నిరుగు గల్వాన్ లోయలో చైనా సైనికుల దురాక్రమణను ప్రతిఘటిస్తూ అమరుడైన నల్లగొండ జిల్లావాసి కల్నల్ సంతోష్ బాబుకు మహావీరచక్ర బిరుదు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చైనా సరిహద్దులో వీరమరణం పొందిన తెలుగుతేజానికి యుద్దసమయంలో చూపించే సాహసం, శౌర్యం, తెగువకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇస్తారు. సైనికులకు ఇచ్చే పురస్కారాలలో మహావీరచక్ర రెండో అత్యున్నత పురస్కారం. అత్యున్నత పురస్కారం పరమవీరచక్ర.
పదహారవ బిహార్ రెజిమెంట్ కు కమాండింగ్ అధికారిగా గల్వాన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సంతోష్ బాబు 15 జూన్ 2020నాడు చైనా సైనికులతో తలబడి అమరుడైనారు. 13 ఫిబ్రవరి 1983లో సూర్యాపేటలో జన్మించిన సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో ప్రాథమిక విద్యనభ్యసించారు. 27 డిసెంబర్ 2000న జాతీయ డిఫెన్స్ అకాడెమీలో చేరారు. 10 డిసెంబర్ 2014న 16వ బిహార్ రెజిమెంట్ చేరారు.
Also Read : గానగంధర్వుడు ఎస్ పీబీకి పద్మవిభూషణ పురస్కారం
శౌర్య సేనా పతకానికి మేజర్ ఎ శ్రీనివాసరెడ్డి, సేనాపతకాలకు లెఫ్టినెంట్ కల్నల్ విజయకుమార్, మేజర్ అజయ్ కుమార్, సతీశ్ సురేశ్, సంగిరెడ్డి సంజీవరెడ్డి (మరణం అనంతరం) ఎంపికైనారు. పరమ విశిష్ట సేవాపతకాలకు లెఫ్టినెంట్ జనరల్ యెందూరు వెంకట కృష్ణమోహన్, లెఫ్టినెంట్ జనరల్ వడ్లమాని షణ్ముఖశ్రీనివాస్, వైస్ అడ్మిరల్ ఆర్. హరికుమార్, వైస్ అడ్మిరల్ ఎస్, రాజశేఖరశర్మ, వి. శ్రీహరి ఎంపికైనారు. మేజర్ జనరల్ పవమాని సురేందర్, రియర్ అడ్మిరల్ వెన్నం శ్రీనివాస్, ఎయిర్ అడ్మిరల్ జొన్నగడ్డ రాజేంద్ర, బ్రిగేడియర్ మంగూరు రఘు, కల్నల్ ముప్పర్తి సంజీవ్ , కల్నల్ కేవీ పద్మప్రకాశ్, ఎయిర్ వైస్ మార్షల్ విష్ణుభొట్ల నాగరాజు శ్రీనివాస్, గ్రూప్ కెప్టెన్ కొండూరు అప్పారావు, ఆకెళ్ళ రవి నరసింహశర్మ, హంపాపురుంనరసింహను ఎంపిక చేశారు.