Tuesday, January 21, 2025

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు స్పర్థ

మహారాష్ట్ర – కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మళ్ళీ రగులుతోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాజాగా చేసిన వరుస వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ తగాదాలు ఎలాగూ ఉన్నాయి. ఇది కూడా రాజకీయంలో భాగమే అయినప్పటికీ, భాషాపరమైన భావోద్వేగాలు  దాగి వున్నాయి. ఎన్నో దశాబ్దాల నుండి సాగుతున్న ఈ గొడవలు మళ్ళీ పైకి లేచే సూచనలు కనిపిస్తున్నాయి.

భాషా భేదాలు

మిగిలిన వివాదాలు ఎలా ఉన్నా, ప్రస్తుతం రాజకున్న అంశం భాషాపరమైంది. బెల్గాం, మరి కొన్ని ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలన్నీ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ తిరిగి మహారాష్ట్రలో కలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే మొన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాల కోసం ప్రాణాలర్పించిన వారికి ఇదే నిజమైన నివాళి అని అన్నారు. ఈ మాటలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం మొన్న ఆదివారం నాడు ట్వీట్ చేసింది. ఈ ప్రకటనను సోమవారం నాడు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఖండించారు.

ఠాక్రేకు యడియూరప్ప సమాధానం

ఠాక్రేకు దీటుగా సమాధానం చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమని, తమ రాష్ట్రంలోని అంగుళం భూమిని కూడా వదులుకునే  ప్రసక్తే లేదని  యడియూరప్ప తిప్పికొట్టారు. అసలే బిజెపికి, శివసేనకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ మధ్య బీహార్ కు చెందిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అంశం పలురకాల మలుపులు తీసుకుంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య మరో గొడవ మొదలైంది. ఒకప్పుడు బెల్గాం / బెళగావి తదితర ప్రాంతాలు బాంబే ప్రేసిడెన్సీలో ఉండేవి. అక్కడ ఎక్కువ మంది మరాఠీ మాట్లాడేవారు. కాబట్టి వాటిని తమ రాష్ట్రంలో కలపండి అంటూ మహారాష్ట్ర ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోంది. బెళగావి కేంద్రంగా 1948లో “మహారాష్ట్ర ఏకీకరణ సమితి” ఏర్పడింది. వీరు ఈ దిశగా పోరాటం చేస్తున్నారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంలో ఆ ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు.

మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఆందోళన

దీనిపై మహారాష్ట్ర ఏకీకరణ సమితి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ఇందులో 10మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి జనవరి 17వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మళ్ళీ తాజాగా గొడవ మొదలైంది.ఎన్నో ఏళ్ళ నుంచి  ఈ వివాదం సుప్రీం కోర్టులో నడుస్తోంది. ఇంతవరకూ ఎటువంటి తీర్పు రాలేదు. దీని పట్ల ఉద్యమం చేస్తున్నవారికి తీవ్రమైన అసంతృప్తి కూడా ఉంది. బెల్గాం సరిహద్దు వివాదంగా ఇది ప్రసిద్ధిలో ఉంది.

బెల్గాం కోసం మహారాష్ట్ర పట్టు

ఒకప్పుడు గుజరాత్, మహారాష్ట్ర,ఉత్తర కర్ణాటక ప్రాంతాలు బాంబే ప్రెసిడెన్సీలో ఉన్నాయి. ఈ అంశంలోని పూర్వాపరాలు చూస్తే, బెల్గాం, తదితర ప్రాంతాలతో పాటు బెల్గాం నగరాన్ని కూడా మహారాష్ట్రలో కలపాలన్నది ప్రధాన డిమాండ్ గా కనిపిస్తోంది. దీనివల్లనే సమస్య పరిష్కారం కాలేదని అనిపిస్తోంది. 1881 గణాంకాలను పరిశీలిస్తే బెల్గాం జిల్లాలో 64.39శాతం కన్నడ మాట్లాడేవారు, 26.04 శాతం మరాఠీ మాట్లాడేవారు ఉండేవారు.  తదనంతర పరిణామాల్లో మరాఠీల వలసలు బాగా పెరిగాయి. 1948 ప్రాంతంలో బెల్గాం మున్సిపాలిటీలో మరాఠీ నాయకుల ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా బెల్గాంను  కర్ణాటకలోనే కొనసాగించారు. ఈ వివాదం పెరుగుతూ వచ్చింది.

మహాజన్ కమిషన్ సిఫార్సు

ఈ  నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో 1957లో నలుగురు సభ్యులతో భారత ప్రభుత్వం ఒక కమిటీని  వేసింది. ఈ కమిటీ కూడా సమస్యను పరిష్కరించలేకపోయింది. మహారాష్ట్ర నాయకుడు సేనాపతి నిరాహారదీక్షకు దిగారు. ఈ పరిణామాలు, మహారాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లతో 1967లో మహాజన్ కమిషన్ వేశారు. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మెహెర్ చంద్ మహాజన్ దీనికి అధిపతిగా  ఉన్నారు. బెల్గాం పట్టణం కాకుండా కొన్ని గ్రామాలను మహారాష్ట్రలో కలపడాన్ని ఈ కమిషన్ రికమెండ్ చేసింది. దీనితో, ఈ సమస్య ముగింపును నోచుకోలేకపోయింది.

బెల్గాం చుట్టూ కన్నడ భాషాప్రాంతాలే

అప్పటికి బెల్గాంలో మరాఠీ మాట్లాడేవారి సంఖ్య పెరిగినప్పటికీ, ఆ పట్టణానికి మూడు వైపుల ఉన్న ఊర్లన్నీ కన్నడ భాష మాట్లాడేవారితోనే ముడిపడి వున్నాయి. 1951 గణాంకాల ప్రకారం బెల్గాంలో మరాఠీ మాట్లాడేవారి సంఖ్య 60 శాతం వుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. కానీ, మహాజన్ కమిషన్ దీనికి బదులుగా 1961గణాంకాలను పరిగణలోకి తీసుకుంది. అప్పటికి, బెల్గాం పట్టణానికి అన్ని  వైపులా కన్నడ మాట్లాడే ప్రజల ప్రాంతాలు పెరిగిపోయాయి.ఈ సమస్య పరిష్కారం దిశగా 2005లో కేంద్ర ప్రభుత్వం ఒక కదలికను తీసుకొచ్చింది. కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరినీ మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోమని సూచించింది. కానీ, ఇది కూడా ముందుకు వెళ్ళలేదు.

సుప్రీంకోర్టులో నానుతున్న సమస్య

చివరకు,2006లో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అది ఇంకా అక్కడ నానుతోంది. మొత్తంమీద ఇద్దరు ముఖ్యమంత్రుల తాజా వేడి వ్యాఖ్యలతో అగ్గి రాజిల్లుకుంది. దేశంలోనే  భాషా ప్రయుక్త రాష్ట్రంగా  మొట్టమొదటిగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. మనకు కూడా మద్రాస్ నగరం విషయంలో, తమిళనాడులోని కొన్ని ఊర్ల విషయంలోనూ , ఒరిస్సాలో కలిసి పోయిన ప్రాంతాలతో పాటు కర్ణాటకతోనూ ఈ తరహా అంశాలు ముడిపడి ఉన్నాయి. బళ్లారి ప్రాంతంలో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. ఆ ప్రాంతం కర్ణాటకలో కలిసిపోయింది. మనం బళ్లారి ప్రాంతాన్ని నష్టపోయాం. అక్కడ నివసించే మనవాళ్ళు  అటు కన్నడ, ఇటు తెలుగు భాషలు మాట్లాడుతూ రెండు సంస్కృతులను గౌరవిస్తూ జీవిస్తున్నారు.

సర్దుకుపోతున్నాం

బెంగళూరులోనూ తెలుగుమాట్లాడేవారు ఎక్కువమందే ఉన్నారు. కర్ణాటకతో  నీరు తదితర అంశాల్లో మనం చాలా నష్టపోయాం. భాషాపరంగా చూస్తే, మనం వివాదాలు పెంచుకోకుండా హుందాగా వ్యవహారించాం. ఒక కర్ణాటక రాష్ట్రమే కాక,మనవాళ్లు ప్రధాన భూమిక పోషించి నిర్మించుకున్న మద్రాస్ మహా నగరాన్ని పోగొట్టుకున్నాం. తిరుమల క్షేత్రాన్ని కాపాడుకోవడం కోసం, ఇటువంటి త్యాగాలు ఎన్నో చేశాం. ఇప్పటికీ చెన్నై నగరమేకాక, తమిళనాడులోని చాలా ప్రాంతాలలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. ఒరిస్సా రాష్ట్రంతోనూ మనకు ఇటువంటి సమస్యలు వచ్చాయి. పర్లాకిమిడి, బరంపురం (బ్రహ్మపురం) మొదలైనవి తెలుగుమాట్లాడేవారు అత్యధికంగా ఉండే ప్రాంతాలు. ఇవి ఒరిస్సాలో కలిసిపోయాయి.

బరంపురం మనదే కానీ

బరంపురంలో ఉండే తెలుగువారి హృదయం ఎప్పుడూ మన తెలుగునేలపైన, భాషపైనే   ఉంటుంది. ఆ ఆవేదనను మనసులోనే దాచుకుని, రెండు భాషా సంస్కృతులను గౌరవిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. హోసూరులో తెలుగు, తమిళం, కన్నడ మాట్లాడేవారు కలిసి మెలిసి వున్నారు. ఇక్కడుండే తెలుగువారు కూడా తెలుగును ఆరాధిస్తూ ఉన్నారు. రాష్ట్రాలు ఏర్పడి కూడా ఆరు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ యుద్ధాలు చేసుకొని విడిపోవాలనుకోవడం సరియైన ఆలోచన కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

కలసి సాగడమే ఉత్తమం

భాషా, సంస్కృతులను కాపాడుకుంటూ, ఇతర  భాషా సంస్కృతులను గౌరవిస్తూ, సాంస్కృతికపరమైన సమస్యలేమైనా ఉంటే, వాటిని పరిష్కరించుకుని కలిసి సాగడమే ఉత్తమమైన మార్గం. మహారాష్ట్ర -కర్ణాటక భాషాపరమైన సరిహద్దు వివాదం రాజకీయ లబ్ధి కోసం పెంచి పోషించుకుంటే, అది ఆ రెండు రాష్ట్రాలను దాటి మిగిలిన రాష్ట్రాలకు కూడా పాకుతుంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త వివాదాలు తోడవ్వడం శ్రేయస్కరం కాదు. కలిసి నడవడమే పరిష్కార మార్గం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles