Tuesday, January 21, 2025

కమ్యూనిస్టు గాడిద

కథ

చాకలి రాములుకు పూట గడవటం కష్టమయిపోయింది. అతని పరిస్థతి పూర్తిగా దిగజారిపోయింది. ఎంత  దిగజారిపోయిందంటే తను, తన కుటుంబం వారానికి నాలుగు రోజులు పస్తులుండాల్సి వస్తే గాడిదను మాత్రం వారం అంతా పస్తులుంచే స్థితికి దిగజారిపోయింది. ఆ కారణంగానే అతని గాడిద పూర్తిగా చిక్కిశల్యమై చావుకి కాళ్ళుజాపుకు కూర్చుంది.

గాడిద తన కళ్ళెదుటే చస్తూ వుడటం చూసి వూరుకోలేక రాములు దాన్ని వీధిలోకి తరిమెయ్యాలని నిర్ణయించుకొన్నాడు. అనుకొన్నదే ఆలస్యంగా కట్లు విప్పి గాడిదను వీధిలోకి తోలేశాడు.

వీధిలో పడ్డ గాడిద యజమానికేసి విస్తుపోయి విచారంగా చూసింది. ఆ చూపుల ధాటికి తట్టుకోలేక చాకలి రాములు ‘‘వెళ్ళు వెళ్ళి నీ బ్రతుకేదో నువు బ్రతుకు’’ అంటూ రెండు తగిలించి గుడిసెలోకి వెళ్ళి దభీల్న తలుపులు వేసుకున్నాడు.

కొద్ది సేపటి వరకూ ఏమీ పాలుపోక, ఎటూ తేల్చుకోలేక అలా వీధిలోకి నిలువునా నిలబడిపోయింది గాడిద. ఆ తర్వాత ఎటువెళ్ళాలో దానికి తోచలేదు. ఇటు చూస్తే మైదానాలు దాని కళ్ళలో మెదిలాయి. ఎటకేగుటకో సమస్యగా ఘనీభవించింది గాడిదకు. ఊళ్ళోకి వెళ్ళి సినిమా పోస్టర్లు, చిత్తుకాగితాలు మేయాలంటే ట్రాఫిక్ ను తప్పుకోవడానికి నానా హైరానా పడాలి. పైగా తాగటానికి అక్కడ నీళ్ళు కూడా దొరికే అవకాశం లేదు. అందుచేత వూరి చివరికి వెళ్ళి పచ్చగడ్డి మేసి కాలువలో పచ్చి మంచినీళ్ళు తాగవచ్చుననుకొని కాళ్ళీడ్చుకుంటూ వూరి చివరికి నడిచింది.

అలా కాళ్ళీడ్చుకుంటూ వూరు చివరకకు చేరుకొనేసరికి గాడిదకు పూర్తిగా నిరాశే ఎదురైంది. పచ్చగడ్డి మచ్చుకైనా కనిపించలేదు. కాలువొడ్డున ఏమైనా వుంటుందేమోనని అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా వెదికి చూసింది. పాపం ఆ గాడిదకేం తెలుసు దేశంలో తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లుగా వుందని, ఆ వూళ్ళో కూడా యీ రెండు వర్గాలవారు వున్నారని, యిహ పచ్చగడ్డి ఎక్కడుంటుందనీను…

ఆనక చేసేది లేక అగ్రకులాల వాళ్ళు ఎవరైనా చూస్తారని భయంభయంగా అటూయిటూ చూసి కాలువలోని నీరు గబగబా త్రాగేసి వెనక్కి తిరిగి వూరుకేసి నడకసాగించింది.

ఊళ్ళోకొచ్చింతర్వాత అది చిత్తు కాగితాల కోసం రోడ్లన్నీ కలియ తిరిగింది. ఎక్కడా చిన్న కాగితం ముక్కయినా కనిపించలేదు. అంతకు చాన్నాళ్ళముందే దేశంలో కాగితం కొరత ఏర్పడిందనీ, అందువల్ల ప్రభుత్వం కాగితాలమీద కంట్రోలు ఏర్పాటు చేసిందనీ, అప్పట్నంచి ప్రజలు మరియు పత్రికల వాళ్ళూ కాగితాన్ని బహుజాగ్రత్తగా వాడుకుంటున్నారనీ, అందుకని చెత్త కుండీలలో కూడా ఒక్క కాగితం ముక్క కనబడకుండా పోయిందనీ ఆ గాడిదకు తట్టలేదు. తట్టింతర్వాత దాని బుర్రలో మరో లైటు వెలిగింది. ఇహ సినిమో పోస్టర్లే గత్యంతరమని వాటికేసి చూసింది.

పచ్చగడ్డి, చిత్తుకాగితాలు దొరక్కపోతే గాడిదలూ, గేదెలూ, గోవులూ అన్నీ కలిసి మూకుమ్మడిగా  సినిమా పోస్టర్లమీదికి ఎగబడవచ్చునని ముందుగానే వూహించిన సినిమా వాల్ పోస్టర్లను చాలా ఎత్తున వేళ్లాడేసేరు. అందుకని గాడిదకు ఈ సారి కూడా ఆశాభంగమే కలిగింది. మొదటిసారిగా తను జిరాఫీ అయి పుట్టనందుకూ, గాడిదయి పుట్టినందుకూ విచారించింది. ఆ తరువాత చేసేది లేక ఏం చెయ్యాలో తెలియక అచ్చం గాడిదలా వూరంతా కలియ తిరిగింది. అలా తిరుగుతుండగా దానికి కాంగ్రెసు పార్టీవాళ్ళు గోడలమీద అతికించిన పోస్టర్ కనిపించింది. అది దానికి అందుబాటులో వున్నదున ఆలస్యం చేయకుండా ఆదరాబాదరా వెళ్ళి దాన్ని నాలికతో తడిపి వూడబెరికి తినసాగింది. దూరాన్నుంచి యీ వ్యవహారం గమనించిన కాంగ్రెసు కార్యకర్తకి ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళపనే అనిపించి పరుగెత్తుకుండూ వచ్చి అటుగా వెళ్లుతున్న తెలుగుదేశం కార్యకర్తను పట్టుకొని నిలేసి ‘‘ఏమిటిది?’’ అని గాడిదకేసి చూపిస్తూ గర్జించేడు.

ముందు ఏమిటోనని విస్తుపోయిన తెలుగుదేశం కార్యకర్త, గాడిద కాంగ్రెసు పోస్టర్ ని మేస్తుండం చూసి అటు తర్వాత కాంగ్రెసు కార్యకర్త కేసి ఎగాదిగా చూసి, చచ్చు ప్రశ్నలు వేసిన పిల్లాడికేసి పంతులు చూసినట్టు చూసి ఫెళ్లున పడీపడీ విరగబడి నవ్వేడు.

ద్రౌపదినవ్వును జూసి యిన్సల్ట్ ఫీలయి ఆనక కోపగించుకొన్ని దుర్యోధనుడిలా కోపంతో ఊగిపోతూ ‘‘గాడిదను తోలి తమాషా చూస్తున్నావట్రా గాడిద కొడకా’’ అంటూ మొదలుపెట్టి తిట్లకు లింకించుకున్నాడు కాంగ్రెస్ కార్యకర్త.

‘‘ఏం కూసావురా! నువ్వే గాడిద కొడుకువి,’’ అంటూ చేతులు పైకి మడిచి కంగ్రెస్ కార్యకర్త మీదికి వురికాడు తెలుగుదేశం కార్యకర్త. జనం చుట్టూతా చూస్తుండగా ఇద్దరూ కలియబడ్డారు. జనంలోని సింపతైజర్స్ రెండువర్గాలుగా విడిపోయి తిట్టుకొంటూ కొట్టుకోసాగేరు. కొందరు మాత్రం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయేరు. జనం అంటే అంతా మామూలు మనుషులు కారు కదా! అందులోను కొందరు అడుక్కుతినేవాళ్లూ, రౌడీలూ, జేబుదొంగలూ, ఖూనీకోర్లూ, సిఐడి పోలీసులూ వుంటారు. జనంలోంచి ఒక సీఐడీ వెళ్ళి పోలీసు స్టేషన్ కి ఫోన్ చేసి వచ్చాడు.

వార్త అందుకోగానే ఎస్సయ్ గారు అర్జంటుగా కానిస్టేబుళ్ళని వెంటబెట్టుకొని హుటాహుటిన బయలుదేరి వచ్చారు. పోలీసుల్ని చూడగానే పిల్లిని చూసిన ఎలకల్లా ఎక్కడివాళ్ళు అక్కడే గప్ చిప్ అన్నట్టుగా జనమంతా తిట్టుకోవడం, కొట్టుకోవడం మానేసారు. ఇన్స్ పెక్టరుగారు వ్యాన్ దిగడంతోనే కార్యకర్తలిద్దరినీ పిలిచి ‘‘ఏం జరిగింది?’’ అని అడిగేరు.

కార్యకర్తలు యిద్దరూ (కాట్ల కుక్కల్లా) ఒకర్నొకరు చూసుకొని తిరిగి ఆవేశపడిపోతే ఒకర్నొకరు తిట్టుకుంటూ విన్నవించుకున్నారు. ‘‘వీడు యీ గాడిదను తీసుకొచ్చి దగ్గరుండి మా సోస్టర్ ని మేపుతున్నాడు’’ అన్నాడు కాంగ్రెస్ కార్యకర్త. ‘‘కాదుసార్ వీడే గాడిద చేత పోస్టర్ ని మేపి మామీద అన్యాయంగా అపవాదు తోస్తున్నాడు’’ అన్నాడు తెలుగుదేశం కార్యకర్త.

‘‘ఒరేయ్ ఏం కూసావురా’’ కోపంగా అన్నాడు కాంగ్రెస్ కార్యకర్త.

తల విదిల్చి ‘‘కుయ్యడానికి నేనేమయినా గాడిదనట్రా నీలా’’ అరిచాడు తెలుగుదేశం కార్యకర్త.

ఇహ తను చూస్తూ ఊరుకుంటే వాళ్ళు తన్నుకోవడం తథ్యం అని తలచి ఇన్స్ పెక్టరుగారు ‘‘ఇక్కడ నేనుండగా మధ్యన మీ గొడవేమిటీ?’’ అన్నాడు.

వాళ్ళిద్దరూ నోరు మూసుకున్నారు. ఇన్స్ పెక్టర్ గారు ఒక క్షణం ఆలోచించి, యింకా ఎక్కువ సేపు ఆలోచిస్తే తను ఆ డిపార్టుమెంటుకి అనర్హుడని జనం ఎక్కడ తేల్చిపారేస్తారోనన్నట్లుగా వెంటనే, ‘‘ఆ గాడిదను అరెస్టు చేయండి’’ అని కానిస్టేబుల్స్ ని ఆదేశించాడు.

ఏ గాడిదను అరెస్టు చెయ్యాలో తేల్చుకోలేనట్టగా కానిస్టేబల్స్ అంతా ఒకర్నొకకరు చూసుకున్నారు. ఇన్స్ పెక్టర్ గారు ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారో వాళ్ళు ఎంతకీ తేల్చుకోలేక వూరకనే వుండిపోయారు.

అది చూసి ఇన్స్ పెక్టర్ గారు కోపంగా, ‘‘మిమ్మల్నే ఆ గాడిదను అరెస్టు చెయ్యమంటున్నది’’ అని గాడిదకేసి చూపిస్తూ అరిచారు.

అప్పటిక్కాని తాము అరెస్టు చేయవలసింది ఎవర్నో అర్థం అయింది కాదు కానిస్టేబుల్స్ కి. అర్థం అయింతర్వాత పోస్టర్ మేయడం పూర్తి చేసి జనాన్నితప్పుకొని వెళ్ళడం సాధ్యం కాక నిలబడివున్న గాడిదను అరెస్టు చేశారు.

ఆ తరువాత ఇంకా ఎవర్ని అరెస్టు చెయ్యాలా అని యోచించారు ఇన్స్ పెక్టర్ గారు. అటు చూస్తే కాంగ్రెసు, యిటు చూస్తే తెలుగుదేశం, కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో తెలుగుదేశం, కనుక ఎవర్ని అరెస్టు చేసినా తన కొంప మునగడం ఖాయమని తలచి ఎవ్వర్నీ అరెస్టు చేయకూడదని నిర్ణయించుకొని ‘‘సాయంత్రం మీరిద్దరూ స్టేషన్ కొచ్చి స్టేట్మెంట్ యివ్వండి’’ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళి వ్యాన్ ఎక్కారు. ఇన్స్ పెక్టర్ గారి చర్య కార్యకర్తలిద్దరికీ సబబుగానే తోచింది. అందుకని ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు.

ఎన్స్ పెక్టర్ గారు వ్యాన్ లో పోలీస్ స్టేషన్ కు వెళ్ళగానే కానిస్టేబుల్స్ వెనుక గాడిదను తోలికొని తీసుకువెళ్ళి లాకప్ లో వుంచారు.

ఇన్ స్పెక్టర్ గారు కుర్చీలో చేరబడి కాఫీకి ఆర్డరు యిచ్చి, సిగరెట్ అంటించి, పొగ పీల్చి వదుల్తూ ఆ పొగను చూసి ఆనందిస్తూ కేసు ఎట్లా ఫైల్ చేయ్యాలా అని ఆలోచించసాగేరు – ఇంతలో ఫోను మోగింది. విసుగ్గా రిసీవరు అందుకొని ‘‘హల్లో’’ అన్నారు. అవతలివైపు నుంచి ఆ వూరి మునిసిపల్ చైర్మన్ కంఠం వినిపించగానే నోట్లోంచి సిగరెట్ జరిపడింది. కంగారుగా ‘‘నమస్కారం సార్ ’’ (చెయ్యెత్తి) అన్నాడు.

అవతలివైపు నుంచి తిరుగు నమస్కారం లేకుండానే చైర్మన్ గారి కంఠం వినిపించింది. ‘‘ఇంతకు ముందు పార్టీల మధ్య కొట్లాటను గూర్చి మీ యిన్వెస్టిగేషన్ ఎంతవరకూ వచ్చింది?’’

‘‘ఏమైంది సార్! గాడిదను అరెస్టు చేసి తీసుకొచ్చాం. ఫైల్ చేసి కోర్టుకు పంపించడమే ఆలస్యం. రేపు పొద్దున్నే ఎలాగైనా గాడిదను కోర్టుకు పంపిస్తాను సార్…’’అని జవాబిచ్చేరు ఇన్ స్పెక్టర్.

‘‘కేసు ఎవరిమీద పెడతారు?’’

‘‘ఎవరిమీదేంటి సార్! గాడిద మీదే’’

‘‘ఏ గాడిదని పెడతారు. ఐమీన్ కాంగ్రెసు గాడిదనా? తెలుగుదేశం గాడిదనా?’’

‘‘ఇంకా అది తేలలేదు. గాడిదను ప్రశ్నించిన తర్వాత తేల్చి చెబుతాను సార్…అన్నారు ఇన్ స్పెక్టర్.

‘‘సరే అదేదో త్వరగా తేల్చి నాకు చెప్పండి’’ అని ఫోన్ పెట్టేశారు చైర్మన్ గారు. ఫోన్ పెట్టేసి సెంట్రీని పిలిచి గాడిదను తీసుకువచ్చి తన ముందు హాజరు పరచమని ఆర్డరు వేశారు ఇన్స్ పెక్టర్ గారు.

లాకప్ లోంచి గాడిదను తీసుకువచ్చి హాజరు పరిచాడు సెంట్రీ.

ఇన్స్ పెక్టర్ గారు గాడిదకేసి కోపంగా చూస్తూ సెంట్రీని వెళ్ళమన్నట్టుగా సంజ్ఞ చేశారు.

ఆకలితో వున్న గాడిద ముందుగా ఇన్స్ పెక్టర్ గారి ఫైళ్ళని చూసి మేత దొరికిందని ఆనందిస్తూ ఆ తర్వాత ఇన్స్ పెక్టర్ గారికేసి కొత్త యజమానిని చూసినట్లు కృతజ్ఞతతో చూసింది.

యిదేమీ గమనించకుండానే ఇన్ స్పెక్టర్ గారు ‘‘నీ పేరు?’’ అనడిగేరు – తెల్లగాకితం తీసి ముందుంచుకుంటూ.

గాడిద అలాగే చూస్తుండిపోయింది.

ఇన్ స్పెక్టర్ గారు కోపంతో రెచ్చిపోయి, ‘‘నిన్నే అడుగుతోంది, నీ పేరు?’’ అన్నారు.  గాడిద అలాగే చూస్తూండిపోయింది. ఇది చూసి టాలరేట్ చెయ్యలేక ఇన్ స్పెక్టర్ గారు లాఠీతో గాడిదకు రెండు తగిలించి, ‘‘ఇప్పుడు చెప్పు’’ అన్నారు.

అప్పటికీ గాడిదేమీ చెప్పలేదు. కాబట్టి, తనే సమాధానం చెప్పుకొని, ‘గాడిద’ అని రాసుకున్నారు. తరువాత ‘‘ఏ వూరు?’’ అని ప్రశ్నించేరు.

ఈ సారి కూడా సమాధానం చెప్పలేదు. ఇన్స్ పెక్టర్ గారు అంతకు ముందు తనను ఎందుకు కొట్టారానని ఆలోచిస్తూండిపోయింది. ఇన్స్ పెక్టర్ గారికి తిరిగి కోపం రాగా ఆవేశంతో లేచి వెళ్ళి,‘‘నేను అడిగిందానికి సమాధానం చెప్పవుటే…ఎంత బలుపు నీకు’’ అంటూ చిక్కిపోయి వున్న గాడిదను చిత్తుగా కొట్టేరు. గాడిద మౌనంగా దెబ్బలన్నీ ఓర్చుకుంది. దాని దృష్టంతా టేబుల్ మీద వున్న ఫైళ్ళమీదే వుంది.

చివరకు చేతులు నొప్పిపుట్టగా విసిగిపోయి వచ్చి తలపట్టుకు కూచుని ఆ వూరి పేరే రాశారు. తరవాత ఆ గాడిద ఏ గాడిదో తేల్చి వివరాలు రాయాలనుకున్నారు. దొరికిన సాక్ష్యాలను బట్టి చూస్తే గాడిద తెలుగుదేశందేనని స్పష్టమవుతోందనిపించింది. అది కాంగ్రెస్ పార్టీ పోస్టర్ని తన్నదానినిబట్టి, కాంగ్రెస్ కార్యకర్త చెప్పిందాన్ని బట్టి చూస్తే యిది ఖచ్చితంగా తెలుగుదేశం గాడిదేనని తేల్చి చెప్పొచ్చనిపించింది. కాని తెలుగుదేశం వాళ్ళు దానికి వప్పుకోవడం లేదు కదా! కేసును గురించి ఆలోచిస్తూ వుండగానే ఫోన్ మోగింది. రిసీవరు అందుకొని విసుగ్గా ‘హలో’ అన్నారు.

‘హలో’ అంటూ అవతలివైపు నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి కంఠం వనిపించింది. ఆ కంఠం వినడంతోటే ఇన్స్ పెక్టర్ గారు ‘‘నమస్కారమండీ’’ అన్నారు.

‘‘ఇంతకు ముందు జరిగిన కొట్లాటలో గాడిద ఏ పార్టీకి చెందిందని తేల్చేరు? అడిగాడు అధ్యక్షుడు.

ఇన్ స్పెక్టర్ గారు సమాధానం చెప్పేలోపుగానే మళ్ళీ…

‘‘ప్రత్యక్ష సాక్ష్యాల్ని బట్టి చూస్తే ఆ గాడిద మాదయితే కాదు. మీరు ఎలాగైనా సరే అది కాంగ్రెస్ గాడిదని ఫైల్ చేయాలి’’ అన్నారు అధ్యక్షులవారు.

‘‘చూస్తానండీ’’

‘‘చూస్తాను కాదు చెయ్యండి’’ అని ఒక క్షణం ఆగి తను ఏదో గుర్తు తెచ్చుకున్నట్లు, ‘‘అన్నట్లు రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఆ మధ్యన మీ ప్రమోషన్ గురించి చెప్పేరు కదా! ఆ సంగతేదో చూస్తాన్లెండి’’ అని ఫోన్ పెట్టేశారు అధ్యక్షులవారు.

ఫోన్ పెట్టేసి ఆ గాడిదను కాంగ్రెస్ గాడిదగా ఎలా చేయాలని ఆలోచిస్తూ కూర్చున్నారు ఇన్ స్పెక్టర్. అంతసేపూ నిలువునా నలిబడిపోయి వున్న గాడిదకు విసుగు పుట్టింది. కాళ్ళు పీక్కుపోయి కడుపులో ఆకలి మండిపోతుండగా ఓపిక నశించి ఫైళ్ళ మీదకెగబడి ఓ ఫైలందుకుని పరపరా నమిలి తినసాగింది.

ఇది చూడగానే ఇన్స్ పెక్టర్ గారికి వెర్రెత్తిపోయి కోపంతో గాడిదను చావచితక బాదారు. వళ్లంతా చీరుకుపోయి దానికి రక్తం కారసాగింది. ఇంకా కొడితే అది ఛస్తుందనే అనుమానంతో, పైగా యిది ఎమర్జెన్సీ కాదని జ్ఞాపకం రావడం వల్లా,దాన్ని కొట్టడం మానేసి కానిస్టేబుల్ ని పిలిచి దాన్ని తీసుకుపోయి లాకప్ లో వేయమని ఆజ్ఞాపించారు.

తర్వాత ఇన్ స్పెక్టర్ గారికి ఇది కాంగ్రెస్ గాడిదేనని అనడానికి బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశంది కాబట్టి అది అధికార పార్టీ ఫైళ్ళని తిన్నది కాబట్టి అది అపోజిషన్ పార్టీకి సంబంధించిందేనని ఖచ్చితంగా చెప్పవచ్చనీ, అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి అది కాంగ్రెస్ గాడిదేనని నిరూపించవచ్చునని అనుకున్నారు. ఎందుకైనా మంచిదని ఈ వర్గాల నుంచి సాక్షుల్ని పెట్టారు.

మర్నాడు ఉదయాన్నే గాడిదను కానిస్టేబుల్స్ కిచ్చి కోర్టుకు పంపిచేరు ఇన్స్ పెక్టర్ గారు.

కోర్టులో కేసుఓడిపోతే పార్టీ పడిపోయినట్లు భావించి కాంగ్రెస్, తెలుగుదేశం వర్గాలవాళ్ళు పోటీపడి ప్రమాణాలు చేసి నిజం కాక అబద్ధపు సాక్ష్యాలు బలంగా చెప్పారు. సాక్ష్యాలన్నీ విన్న మెజిస్ట్రేటు గారు ఎటూ తేల్చుకోలేకపోయారు. గాడిద కాంగ్రెస్ దా, తెలుగుదేశందా అని తీవ్ర మీమాంసలో పడ్డారు.  చివరికి గాడిదతోటే సాక్ష్యం చెప్పించి నిజం పలికించాలనుకున్నారు.

అందుకని ముందు గాడిదతో ప్రమాణం చేయించమని గుమాస్తాని పురమాయించారు.

గుమాస్తా భగవద్గీతని తీసుకువచ్చి గాడిదముందు నిలబడి ‘‘దేవుడి ఎదుట’’ అన్నాడు.

భగవద్గీతను చూడగానే గాడిద కడుపులో ఆకలి భగ్గున బడబాగ్నిలా రగిలిపోయింది. వెంటనే అది భగవద్గీతనందుకొని నోటితో పరపర నమిలితినసాగింది. ఇది చూసి ప్రేక్షకులు గొల్లున నవ్వుకున్నారు. మెజిస్ట్రేటుగారికి మతిపోయినంతపనైంది. ‘‘సైలెన్స్…సెలెన్స్’’ అని అరిచేరు.

ప్రేక్షకులంతా సైలెన్సయిపోయారు. గాడిద భగవద్గీత తినండం పూర్తి చేసి గుమస్తాకేసీ, మెజిస్ట్రేటు కేసీ కృతజ్ఞతతో చూసింది.

మెజిస్ట్రేటుగారు కొద్దిసేపు ఆలోచించి, ‘‘గాడిద కాంగ్రెసుది కానీ, తెలుగుదేశంది కానీ కాదు. మనకిపుడు కనిపించిన ప్రత్యక్ష సాక్ష్యాన్నిబట్టి ఇది కమ్యూనిస్టు గాడిదని చెప్పవచ్చు. ఎందుకంటే కమ్యూనిస్టులకు దేవుడంటే నమ్మకం వుండదు. ఇప్పుడు గాడిత భగవంతుడు కాకపోయినా మనం భగవంతుడిలా చూసుకొనే భగవద్గీతను లక్ష్యపెట్టకుండా మనం చూస్తూ వుండగానే నమిలి తిన్నది కాబట్టి యిది ఖచ్చితంగా కమ్యూనిస్టు గాడిదే’’ నని ఫైండింగ్ ఇచ్చేరు.

(తెలుగు కథ 1960-85) నుంచి సేకరణ.

Krishna Rao Nandigam
Krishna Rao Nandigam
నందిగం కృష్ణారావు ప్రముఖ నవలా రచయిత, కథకుడు. ప్రఖ్యాత న్యాయవాది. మొబైల్: 93930 33345

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles