రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
మహర్షి అంటే అన్నీ వదులుకొని
అడవులకో కొండలకో వెళ్ళి
తపస్సు చేసుకుంటూ
బోలెడంత జ్ఞానం సంపాదించి
ముక్తి కోసం బ్రతికే వాడంటారు.
జనం మధ్యలో ఉంటూ
జనం కోసం చచ్చేవాడిని
ఏమంటారు?
పుట్టింది మంత్రిగారింట్లో
భోగభాగ్యాల ఉయ్యాలలూగి
అత్యంత ఉన్నత చదువులు చదివి
ఉద్యోగంలో చేరిన నాటినుండి
అసమానతకు వ్యతిరేకంగా
పోరాట యోధుడిగా మారి
జనం హక్కుల కోసం
ముందు నిలబడిన మార్గదర్శి.
స్వదేశ పిలుపునందుకుని
దేశమంతా తిరిగి జాతిని అర్థం చేసుకుని
రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని
ఉత్త చేతులతో ఫిరంగులను ఎదుర్కునే
పోరాటానికి సిద్ధ పరిచాడు
ఎక్కడ అన్యాయం జరిగినా
సత్య ఆగ్రహంతో, తన నిరాహారంతో
కరకు గుండెల్లో గుబులు పుట్టించాడు
ఈ అహింసా ప్రేమికుడు.
అహింస అంటే అర్థం ప్రేమేగా.
అవకాశం దొరికింది రెండో ప్రపంచ యుద్ధంలో
బ్రిటీషు వారిని ఇరుకున పెట్టడానికి
తన సహాయ నిరాకరణను పక్కన పెట్టి హిట్లర్, ముసోలిని లాంటి నియంతలకు వ్యతిరేకంగా
ధర్మ నిర్వహణగా సాయమందించాడు బ్రిటీషు వారికి
అవకాశవాది కాలేని మనస్తత్వం కదా.
ప్రపంచానికి ఆయుధంలేని పోరాటం నేర్పిన
మహా యోధుడిని ప్రపంచమంతా గుర్తించినా
మనలో కొంతమంది గుర్తించలేదు.
భార్యను ఎదురుగా ఉంచుకొని
బ్రహ్మచర్యాన్ని దశాబ్దాలు పాటించిన
కర్మయోగిపై అభాండాలు వేస్తారు మరికొందరు
కణ కణాన హిందూ ధర్మం తొణికిసలాడిన వాడిపై మరోమత పక్షపాతిగా ముద్ర వేస్తారు ఇంకొందరు.
నిన్ను స్వాతంత్ర్యం తెచ్చిన నాయకుడిగా గుర్తిస్తున్నాం
నీ ఆలోచన, వ్యక్తిత్వం, మహత్వం మాకు అర్థం కాదు
ఠాగూరు నిన్ను ‘మహాత్మా‘ అన్నా
ఐన్ స్టీన్ రాముడితో పోల్చినా
నిన్ను తెలుసుకోలేని మా అల్పత్వాన్ని నువ్వు క్షమించినా
నీ మహాత్వాన్ని గ్రహించి పాటించేంత స్థితి మాకు లేదు
నీవు చూపిన దండి మార్గం, విదేశీ వస్తు బహిష్కరణ
గ్రామ స్వరాజ్యం, ధర్మ కర్తృత్వం అమలు చేస్తే
సమస్యలన్నీ సమసి పోతాయంట
కాని అసలు అర్థమే కానిదాన్ని పాటించడమెట్లా?
మూర్తీభవించిన కారుణ్యం మదర్ తెరెసా
అంచలంచలుగా మహర్షిత్వాన్ని చేరుకుంటూంది.
తనకున్నదంతా జానానికి ఊడ్చిపెట్టి
చొక్కాకూడా లేకుండా
వేరు సెనగలు, మేక పాలు ఆహారంగా
జీవితం గడపొచ్చని నేర్పిన మనిషిని
దేశం ముక్కలు కాకూడదని
ప్రాణాలు బలిపెట్టిన మనీషిని
ధర్మరాజును మించి ధర్మాన్ని పాటించిన వాడిని మానవ సేవే మాధవ సేవ అనకుండానే
దాన్ని పాటించి చూపిన వాడిని
మహర్షిగా గుర్తించలేని అల్పాత్ములమా?