Thursday, November 7, 2024

ఆయుధాలు అమ్ముకోడానికే అమెరికా యుద్ధాలు

ఇతరదేశాల్లో సైనిక జోక్యాలు చేసుకోవలసిన, దశాబ్దాల తరబడి సైన్యాలను వినియోగించవలసిన అవసరం అమెరికాకు ఎందుకు వచ్చిందో వివరిస్తున్నారు దేవరకొండ సుబ్రహ్మణ్యం.

ఇరవై సంవత్సరాల సైనిక జోక్యం తర్వాత అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వైదొలగడం ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో అమెరికా సైనిక జోక్యం గురించిన చర్చను మరొకసారి ముందుకు తెచ్చింది. ఆయుధాల ఉత్పత్తిలో,ఉత్పత్తి చేసిన ఆయుధాలను మిగతా దేశాలకు అమ్మడంలో అమెరికా సుమారు 60 సంవత్సరాలుగా అగ్రభాగాన ఉంది. ఆ దేశపు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఆయుధాల ఉత్పత్తే ముఖ్యభాగం. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎస్‌ఐ‌పి‌ఆర్‌ఐ) పరిశోధన ప్రకారం, అమెరికాలోని ఆయుధ కంపెనీలు, రక్షణరంగ సేవల సంస్థలు అంతర్జాతీయ ఆయుధ అమ్మకాలలో 37 శాతం ప్రాతినిధ్యంతో ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. అమెరికా మొత్తంగా ఆయుధాల మీద, రక్షణ మీద 2020లో చేసిన ఖర్చు 778 బిలియన్ డాలర్లు. అంటే 77,800 కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 58 లక్షల కోట్ల రూపాయలు. ఆ తర్వాత10 స్థానాల్లో ఉన్న దేశాలు – చైనా, ఇండియా, రష్యా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్, జపాన్, దక్షిణ కొరియా,బ్రెజిల్. ఈ పది దేశాల మొత్తం ఖర్చు కలిసి కూడ అమెరికా ఖర్చు కన్న తక్కువే. అంటే ఆర్దికంగానే కాకుండా, రాజకీయంగా కూడా అమెరికాకి ఆయుధాల ఉత్పత్తి, అమ్మకాలు, వినియోగం చాలా అవసరం.

ఈ మారణాయుధాలు అమెరికా ఉత్పత్తి చేసినవే

అమెరికా మొత్తం ఖర్చులో 15 శాతం ఆయుధ పరిశ్రమమీదే

అమెరికా మొత్తం ఖర్చులో 15 శాతం ఆయుధ పరిశ్రమ మీదనే ఖర్చు పెడుతుంది. 2019లో మొత్తం దేశ రక్షణ కోసం కేటాయించిన 716 బిలియన్ డాలర్లలో 686 బిలియన్ డాలర్లు, అంటే 96 శాతం, రక్షణ  శాఖకే కేటాయించింది. మొత్తం అమెరికా పారిశ్రామిక ఉత్పత్తిలో సుమారు 10 శాతం కాంట్రాక్ట్ ఆయుధ నిర్మాణం, అంటే ఇతర దేశాల ప్రభుత్వాల కోసమో, బహుళ జాతి సంస్థల కోసమో ఆయుధాలు ఉత్పత్తి చేసి ఇవ్వడం. ఇప్పుడు ఆ ఆయుధనిర్మాణ పరిశ్రమలో ఉద్యోగాలు నిలపడం కోసం, అమెరికాకు సొంతంగా అవసరం లేకపోయినా నిరంతరం ఆయుధ ఉత్పత్తి జరగవలసిందే. అంటే, అమెరికా ఆర్థిక పరిస్థితి బావుండాలంటే తప్పనిసరిగా ఆయుధ ఉత్పతి జరుగుతూనే ఉండాలి.

అమెరికా పాలనా, సైన్యమూ1960ల తర్వాత నుంచి “సైనిక పారిశ్రామికకూటమి” చేతుల్లోకివెళ్లిపోయాయి. ఈ “సైనిక పారిశ్రామికకూటమి” ఏర్పడకముందే అమెరికా సైన్యం ఆ దేశపు రక్షణ అవసరాల కోసం ప్రైవేట్ పరిశ్రమ మీదే ఆధారపడుతూ ఉండేది. ఈ కూటమి ఏర్పడ్డాక ప్రభుత్వ అవసరాలన్నీ చూసే పని ఈ కూటమికే అప్పగించడం అలవాటయిపోయింది. ఆయుధ పరిశ్రమ ముఖ్య ఉద్యోగులు, సంధానకర్తలు (లాబీయిస్టులు) చాలా సులభంగా ప్రభుత్వోద్యోగాలు, నిర్ణయాధికారస్థానాలు సంపాదించడం ఈ అరవై ఏళ్లుగా అమెరికాలో మామూలయిపోయింది. అలా అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉండడం, ఇతర దేశాల పాలకులు పరస్పరం యుద్ధాలు చేసుకునేలా ఒత్తిడి తేవడం, తాను స్వయంగానో, తన తైనాతీలతోనో ఇతరదేశాల్లో ఆయుధ జోక్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ అవసరాలుగా మారిపోయాయి.

కొన్ని ఉదాహరణలు:

ఇతరదేశాలలోఅమెరికా జోక్యంచేసుకోవడం చాలాసంవత్సరాలుగా జరుగుతోంది. ఈ జోక్యం సైన్య (యుద్ధ), రాజకీయ, దౌత్య, ఆర్థిక స్థాయిల్లో వేరువేరుగా ఉంటుంది. ఈ జోక్యం ప్రపంచంలో ప్రజాస్వామ్యం  కాపాడడానికి, ఆ దేశాలలో ఆయుధ నిర్మాణం ఆపడానికి అనివార్యం అవుతున్నదని అమెరికా ప్రభుత్వం చెప్పే ముఖ్యకారణం.19వ శతాబ్ది మొదలు ఇప్పటిదాకా వివిధ దేశాలలో ఈ అమెరికా దౌర్జన్యం సాగుతూనే ఉంది. ఈ దుర్మార్గం ఒక్కొక్కప్పుడు తన ముఖ్య నిఘా, రక్షణ సంస్థ సి‌ఐ‌ఎ ద్వారా ఆ దేశాల అంతర్గత వ్యవహారాల్లో కలగచేసుకోవడం ద్వారా మొదలు పెట్టి, సైన్యం పంపడంతో పూర్తవుతుంది.

1961లో కెన్నెడీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అప్పుడే చేగువెరా, ఫైడెల్ కాస్ట్రో విజయవంతంగా విప్లవం సాధించిన క్యూబా దేశంలో, బే ఆఫ్ పిగ్స్ మీద సైనిక దండయాత్ర ద్వారా కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంచేశారు. తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులకు సహాయం చేయడం ద్వారా కూడా క్యూబాలో స్థిరత్వం లేకుండా చేశారు. అలాగే డొమినికన్ రిపబ్లిక్ లో సి‌ఐ‌ఎ సహాయంతో అక్కడి నియంతను హత్య చేయించి,అంతర్యుద్ధం జరిగేలా చేసి తమ సైన్యం పంపించి అక్కడ కలగచేసుకున్నారు.

వియత్నాం అంతర్యుద్ధంలో దక్షిణ వియత్నాంలోకి సైన్యాన్ని పంపి, ఉత్తర వియత్నాంతో యుద్ధం చేయడం మనందరికీ తెలుసు. ఉత్తర వియత్నాం గెరిల్లా వియత్కాంగ్ యోధులు హోచిమిన్ నాయకత్వంలో అమెరికాని ఓడించి దక్షిణ వియత్నాంను స్వాధీనపరచుకొని మొత్తం వియత్నాంను ఒకటి చేశారు. అదే సమయంలో అమెరికా కాంబోడియా, లావోస్ లలో తిరుగుబాట్లను అణచివేసే పేరుతో అమెరికా సైనిక జోక్యం చేసుకుంది.

మృత్యుశకటాలు

ఇరాక్ జన విధ్వంసక మారణాయుధాలు తయారు చేస్తోందని, సద్దాం హుస్సేన్ ప్రభుత్వం మీద దాడి చేసి, గెలిచి, కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నియమించి, సద్దాంను ఉరి తీసింది. అలాగే అఫ్ఘనిస్తాన్ లో 2001 లో ఎక్కువభాగం పాలిస్తున్న తాలిబాన్ మీద దాడి చేసి, అక్కడి ప్రభుత్వాన్నీ ప్రజలనూ కాపాడే మిష మీద సైన్యాన్ని దించింది. అక్కడ తమ సైన్యాన్ని 2021 వరకూ వుంచి 20 ఏళ్లలో సుమారు ఒక ట్రిలియన్ డాలర్లు వెచ్చించిందని సమాచారం.

ఆయుధ విక్రేతలలో అమెరికాదే అగ్రస్థానం

ఇంతే కాక, మిగతా దేశాలకి ఆయుధాలు అమ్మే దేశంగా, మొత్తం ప్రపంచ ఆయుధ అమ్మకాలలో మొదటి స్థానంలో ఉంది అమెరికా. ఆయుధాల అమ్మకంలో, మొత్తంగా రక్షణ పరికరాల వ్యాపారంలో, అమెరికా విదేశాంగ విధానంలో రాజకీయ, సైనిక, ఆర్ధిక, ఆయుధ నియంత్రణ, పౌరహక్కుల పరిస్థితి వంటి ఎన్నో కోణాలు చోటుచేసుకుంటాయి. 2020 లో అమెరికా సుమారు 175బిలియన్ డాలర్ల రక్షణ సామగ్రి ఇతర దేశాలను అమ్మింది. ఇందులో ఎక్కువ భాగం సౌదీఅరేబియా,తదితర ఆయిల్ ఉత్పత్తి దేశాలు కొన్నాయి. మొత్తం 96 దేశాలకు అమెరికా ఆయుధాలు అమ్ముతోంది. ఈ ఆయుధాల అమ్మకం ద్వారా ఆయా ప్రభుత్వాలను అధీనంలో పెట్టుకుని తమ పరిశ్రమల కోసం అవసరమైన, ఆయా దేశాలలో ఉన్న ఖనిజ సంపద (లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు) మీద, ఆయిల్ సంపద (ఇరాక్) మీద అజమాయిషీ సంపాదించడం ఇంకో ముఖ్య కారణం.

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రజాస్వామ్యం నిలబెట్టడం, మరే దేశమూఆయుధాల ఉత్పత్తి చేయకుండా చూడడం, మిగతా దేశాల్లో పౌరహక్కులు కాపాడడంలాంటి సాకులూ కారణాలూ చూపి ప్రపంచంలో శాంతి లేకుండా చేయడానికి తనకు హక్కు ఉందని అమెరికా నమ్ముతోంది.

ఈ వ్యాసం కోసం పరిశీలించిక లింకులు

1 https://www.bbc.com/news/business-56397601

3.https://stacker.com/stories/5549/50-insights-us-military-industrial-complex

4.https://www.sipri.org/databases/armsindustry

5.https://www.nytimes.com/2017/09/22/business/economy/military-industrial-complex.html

6. https://en.wikipedia.org/wiki/United_States_involvement_in_regime_change

(రచయిత అర్థశాస్త్రవేత్త, నాటకరంగ కార్యకర్త)

(ఈ వ్యాసం ‘వీక్షణం’లో ప్రచురితమైంది. ‘వీక్షణం‘ సంపాదకుడు ఎన్. వేణుగోపాల్ కి ధన్యవాదాలతో)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles