పండితులు మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారు పరమ సౌమ్యులు. తెలుగునాట ఈ రోజులలో ప్రవచక త్రయంగా భాసిల్లుతున్న శ్రీయుతులు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు ,సామవేదం షణ్ముఖశర్మలు గొప్ప పండితశిరోమణిగా భావించి గౌరవించే శాస్త్రిగారు 96 సంవత్సరాలు అర్థవంతమైన నిండు జీవితం గడిపారు. ప్రవచన భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాతనే పరమపదించారు. ఎన్నో సత్కర్మలు ఆచరించారు కనుకనే అనాయాస మరణం సంభవించింది.
శాస్త్రిగారు నాకు అత్యంత ఆత్మీయులు. 1994లో మా అమ్మగారు భారత సావిత్రి కన్నుమూసిన సందర్భంలో పన్నెండవ రోజు మా సోదరులనూ, కుటుంబ సభ్యులను ఆశీర్వదించేందుకు ప్రేమాభిమానాలతో స్వయంగా వచ్చి కొన్ని గంటల సేపు కూర్చొని వెళ్ళారు. నేను దిల్లీ వెళ్ళక ముందు ఉదయం పత్రిక సంపాదకుడిగా విజయవాడ నుంచి హైదరాబాద్ 1989లో వచ్చిన వెంటనే ఎడిటోరియల్ పేజీలో పైనుంచి కింది వరకూ రెండు సింగిల్ కాలమ్స్ నిడివితో ఒక కాలమ్ రాయమని నేను చేసిన అభ్యర్థనను మన్నించి ‘ధర్మపథం’ పేరుతో ధారావాహిక రాశారు. సహచరులు బాలకృష్ణమాచారి, జనార్దనాచారి ఆశోక్ నగర్ లో శాస్త్రిగారి నివాసానికి వెళ్ళి కాలమ్ తెచ్చేవారు. ఆయన రాసింది రాసినట్టు ప్రచునించాలనీ, అక్షరం మార్చవద్దనీ వారిని కోరాను. ఆయన రాసుకొని సిద్ధంగా ఉండేవారు. మా వాళ్ళు వెళ్ళిన వెంటనే అందజేసేవారు. ఆయన క్రమశిక్షణకు మారుపేరు. 1990 నుంచి 1992 వరకూ ఈ కాలమ్ నడిచి విశేషంగా పాఠకాదరణ పొందింది. ఆ తర్వాత చాలా సందర్భాలలో వారిని దర్శించుకున్నాను. హాయిగా నవ్వుతూ మనస్పూర్తిగా ఆశీర్వదించేవారు. హైదరాబాద్ లో విద్యార్థిగా ఉన్న రోజుల నుంచీ ఆయన ప్రవచనాలు వినేవాడిని. సికిందరాబాద్ మహబూబ్ కాలేజీలో జరిగిన ప్రవచనాలను ప్రతిరోజూ వినేవాడిని. ఇటీవల శృంగేరీపీఠాధిపతి హైదరాబాద్ వచ్చినప్పుడు వారి సమక్షంలో శాస్త్రిగారు చేసిన అద్భుతమైన ప్రసంగం తాలూకు వీడియోను నా బంధువులకూ, సన్నిహితులకూ అనేకమందికి పంపించాను.
మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాస, మహమహోపాధ్యాయ బిరుదాంకితులు. 22 ఆగస్టు 1925నాడు అర్ధరాత్రి (తెల్లవారితే వినాయకచవితి) దక్షిణామూర్తిశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు జిల్లా పత్తెనపల్లి తాలూకా గోరంట్ల అగ్రహారానికి చెందిన మల్లాది వంశంలో రామకృష్ణ చయనులు అనే బహుముఖ ప్రజ్ఞాశాలి హైదరాబాద్ సంస్థానంలో అత్యంత ప్రముఖుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగిగా ఉన్న మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు దత్తత వచ్చారు. అందుకని వారికి హైదరాబాద్ మల్లాదివారని పేరు వచ్చింది. రామకృష్ణ చయనులు పది భాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. పరమ నైష్ఠికుడు. ఆచారవ్యవహారాలలో నిక్కచ్చిగా ఉండేవారు. చయనులుకు ముగ్గురు కుమారులలో చంద్రశేఖరశాస్త్రిగారి తండ్రి రెండవవారు. ముగ్గురు కుమారుల సంతానంలో చంద్రశేఖరశాస్త్రి అగ్రజుడు. అందుకే ఆయనంటే తాతగారు రామకృష్ణ చయనులుకు చాలా ఇష్టం. నెలల బాలుడుగా ఉన్నప్పుడు చంద్రశేఖరశాస్త్రిగారిని తాతగారు హైదరాబాద్ తీసుకొని వచ్చి పెంచారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదేవమ్మగారే ఆయనను సాకారు. చయనులుగారే శాస్త్రిగారికి ఉపనయనం చేశారు. ఆయనే తర్క ప్రకరణాలనూ, శ్రౌతస్మార్తాలూ నేర్పించారు.
చంద్రశేఖరశాస్త్రిగారి తండ్రి దక్షిణామూర్తిశాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితుడు. పెత్తండ్రి వీరరాఘవవశాస్త్రి తర్కవేదాంత పండితులు. ఆయన దగ్గర తర్కం చదువుకున్నారు. పినతండ్రి హరిశంకరశాస్త్రి దగ్గర వేదాధ్యయం చేశారు శాస్త్రిగారు. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నారు. తెలుగు వీధిబడిలో చదివారు. పంచదశి, వేదాంతభాష్యం, వ్యాకరణంపై అధికారం సంపాదించారు.
రామకృష్ణ చయనులుగారికి శాస్త్రిగారు పురాణ ప్రవచనం చెప్పాలని గొప్ప కోరిక ఉండేది. అందుకే శాస్త్రిగారిని ఇంగ్లీషు చదువులకు దూరంగా ఉంచారు. 15 ఏళ్ళ వయస్సులోనే ప్రవచన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అది ఏడు దశాబ్దాలపాటు నిరాఘాటంగా, ప్రతిభావంతంగా, జనప్రియంగా సాగింది. పురాణం చెబుతూ నాటి ఘటనలను వర్తమాణ పరిణామాలకు అన్వయించడంలో ఆయన దిట్ట. వారి సుదీర్ఘ పురాణ ప్రవచన ప్రస్థానంలో (పురాణ కాలక్షేపం అనకూడదని ఆయన గట్టిగా చెప్పేవారు) ఎన్నో సంస్థలకు చెందిన ఎందరో ప్రముఖులు ఆయనను సత్కరించి తమను తాము గౌరవించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ఆస్థాన పండితులుగా పని చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పేవారు. భద్రాద్రి సీతారామ కల్యాణానికీ, శ్రీశైలంలో భ్రమరాంబామల్లికార్జునుల కల్యాణానికీ కర్ణపేయంగా, భక్తజన పారవశ్యంగా వ్యాఖ్యానం చెప్పేవారు. ఆకాశవాణిలో, దూరదర్శన్ లో అనేక ఉపన్యాసాలు చేశారు. ధర్మసందేహాలకు సమాధానాలు చెప్పేవారు. ప్రతి తెలుగు ఉగాదినాడు పంచాగశ్రవణం ప్రతిష్ఠాత్మకంగా, శోభాయమానంగా, శుభకరంగా జరిగేది. కొప్పరపు కవుల కళా పీఠము సౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారికి 2007లో పురస్కార ప్రదానం చేసింది.
అమరావతిలో నివసించే రోజులలో జాగర్లమూడి రామశాస్త్రి, గోళ్ళమూడి ప్రసాదరావు ప్రోత్సాహంతో పద్యపఠనం, ప్రతిపదార్థ తాత్పర్యం చెప్పడం అలవడింది. ప్రసాదరావు వైద్యుడు. ఆయన భాస్కరరామాయణం ఇచ్చి పద్యాలు శాస్త్రిగారి చేత చదివించుకునేవారు. సాయంత్రం ఆయన నివాసంలోనే గ్రామస్థుల సమక్షంలో నిత్యం రామాయణం చెప్పారు. నరసరావు పేట వచ్చిన పుష్పగిరి పీఠాధిపతి శాస్త్రిగారి చేత పురాణ ప్రవచనం చెప్పించుకొని ఆనందించారు. నెలకు 40 రూపాయల వేతనంమీద పుష్పగిరి ఆస్థానంలో పురాణపండితునిగా నియమించారు. పీఠాధిపతితో గ్రామాలు తిరుగుతూ సంవత్సరన్నరపాటు ప్రవచనం చెప్పారు. విజయవాడలో పెత్తండ్రి వీరరాఘవశాస్త్రిగారి ఆధ్వర్యంలో బ్రహ్మసత్రయాగం జరిగింది. ఆ సందర్భంగా వెళ్ళి అక్కడ సంవత్సరంపాడవునా పురాణ ప్రవచనం చెప్పారు. తన 25వ ఏట ఈమనికి చెందిన సీతారామ ప్రసన్నతో వివాహం జరిగింది. సంవత్సరం తర్వాత 1951లో కొడుకు పుట్టాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత అయిదుగురు కుమారులూ, ఇద్దరు కుమార్తెలూ పుట్టారు. ఒక కుమార్తె పేరు తల్లి పేరు ఆదిలక్ష్మి అనీ, రెండవ కుమార్తెపేరు తన నాలుకపైన నాట్యం చేసే సరస్వతి అనీ పెట్టుకున్నారు. వీరందరి పెంపకం, చదువులూ, పెళ్ళిళ్లూ యావత్తూ పురాణ ప్రవచనాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే చేశారు.
ప్రవచన కార్యక్రమాలలో పడి రెండు, మూడు నెలలపాటు ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ తన భార్య అన్ని పనులు సమర్థంగా చక్కబెట్టేవారని, లేకపోతే తాను ప్రవచనాలు చెప్పగలిగేవాడిని కానని ఆయన ‘సాక్షి’ ఆదివారం అనుబంధం ‘ఫన్డే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతజ్ఞతాపూర్వకంగా చెప్పుకున్నారు. బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావూ వంటి రాజకీయ ప్రముఖులూ, చిత్తూరు నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి సినీ ప్రముఖులు శాస్త్రిగారిని ఎంతగానో గౌరవించేవారు. చిత్తూరు నాగయ్య ఒక రోజు శాస్త్రిగారిని తన ఇంటికి పిలిపించుకొని నూతనవస్త్రాలతో సత్కరించి చేతికి స్వర్ణకంకణం తొడిగారు.
వయోభారం కారణంగా 2011లో పురాణ ప్రవచనానికి స్వస్తి చెప్పారు. చమత్కార సంభాషణలతో, చిన్నచిన్న కథలతో ఉపన్యాసాన్ని రక్తికట్టించేవారు. ఒకే అర్థం వచ్చే తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు పదాలను అలవోకగా ప్రయోగించేవారు. సందర్భశుద్ధి బాగా తెలిసిన వక్త. ప్రవచనంలో తాదాత్మ్యం చెందడం ఆయనలోని ప్రత్యేకత. వైదిక ధర్మ ప్రచారానికి జీవితం అంకితం చేసిన మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారు నిండు జీవితం జీవించారు. ఆయన ధన్యజీవి. కాషాయ దుస్తులు ధరించని కర్మయోగి.