Thursday, December 26, 2024

గాంధీజీ ప్రత్యేకత ఏమిటి ?

గాంధీయే మార్గం-14 

గాంధీజీ జీవితాన్ని దగ్గరగా చూస్తే చాలా సాధారణమైన వ్యక్తిగా కనబడతారు. అయితే,  లోపాలను గుర్తించడంలో కానీ, సరిదిద్దుకోవడంలో గానీ, అప్రమత్తంగా సూక్ష్మబుద్ధితో నిర్ణయాలు తీసుకోవడంలో గానీ, చేపట్టిన దారిన సాగడంలో గానీ  పరికిస్తే ఆ వ్యక్తిత్వంలోని అసాధారణ మూర్తిమత్వం మనకు ద్యోతకమవుతుంది.

Also read: మహాత్ముడు ఎందుకుకొల్లాయి గట్టారు?

గాంధీజీ చదవాలనుకున్నది, చదువుకోనిది — వైద్యశాస్త్రం. తనకు నచ్చిన అంశాన్ని చదువు ద్వారా సాధించలేకపోయినా, అవకాశం దొరికినపుడు స్వచ్ఛందంగా తర్ఫీదు పొందారు. తనకు అభీష్టం కాకపోయినా కుటుంబ సభ్యులకోసం ఉద్యోగావకాశాల కోసం ఇంగ్లండులో బారిస్టరు చదువి పట్టా గడించారు. విజయవంతంగా రాణించే అవకాశం ఉన్నా, అందులో కొనసాగడానికి పెద్దగా ఇష్టపడలేదు. అలాగే రాజకీయాల్లో తిరుగులేని నాయకుడుగా భాసించినా ఆయన జీవితాంతం పాటించిన వృత్తి రచనలు చేయడం,  పత్రికలు నిర్వహించడం! 

Also read: వందశాతం రైతు పక్షపాతి 

మేనేజ్మెట్, పర్యావరణం, డెవలప్మెంట్ జర్నలిజం వంటి ఆధునిక విషయాలను ప్రపంచ వ్యాప్తంగా గాంధీజీ ని మినహాయించి  ఊహించుకోలేని పరిస్థితి ఈనాటి ప్రత్యక్ష అనుభవం. గాంధీజీ జీవితాన్ని సమ్యక్ వీక్షణంతో పరిశీలిస్తే మనకు ఆయన కొన్ని సాధారణ నియమాలు తేటతెల్లమవుతాయి.

Also read: తొలి భారతీయ పర్యావరణవేత్త జె.సి.కుమారప్ప

యథాలాప సంఘటనలు:  

దక్షిణాఫ్రికాకు ఉపాధి నిమిత్తం మిత్రుల ప్రోద్బలంతో వెళ్ళారు. అయితే అక్కడి తెల్ల దొరల జాత్యహంకారం చవిచూడ్డంతో అనుకోకుండా అక్కడి భారతీయ సంతతి ప్రజలకు నాయకుడయ్యారు. దక్షిణాఫ్రికాలో విజయం సాధించిన తర్వాత భారతదేశంలో చేపట్టిన తొలి ఉద్యమం చంపారణ్యంలో నీలిమందు రైతుల కష్టాలను కడతేర్చడం. అనుకోకుండా ఇలాంటి సంఘటనలు తారసపడినప్పుడు వాటిని స్వీకరించి తనదైన విధానంలో పోరాడి విజయం సాధించడం గాంధీజీలో చూస్తాం.

Gandhiji always preferred to travel by train

గమనింపు, అధ్యయనం: 

గాంధీజీ బుద్ధి సూక్ష్మత చాలా గొప్పది. వ్యక్తుల ఎంపిక కానీ, పనుల ఎంపిక కానీ, మనం అధ్యయనం చేస్తే గాంధీజీ స్టైల్ మనకు అవగతమవుతుంది. ఫిరోజ్ షా మెహతా, లోకమాన్య బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే – ఈ ముగ్గురిలో వారి విధానాలను జాగ్రత్తగా పరిశీలించి, అధ్యయనం చేసి,  చివరకు గోపాలకృష్ణ గోఖలే మహాశయుడిని గురువుగా స్వీకరించారు. తన జీవితానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేని క్లిష్టపరిస్థితులు సంభంవించినపుడు తన ప్రాంతంలో వుండే వజ్రాల వ్యాపారి అయిన మహానుభావుడిని సంప్రదించేవారు. భారతదేశం వచ్చిన తర్వాత  ఈ దేశ ప్రజలను వారి ఆలోచనలను విధానాలను తెలుసుకోవడానికి ఒక సంవత్సరం పాటు రైళ్ళలో ప్రయాణం చేశారు. ఆ తర్వాతనే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంస్థాపన కార్యక్రమంలో తన తొలి ప్రసంగం చేశారు. ఈ విధంగా మనం గమనిస్తే ఆయనలో ఉన్న పరిశీలనా దృష్టి, అధ్యయన శీలం, పరిశోధనా గరిమ, పోరాటం పటిమ  మనకు తెలుస్తుంది.

Also read: సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

దేశవాళి దృక్పధం: 

స్వాతంత్ర్యోద్యమం చప్పబడినప్పుడు సగటు మనిషిని కూడా ప్రభావితం చేసే ఉప్పును పోరాట చిహ్నంగా స్వీకరించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా సామాన్యులందరు ఆయన బాటన నడిచారు. విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమం స్వీకరించినపుడు ప్రత్యామ్నాయంగా ఖద్దరును సూచించారు. అయితే ఖరీదు గురించి దాని ఖరీదు,  లభ్యత సమస్యలుగా వున్నపుడు మన దేశ సంస్కృతి,  శీతోష్ణస్థితి గమనించి కొల్లాయి కట్టమని పిలుపునిచ్చారు. భారతదేశంలోని ప్రజలు పాటించే అన్ని మతాలలోని సుగుణాలను జాగ్రత్తగా స్వీకరించి, సత్యాగ్రహం అనే గొప్ప భావనను ప్రపంచానికందించారు.

Also read: ఏడున్నర దశాబ్దాలలో గాంధీజీ విధానాలు ఏమయ్యాయి ?

అమ్మభాషలోనే ఆత్మకథ:

గాంధీజీ తొలి రచన మాత్రమే కాక ఆత్మకథను కూడా గుజరాతీ భాషలోనే రాశారని  గమనించాలి. అలాగే దక్షిణాఫ్రికాలో తాను నడిపిన ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికలో అక్కడుండే భారతీయ సంతతి మాట్లాడే భాషలలో రచనలు వుండేటట్లు ప్రయత్నించారు. అదే పద్ధతిని భారతదేశంలో కూడా పాటించారు.

Also read: గాంధీజీ ఆలోచనలకు విలక్షణ వ్యాఖ్యాత డా.రామమనోహర్ లోహియా

హేతుబద్ధమైన ఆలోచనాసరళి:

 భారతీయ నీతి శాస్త్రాలన్ని చదివి ఆయన నిర్వచించిన ‘విముక్తి’  భావన మనకు ఆశ్చర్యం కొల్పుతుంది. ఎదుటి వ్యక్తి సమస్యలను తీర్చితే కానీ, తనకు విముక్తి కలగదని గాంధీజీ తేటతెల్లం చేశారు. అంతవరకు మన దేశంలో యోగులు, ఆధ్యాత్మిక వాదులు తమ తపస్సు తాము చేసుకుని, తమ ముక్తి కోసం శ్రమించడాన్ని ఉన్నతంగా పరిగణించారు. వీరి బాధ్యతా రాహిత్యాన్ని గుర్తించి, వారికి దారి చూపిన వ్యక్తి గాంధీజీ. విజ్ఞాన శాస్త్రం మనిషి సమస్యలను పరిష్కరించి తోడుగా నిలుస్తుంది. దీనికి సంబంధించి గాంధీజీ చెప్పే ఆలోచన చాలా విలక్షణంగా  కనబడుతుంది.  ఎక్కువ దేశాల్లో పెక్కు సమాజాలలో విజ్ఞానశాస్త్రం అనువర్తింపబడితే తత్ఫలితంగా విజ్ఞాన శాస్త్రం కూడా లబ్ధి పొందుతుంది అని గాంధీజీ విశ్లేషించడం అబ్బురమనిపిస్తుంది.

Also read: సామాన్యంగా అనిపించే అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం

సార్వత్రికమైన ఆశావహ దృష్టి:

జటిలమైన సమస్యతో పెనుగులాడే వర్గాలు కూడా ఒకే  తలం నుంచి సంప్రదించుకోవాలని గాంధీజీ ఆకాంక్ష. రాజ్యాధికారం చేతిలో ఉన్న ప్రభుత్వాలను ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ఎదుర్కోమంటారు. అట్లని లొంగిపోవడం కాదు. నిరసన తెల్పాలి,  శాంతియుతంగా సాగాలి. సహాయనిరాకరణోద్యమం, శాసనోల్లంఘనం, విదేశీ వస్త్ర బహిష్కరణం ఇలా అన్నీ అదే పద్ధతిలోనే సాగాయి. సామాన్య ప్రజ గులకరాయి వేసినా రాజ్యాధికారం దాన్ని తుపాకి గుండుగా పరిగణించి మరింత పెద్ద ఆయుధంతో నాశనం చెయ్యగలదు. ఇలాంటి అవకాశం లేకుండా శత్రువును కూడా ఆలోచనలో పడవేసి తనను తాను సంస్కరించుకునే అవకాశం కలగజేసేది సత్యాగ్రహం. నిజానికి రాజకీయ స్వాతంత్ర్యం గాంధీజీ దృష్టిలో అంత ప్రధానం కాదు. దాన్ని పరిరక్షించుకోవాలంటే మౌలికంగా ప్రజల స్థాయి చాలా రకాలుగా మెరుగు పడాలి. కనుకనే ముడు దశాబ్దాలకు పైగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో కొన్ని సందర్భాలలోనే గాంధీజీ ఉవ్వెత్తున పోరాట నాయకునిగా మనకు కనబడతారు. మిగతా సమయం అంతా ఆయన పారిశుధ్యం, సామాజిక ఆరోగ్యం, విద్య దురలవాట్లను పోగొట్టడం వంటి విషయాలపై కూడా తన ప్రయత్నాలను కేంద్రీకరించారు. నిజానికి గాంధీజీ దృష్టిలో ఎవరి దేశభక్తి అయినా ఇంకో దేశవాసికి ప్రతిబంధకం కానేకాదు. అంతటి ఆశావాదమైనా సార్వత్రిక దృష్టి గాంధీజీది.

Also read: గ్రామీణ భారతానికి అబ్దుల్ కలాం పరిష్కారం

గాంధీజీ జీవిత గమనాన్ని, పోరాటపథాన్ని పరిశీలిస్తే. ఈ ధోరణులు అంతర్లీనంగా నడుస్తాయని మనకర్థమవుతుంది. అనుకోకుండా సంఘటనలు సంభవించినా తను ఎంతో పరిశీలించి, పరిష్కార మార్గాన్ని వెతుకుతుంటారు. ఒక్కసారి తను నిర్ణయించుకుంటే  ఇక ఆయనను ఆపేవారు ఇంకెవరూ వుండరు. అలాగే ఏక కాలంలో పలు కార్యక్రమాలలో సవ్యంగా విజయం సాధించే ‘మల్టీ టాస్కింగ్’ ఆయన సొంతం. మన దేశంలో స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్నంత కాలమూ గాంధీజీ తన పెద్ద కుమారుడు హరిలాల్ కల్పించిన అవరోధాలు, ప్రతిబంధకాలు అన్నీ ఇన్నీకావు. అలాగే ఈ సువిశాల దేశపు వివిధ ప్రాంతాలకు చెందిన విలక్షణ నాయకులెందరినో ఆయన చాలా చాకచక్యంగా సంబాళించగలిగారు.

Also read: అద్భుతమైన వ్యక్తిత్వం కస్తూర్బా సొంతం

సార్వత్రికతను అర్థం చేసుకోవాలి

పర్యావరణానికి సంబంధించి మనిషి అలసత్వాన్ని ప్రకృతి తీరుస్తుంది కానీ పేరాశను కాదు. సగటు మనిషి పట్ల సమదృష్టి కలిగి వుండటమే తర్వాత, తర్వాత పర్యావరణ భావనకు దారితీసింది.  ఇప్పుడు మనం తరచు చర్చించుకునే మేనేజ్ మెంట్ సైన్సెస్ కు ఆది గురువు వంటివారు మహాత్మాగాంధీ. పాత్రికేయత్వాన్ని ప్రయోజనాత్మకంగా వాడిన డెవలప్మెంట్ జర్నలిస్ట్ కూడా ఆయనే.

Also read: గాంధీజీ అవసరం నేడు ఎక్కడెక్కడ?

గాంధీజీ ఆలోచనలలోని సార్వత్రికతను కానీ, ప్రయోజకత్వాన్ని గానీ మనం దృష్టి పెట్టకుండా, చర్చించుకోకుండా సాగిపోతున్నాం. కానీ మొత్తం ప్రపంచం మనం నిర్లక్ష్యం చేసిన గాంధీజీ తాత్వికతను అధ్యయనం చేసుకుని,  అలవర్చుకుంటోంది.

Also read: గాంధీజీ సార్వత్రికత ఏమిటి?

డా. నాగసూరి వేణుగోపాల్

మొబైల్ : 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles