జనవరి 30 వ తేదీ మహాత్మాగాంధీ ప్రాణాలు కోల్పోయిన రోజు. ఆ మహనీయుడి వర్ధంతి నాడు “అమరవీరుల దినోత్సవం” జరుపుకుంటున్నాం. అమూల్యమైన ఆయన సందేశాలను తలచుకుంటున్నాం, ఆయన్ని కొలుచుకుంటున్నాం. ఎంతో పవిత్రంగా భావించే ఇటువంటి రోజున ఒక చెడ్డవార్త వినాల్సి వచ్చింది. మహాత్మునికి మహా అవమానం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని డేవిస్ నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అక్కడ సెంట్రల్ పార్క్ లో ఉన్న మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం బేస్ మెంట్ ను పగులగొట్టి, కాళ్ళు, ముఖం సగం ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని జనవరి 27కే వారు గుర్తించినట్లు తెలుస్తోంది. జనవరి 30వ తేదీ మనకు గాంధీ స్మృతిలో ముఖ్యమైన రోజు కాబట్టి, దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
భద్రపరుస్తామన్న కౌన్సిల్ అధికారి
విగ్రహాన్ని అక్కడ నుంచి తీసి సురక్షిత ప్రదేశంలో భద్రపరుస్తామని డేవిస్ నగర కౌన్సిల్ లుకాస్ ఫ్రెరిచ్ చెప్పినప్పటికీ, ఇది అమెరికాలో మహాత్మునికి జరిగిన గొప్ప అవమానంగా భావించాలి. ఈ పార్కులో స్థాపించిన ఈ విగ్రహాన్ని నాలుగేళ్ళ క్రితం భారత ప్రభుత్వం బహుకరించింది. అప్పుడు కూడా తీవ్ర ఉద్రిక్తతల మధ్యనే దీన్ని ఆవిష్కరించారు. ఆర్గనైజషన్ ఫర్ మైనారిటీస్ ఇన్ ఇండియా (ఓ ఎఫ్ ఎం ఇ ) గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేయడంపై అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించింది. నగరంలోని ఎక్కువమంది పౌరులు విగ్రహ స్థాపనకు సమ్మతించడంతో విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Also Read : మెట్టు దిగిన ప్రభుత్వం, బెట్టువీడని రైతన్నలు
మైనారిటీల సంస్థ ఆందోళన
కానీ, ఈ విగ్రహాన్ని తొలగించాల్సిందే అంటూ ఆర్గనైజషన్ ఫర్ మైనారిటీస్ ఇన్ ఇండియా ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తూనే వుంది. అనేక సంవత్సరాల నుంచి హిందుత్వం పట్ల భయం, భారత్ పట్ల వ్యతిరేకత ఉన్న ఖలిస్థాన్, ఓ ఎఫ్ ఎం ఇ వంటి వేర్పాటువాదులు ద్వేషపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, ఫ్రెండ్స్ అఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్ కు చెందిన గౌరంగ్ దేశాయ్ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ ఏర్పాటువాదులు భారతీయమైన సాంస్కృతిక, చారిత్రక జ్ఞాపకాలు, ఆనవాళ్ళను, అంశాలను కాలిఫోర్నియాలోని పాఠ్యంశాలలో తొలగించే విధంగా ఒత్తిడి తెస్తున్నారని భారతీయ అమెరికన్లు మండిపడుతున్నారు.
‘భారత్’ మాటను తొలగించాలంటూ ఆందోళన
కాలిఫోర్నియా స్కూల్స్ లో ఆరు, ఏడు తరగతుల సిలబస్ లో “భారత్” కు బదులుగా “దక్షిణ ఆసియా”ను చేర్చాలని 2016 నుంచి భారత్, హిందూ వ్యతిరేకులు ఆందోళనలు చేపట్టినా, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తడంతో కాలిఫోర్నియా ప్రభుత్వ విద్యా విభాగం వెనక్కు తగ్గింది. డేవిస్ నగరంలో జరిగిన మహాత్ముని విగ్రహ ధ్వంసం ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ కాంస్య విగ్రహం 6 అడుగుల ఎత్తు, 294 కేజీల బరువుంది.
Also Read : యోగ్యులను వరించిన పద్మపురస్కారాలు
భారతీయులందరికీ అవమానం
ఈ విగ్రహ ధ్వంసం అనే అంశం కేవలం మహాత్మాగాంధీని అవమానించడం కాదు, భారతదేశాన్ని, అమెరికాలో నివసిస్తున్న భారతీయులందరినీ ఘోరంగా అవమానించినట్లుగానే భావించాలి. ఈ తరహా సంఘటన ఇదే మొదటిది కాదు. మొన్న డిసెంబర్ 2020 లోనూ వాషింగ్ టన్ లో గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేశారు. అది కూడా భారతీయ ఎంబసీ కార్యాలయం ఎదురుగా జరిగింది. అప్పుడు,యూఎస్ అంబాసిడర్ కెనెత్ భారత్ ను క్షమాపణలు కోరాడు. దీన్ని అగౌరవమైన చర్యగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.
Also Read : రైతు ఉద్యమంలో దేశద్రోహులు
ఖలిస్తాన్ వాదుల సంబరం
తాజాగా జరిగిన ఈ సంఘటనను చాలా మంచిరోజుగా భావిస్తున్నామంటూ ఖలీస్థాన్ మద్దతుదారులు ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని పంచుకోవడం గమనార్హం. అమెరికా-భారత్ మధ్య బంధాలు ఆరోగ్యంగానే సాగుతున్నప్పటికీ, అమెరికాలో జరిగే ఇటువంటి సంఘటనలు జాతిని కలచివేస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం ఖలిస్థాన్ ఉద్యమం పెద్దగా ప్రభావశీలంగా లేకపోయినా, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పలు అనుమానాలు రేకేత్తుతుంటాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంలోనూ ఖలిస్థాన్ ఉద్యమకారులు, మద్దతుదారుల పాత్ర ఉందంటూ బిజెపి నేతలు కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
మరపురాని అలజడి
ఈ సంఘటనల నేపథ్యంలో, గతంలో జరిగిన అల్లర్లను మరచిపోలేం. ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధీ హత్య, తదనంతరం జరిగిన సిక్కుల ఊచకోత మొదలైనవి చరిత్రపుటల్లో చీకటిరోజులు. దేశం అంతర్గతంగా కొన్నేళ్ల నుంచి ప్రశాంతంగా ఉంది. అన్ని మతాలవారు సోదరభావంతో సహజీవనం చేస్తున్నారు. సమత, మమత భావనలతో కలిసిసాగడమే గాంధీకి మనమిచ్చే నిజమైన నివాళి. అమెరికాలో జరిగిన ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదని కోరుకుందాం. శాంతి, అహింసలే గాంధీ సూచించిన గొప్ప మార్గాలు. అవే విజయసూత్రాలు.
Also Read : చైనాతో వేగడం ఎలా?