గాంధీయే మార్గం – 8
“సంఘ సంస్కర్తలలో రాజకీయాలకు సంబంధించినంత వరకు ప్రతీప శక్తులకు ప్రతినిధులుగా నిలిచే వారెందరు లేరు… రాజకీయ విప్లవవాదులలో మత మౌఢ్యాలను సమర్ధించిన వారెందరు లేరు? నూతన మత సంస్థాపకులలో ఆర్థిక వ్యవస్థపట్ల ఓదాసీన్యాన్ని ప్రదర్శించేవారెందరు లేరు? ఇట్టి వారి కోవకు చెందినవాడు కాదు డాక్టర్ లోహియా. జీవితం అవిభాజ్యమైనదని ఆయనకు తెలుసు; మత, సాంఘిక, ఆర్థిక, రాజకీయాది రంగాల కింద దాన్ని విడగొట్టడానికి వీలు లేదని ఆయనకు తెలుసు. అందువల్లనే తన స్వతంత్రాలోచనలకు సమగ్ర రూపమివ్వడానికి ఆయన కృషి చేశాడు” అని ప్రసిద్ధ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు , డా. రామమనోహర్ లోహియా జీవితాన్ని, ఆలోచనలను అర్థవంతంగా విశ్లేషిస్తారు. దండి ఉప్పు సత్యాగ్రహం సంబంధించి గొప్ప పరిశోధనను పిహెచ్.డి. పట్టాకోసం చేయడమే కాకుండా, నేటికీ గాంధీజీ ఆలోచనలను సవ్యంగా, ప్రయోజనకరంగా అందుకోవడానికి మంచి దివిటీ వంటివాడు డా. రామమనోహర్ లోహియా!
Also read: అవును… నేడు గాంధీయే మార్గం!
స్వతంత్ర ఆలోచన, సాహసాల మేలు కలయిక
‘పాలిటిక్స్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ రిలిజియన్ అండ్ రిలిజియన్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ పాలిటిక్స్’ – వంటి విభిన్నమైన, అర్థవంతమైన దృక్కోణాలను ఒక్క రామమనోహర్ లోహియాలోనే చూడగలం. ఆధునిక భారతీయ సమాజాన్ని అవగతం చేసుకోవాలంటే తప్పక గాంధీజీ, అంబేద్కర్, ఎమ్.ఎన్.రాయ్ వంటి మహామహుల జీవిత అనుభవాలనూ వారు ప్రబోధించిన వాదాలనూ, సూత్రీకరించిన విశ్లేషణలనూ తప్పక అధ్యయనం చెయ్యాలి. అటువంటి కోవలో తారసపడే మహామేధావి, కళాహృదయం గల రసపిపాసి, రాజకీయవేత్త, సిద్ధాంత కర్త, గొప్ప రచయిత డాక్టర్ రామమనోహర్ లోహియా (1910-1967). మీరు హర్షించవచ్చు, లేదా ఖండించవచ్చు – కానీ నిర్లక్ష్యం చేయడానికి వీలులేని విలక్షణ వ్యక్తి లోహియా. స్వతంత్రంగా ఆలోచించగలవారందరూ సాహసికంగా ఉండలేరు. ఈ రెండు అపురూప లక్షణాల మేలుకలయిక ఆ వ్యక్తిత్వం.
Also read: రాగద్వేష రహితమైన, వివేకం గల విజ్ఞాన దృష్టి
ఈ సమాజాన్ని ఈ దేశపు స్వాతంత్ర్యేచ్ఛను గొప్పగా ప్రభావితం చేసిన అపురూపమైన వ్యక్తి గాంధీజీ. హేతుబద్ధంగా విబేధించి గాంధీజీ ఆలోచనలకు కొత్త అర్ధాన్నీ, జన జీవాలను అందించిన దార్శనికుడు, తాత్వికుడు లోహియా! గాంధీ, లోహియా వ్యక్తిత్వాలనూ, ఆలోచనలనూ కలిపి పరిశీలించినపుడు చాలా తమాషాగా, మరింత ఆసక్తికరంగా ఉంటుంది. వ్యవహార శైలిలో ఇద్దరికీ కట్టెదురు. గాంధీ ఎంత మృదువో లోహియా అంత పెళుసు. ఇద్దరి మధ్య 41 సంవత్సరాల ఎడం ఉంది. బయటి నుంచి చూస్తే ఇరువురివీ పొంతన లేని మూర్తిమత్వాలు ! కానీ అంతరంగాలను పరిశీలిస్తే – లోహియా మహాశయుడు గాంధీజీని గురువుగానే కాదు, ‘మానస పిత’గా పరిగణించారు. గాంధీజీ అయితే కుమారుడి కన్నా ఎక్కువ ప్రేమగా లోహియాను చూసుకున్నారు. అందువల్లనే గాంధీజీ చాలాసార్లు లోహియా పరుషమైన, దురుసైన, పదునైన మాటలు చాలాసార్లు పడ్డారు. లోహియా అతిగా సేవించే కాఫీ, టీ, సిగరెట్లు – తగ్గించడానికీ, మాన్పించడానికీ గాంధీజీ తీసుకున్న శ్రద్ధా, పడిన శ్రమా అలవి కావు. ఒక రెండు నెలల వ్యవధిలో సిగరెట్లు మానివేశారు లోహియా. అయితే గాంధీ హత్యకు గురయిన రోజున లోహియా మళ్ళీ సిగరెట్ తాగారు. బయటికి అంతగా కనబడేది కాదుగానీ, లోహియా విపరీతంగా గాంధీజీని ఇష్టపడేవారు. తన మరణ సమయంలో కూడా ఆ లోటు లోహియాను వెంటాడింది.
Also read: గాంధీజీ సార్వత్రికత ఏమిటి?
గాంధీతో గాఢమైన అనుబంధం
గాంధీజీతో తనకున్న అనుబంధాన్ని లోహియా 1952లో హైదరాబాదులో చేసిన ప్రసంగంలో వివరించారు. ఈ ప్రసంగం ఆధారంగానే ‘అనెక్డోట్స్ ఆఫ్ మహాత్మాగాంధీ’ అనే లోహియా వ్యాసం తయారైంది. ఇందుమతి కేల్కర్ చాలా చక్కని లోహియా జీవితచరిత్ర రాశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన హిందీ ఆచార్యులు ప్రేమ్ సింగ్ గారు గాంధీ, లోహియా ద్వయం జీవన శైలీ, సిద్ధాంతాల మీద అధ్యయనం చేసి వారి సన్నిహితమైన, ఫలవంతమైన అనుబంధం గురించి సుదీర్ఘమైన విశ్లేషణ చేశారు. ప్రేమ్ సింగ్ అధ్యయనం చాలా ఆసక్తికరంగా లోతుగా వుంది.
ఆగ్రా, అవథ్ సంస్థాన ప్రాంతం అక్బర్ పూర్ లో 1910 మార్చి 23న సంపన్న వైశ్య కుటుంబంలో రామమనోహర్ లోహియా జన్మించారు. రెండో ఏటనే తల్లిని పొగొట్టుకున్న దురదృష్టవంతుడు. కుమారుడి కోసం తండ్రి హిరాలాల్ మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. 1918లో కుమారుడి చదువుకోసం బొంబాయి వెళ్ళారు హీరాలాల్. ఇంటర్మీడియెట్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోను, బి.ఏ. కలకత్తా విశ్వవిద్యాలయం విద్యాసాగర్ కళాశాలలో పూర్తి చేశారు. 1929-1933 మధ్య కాలంలో జర్మనీలో చదువు కొనసాగించి, ఇపుడు Humboldt University of Berlin గా పిలువబడే విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. పూర్తి చేశారు. గాంధీ సామాజిక-ఆర్ధికపరమైన ఆలోచనలను వివరించే రీతిలో భారతదేశంలో ఉప్పు పన్ను అంశంపై ఆయన పరిశోధక గ్రంథం వెలువరించారు.
1933 నుంచి 1967 అక్టోబరు 12న గతించే దాకా లోహియా అలుపెరుగకుండా ప్రజాజీవితంలో మమేక మయ్యారు. ఆయన వివాహం కూడా చేసుకోకుండా మొత్తం జీవితాన్ని సోషలిస్టు సిద్ధాంతాల అధ్యయనానికీ, ప్రజాజీవితం అర్ధవంతం కావడానికి కృషిచేశారు. డా. రామమనోహర్ లోహియా 57 సంవత్సరాల వయస్సులో కనుమూసినపుడు నార్ల వెంకటేశ్వరరావు లోతయిన, విశ్లేషణాత్మకమయిన సంపాదకీయం సంపాదకీయాన్ని తను నిర్వహిస్తున్న‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో రాశారు. తెలుగులో లోహియాను క్లుప్తంగా, లోతుగా తెలుసుకోవడానికి నార్ల సంపాదకీయం చిన్న అద్దం వంటిది.
అందులో నార్ల ఇలా అంటారు –
‘‘వాక్కు పరుషమైనా డా. లోహియా హృదయం ఎంతో ఆర్ద్రమైంది. స్నేహానికి అది కరిగేది; సౌజన్యానికి కరిగేది; సౌందర్యానికి కరిగేది;…
… ఆధునిక దృష్టి గలవారికి, విప్లవాదులైన వారికి పౌరాణిక సాహిత్యంపట్ల వైముఖ్యం వుండటం కద్దు. కానీ, లోహియా మాత్రం హిందూ పురాణాలపట్ల భక్తి గౌరవాలను చూపుతూ వుండేవారు. … చారిత్రక పురుషులకంటే లోహియా దృష్టిలో (పురాణ పురుషులే) హిందువుల జీవితాన్ని, వారి సంస్కృతిని వారి చరిత్రను ప్రభావితం చేశారు, చేస్తున్నారు.
ఆయనకు ఇంగ్లీషు భాషపట్ల కంటే కులవ్యవస్థపట్ల అధిక విరోధభావం వుండేది. కులవిబేధాలు తొలగనిదే ప్రజాస్వామ్యం లేదని, సోషలిజం అంతకంటే లేదని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు…
… ఒక జవహర్ లాల్ ను విడిచిపెడితే, భారత రాజకీయనాయకులలో ఇంతగా సర్వతోముఖమైన అభిరుచులున్న వ్యక్తి మరొకరు కానరారు. రాజకీయ రంగంలో రాణించి ఉండకపోతే లోహియా ఒక సాహిత్యకారుడిగా, కళాభిజ్ఞుడిగా, తత్వవేత్తగా రాణించేవారు…”
గాంధీజీ ఆలోచనలకు విశ్లేషణాత్మకమైన వివరణ, సమన్వయం చేసి, వారి తాత్విక ఆలోచనలకు చక్కగా కొనసాగింపు చేసినవాడు లోహియా. తన అన్వేషణలో గాంధీజీ ఆలోచనలే ఎక్కువ ఉపకరిస్తాయని గుర్తించిన లోహియా ఎప్పుడు గుడ్డిగా, సెంటిమెంటల్ గా మారలేదు. లోహియా తనను తాను మార్క్సిస్టుగా కానీ, వ్యతిరేకిగా కానీ; గాంధేయవాదిగా కానీ వ్యతిరేకిగా కానీ ముద్ర వేసుకోవడానికి ఇష్టపడలేదు. గాంధీజీ గతించిన తర్వాత మాట్లాడుతూ ఇపుడు గాంధీ సిద్ధాంతాలు అనేవి సర్కారీ గాంధీయిజం, మొనాస్టిక్ గాంధీయిజంగా మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు. మొదటిది గాంధీజీ రాజకీయ వారసుల వ్యవహారం కాగా… రెండవది ప్రభుత్వ ఖర్చుతో లాంఛనంగా జరిగే కార్యక్రమాల తంతు.
Also read: గాంధీజీ అవసరం నేడు ఎక్కడెక్కడ?
మనిషి కేంద్రంగా గాంధీ ఆలోచనలు
కానీ లోహియా మాత్రం సత్యం, కాలం, చరిత్ర, ప్రగతి …వంటి గాంధీజీ భావనల గురించి, ప్రతీకలను గురించి అధ్యయనం చేసి ప్రజా జీవితంలో విలువలు పెరగాలనే అర్థాన్ని ప్రతిపాదించారు. లేకపోతే శాఖాహారం, అహింసలు మాత్రమే గాంధీయిజంగా చలామణి అయ్యేవి. దేవుడి ప్రతిష్ఠించే గాంధీజీ ఆలోచనలు మనిషి కేంద్రంగా సాగాలనే లోహియా సవరింపునిచ్చాడు.
దేవుడి ప్రస్తావన లేని సత్యాగ్రహి గురించి గాంధీజీన కోరిన వారు లోహియా! గమ్యం మాత్రమే కాదు, గమనం కూడా ఉన్నతంగా ఉండాలనే గాంధీజీ వైఖరి లోహియాను బాగా ఆకర్షించింది. అలాగే గాంధీగారి హృదయ పరివర్తన అనే భావన తరువాతి కాలంలో అర్థరహితంగా మారడం డా. రామమనోహర్ లోహియా గారికి ఎంతో ఖేదాన్ని మిగిల్చింది. గాంధీజీ ఆలోచనలకు మన్నిక ఉన్నంత కాలము, వాటికి సంబంధించిన డా. లోహియా వివరణలకు, విశ్లేషణలకు విలువ కొనసాగుతుంది.
ముందు ముందు ఈ పరంపరలో గాంధీజీని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి, గాంధీజీ ప్రభావానికి లోనైన మహానుభావుల గురించి, వారు ప్రతిపాదించిన విషయాల గురించి, ఉదాత్తమైన , ప్రయోజనకరమైన గాంధీజీ ఆలోచనలను ప్రతిఫలింపచేసే చారిత్రక శకలాలను, వాటి ఆనవాళ్ళను గురించి కూడా అపుడు తెలుసుకుందాం.
Also read: సామాన్యంగా అనిపించే అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం
రచయిత మొబైల్: 9440732392