“వంద వసూలు చెయ్యి. అరవై కేంద్రానికి ఇవ్వు. నీకు మిగిలిన నలభైలో ఇరవై ఐదు ఉద్యోగులకు జీతాలుగా ఇవ్వు. పది పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్ గా ఇచ్చి, మిగిల్చిన ఐదును పేద ప్రజలకు పంచు. అందరూ కలిసి ఆ ఐదునే పప్పు బెల్లాలు అంటూ హేళన చేస్తారు. ఇదిచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నావని అంటారు. వందలో ఐదుకే ఇలా గాబరాపడిపోతారు” అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ గోపి దారా తన ఫేస్ బుక్ వాల్ మీద ఒక చిన్న వ్యాఖ్య రాసుకున్నారు. నేటి తరపు జర్నలిస్టులలో నిర్భయంగా నిజాలు చెప్పగలిగిన అతికొద్ది మంది జర్నలిస్టులలో ఆయన ఒకరు. నిజానికి ఆయన ఈ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారన్న వార్తల నేపథ్యంలో. చివరకు సమ్మె ఆగిపోయిందనుకోండి.
ప్రభుత్వ ఆదాయంలో 36 శాతం ఉద్యోగుల జీతభత్యాలకే
నిజానికి మన రాష్ట్ర ఆర్థిక చిత్రంలో రూపాయి రాకపోకలను గమనిస్తే మన మొత్తం ఆదాయంలో 36 శాతం ఉ ద్యోగుల జీతభత్యాలకే వెచ్చిస్తున్నారన్నది నిష్టురమైన నిజం. ఆదాయపు ఖర్చులో ఉద్యోగుల జీతాలే గుదిబండలు అవుతున్నాయని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు లౌక్యం తెలియక అనేసి ఉద్యోగుల కోపానికి గురయ్యారు. అయితే, వారి ఆగ్రహం ప్రభుత్వాలను మార్చివేస్తుందన్న భ్రమలు ఎవరికీ లేకపోయినప్పటికీ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా పనులు సాఫీగా సాగుతాయన్న ఆలోచనలో తరువాతి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండేవారు. చంద్రబాబు అవకాశం వచ్చినప్పుడల్లా ఉద్యోగులను తర్జని చూపుతూ బెదిరిస్తూ, బహిరంగ సమావేశాలలో అధికారులను ప్రజల ముందు కించపరిచి అవమానిస్తూ, రాజకీయ నాయకులకూ ప్రభుత్వ ఉద్యోగులకూ మధ్య సంఘర్షణ వచ్చిన ప్రతిసారీ రాజ కీయంవైపే ఉంటూ తన ప్రాధాన్యతలను చెప్పకనే చెప్పేవారు. విద్యార్థి సంఘాలను నిర్వీర్యం చేసినట్లే ఉద్యోగుల సంఘాలను నిర్వీర్యం చేయాలని భావించి తన తైనాతీలను ఉద్యోగ సంఘ నాయకులుగా నిలబెట్టి చేయని కుట్రలు లేవు. వీటి గురించి తెలుసుకోవడానికి చరిత్ర పుస్తకాలు తిరగేయాల్సిన పని లేదు. ఇదంతా సమీపకాలపు గత చరిత్రే. అయినా ఉద్యోగులు ఇదంతా ‘కన్వీనియంట్’ గా మర్చిపోయారు.
ఉద్యోగులను ప్రజలు తప్పుపట్టలేదు
వారలా మర్చిపోవడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు పెద్దగా తప్పు పట్టలేదు. ఎవరికైనా జీతాలు పెంచుకోవడానికి ఉన్నన్ని దారులూ వినియోగించుకోవాలని ఉంటుంది. ఆ విధంగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా గత పదేళ్లుగా పెద్దగా జీతాలు పెరగక సతమతమవుతున్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. వారి జీతాల పెంపుదల కోరికను ఎవరూ ఆక్షేపించలేదు. దానికోసం ఉద్యోగులు ఏం చేసినా ప్రజలు సహకరించేవారు. ఉదాహరణకు సమ్మె చేసినట్లయితే ప్రజలు తమ వివిధ కార్యాలయ అవసరాలను వాయిదా వేసుకోవడం వంటి సర్దుబాటు చేసుకునేవారు. ఉద్యోగుల కోరికలో అసమంజసం ఏమీ లేదన్న ఆలోచన ప్రజలలో తొలి వారం రోజుల పాటు ఉండేది. అందుకు తగినట్లుగానే ఉద్యోగులు తమ కార్యాచరణ ప్రకటించారు. ఉద్యమ సెగ ప్రభుత్వానికి తెలియాలని భావించారు. అన్ని వర్గాల ప్రజలను అన్ని రకాలుగా ప్రసన్నం చేసుకోవాలని నిరంతరం ప్రయత్నించే ముఖ్యమంత్రి పాలనలో ఇలాంటి ఆందోళనలు మరింత అధికంగా ఉండేవే.
వీధులలోకి వచ్చిన జనం ఎవరు?
సమస్య ఎక్కడ వచ్చిందంటే ఉద్యోగులంతా తమ బల ప్రదర్శనకు విజయవాడ వెళ్లడానికి ఎంచుకున్నప్పుడు. సరిగ్గా దానికి రెండు రోజుల ముందే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న – తమకు జీతాలు తగ్గిపోయాయన్న – వాదనను తిప్పికొట్టడానికి ప్రభుత్వం గత నెల జీతాన్ని ఈ నెల జీతంతో పోల్చి ప్రజలకు వివరంగా చూపించింది. ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో ఉన్నదీ ప్రజలకు తెలిసింది. తీరా విజయవాడ దృశ్యం తమకే తెలియని మరికొన్ని కొత్త సంగతులు చెప్పింది. తమకు తెలిసిన ఉద్యోగులందరూ తమ చుట్టూనే ఉన్నప్పుడు నేల ఈనినట్టు సముద్రం కట్ట తెగినట్టు, ఆకాశంలో చుక్కలు రాలినట్లు ఒక్కసారిగా అంత జనప్రవాహం అక్కడ ఎలా చేరినట్లు? ప్రజలకు మీమాంస మొదలైంది. ప్రతిపక్షాలు పన్నిక కుట్రలో భాగంగా దీనిని అర్థం చేసుకున్నారు. ఉద్యోగుల జీతాల పెంపుదల ఆశను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షం వాడుకునేలా ఉందని వారు భావించారు. దీనికి ఊతమిచ్చే విధంగా చంద్రబాబు ఈ సమస్యగురించి ఎలాంటి స్టేట్మెంట్లూ చేయక నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం వారి అనుమానాలను పెంచింది. చంద్రబాబు వ్యవహారశైలి ప్రజలకు కొట్టిన పిండి.
ఉద్యోగనాయకుల సంస్కారం
ఇక ఆ రోజంతా మన ప్రభుత్వ ఉద్యోగులు మీడియా గొట్టాల ముందు నిలబడి ‘అత్యంత సంస్కారవంతంగా’ మాట్లాడిన మాటలు ఉద్యోగులే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి ప్రజలకు వినోదాన్ని అందించాలనుకున్నారు. అది మిస్ ఫైర్ అయింది. నెలకు దాదాపు లక్ష రూపాయలు జీతంగా తీసుకునే ఉద్యోగులు.. విపత్కర పరిస్థితులలో వివిధ రూపాలలో ఏడాదికి యాభై వేల రూపాయల ప్రభుత్వ సహాయాన్ని అందుకుంటున్న రైతులను, రైతుకూలీలను, వివిధ వృత్తుల వారిని, ఆటో డ్రైవర్లను, రకరకాల వివిధ వృత్తి పనివార్లను, హమాలీలను తదితరులందరినీ అవమానించడం తట్టుకోలేకపోయారు. ఉద్యోగులకు దక్కవలసిన సొమ్మును వారికి దక్కనివ్వకుండా చేసి, తమకేదో దోచిపెడుతున్నట్లు వారంతా అవమానకరంగా మాట్లాడడం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆ అలగాజనమంతా తమ పిన్నమ్మలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, పెదనాన్నలు, మామయ్యలు, అత్తయ్యలు అన్న సంగతి తాము భద్రలోక వేతన జీవులుగా మర్చిపోయారు.
చేసిన మేలు చెప్పుకోలేకపోయారు
రాజకీయ అవినీతిని, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని గత మూడేళ్లుగా గణనీయంగా తగ్గించడం ద్వారా వచ్చిన మిగులు సొమ్మును సంక్షేమానికి ప్రభుత్వం వినియోగిస్తుందని ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పలేకపోతున్నారు. అసలు మన రాజ్యమే సంక్షేమ రాజ్యమని, సంక్షేమంలోనే అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు దాగి ఉందని రాజకీయ నాయకులు ప్రజలకు, ఉద్యోగులకు వివరించి చెప్పలేకపోవడానికి కారణం ఇంకా వారు పాత ఆలోచన ధోరణిలోనే ఉండడం. జగన్ కలలు కంటున్న నూతన రాజకీయాలను తన అనుచర నాయకులే అందుకోకపోవడం శోచనీయం. ఇందులో ఆశావహకమైన విషయం ఏమంటే, ప్రజలు దానిని కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటున్నారు. దానికి కారణం ఆ మార్పు ఫలితాలు వారు అనుభవిస్తుండడమే.