హైదరాబాద్ : పోచంపల్లి చేనేత చీర పైన తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన లోక్ సభ సభ్యురాలు మొహువ మోయిత్రా ప్రశంసలు కురిపించారు. భారతీయ చేనేత వస్త్రాలు అద్భుతంగా ఉంటాయన్న ఆమె, పోచంపల్లి చీర అందాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత వారం హైదరాబాదులో పర్యటించిన ఐటీ పైన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సభ్యులకు మంత్రి కే.తారకరామారావు తెలంగాణ ప్రభుత్వం తరఫున చేనేత వస్త్రాలను అందించారు. ఈ కమిటీ అధ్యక్షుడు, తిరువనంతపురం నగరం నుంచి లోక్ సభకు ఎన్నికైన శశిథరూర్ తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నిర్వహణ సామర్థ్యాన్నీ, ఐటీ రంగంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని ప్రశంసించారు.
పోచంపల్లి చేనేత వస్త్రాలను తన ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన ఎంపీ మొహువ మోయిత్రా కు మంత్రి కే. తారకరామారావు ధన్యవాదాలు తెలిపుతూ ట్వీట్ చేశారు. మోయిత్రా ప్రముఖ త్రిణమూల్ నాయకురాలు. అమెరికాలో చదువుకొని, ఉద్యోగాలు చేసి, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా వచ్చి రాజకీయాలలో ప్రవేశించారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలుగా, ప్రతిభావంతమైన వక్తగా, బీజేపీని విమర్శించడంలో దిట్టగా రాణిస్తున్నారు.