Tuesday, January 21, 2025

దేవనూరు మహదేవ: దేశంలో ఒక  సంచలనం!

 ‘కన్నడ దళిత బందయ’ ఉద్యమానికి ఊపిరులూదిన ప్రఖ్యాత కన్నడ రచయిత దేవనూరు మహదేవ, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి, కన్నడ భాషకూ పరిమితమైన రచయిత కాదు. ఆయన రచనలకు వెంటవెంటనే వచ్చిన అనువాదాల వల్ల ఆయన ఇప్పుడు భారతీయ రచయితల జాబితాలో చేరిపోయారు. పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు స్వీకరించడం వల్ల కూడా ఆయన గురించి ఇతర రాష్ట్రాలలో తెలిసింది. అంతకంటే ముఖ్యంగా 2010లో కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ‘నృపతుంగ అవార్డు’ను తిరస్కరించడం వల్ల కూడా ఈ రచయిత పేరు భారతీయ సాహిత్య జగత్తులో మారుమ్రోగింది. ‘ఓదలాల,’ ‘కుసుమబాలె,’ ‘ఇఢగ బిడ్డ అక్షర’ వంటివి ఈయన ప్రసిద్ధ రచనలు. మైసూరు జిల్లా, నంజన్ గుడ్ తాలూకా దేవనూరు గ్రామంలో 10 జూన్ 1948లో జన్మించిన దేవనూరు మహదేవ వృత్తిరీత్యా కన్నడ ఉపాధ్యాయుడు. సాదాసీదా జీవితం గడుపుతున్నదశలో నృపతుంగ అవార్డు ద్వారా లభించే అయిదు లక్షల ఒక వెయ్యి నగదును వదులుకోవడం గొప్ప విషయమే! అందుకు ఆయన చెప్పిన బలమైన కారణం ఏమిటంటే – కర్ణాటకలో కన్నడం అధికార భాష అయినా, అక్కడి పాఠశాలల్లో ఆ మాధ్యమంలో బోధన జరగకపోవడం! దాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే  ఆ అవార్డును తిరస్కరించారు. పిల్లలకు మాతృభాషలో బోధించడం అత్యవసరమని – వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కళాశాల స్థాయి వరకు కన్నడ మాధ్యమంలో బోధన చేపట్టాలనీ కోరారు.

ఆర్ ఎస్ ఎస్ ఆలమత్తు అగల, పుస్తక రచయిత మహాదేవ

Also read: మ్యాన్ వర్సెస్ వైల్డ్

కొన్ని విలువలకు కట్టుబడి సాహిత్యోద్యమకారుడిగా ఎప్పుడూ ముందుండే దేవనూరు మహదేవ ఇటీవలి కాలంలో కూడా మారిన్ని సంచలనాలకు కారణమయ్యారు. ‘‘ఆర్ఎస్ఎస్-దాని మూలం, దాని శ్వాస (ఆర్ఎస్ఎస్ ఆలమట్టు అగల)శీర్షికతో 64 పేజీల ఒక చిన్న పుస్తకం ప్రకటించారు. అది దేశంలోని అదికార పార్టీ బీజేపీకి మూల గురువైన ఆరెస్సెస్ నిజ స్వరూపాన్ని-ఉద్దేశాలను చాలా లోతుగా పరిశీలించి, వాటిని ఈ దేశ ప్రజల ముందుకు తెచ్చింది. మన జానపదకథ, ‘‘బాలనాగమ్మ’ కథలో- ‘మాయల ఫకీరు ప్రాణం చిలకలోన ఉన్నదీ’ అన్నట్టు- ఇక్కడ పరిపాలన సాగిస్తున్న అధికార పార్టీ ప్రాణం ఆరెస్సెస్ అరచేతిలో ఉందని ఈ దేశ ప్రజలకు తెలుసు. అందుకే ఆ రచయిత నేరుగా ఆరెస్సెస్ విధానాలు, ఆలోచనా ధోరణి ఎలాంటిదో విశ్లేషిస్తూ ఆ పుస్తకం రాశారు. ఆరెస్సెస్ ఈ దేశాన్ని ఎటు ఈడ్చుకువెళ్ళాలని చూస్తూ ఉందో అందులో విడమరిచి  చెప్పారు. సంఘ్ పరివార్ గురించి ప్రచారంలో ఉన్న అభిప్రాయాలేమిటీ? వాస్తవానికి దాని అసలు రంగేమిటీ? అనే విషయం స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చారు రచయిత.

Also read: రామాయణంలో బుద్ధుణ్ణి ఎందుకు తిట్టారు?

ఈ చిన్న కన్నడ పుస్తకం మార్కెట్లోకి రాగానే లక్ష కాపీలు అమ్ముడయ్యాయి. ఆ డిమాండ్ ను తట్టుకునే విధంగా మరో డెబ్బయ్ వేల కాపీలు ముద్రిస్తున్నారు. అంతే కాదు, తెలుగు, తమిళం, మళయాలం, హిందీ, ఇంగ్లీషు వంటి ఇతర భారతీయ భాషలల్లో కూడా అనువాదాలు అచ్చవుతున్నాయి. ‘‘ఆర్ ఎస్ ఎస్ –లొతుపాతులు’’ శీర్షికతో తెలుగులో కూడా వచ్చింది. అజయ్ వర్మ వల్లూరి అనే యువరచయిత దీన్ని తెలుగులోకి అనువదించాడు. ఈయన ఇటీవలి కాలంలో మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి యం.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. అసలైతే ఈయన కూడా కర్ణాటకవాడే! రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రచురణ సంస్థలన్నీ ఈ తెలుగు అనువాదాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి.

తెలుగు అనువాదం మొదటిసారి సెప్టెంబర్ 2022లో అచ్చయ్యింది. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదివి విషయం వివరంగా తెలుసుకోవాల్సిందే! ఆరెస్సెస్ కున్న నిగూఢమైన ఎజెండా ఏమిటో? అది ఈ దేశాన్ని ఎంత ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తుందో ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎక్కడికక్కడ తిప్పి కొట్టడానికి సిద్ధపడాలి.

Also read: జూన్ 21ని ‘హ్యూమనిస్ట్ డే’ గా గుర్తుంచుకుందాం!

రచయిత దేవనూరు మహదేవ  తన పుస్తకంలో చెప్పిన అంశాలు టూకీగా చెప్పుకోవాలంటే… అవి ఇలా ఉంటాయి-

  1. భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని నెలకొల్పాలని ఆరెస్సెస్ ఆరాటపడుతూ ఉంది.
  2. కులమతాల ప్రసక్తి పక్కన పెట్టి మనుషులంతా ఒక్కటే అనే అభిప్రాయం దేశ  పౌరల్లో కలగకుండా చేయాలని ప్రయత్నిస్తోంది. నిచ్చెనమెట్ల కుల సంస్కృతిని పునరుద్ధరించాలని ఆరాటపడుతూ ఉంది.
  3. స్త్రీలను దళితుల జాబితాలో చేర్చి, వారి హక్కుల్ని కాలరాయలని చూస్తోంది.
  4. అభివృద్ధి నిరోధకంగా, ఆధునిక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా హిందూ ధర్మాన్ని, భూతవైద్యాన్ని, క్షుద్రపూజల్ని, వాస్తు, జ్యోతిషం, పునర్జన్మల్ని, పాపపుణ్యాల్ని సజావుగా పెంచి పోషించాలని ఆరెస్సెస్, దాని ఉపసంస్థలు, సంఘాలు కలలు కంటున్నాయి. ఆరెస్సెస్ సంతానాలు సుమారు యాభయ్ దాకా ఉన్నాయి. నలభై సంస్థల వివరాలు ప్రజలకు అందుబాటులో కొచ్చాయి.  అందులో బీజేపీ, అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), హిందూ జాగరణ్ మంచ్, విశ్వహిందూ పరిషత్, సంస్కార భారతి, బజరంగ్ దళ్, శ్రీరామసేన, ధర్మ సంసద్  – ఇలా అనేకం! ఇవన్నీ పాతికేళ్లకు ముందే ఏర్పడ్డ- ఆరెస్సెస్ పిల్ల సంస్థలు. ఇప్పటికి వీటి సంఖ్య ఎన్ని రెట్లు పెరిగాయో లెక్కతేలలేదు.
  5. వీటితో ఈ దేశ ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని రచయిత దేవనూరు మహదేవ హెచ్చరించారు. ఎందుకంటే ఈ సంస్థల సభ్యులందరూ ఆరెస్సెస్ చేతిలో కీలుబొమ్మల్లా ప్రవర్తిస్తారు తప్ప, స్వంత మెదడు ఉపయోగించరు. ‘‘తమ సబ్యులకు అసలు వివేచనా శక్తే అక్కర లేదు’’- అని గోల్వాల్కర్ 16 మార్చి 1954ర వార్థాలో చేసిన ప్రసంగంలో అన్నారు.
  6. సెక్యులర్, ఫెడరల్ అనే పదాలే వీరికి రుచించవు. వాటిని నాశనం చేయడమే  ఆరెస్సెస్ వారి జీవిత ధ్యేయం!
  7. Also read: మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం
  8. ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు వారి ఉనికిని వారు కాపాడుకోకుండా అడ్డుపడాలి. వారిని నాశనం చేయాలి. లొంగిపోయి హిందుత్వను స్వీకరించి, బానిసల్లా పడి ఉండడానికి సిద్ధపడితే-సరే. ఉండొచ్చు.
  9. జర్మన్ నియంత హిట్లర్ పోకడల్ని తు.చ. తప్పకుండా పాటించాలని, తమ హిందూత్వ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని – ఈ దేశాన్నిహిందూ దేశంగా మార్చాలని వారి కోరిక!
  10. మొదట హిందీని దేశమంతా పులిమి, తర్వాత సంస్కృతాన్ని తీసుకురావాలని వారి ఆరాటం! లలితా సహస్రనామాన్ని పార్లమెంటులో ప్రార్థనాగీతం చేయాలి. వాస్తు, జ్యతిషంతో పాటు భూతవైద్యాన్ని, క్షుద్రపూజల్నికూడా విశ్వవిద్యాలయాల్లో కోర్సులుగా చేయాలి. పౌరోహిత్యం, కర్మకాండ కూడా అధ్యయన అంశాలుగా మార్చాలన్నది ఆరెస్సెస్ నిర్ణయం.
  11. సావర్కర్ ను దేశభక్తుడిగా చేయాలి. విషం కక్కే అతని ఉపన్యాసాల్ని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టాలి. గాంధీ హత్యకు కారకుడైన గాడ్సేను పరమ దేశభక్తుడిగా గౌరవించుకోవాలి!

ఓటర్లను డబ్బుతో కట్టిపడేయాలని, ఇతర పార్టీలవారిని డబ్బు-పదవుల ఆశతో లొంగదీసుకోవాలని ఆరెస్సెస్ తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలోని ఎన్నో రాష్ట్రాలలో, సజావుగా నడిచే ప్రభుత్వాల్ని కూలగొట్టి అధికారం చేజిక్కించుకున్న వైనం మనం గత 7,8 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. దేశంలోని వివిధ రాష్ట్రాలలో 3 రకాల  పార్టీలు అధికారంలో ఉన్నాయి. 1. ఒకే వ్యక్తి నియంత్రించే పార్టీలు.2. ఒకే కుటుంబం నియంత్రించే పార్టీలు. 3. రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన సంఘాలతో ఏర్పడ్డ పార్టీలు. వీటిలో అత్యంత ప్రమాదకరమైంది ఈ మూడో రకం. రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) చేతిలో కీలుబొమ్మ బీజేపీ. ఆ పార్టీకి గానీ, ఆ నాయకులకు గానీ స్వయం ప్రతిపత్తి ఉండదు.

Also read: సెంగోల్:  రాజ్యాంగం పై సర్జికల్ స్ట్రైక్

ఆరెస్సెస్ ఆదేశానుసారం బీజేపీ నాయకులు నడుచుకుంటూ ఉంటారు. ప్రజాసంక్షేమం పట్టించుకోరు. అందుకే ప్రజలు తిరగబడి, కర్ణాటకలో బీజేపీకి బుద్ధి చెప్పారు. భారత దేశంలో ద్రవిడ, ఆర్య, ఇస్లాం, క్రైస్తవ రక్తాలన్నీ వేరు చేయలేనంతగా కలిసిపోయాయి. అలాంటప్పుడు ఇంకా ఆర్య ఔన్నత్య సిద్ధాంతాన్ని పట్టుకొని రోగగ్రస్తమైన ఆరెస్సెస్ కు- తగిన చికిత్స చేయడం తప్పనిసరి అని రచయిత దేవనూరు మహదేవ చెపుతున్నారు. ఈ దేశంలోనే పుట్టి, దేశదేశాలకు విస్తరించిన బౌద్ధ, జైన, సిక్కు, లింగాయత జీవన విధానాల్ని బలవంతంగా చాతుర్వర్ణాలలో కలిపి, తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ఆరెస్సెస్ అహర్నిశలు శ్రమిస్తోంది. చారిత్రక కట్టడాల, నగరాల పేర్లు మార్చడం, పాఠ్యాంశాల్లోంచి చరిత్ర, సైన్సు అంశాల్ని తొలగించడం ఒక బుద్ధితక్కువ పని అయితే, ఆదివాసుల, మూలవాసుల పేరు కూడా మార్చి – వారికి ‘వనవాసి’ అని నామకరణం చేసింది. సింధూనాగరికత పేరు మార్చి ‘సరస్వతి నాగరికత’గా వ్యవహరిస్తోంది. దీని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే సామాన్య పౌరులు వివేకవంతులు కావాలి. వైజ్ఞానిక అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి!

ఆర్ ఎస్ ఎస్ లోతుపాతులు, దేవనూరు మహదేవ కన్నడ రచనకు తెలుగు అనువాదం

కర్ణాటకలో ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా పని చేసి, అధికార బీజేపీని ఓడించినట్టుగా మనకు అనిపిస్తుంది (మే 2023) కానీ, అక్కడ క్షేత్రస్థాయిలో అనేక ప్రజాసంఘాలు-తమతత్త్వపార్టీని మట్టుబెట్టాలన్న నినాదంతో ఇల్లిల్లూ, వీధివీధీ తిరిగి ప్రచారం చేశాయి. ఇప్పుడు ఫలితాలు మన కళ్ళ ముందే ఉన్నాయి.  దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలలో కూడా జనాన్ని ఆలోచింపజేసే కార్యక్రమాలు బాధ్యత గల పౌరులు, సమూహాలు, సంఘాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే సామాన్యులు వివేకవంతులు కాకతప్పదు. ప్రతి ఒక్కరూ యదార్థాల్ని గ్రహించే శక్తిని పెంచుకోకతప్పదు. మరో మతం, మరో ఆలోచనా ధోరణీ లేకుండా భారతీయులందరినీ ‘హిందుత్వ’ గొడుగులోకి లాక్కోవాలని ఆరెస్సెస్ పన్నిన కుట్రను భగ్నం చేయాల్సి ఉంది. ఆరెస్సెస్-బీజేపీల ఆలోచనా ధోరణి ఈ దేశ సమగ్రతకు ప్రమాదమని హెచ్చరించారు రచయిత దేవనూరు మహదేవ.

Also read: ‘జైహింద్’ ఆలోచన మన హైదరాబాదువాడిదే!

విచ్ఛిన్నతే దెయ్యం!

ఐక్యతే దైవం!!

అన్న సూక్తిని జీర్ణించుకకుని, వ్యక్తులు, సమూహాలు, ఎన్ జీవోలు, స్త్రీలు, పురుషులు, ఇతర రాజకీయపార్టీలు అన్నీ సంఘటితమై ఆరెస్సెస్ దుర్మార్గాల్ని అడ్డుకోవాల్సి ఉంది. అంతకన్నా మరో మార్గం లేదు. ప్రజాస్వామ్య బద్ధంగానే బీజేపీకి అధికారపీఠం అందించిన ఈ దేశ ప్రజలు, మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగానే దాన్ని గద్దె దించాల్సిన అవసరం వచ్చింది. అందుకు ఈ దేశ ప్రజలు సమాయత్తమౌతున్నారు.

Also read: గుర్తిస్తే, మానవవాదులు మన‘లోనే’ ఉన్నారు!

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)  

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles