- గాంధీ అనేక సాహసాలు చేశాడు, అందుకే గౌరవం
- గాంధీనీ, నెహ్రూనీ, ఇందిరనీ తిట్టేవారి సంఖ్య పెరిగింది
- సనాతనధర్మం ఆచరించడని గాంధీ పట్ల వ్యతిరేకత
గాంధీ పూర్ణపురుషుడేమీ కాదు. అసలు పూర్ణపురుషుడంటూ ఎవరూ ఉండరు. గాంధీలో నాకు నచ్చినవి ఉన్నాయి, నచ్చనివీ ఉన్నాయి. ముఖ్యంగా మనలో చాలామంది చేయలేని సాహసాలు ఆయన చేశాడు. దక్షిణాఫ్రికానుంచి చుట్టం చూపుగా ఒకసారి దేశానికి వచ్చినప్పుడు కలరా వ్యాపించడంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి పాయిఖానాలు శుభ్రం చేసే కమిటీలో చేరి స్వయంగా పాయిఖానాలు శుభ్రం చేశాడు. తను దక్షిణాఫ్రికాలో ఉన్నరోజుల్లో ప్లేగు వ్యాపించినప్పుడు కూడా ప్రాణాలకు తెగిస్తూ రంగప్రవేశం చేసి జనాన్ని పోగేసి ప్లేగు బాధితుల వాడల్లోకి వెళ్ళి వైద్యసదుపాయం అందించాడు. ఆ ప్రయత్నంలో ఆయన బతికి బట్టకట్టాడు కానీ ఆయనతో పనిచేసిన కొందరు చనిపోయారు. దక్షిణాఫ్రికాలోనే రెండుసార్లు భౌతికమైన దాడులకు గురై దాదాపు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. స్వదేశంలో కూడా కనీసం మూడు సార్లు ఆయనపై హత్యాప్రయత్నాలు జరిగాయి. చివరికి ఆ ప్రయత్నంలోనే హత్యకు గురయ్యాడు. ఇలా మనలో చాలామంది చేయలేని అనేక సాహసాలు ఆయన చేశాడు కనుక ఆయన మీద నాకు గౌరవం. అలాగే ఆయన రాజకీయసామాజిక జీవితంలో కూడా మరెవరిలోనూ కనిపించని అసాధారణమైన మెరుపులు ఉన్నాయి. ఆ మేరకు ఎవరైనా ఆయనను సముచితంగా గౌరవించవలసిందేనని నేను అనుకుంటాను.
అంబేడ్కర్ ది విశిష్ట పాత్ర
అయితే ఈమధ్య కాలంలో కొన్ని విషయాల్లో గాంధీ కన్నా నాకు అంబేడ్కర్ ఎక్కువ నచ్చుతున్నాడు. కుల, మత, ప్రాంత, స్త్రీపురుష భేదాలకు అతీతంగా జనాన్ని ఏకం చేయడంలో గాంధీది విశిష్టపాత్ర కావచ్చు. కానీ దేశానికి సర్వసమత్వంతో కూడిన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వ్యవస్థను రూపకల్పన చేసి అందించడంలో అంబేడ్కర్ దే గాంధీని మించిన విశిష్ట పాత్ర.
ఒకసారి వెనుదిరిగి చూస్తే కొన్ని విషయాలు ఇప్పటికీ ఆసక్తిని, ఆలోచనలను రేపుతూనే ఉంటాయి. గాంధీగారి కాలంలోనే బ్రాహ్మణులలో ఒక వర్గం గాంధీని అభిమానించి, ఆరాధించి వెంట నడిచింది. ఇంకో వర్గం గాంధీని ద్వేషిస్తూ శాపనార్థాలు పెట్టింది. ఉదాహరణకు మా నాన్నగారి మేనమామ కంభంపాటి సోమయాజులుగారు 1924లో జరిగిన కాకినాడ కాంగ్రెస్ సెషన్ లో పాల్గొని గాంధీ ప్రభావంలోకి వచ్చి స్వాతంత్రోద్యమంలోకి దిగారు. బళ్ళారి ప్రాంతంలో కాంగ్రెస్ ను ఆర్గనైజ్ చేసే పని ఆయనకు అప్పగించారు. పెండేకంటి వెంకటసుబ్బయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పట్లో ఆయన మార్గదర్శనంలో పనిచేసిన జూనియర్ స్వాతంత్ర్య సమరయోధులు. సోమయాజులు గారి కుటుంబం ఆ తర్వాత ఆదోనిలో స్థిరపడ్డాక, విజయభాస్కర్ రెడ్డి ఎప్పుడు ఆదోని వెళ్ళినా ఆ కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. ఒక సందర్భంలో చట్ట సభకు కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో నీలం సంజీవరెడ్డిగారికి, సోమయాజులుగారికి మధ్య అభిప్రాయభేదాలు రావడం, సంజీవరెడ్డిగారు ఆయనను బెదిరించడం, అయినా ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళడం….వేరే చరిత్ర. అన్నగారు అలా స్వాతంత్ర్యసమరంలోకి వెళ్లిపోవడం, ఆర్థిక సమస్యలు వగైరా కారణాల వల్ల ఆయన సోదరుడు, అంటే మా నాన్నగారి చిన్న మేనమామ ప్రక్కిలంక(పశ్చిమగోదావరి జిల్లా)లోని మా ఇంటికి చేరుకోవడం, మా కుటుంబ వారసత్వంగా వచ్చిన కరణీకాన్ని మా నాన్నగారు చిన్నమేనమామకు వదిలిపెట్టి తను ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్ళి కొన్నేళ్లు పోలవరంలో, ఆ తర్వాత చాలాకాలం విజయవాడలో, అనంతర కాలంలో ఇంకా మరికొన్ని చోట్ల స్కూలులోనూ, సంస్కృత కళాశాలలో పండితునిగా పనిచేయడం సంభవించాయి.
గాంధీ అంటే పడని బ్రాహ్మణవర్గం
చెప్పొచ్చేదేమిటంటే, మానాన్నగారితో సహా ఆయన ముగ్గురు సోదరులపైనా పెద్ద మేనమామ ప్రభావం పడలేదు. పడకపోవడం ఇప్పటికీ నాలో ఆలోచన రేపుతూనే ఉంటుంది. మా నాన్నగారి దగ్గరినుంచి మా పెద్దలలో గాంధీపట్ల సదభిప్రాయం ఉండేది కాదు. కొంచెం మోతాదు తేడాలో అందరూ గాంధీని విమర్శించేవారు. గాంధీ సనాతనధర్మానికి సరిపడని పనులు చేయడమే ఆ విమర్శ సారాంశం. ఆ తర్వాత నెహ్రూ, అంబేడ్కర్, ఇందిరాగాంధీల మీద కూడా విరుచుకుపడడం సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబాలలో పరంపరగా ఉంటూ వచ్చింది. ‘విధవ’ రాజ్యం ఏలడం ఇందిరాగాంధీపట్ల వారి విమర్శకు ఒక కారణంగా ఉండేది. విచిత్రం ఏమిటంటే ఆ బ్రాహ్మణ కుటుంబాలనుంచే వచ్చిన నా తరం వారికి, నా తర్వాతి తరం వారికి కూడా గాంధీ-నెహ్రూ-అంబేడ్కర్-ఇందిరాగాంధీలను విమర్శించడం పరిపాటిగా మారింది. అదిప్పుడు మరింత పదునెక్కి తిట్లు, శాపనార్థాల స్థాయికి చేరిన సంగతి మనకు తెలుసు.
మధ్యతరగతి మేధావులదీ అదే దారి
గాంధీ-నెహ్రూ-కాంగ్రెస్ ల ప్రభావంలోకి వచ్చిన బ్రాహ్మణులలోని ఒక వర్గం రొటేషన్ పద్ధతిలో కిందికి వెళ్ళి, వారిని ముందు నుంచీ విమర్శిస్తూవచ్చిన వర్గం పైకి రావడం- విమర్శ తిట్లు, శాపనార్థాలకు చేరడానికి ఒక ప్రబలమైన కారణంగా కనిపిస్తుంది. వ్యక్తులలో మంచికి మంచిని, చెడుకు చెడును ఎత్తిచూపి; దేనికి ఎన్ని మార్కులు వేయాలో, దేనికి వేయకూడదో వివేచించే సమతుల్యధోరణి మధ్యతరగతి విద్యావంతవర్గంలో ఉంటుందన్న ఊహ నాకు చాలాకాలంగా ఉండేది. క్రమంగా అది అపోహగా తేలిపోయింది. ఇంతకుముందు దళితులు, ఇతర బలహీనవర్గాలు రాజకీయపాక్షికతను తెచ్చుకుని బలమైన నియోజకవర్గాలుగా ఉండేవారు. అందుకు ఒక ప్రబలమైన చారిత్రక కారణం ఉంది. ఇప్పుడు వారికంటే బలమైన గొంతు, వ్యక్తీకరణ శక్తి ఉన్న మధ్యతరగతి విద్యావంతులలోని ఒక వర్గం; అంటే గాంధీని, నెహ్రూను, అంబేడ్కర్ ను మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన వర్గం- ఇప్పుడు తనకు అనుకూలమైన శక్తులు అధికారంలోకి రావడంతో పూర్తిగా తనదైన రాజకీయపాక్షికతను తెచ్చుకున్న ఫలితమే ఈ సమతుల్యతా లోపమని నేను అనుకుంటున్నాను.
లోపించిన సమతౌల్యం
దీని ప్రభావాలు, లేదా దుష్ప్రభావాలు ఇప్పుడు బహుముఖంగా కనిపిస్తున్నాయి. ఒక దారుణ మానభంగాన్ని, లేదా ఒక కోర్టు తీర్పులోని అసమంజసతను- ఏ పార్టీ అధికారంలో ఉందన్నదానికి అతీతంగా ఒక సమతుల్యదృష్టి నుంచి చూసే అవకాశం ఇప్పుడు కరువవుతోంది. న్యాయధర్మాలపక్షం వహించే ఒక తటస్థవర్గం క్రమంగా ఉనికి కోల్పోతోంది. దాని గొంతు సన్నబడుతోంది. తటస్థవర్గం పూర్తిగా అంతరించి రంగస్థలాన్ని పూర్తిగా రాజకీయపక్షపాతశక్తులకు వదిలివేసినప్పుడు ఆ వృషభాల కుమ్ములాటలో వాటి పదఘట్టనల కింద నలిగి నజ్జయ్యేది బలహీనులు మాత్రమే. చట్టబద్ధపాలనను ఏ కారణంతో బలహీనపరిచినా దాని ప్రభావం కుల, మత, జెండర్ పరమైన అల్పసంఖ్యాక బలహీనులందరి మీదా పడి అస్తిత్వాలను గల్లంతు చేస్తుంది. అసమంజసమైన తీర్పులను కూడా గుడ్డిగా సమర్థించేవారికీ అది ఆత్మవిధ్వంసకంగా పరిణమిస్తుంది.
(గాంధీ జయంతి ప్రత్యేకం)