మహాత్మా
ఉపవాస తపస్సులు చేసి చేసి
ఎందుకయ్యా తెచ్చావు స్వాతంత్ర్యం మాకు
అదేo చేసుకోవాలో మాకు ఇప్పటికి తెలీదు
మాకు తెలిసిందల్లా ఒకటే
తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారు.
స్వాతంత్ర్యంతోపాటు ప్రజాస్వామ్యమంట
అదికూడా వచ్చేసింది
అందరూ సమానమంట
ఆ మాటంటే కొంతమందికి ఒళ్ళుమంట.
ప్రతి ఒక్కరికి ఒక ఓటంట
చదువుకున్నోడికి, బుర్రలేనోడికి కూడా ఒకటేనంట
బుర్రలేనోళ్ళు సారాకు, కులాలకు ఓటేస్తారంట
చదువుకున్నోళ్ళు మెదళ్ళు మూసుకుని తమ పార్టీకే వేస్తారంట.
కాగితం మీద రాసుకొచ్చి చదివేవాళ్ళు
ఏం మాట్లాడతారో తమకే అర్థం కానివాళ్ళు
డబ్బు, గూండాలతో అధికారం పట్టేవాళ్ళు
అబద్ధాలు పదే పదే చెప్పి నమ్మించే వాళ్ళు నాయకులై పోయారు.
చేసేది తప్పని ఎవరైనా చెబితే
అలా చెప్పడమే పెద్ద తప్పై పోతూంది
దొంగ పోలీసును ‘దొంగ‘ అనే రోజొచ్చింది
మంచి చెప్పడం మహా పాపమై పోయింది.
ప్రభుత్వాలు బ్రతుకుతున్నాయి సారా మీద,
పండగలప్పుడు రవాణా సంస్థల ద్వారా
బ్లాకులో టికెట్లు అమ్ముకుంటున్నాయి,
జనానికి కుక్క బిస్కెట్లు పడేసి
పబ్బం గడుపుకుంటున్నాయి.
అక్కడో రాష్ట్రంలో పిల్లల బడులు తగలబెట్టారు
చదువుకుంటే చెప్పిన మాట వినకుండా
స్వంతంగా ఆలోచిస్తారేమోనన్న భయంతో.
ఒకప్పుడు ఆడపిల్లల గురించి అలా అనుకునే వారంట.
తమ వ్యతిరేకులను చంపేసే సిద్దాంతం కొందరిది
నా కుర్చీ కదలకూడదనే సిద్ధాంతం మరికొందరిది
మనుషుల మాన ప్రాణాల్నే కాదు దేవుళ్ళను దోచుకున్నా
కిమ్మనకుండా జరిగిపోతున్న కాలమిది.
చదువురాని వాళ్ళకంటే
సిద్దాంతాలు చదువుకున్న మూర్ఖులెక్కువగా వున్న దేశంలో
పండితులు పాoడిత్యంలో మునిగిపోయిన సంఘంలో
పత్రికలు విలేఖరులు అమ్మకానికున్న కాలంలో
రాజకీయాన్ని కొoదరికి వదిలేసిన ఈ దేశ జనానికి,
రవీoద్రునివంటి కవి లేని నేటి సమాజానికి
స్వాతంత్ర్యం ఎందుకు కావాలో ఎవరు చెబుతారు.
నువ్వు ఆంగ్లేయులను వెళ్ళ గొట్టావు
కాని మేము ఇంగ్లీషువాళ్ళమై పోయాము
బొట్టు తుడిచేసి, గౌన్లు వేసుకుని
ఇంట్లోని పరమాన్నం వదిలి
బయట పిజ్జాలు, బీర్లు మింగుతున్నాం.
ఇంగ్లీషు మాట్లాడడమే పరమధర్మం అని
భావించే భావ దాస్యులమై పోయాము
మాకు మంచి చెడు ఆలోచించే శక్తి లేదు
మా నాయకుడి మాటే వింటాం
మమ్మల్ని చెప్పుకింద ఉంచే వాళ్ళ మీదే మాకు నమ్మకం
మాకు మంచి చేస్తామన్న వాణ్ని తిడతాం, కొడతాం
మా నాయకుడు చెపితే చంపేస్తాం
కాని ఎవడు ఏం చెబుతున్నాడో
ఎందుకు చెబుతున్నాడో
ఎవరికోసం చెబుతున్నాడో ఆలోచించం.
ఆలోచనను భద్రంగా లాకరులో దాచేశాం
అసలు దాన్ని వీలయితే పుట్టకుండానే చంపేస్తాం.
మాకెందుకయ్యా ఈ స్వాతంత్ర్యం
అంతా నీ పిచ్చిగాని.
భారతి ‘న స్వాతంత్ర్య మర్హతి’.
Also read: పండగచేస్కో
Also read: ఓట్ల పండగ
Also read: గుడి – బడి
Also read: ప్రియురాలికి ప్రేమలేఖ
Also read: మేతావులు