Sunday, December 22, 2024

అద్భుత చిత్రాల సృష్టిక‌ర్త‌… విక్టరీ మ‌ధుసూద‌న‌రావు

  • కథల విషయంలో రాజీలేదు
  • నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిన దర్శకుడు
  • అక్కినేని ఇమేజ్ పెంచిన చిత్రాలు తెరకెక్కించిన ఘనుడు

తెలుగు చిత్ర సీమ‌లో వృత్తినే దైవంగా న‌మ్ముకుని వెలుగొందిన ద‌ర్శ‌కులు అనేక మంది ఉన్నారు. వారిలో వీర‌మాచ‌నేని మ‌ధుసూద‌న రావు ఒక‌రు. తెలుగు చలన చిత్ర సీమలో 50 సంవత్సరాలుగా కొనసాగుతూ నాలుగు భాషలలో కలిపి 71 చిత్రాలకు దర్శకత్వం వహించి  త‌న కంటూ ఓ ప్ర‌త్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు.  తెలుగు చిత్ర సీమ అనేక మంది ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ప్ప‌టికీ వారిలో జ‌న నీరాజ‌నాలందుకున్న ద‌ర్శ‌కులు ప‌దుల సంఖ్య‌లోనే ఉన్నారు. అలాంటి వారిలో మొద‌టి వ‌రుస‌లో ఉన్న‌వారు వీర‌మాచ‌నేని మ‌ధుసూద‌న రావు. విక్ట‌రీని ఇంటి పేరుగా చేసుకుని రాణించిన ఆయ‌న  తెలుగు చిత్ర రంగాన తిరుగులేని ద‌ర్శ‌కుడిగా ఎదిగారు.

Also read: పాత్రలకు ప్రాణం పోసిన మ‌హాన‌టి సావిత్రి

దర్శకుడిగా 1959 నుంచి ప్ర‌యాణాన్ని ప్రారంభించి మూడు దశాబ్దాల పాటు  ఎన్టీఆర్ , ఏఎన్నార్ ,  శోభన్ బాబు ,  కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలకు ఎన్నో సూప‌ర్ హిట్లు ఇచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌ది. వీటిలో  ఏఎన్నార్ తో ఆయ‌న చేసిన చిత్రాలు మ‌ర‌పురాని చిత్రాలుగా ప్రేక్షక నీరాజ‌నాలందుకున్నాయి.

ఇంటిపేరే విక్టరీ

Aradhana (1962)
‘ఆరాధన’ చిత్రంలో సావిత్రితో అక్కినేని నాగేశ్వరరావు

“విక్టరీ” నే యింటి పేరుగా చేసుకున్న‌ మ‌ధుసూద‌న‌రావు  1923 జులై 27 న కృష్ణా జిల్లాలో గుడివాడ‌కు స‌మీపంలో  ఓ సామాన్య రైతు కుటుంబంలో జ‌న్మించారు. మ‌ధుసూద‌న‌రావుకి చిన్న‌త‌నం నుంచి సినిమాలంటే ప్రాణం. ఆ క్ర‌మంలోనే  ఆయ‌న  ఐ. ప్రసాద్, తాతినేని ప్రకాశరావు వంటి ప్ర‌ముఖుల పరిచయంతో సినీ రంగ ప్రవేశం చేశారు.  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.ఎస్. ప్రకాశరావు ద‌గ్గ‌ర  చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా ‘సతీ తులసి’  అనే పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు.

Also read: నియమ, నిష్ఠల అపూర్వ సంకల్పం అయ్యప్ప దీక్ష

ఆ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.  అయితే అదే స‌మ‌యంలో వి.బి. రాజేంద్ర ప్రసాద్  ‘జగపతి’ సంస్థ నెలకొల్పి త‌న సంస్థ మొట్టమొదటి చిత్రం  ‘అన్నపూర్ణ’ను మధుసూదనరావు చేతిలో పెట్టారు.  జగ్గయ్య, జమున జంటగా నటించిన ఆ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఈ విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో రాజేంద్ర ప్ర‌సాద్  మధుసూదనరావు దర్శకత్వంలోనే వరుసగా “ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు” చిత్రాలను నిర్మించి, ప్రేక్ష‌క ఆద‌రణ పొందారు. ఈ విజ‌యాలు మ‌ధుసూద‌న రావుకి ద‌ర్శ‌కునిగా అనేక అవ‌కాశాలు సంపాదించి పెట్టాయి.

మహానటులతో అనుబంధం

Early Tollywood: LAKSHADHIKARI 1963
లక్షాధికారిలో కృష్ణకుమారి, ఎన్ టి రామారావు

మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ ల‌తో ఆయ‌న‌కు  ఎంతో అనుబంధం ఉంది. వీరిద్దరి చిత్రాల ద్వారా ఆయనకు ‘విక్టరీ’ ఇంటిపేరుగా మారింది. యన్టీఆర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘లక్షాధికారి’ని కూడా నిర్మించింది ఆయ‌నే.  ఈ చిత్రంతోనే తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాతగా మారారు.  అలాగే, ఏయన్నార్ తో జగపతి బ్యానర్ లో రూపొందించిన చిత్రాలు కాకుండా, “జమీందార్,’’ ‘‘మంచికుటుంబం,’’ ‘‘ఆత్మీయులు,’’ ‘‘పవిత్రబంధం,’’ ‘‘మంచివాడు” వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు . ఇక యన్టీఆర్ తో “ఎదురీత, సూపర్ మేన్” వంటి చిత్రాలనూ తెరకెక్కించి ఆకట్టుకున్నారు. అలాగే  ‘ఆత్మీయులు,’’ ‘‘ప్రేమలు-పెళ్ళిళ్ళు,’’ ‘‘చక్రవాకం,’’ ‘‘చండీప్రియ’’ వంటి నవలా చిత్రాలు  కూడా మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందాయి. వీటిలో ‘ఆత్మీయులు’  ఘ‌న  విజయం సాధించింది. శోభన్ బాబు తో నిర్మించిన  ‘జేబుదొంగ,’ ‘జూదగాడు’  కృష్ణంరాజుతో రూపొందించిన ‘బెబ్బులి’ చిత్రాలు మంచి జ‌నాద‌ర‌ణ పొందాయి. ఇక నాయిక పాత్రచుట్టూ తిరిగే కథలతో ఆయన చేసిన చిత్రాల్లో ‘కృష్ణవేణి,’ ‘కాంచన గంగ’ ముందువరుసలో నిలుస్తాయి.  ‘కృష్ణ‌వేణి’ చిత్రం  వాణిశ్రీకి ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించి పెట్టింది. మధుసూదనరావు దర్శకత్వంలో కన్నడ, హిందీ చిత్రాలు కూడా రూపొందాయి.

Also read: తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిద‌ర్శ‌నం బాపు బొమ్మ‌

అగ్రశ్రేణి దర్శకులకు గురువు

1962 లో సూపర్ స్టార్ కృష్ణని పరిచయం చేస్తూ “పదండి ముందుకు” తీశారు.  హీరో నాగార్జునని “విక్రం” ద్వారా, జగపతి బాబుని “సింహస్వప్నం” ద్వారా, రమేష్ బాబుని “సమ్రాట్” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. అగ్ర శ్రేణి దర్శకులైన కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, పి.సి.రెడ్డి, జి.సి.శేఖర్, బోయిన సుబ్బారావు, వంశీ,శివ నాగేశ్వరరావు త‌దిత‌ర హిట్ ద‌ర్శ‌కులంతా మ‌ధుసూద‌న రావు   దగ్గర శిష్యరికం చేసినవారే.

రీమేక్ కింగ్

మధుసూదనరావుకు ‘రీమేక్ కింగ్’ అనే  పేరు కూడా ఉంది. తనదైన పంథాలో పయనిస్తూ, తాను చేసిన అనేక  రీమేక్  చిత్రాల‌ను ఆయ‌న  విజయాల బాట పట్టించారు. అలా  తొలి రీమేక్ ‘రక్తసంబంధం’. తమిళంలో విజయం సాధించిన ‘పాశమలర్’ ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. అలాగే, బెంగాలీ చిత్రం ‘సాగరిక’ ఆధారంగా ‘ఆరాధన’, మరో బెంగాలీ చిత్రం ‘అగ్నిసంస్కార్’ రీమేక్ గా ‘ఆత్మబలం’, తమిళ ‘ఆలయమణి’ ఆధారంగా ‘గుడిగంటలు’, మళయాళ ‘తులాభారం’ రీమేక్ గా ‘మనుషులు మారాలి’, కన్నడ ‘గజ్జెపూజ’ తో ‘కళ్యాణమండపం’, తమిళ ‘సవాలే సమాలి’ ద్వారా ‘మంచిరోజులు వచ్చాయి’, కన్నడ ‘శరపంజర’ ఆధారంగా ‘కృష్ణవేణి’ , ‘దో యార్’ రీమేక్ గా ‘ఇద్దరూ ఇద్దరే’, ‘అమానుష్’ ద్వారా ‘ఎదురీత’, ‘ప్యాసా’ ఆధారంగా ‘మల్లెపువ్వు’, కన్నడ ‘తాయిగె తక్క మగ’తో ‘పులిబిడ్డ’ వంటి చిత్రాలను తీసి ‘రీమేక్ కింగ్’గా ఆయ‌న పేరు సంపాదించారు.

Also read: అబ్బుర‌ప‌రిచే క‌ళాకృతుల‌కు నిల‌యం సాలార్ జంగ్ మ్యూజియం

క్రమశిక్షణకు మారుపేరు

క్రమశిక్షణకు మారుపేరు మ‌ధుసూద‌న‌రావు. ఏ విషయంలోనైనా ఒక పద్ధతి ఉండాలనేది ఆయన తత్వం. తాను  చేసే చిత్రాలు నిర్మాత జీవితాన్ని ప్రభావితం చేస్తాయ‌ని  నమ్మిన వ్యక్తి ఆయన. ఆ కార‌ణంగానే ఆయ‌న  తొందరపడి  ఏనాడూ చిత్రాలు చేయ‌లేదు. ఒక ప‌క్క నిర్మాతల అభిప్రాయాలను గౌరవిస్తూనే, మ‌రో ప‌క్క తాను అనుకున్న విధంగా కథలను తెరకెక్కించారు. సినిమా బాగా రావడం కోసం ఆయన ఏ విషయంలోనూ రాజీప‌డ‌లేదు.  కథపై ఎక్కడ ఎలాంటి సందేహం ఉన్నా ఆయన సెట్స్ పైకి వెళ్లేవారు కాదు. అలాగే పాత్రల స్వరూప స్వభావాలు దెబ్బతినకుండా జాగ్ర‌త్త ప‌డేవారు. సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించేవారు. ఆ కార‌ణంగానే ఆయ‌న చిత్రాల‌లోని  పాత్రలు తెరపై కాకుండా, కళ్లముందు కదలాడుతున్నట్టుగా ప్రేక్ష‌కుల‌కు అగుపించేవి. స‌హ‌జ సిద్ధంగా ఉండేవి.  1964 లో తనతో పాటు ప్రజా నాట్య మండలిలో పనిచేసిన సరోజినిని ఆదర్శాలకు కట్టుబడి వివాహం చేసుకున్న ఆయ‌న మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి మధు ఫిల్ం ఇనిస్టిట్యూట్ స్థాపించి ఎంతో మందిని నటులుగా తీర్చి దిద్దారు. 

తన 95వ ఏట, 2012 జనవరి 11న, అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.  బతికినంత కాలం సినిమాల‌నే వ్యాప‌కంగా చేసుకుని జీవించిన మ‌ధుసూద‌న‌రావు క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త‌, ప‌ట్టుద‌ల నేడు తెరంగేట్రం చేస్తున్న నూత‌న ద‌ర్శ‌కులంద‌రికీ ఆద‌ర్శం.

(జ‌న‌వ‌రి 11 వి.మ‌ధుసూద‌న రావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా)

దాస‌రి దుర్గా ప్ర‌సాద్‌

మొబైల్ : 7794096169

Durga Prasad Dasari
Durga Prasad Dasari
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles