ఆపరేషన్ సక్సెస్ ..పేషెంట్ డెడ్
తాంబూలాలు ఇచ్చుకున్న తరువాత తన్నుకు చావండి అని మహాకవి గురజాడ మనం రోజూ గుర్తుచేసుకోవాలసిందే మరి. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ రాజ్యాంగ హద్దులను అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారని ఒక్క ఏడాదిలోనే తేలిపోయింది. కాని కోర్టు తప్పు ఏముంది? కనీసం ఈ మాత్రం సమయం కావాలె కాదా కదా? చీఫ్ విప్ విషయంలో స్పీకర్, రాహుల్ నర్వేకర్ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు అని చెబితే చెప్పారు గాని, సుప్రీంకోర్టు కేవలం ఒక సలహా ఇచ్చి ప్రవచనం చేశారు. శుభం. అయితే చివరికి ఏం జరిగిందంటే ప్రభుత్వం రాజీనామా చేయవలసిన పనేమీ లేదు.
ఈ అన్ని సమస్యలకూ మూలమైనవి ఏమంటే….ఏడాది కింద జూన్ లో, అంటే ఖచ్చితంగా 11 నెలల్లో, ఆ మహానుభావుడు ఉద్ధవ్ ఠాక్రే పదవి నుంచి దిగిపోయాడు. ఫిరాయింపు ఆరోపణలతో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం అప్పటి ఉప సభాపతి అనే నరహరి జరీవాల్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ శిందే వర్గం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఇవన్నీ రాజకీయ న్యాయ, అన్యాయ, అక్రమం అని ఎవ్వరూ అనకూడదు.
దీనిపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ కృష్ణ మురారీ, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ వారి ధర్మాసనం, ఉద్ధవ్ ఠాక్రేను విశ్వాస పరీక్షకు ఆహ్వానించడంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం తప్పేనని తేల్చిచెప్పింది. రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా చేయాలో చెప్పారు. అందుకే, స్పీకర్, ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం విషయంలో తప్పించుకునే ధోరణిని ప్రదర్శించినప్పుడే.. మంత్రివర్గం సలహాలు లేకుండానే గవర్నర్‌కు జోక్యం చేసుకునే అధికారం ఉంటుందని మన రాజ్యాంగం న్యాయస్థానాలు వివరించాయి.
కాని వినేవారెవరు?
‘‘శిందే వర్గం రాసిన లేఖను ఆధారంగా చేసుకుని, ఉద్ధవ్ సర్కారు మెజారిటీని కోల్పోయిందని గవర్నర్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఆ లేఖ పేర్కొనలేదు. తాము ఒక వర్గంగా ఏర్పడ్డట్లు మాత్రమే వివరించారు. అది కేవలం ఒక పార్టీలో ఉన్న అంతర్గత వివాదమే. ఒక రాజకీయ పార్టీ అంతర్గత వివాదంలో, పార్టీల మధ్య వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారాన్ని రాజ్యాంగం గానీ, చట్టం గానీ గవర్నర్‌కు ఇవ్వలేదు. పార్టీలో అంతర్గత విభేదాల ఆధారంగా బలపరీక్షను ఓ మాధ్యమంగా వాడలేం. కేవలం అనర్హతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు రాసిన లేఖను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రిని విశ్వాస పరీక్షకు ఆహ్వానించడం తప్పే..! అవిశ్వాస తీర్మానం విషయంలోనే గవర్నర్‌కు విచక్షణాధికారం ఉంటుంది. కానీ, ఇక్కడ విపక్ష నాయకుడైన ఫడణవీస్ అవిశ్వాస తీర్మానమే పెట్టలేదు. లేఖ ఆధారంగా విశ్వాస పరీక్షకు గవర్నర్ ఆదేశించకుండా ఉండాల్సింది’’ అని ధర్మాసనంకు తీర్పు లో వివరించింది.
(దీన్ని వ్యాఖ్యానం అని పత్రికల్లో అంటూ ఉంటారు. కాని దాన్ని తీర్పు అని అర్థం.)
బొడ్డుతాడును తెంచివేయడమే
గవర్నర్ గారు ఏం చేస్తారు పాపం? ప్రభుత్వానికి కాదని చెప్పే శక్తి ఎవరికి ఉంది? ఇక చీఫ్ విప్ గారిని మాత్రం ఏమంటారు? ఈ విషయంలో స్పీకర్ రాహుల్ నర్వేకర్ నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ‘‘విప్‌ను నియమించేది రాజకీయ పార్టీ. పార్టీ శాసన సభాపక్షం కాదు. పార్టీ శాసనసభా పక్షం విప్‌ను నియమించడం అంటే.. శాసన సభాపక్షానికి, సంబంధిత రాజకీయా పార్టీకి మధ్య బొడ్డుతాడును తెంచివేయడమే’’ అని ధర్మాసనం తేల్చింది. అదే జరిగితే కొందరు ఎమ్మెల్యేలు కలిసి పార్టీ నుంచి విడిపోవచ్చని పేర్కొంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో విప్ నియామకం రాజకీయ పార్టీ హక్కు అని స్పష్టం చేసింది. ‘‘ఇద్దరు చీఫ్ విప్‌లు–– సునీల్ ప్రభు(ఉద్ధవ్ వర్గం), భరత్ గోగావాలే(శిందే వర్గం) ఉన్నప్పుడు.. ఎవరు చట్టబద్ధమైన చీఫ్ విప్ అనే అంశాన్ని గుర్తించేందుకు స్పీకర్ (రాహుల్ నర్వేకర్) ప్రయత్నించలేదు. అనర్హత విచారణను ఎదుర్కొనే ఎమ్మెల్యేలు తమదే అసలైన పార్టీ అని అంటారు. ఎదుటి వారు కాదు కాదని కూడా మామూలే.
భజన, విభజన
చాలా మందికి భజనకు విభజనకు మధ్య రాజ్యాంగ తేడా తెలియదు. పార్టీ విభజన అనేదాన్ని 91వ రాజ్యాంగ సవరణలో తొలగించారు. ‘‘ఇక్కడ పార్టీ విభజన అనే సవాలే లేదు. కానీ, చీఫ్ విప్ విషయంలో స్పీకర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. అవన్నీ మాకెందుకు, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? ఏం చేస్తున్నారు? మనకెందుకు.
సుప్రీంకోర్టు చెప్పినా వినరా?
సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2016లో నాబమ్ రెబియా కేసులో తీర్పు ఏమంటే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉండగా.. సభ్యుల అనర్హతపై ఆయన/ఆమె విచారణ జరపలేదని. శిందే వర్గంపై అనర్హత పిటిషన్ల విచారణను ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ చంద్రచూడ్ బదిలీ చేసారు. సుప్రీం కోర్టు అనర్హతపై విచారణను ముందు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శిందే వర్గానిదే అసలైన శివసేన అని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనర్హత తప్పిస్తారా?
నిజానికి విభజన ద్వారా తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం లేదు. శివసేన పార్టీ గుర్తు (విల్లు–బాణం)ను కూడా శిందే వర్గానికి కేటాయించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న పార్టీ ‘విభజన(స్ల్పిట్)’ అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం 2003లో 91 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించింది. ఈసీఐ తన ఉత్తర్వులను ‘పార్టీ విభజన’.. గతంలో శివసేన వారి పార్టీ రాజ్యాంగం (నియమావళి) ఆధారంగా చెప్పారు. సభాపతికి మాత్రమే అనర్హతపై విచారించే అధికారం ఉంటుందని, చీఫ్ విప్ గుర్తింపు నిర్ణయాన్ని మాత్రమే విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ అర్థం చేసుకున్నారు. అంటే గవర్నర్ లు, స్పీకర్లు అధికారంలో ఉన్న తరువాత ఉంటే వారిలో అందరికన్నా పెద్దవాడైన రాష్ట్రపతి గారేంచేస్తారు? ఇకపైన మాత్రం ఏం చేస్తారు? చేయవలసిన పనంతా అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా పెద్ద వారు చేసిపోయారు కదా.
ఆపరేషన్ బాగా జరిగింది కాని పేషంట్ చచ్చిపోయాడు. ఎందుకో తెలియదు. ఆ ఆపరేషన్ ప్రభుత్వ రహస్యం డాక్టర్లకేం తెలుసు, పాపం? మరణించిన బంధువులు వాళ్లను తంతే ఏం లాభం? డాక్టర్లు, లాయర్ కుమ్మక్కయిపోతే రాజ్యాంగం ఏమి చేస్తుంది? హైదరాబాద్ లో సెక్రెటెరియట్ దగ్గర పెద్ద బొమ్మలో మిగిలిపోయిన అంబేడ్కర్, కింద చిన్నగా ఉన్న ఇందిరాగాంధీ, ఇంకా చిన్నగా ఉన్న చిన్నారి పి. వి. నరసింహారావు మాత్రం డిల్లీ రాజకీయాలకు తెలుస్తారా? అందుకే డాక్టర్ పాత్రలో ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం పేషంట్ అయిన ఉద్ధవ్ ఠాక్రే సర్కారును పునరుద్ధరించలేమని తేల్చివేసింది. కథా అంతే అదే. ఎవరు మంచి వారో కాదో చెప్పలేరు.
ఇక కథ కంచికిపోయే ముందు, మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే…
నీతి నెంబర్ 1. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరపకూడదు(నాబమ్ రెబియా కేసు). సుప్రీంకోర్టుకి నమస్తే.
నీతి నెంబర్ 2. దొంగలు ఎవరో తెలియదు కదా. స్పీకర్ శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యేను చీఫ్‌విప్‌గా గుర్తించడం చట్ట విరుద్ధం అని మాత్రంతెలుస్తోంది మరి.
నీతి నెండర్ 3. రాజకీయ పార్టీ నియమించిన విప్‌ను స్పీకర్ తప్పనిసరిగా గుర్తించాలి. నిద్రబోయిన వాడిని లేపొచ్చుగాని, నిద్ర నటించే వాడిని ఏం చేస్తాడని సుప్రీంకోర్టుకు తెలియదా?
నీతి నెంబర్ 4లో నెంబర్ 3 మళ్లీ చదవాలి. అవిశ్వాసం నుంచి తప్పించుకునేందుకు స్పీకర్, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పుడే గవర్నర్ జోక్యం చేసుకుని, ఓటింగ్‌కు ఆదేశించాలి
నీతి నెంబర్ 5 మళ్లీ…ఇదే చదవాలి. ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతృత్వంలోని సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తున్నట్లు లేఖ రాసినా.. గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశించకూడదు
నీతి నంబర్ 6: ఇంకా ఏం చెబుదాం చెప్పండి? తిరుగుబాటు ఎమ్మెల్యేల తీర్మానాల ఆధారంగా ఉద్ధవ్ ఠాక్రే సర్కారు మైనారిటీలో పడిపోయిందని గవర్నర్ నిర్ణయం తీసుకోవడం సరికాదు. నాకు తెలిసినంతవరకు రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బాగనే చదువుకున్నారు.
నీతి నెంబర్ 7: ఆపరేషన్ జయప్రదం అయింది కానీ పేషంట్ చనిపోయీడంటే ఇదే కదా? బలపరీక్షకు ముందే ఉద్ధవ్ రాజీనామా చేసినందున.. ఆయన సర్కారును పునరుద్ధరించలేము. నీతి మళ్లీ నెంబర్: 5 చదవాలి కదా.
చివరాఖరికి నీతి నెంబర్ 8: ఉద్ధవ్ రాజీనామా తర్వాత శిందే వర్గాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం సరైన నిర్ణయమే.
తాంబూలాలు ఇచ్చుకున్న తరువాత తన్నుకు చావండి అని మహాకవి గురజాడ అన్న మాటను మనం రోజూ గుర్తుచేసుకోవాలసిందే మరి.
మాడభూషి శ్రీధర్ 13.5.2023