వోలేటి దివాకర్
రాజమహేంద్రవరంలో మే 27,28 తేదీల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మహానటుడు ఎన్టీ రామారావు శతజయంతోత్సవ సంవత్సరం కావడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు రానుండటంతో ముందస్తు టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయడం వంటి ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. ఈ పండుగకు తెలుగు తమ్ముళ్లు స్వచ్చందంగా… ఉత్సాహంగా హాజరయ్యారు. దీంతో ఈ ఏడాది ఆశించిన దానికి కన్నా మహానాడు ఎంతో ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం నగరంతో పాటు, పరిసర గ్రామాల్లో పార్టీ శ్రేణులు పోటీపడి మరీ తెలుగుదేశం ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో పసుపుమయం చేశారు.
మహానాడు బహిరంగ సభ జరిగిన రోజున ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సరిగ్గా సభ జరిగే రెండు గంటల ముందు వాతావారణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మహానాడు కోసం కట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు దెబ్బతిన్నాయి. సభా ప్రాంగణం వద్ద కూడా ఇబ్బందులు తలెత్తాయి. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. టిడిపి నాయకులతో పాటు, పార్టీ అభిమానులు కూడా ఆందోళన చెందారు. మరోవైపు మహానాడులో కట్టిన ఫ్లెక్సీలను తొలగించడం, టిడిపి ఫ్లెక్సీల పక్కనే వైసిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి చేష్టలు విమర్శలకు దారితీశాయి. మే 28న ఆదివారం సభ వర్షార్పణం కానుందని వై ఎస్సార్ సిపి శ్రేణులు లోలోపలే ఆనందపడ్డాయి. అయితే వారి ఆనందం ఆవిరయ్యింది. సభ కొంత ఆలస్యమైనా చల్లటి వాతావరణంలో సజావుగా సాగిపోయింది. వర్ష సమయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు చెల్లాచెదురైనా ఆ వెంటనే సభా ప్రాంగణానికి తరలిరావడం విశేషం.
ఆతిధ్యం అద్భుతం!
పార్టీ కార్యకర్తలు, విలేఖర్లకు ఆతిధ్యం ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీది ఎప్పుడూ ముందంజే. 2006 లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన మహానాడు ప్రతినిధుల సభను కవర్ చేసే అవకాశం లభించింది. నడి వేసవిలో కూడా ఎండ తగలకుండా డేరాలు వేసి, కూలర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి విలేఖర్లకు కొత్త అల్లుళ్ల మాదిరిగా మర్యాదలు చేశారు. ప్రతీ పావుగంటకూ స్నాక్స్, శీతల పానియాలు అందించి, ముఖం మొత్తించారు. విలేఖరులకు జరుగుతున్న మర్యాదలు చూసి, పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే అసూయను వ్యక్తం చేయడం గమనార్హం. ఇక టిఫిన్లు, భోజనాలు సరేసరి. 2006 లో కాకినాడకు చెందిన నాటి టిడిపి నాయకుడు దివంగత ఫ్రూటీ కుమార్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే పార్టీ కార్యకర్తలకు కూడా ఏలోటూ రాకుండా ఏర్పాట్లు చేశారు.
ఈసారి మహానాడును ప్రత్యక్షంగా కవర్ చేసే అవకాశం లభించకపోయినా…. అల్పాహారం, భోజన ఏర్పాట్లు అదే స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. మహానాడు జరిగిన రెండు రోజులు టిడిపి కార్యకర్తలతో పాటు, స్థానికులు కూడా టిఫిన్లు, భోజనాలకు ఎగబడ్డారు. రాజమహేంద్రవరం. నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహానాడుకు భోజనాల కోసం వెళ్లిన వారు కూడా ఉండటం విశేషం. దీంతో స్థానిక హోటళ్లు, మాంసహార దుకాణాల్లో వ్యాపారం
మందంగించింది.
భవిష్యత్ కు భరోసా సరే… భవిష్యత్ పొత్తుల ప్రస్తావనేదీ?
తెలుగుదేశం పార్టీ మహానాడు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినా ప్రజలు, ఇతర పార్టీలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మహానాడులో టీడీపీ నేతల పరనిందలు, ఆత్మస్తుతి మామూలే. రానున్న ఎన్నికలకు సంబంధించిన పొత్తుల ప్రస్తావన, రాజకీయ తీర్మానాలు లేకపోవడంతో మహానాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనం సృష్టించలేదు. ప్రజల్లో కూడా పెద్దగా ఆసక్తి వ్యక్తం కాలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బిజెపిలతో కలిసి టిడిపి పోటీ చేస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ భావి పొత్తులపై కనీస ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది వ్యూహాత్మకం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మహానాడు వేదిక ద్వారా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భవితకు భరోసా పేరిట తొలి విడత ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించారు. మహిళా సాధికారతకు మహాశక్తి, యువగళం, అన్నదాత, ప్రతీ ఇంటికీ మంచినీళ్లు, బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం, పూర్ టు రిచ్ కార్యక్రమాల కింద పలు పథకాలను ప్రకటించారు. తద్వారా రానున్న ఎన్నికలకు సమరశంఖాన్ని పూరించారు.
ఈసారి మహానాడుకు టిడిపి అనుకూల సినీతారలు హాజరుకాకపోవడం కూడా అభిమానులకు కాస్త నిరాశను కలిగించింది. మహానాడు లాంటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించినా…రాజమహేంద్రవరంనకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి అప్పారావు మధ్య పైక్సీల పేరిట ఆధిపత్య పోరు కొనసాగడం గమనార్హం. మహానాడు గోరంట్ల ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో జరిగినా ఆదిరెడ్డి అప్పారావు వర్గీయులు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీల్లో గోరంట్ల బొమ్మ వేయకపోవడం అదిరెడ్డి వర్గ వైఖరిని తేటతెల్లం చేస్తున్నట్లు కనిపించింది.