ముంబయ్ : విప్లవ కవి, జర్నలిస్టు వరవరరావును తలోజా సెంట్రల్ జైలు నుంచి నానావతి హాస్పిటల్ కు తరలించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. బాంబే హైకోర్టు గట్టిగా నొక్కి చెప్పిన తర్వాత వి.వి.ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఒప్పుకున్నారు. ఆస్పత్రిలో 15 రోజులపాటు వైద్యం చేస్తూ, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రత్యక్ష విచారణ
జస్టిసెస్ ఎస్.ఎస్. షిండే, మాధవ్ జామ్దార్ లతో కూడిన బెంచ్ బుధవారంనాడు ప్రత్యక్షంగా కేసు విచారించింది. మంగళవారంనాడు ఆన్ లైన్ లో జరిగిన విచారణలో ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ వి.వి. తరఫున వాదించినప్పుడు ఆమె మాటలు సరిగా వినపడలేదని బుధవారం ప్రత్యక్ష విచారణ చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళవారంనాడు కూడా ఇందిరాజైసింగ్ వి.వి.ని నానావతి ఆస్పత్రికి తరలించాలని కోరారు. ఇది చాలా అత్యవసరమైన కేసు కనుక కోర్టుకు శలవలు ఉన్నప్పటికీ ప్రత్యక్ష విచారణ చేయాలని న్యాయమూర్తులు నిర్ణయించారు.
అనారోగ్య సమస్యలు అనేకం
ఇందిరా జైసింగ్ వి.వి.కి ఉన్న ఆనారోగ్య సమస్యలన్నిటినీ ఏకరువు పెట్టారు. అన్ని సమస్యలకూ పరిష్కారం లభించాలంటే నానావతి ఆస్పత్రికి తరలించడం ఒక్కటే మార్గమని ఆమె పట్టుపట్టారు. చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీపక్ ఠాకరే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలనీ, ప్రభుత్వాన్ని ఒప్పించాలనీ న్యాయమూర్తులు ఆదేశించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్ తో మాట్లాడాననీ, వరవరరావును నానావతి ఆస్పత్రికి 15 రోజులకోసం పంపించడానికి ఆయన అంగీకరించారనీ తెలిపారు. ఇది ఆనవాయితీ కాకూడదనీ, ఒక ప్రత్యేక కేసుగా ఈ ఒక్క కేసులోనే ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతి
ఉత్తర్వును చెబుతూ వరవరరావు కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరవరరావుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి సమర్పించాలని కూడా న్యాయమూర్తులు ఆదేశించారు. ఉత్తర్వులు జారీ చేస్తున్న సందర్భంలోనే అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనీల్ సింగ్ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తరఫున వాదిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులలో వసతులు బాగానే ఉన్నాయని చెప్పారు. జే.జే. ఆస్పత్రికి తరలించడానికి తమకు అభ్యంతరం లేదని అన్నారు. ఆయన గట్టిగా అభ్యంతరాలు చెబుతున్నప్పుడు ఇందిరా జైసింగ్ కల్పించుకున్నారు.
కస్టోడియల్ డెత్ అవుతుంది జాగ్రత్త: ఇందిరా జైసింగ్
జే.జే. ఆస్పత్రిలోనే వరవరరావు ఒక మూత్రం మడుగులో పడి ఉండి కనిపించారనీ, అక్కడ వసతుల ఏ మాత్రం సవ్యంగా లేవనీ చెప్పారు. నానావతి ఆస్పత్రికి పంపించడం ప్రబుత్వానికి కూడా ఇష్టమేననీ, ఇదివరకు ఒక సారి ఆ ఆస్పత్రికి వరవరరావును పంపించారనీ ఆమె తెలియజేశారు. వరవరరావు ఆస్పత్రిలో తుది శ్వాస వదులుతే అది కస్టోడియల్ డెత్ కిందికి వస్తుందని ఆమె హెచ్చరించారు. నవంబర్ 17న 15 నిమిషాలు విడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇచ్చిన వైద్య నివేదికను చదువుతూ ఆయన వయస్సు 45 సంవత్సరాలని రాశారని చెప్పారు.
నానావతి ఆస్పత్రి నివేదిక
అంతకు పూర్వం నానావతి ఆస్పత్రి ఇచ్చిన నివేదికను చదివి వినిపిస్తూ, వరవరరావుకు డెమన్షియా (మతిమరుపు) వచ్చిందనీ, గుండెపోటు వచ్చిందనీ, లివర్, కిడ్నీ పాడైపోయాయనీ, కోవిద్ అనంతరం వచ్చే దుష్పరిణామాలు ఉన్నాయనీ పేర్కొన్నారు. థాచెటర్ మూడు మాసాలుగా మార్చని కారణంగా మూత్రవాహికకు ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారు.
Also Read: వరవరరావు వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు పరిరక్షించలేకపోయింది ఎందుకని?