- శివుడు పూనాడా? చపల చిత్తమైన చర్య?
- భయంకరమైన ఉన్మాదంతో పిల్లల ప్రాణాలు బలి
- మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మళ్ళీ ఉద్యమాలు రావాలి
ఆ తల్లి దండ్రులు విద్యాధికులు.మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టి పల్లి శివనగర్ లో పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులకు ఆలేఖ్య (27) సాయి దివ్య (22) అనే చక్కని కుమార్తెలు ఉన్నారు. మూఢనమ్మకంతో తల్లిదండ్రులే వారిని శూలాలతో పొడిచి చంపడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. నాయుడు మహిళా కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ అయితే, పద్మజ మరో విద్యా సంస్థల్లో ప్రిన్సిపాల్. పిల్లలు ఇద్దరిలో అలేఖ్య భోపాల్ లో పీజీ చేస్తుండగా, దివ్య బీబీఏ పూర్తి చేసి సంగీతంలో శిక్షణ తీసుకుంటోంది.
శివుడితో సంభాషణ?
ఇంత ఉన్నత విద్యా వంతులు శివునితో మాట్లాడతారట. అమ్మవారు ప్రత్యక్షం అవుతారట. ఈ హత్యలు దేవుని పేరిట తల్లిదండ్రులే చేయడం ఇక్కడి విషాదం. ఇలాంటి మూఢనమ్మకాల పిచ్చి తో డబ్బును మానాన్ని, ప్రాణాన్ని తృణప్రాయంగా పరిగణించే దుర్భల మనస్తత్వాలు ఉన్న మన పవిత్ర భారత దేశంలో దొంగ బాబాలు పుట్టుకొస్తునే ఉంటారు. వారి చెప్పుచేతల్లో ఉన్మాదం తో శివాలెత్తే భక్త జనం ఉండడం వల్ల అభంశుభం ఎరుగని అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కళ్ళలో క్రూరత్వం, నవ్వులో బీభత్సం, మాటతో మారణ హోమం చేసే మాయల మరాఠీల వల్ల అమాయకులు బలి పీఠం ఎక్కుతున్నారు. దీనికి కారణం అవాస్తవమైన ఊహా ప్రపంచంలో విహరించి, తాము ఉన్మాద స్థితిలో తన కుటుంబం పై లేని అపోహలను, ఆధ్యాత్మిక మానసిక స్థితి కల్పించి లేని రుగ్మతలను వారిపై రుద్ది వారు మూఢ నమ్మకాల ముసుగులో కొట్టుమిట్టాడే దౌర్భాగ్య స్థితికి చేరుకుంటున్నారు. ఇందులో అత్యధిక శాతం విద్యావేత్తలు. అక్షరం ముక్క రాని మానసిక జిమ్నాస్టిక్ చేసే వారిని గురువులుగా ఎంచుకోవడం వారిమానసిక బలహీనతలకు పరాకాష్ట.
18 రకాల మూఢనమ్మకాలు:
ప్రపంచంలో పద్దెనిమిది రకాల మూఢనమ్మకాలు రాజ్య మేలుతున్నాయట. అందులో క్రైస్తవులు, హిందువుల మూఢ నమ్మకాలు వేరు వేరుగా ఉంటాయి. హిందువులకు అపశకునం అనుకున్నవి మరొకరికి శుభసూచకం. మితిమీరిన భావావేశాలు, మతపరమైన మూఢాచారాలు, అనాగరిక సంప్రదాయాల వల్ల మనిషి బలహీనుడవుతున్నాడు. ఏదో మంచి జరగాలనే మానసిక స్థితి లో ఊహలు నిజాలు కాక సైకో అవుతున్నాడు. భవిష్యవాణి నమ్మకాలు, దేవతల పట్ల అధిక భయం, అసమంజసమైన విశ్వాసం వివేచన కోల్పోయేలా చేసి ఉన్మాద స్థితికి చేరతారు. అజ్ఞానం, అజ్ఞాతమైన భయం, మాయాజాలం లేదా అవకాశంపై నమ్మకం, మనిషి తప్పుడు భావన, నమ్మకం వల్ల కలిగే అతీంద్రియశక్తి, ప్రకృతి లేదా భగవంతుని పట్ల మనస్సు యొక్క అహేతుక వైఖరి వల్ల ఉన్మాదం వస్తుంది. ఇది కల్తీలేని అజ్ఞానం.
నిర్హేతుకమైన ధోరణులు:
విజ్ఞాన శాస్త్రంపై అపనమ్మకం, హేతువును తప్పుగా అర్థం చేసుకోవడం, విధి లేదా మాయాజాలంపై నమ్మకం, తెలియని భయం నుండి ఇది పుడుతుంది. సాధారణంగా అదృష్టం, జోస్యం, కొన్ని ఆధ్యాత్మిక జీవుల చుట్టూ ఉన్న నమ్మకాలు అధ్యాత్మిక విమోచన దృక్పథం. ప్రత్యేకించి భవిష్యత్ సంఘటనలను నిర్దిష్ట (స్పష్టంగా) సంబంధం లేని సంఘటనల ద్వారా జ్యోతిష్యం ముందే చెప్పగలదనే నమ్మకం ఈ మూఢనమ్మకాలకు కారణం. నమ్మకం అనే పదాన్ని తరచుగా మనం వాడతాం. ఆ నమ్మకం పూర్వీకుల నుండి సొంత మవుతుంది, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు చెప్పినవి పాటించాలనే మూర్ఖత్వం మనిషిలో తిష్ఠ వేసుకోవడం వల్ల ఈ అపశృతులు తలెత్తుతున్నాయి. సమాజంలో మూఢమైన మత విశ్వాసాలు ఇందుకు కారణం అవుతున్నాయి.
బల్లిమీద పడితే అపకారం?
బల్లి మీద పడ్డా, కర్రల తో ఎవరైనా ఎదురొచ్చినా, వితంతువులు ఎదురైనా, అపశకునంగా భావించే సమాజం మనదైతే, మరో ప్రాంతంలో ఇవి వారికి శుభాలు. నల్ల పిల్లి ఎదురైతే కొందరు అదృష్టంగా భావిస్తారు. మరికొందరు దురదృష్టకరమని భావిస్తారు. జానపద కథల్లో పురాతన దేవాలయాల్లో నిధుల కోసం వెళ్లడం మాయమవడం. మనుషుల్ని పిల్లిగానో, ఎలుకగానో మర్చడం ఇవన్నీ ఊహాగాన కథలు వీటికి ఫిక్షన్ జోడించి విఠలాచార్య గారు అప్పట్లోనే అద్భుతమైన చిత్రాలను తీశారు. ఆ కాలంలో ఇవి మూఢనమ్మకాలు. బాణామతి, చేతబడి గ్రామ దేవతలకు బలి సంప్రదాయాలు ఇప్పటికి ఇంకా సమాజంలో ఉన్నాయి. కుక్కలు, నక్కలు, కళ్ళు పీకడం , కిరోసిన్ పోసి సజీవ దహనం చేయడం, దయ్యం పూనిందని చెప్పుతో కొట్టడం, అమావాస్య రోజు దుష్ట గ్రహాలు తిరుగుతాయని, గ్రహణం పట్టిందనే నమ్మకాలు ఇలా తుమ్మితే, దగ్గితే అపనమ్మకం అనుకునే వారు పిల్లులు, నిమ్మకాయల, ఎండు మిర్చి చిల్లర నాణేలు, మంత్రాలు, మాయలు ఇవన్నీ మూఢనమ్మకాలు!
హేతువాదులు ఉద్యమించాలి:
కాకి తలమీద తన్నితే యముడి పిలుపు వచ్చిందని, దున్నపోతు మీద ఉత్తర దిక్కుకు వెళ్లి నట్టు కల వస్తే ఇక నూకలు చెల్లినట్టు భావించే ఈ సమాజ పోకడలు మితిమీరిన ఫలితంగానే పద్మజ – నాయుడు పుట్టుకు వచ్చారు. పెళ్లయి పిల్లపాపలతో వర్ధిల్లవలసిన దంపతులు అలేఖ్య, దివ్యను బలి తీసుకోవడం ఈ తరంలో అమానుష చర్య. నిందితులను ఎంతగా శిక్షించినా పోయిన ప్రాణాలు రావు కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. మూఢాచారాలకు వ్యతిరేకంగా హేతువాదుల సంఖ్య పెరగాలి. వారు సమష్టిగా ఉద్యమించాలి!