- అభ్యుదయ భావాలతో చిత్రాలు తీసి విజయం సాధించిన వైనం
- కుటుంబ చిత్రాలకూ, అభ్యుదయ చిత్రాలకూ ప్రేక్షకాదరణ
- ఉమ్మడి కుటుంబం, కలసి ఉంటే కలదు సుఖం, కులదైవం జయప్రదం
- మాదాల చిత్రాలలో అత్యధికం ప్రేక్షకుల మన్ననలు పొందడం విశేషం
తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 9వ భాగం
ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల గురించి కొన్ని చక్కటి కథాచిత్రాలు వచ్చాయి. వాటిలో కిందటివారం పేర్కొన్న మానవ బంధాలతో పాటు ప్రగతి భావనల పరిమళాలు ఉండటమూ విశేషం! అటువంటి చిత్రాల గురించి ముచ్చటించుకున్నప్పుడు కలసి ఉంటే కలదు సుఖం, ఉమ్మడి కుటుంబం, కులదైవం వంటి చిత్రాల గురించి ప్రస్తావించుకోవాలి. ఈ మూడు చిత్రాల్లోని ఏకసూత్రత ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ! కుటుంబం లోని వారందరి స్వభావాలూ ఒకేలా ఉండవు కాబట్టి ఒక్కోసారి అపార్ధాలూ, మనస్పర్ధలూ రావడం సహజం! అది ఆర్ధిక సంబంధం కావచ్చు, కుటుంబ కోణంలోని సమస్య కావచ్చు, తరాల మధ్య ఉండే అంతరాల వల్ల కావచ్చు!
Also read: అభ్యుదయ భావాలకు ప్రతిరూపం మాభూమి
కారణం ఏదైనా వచ్చిన సమస్య వల్ల ఏర్పడిన ఇబ్బందిని కలిసి ఆలోచించి ఎలా పరిష్కారం చేసుకున్నారు అన్నది తెలిపే కధాచిత్రాలు అవీ. ఓ సమస్య వచ్చినప్పుడు దాని సమాధానం కోసం విశాల భావంతో ఆలోచించినప్పుడే సరి అయిన జవాబు దొరుకుతుంది! సమస్య పరిష్కారం అవుతుంది. ఈ ప్రయత్నంలో వచ్చిన ఫలితాలు సంతోషకరంగా, సంతృప్తికరంగానూ ఉంటాయి. ఈ భావాలను తెలియచేసే చిత్రాలు ముఖ్యంగా ఉమ్మడికుటుంబాల వ్యవస్ధ గురించి చెప్పే చిత్రాలు, అందుకే విజయవంతమయ్యాయి ఆనాడు!
Also read: వ్యవసాయం ఇతివృత్తంగా అనేక సినిమాలు
మార్పు నిరంతర ప్రక్రి
అయితే మార్పు అనేది కాలపరిణామ స్వభావం! ఆధునిక సౌకర్యాలతో పాటు ఆధునిక ఆలోచనలు, వాటితో ఆదర్శ భావాలు తలెత్తడం సహజం! మానవ స్వభావాల్లో మార్పు రావడం అనేది తరం నుంచి తరంతో పాటు జరుగుతున్న ప్రక్రియ! ఈ దశలో ఒక్కోసారి సంప్రదాయపు సంఘ కట్టుబాట్లకు, క్రమశిక్షణకు, ఒక క్రమంలో సాగుతున్న వ్యవస్ధలకు, కొంత భంగం ఏర్పడే అవకాశాలుంటాయి. అయితే వాటిని విశాల భావంతో విస్తృతార్ధంలో అర్ధం చేసుకున్నప్పుడు పాతని వదిలేసినా, నూతనంగా వచ్చిన మార్పుని ఆహ్వానించాలి అన్న సహృదయత, సదా సద్వివేకం, సామరస్య ధోరణి అవసరం! అత్యంతావశ్యకం!
ఇవన్నీ మాకెందుకు, ఆ పాతనే మాకు ఇష్టం, అది వదులుకుంటే కష్టం, నష్టం అనుకున్నప్పుడు కుటుంబాలలోనే కాదు, సంఘంలోనూ సంఘర్షణలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది! ఆలోచనల్లో వైరుధ్యాలున్నా అవతలి వారిని వైరివర్గంగా భావించడం ఇరుపక్షాలదీ తప్పు అవుతుంది! జరుగుతున్న మార్పుని పరిశీలించి అవసరమైతే అధ్యయనం చేసి, వివేకంతో ఆలోచిస్తే మార్పు ఆహ్వానించదగిన అందాల పుష్పమాలలా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే చెట్టుపైనున్న పండును కోయడానికి కొంత సమయం పట్టినట్టే, మార్పును మనసారా అర్ధం చేసుకోవడానికీ కొంత సమయం పడుతుంది. కానీ ఫలితం ఫలవంతంగా ఉంటుంది!
Also read: ప్రతి ప్రయత్నం ఒక వియత్నాం
ఇందుకు ఉదాహరణగా ఆదర్శకుటుంబం, కులగోత్రాలు, సంసారం చదరంగం వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. మొదటి చిత్రంలో మారిన కాలాన్నిబట్టి కుటుంబ సభ్యులు విడిగా ఉన్నా సామీప్యంలో ఉంటే కలకాలం కలివిడిగా ఉండవచ్చు అన్న నేటి కాలపు కుటుంబాలకు ఉపయోగపడే చక్కని సందేశం ఉంది! మరి ఇందులో అభ్యుదయ భావన, ప్రగతి ఊహ ఏమిటి అంటే కలిసి ఉండి కలహాలు, కలతలు తెచ్చుకోవడంకన్నా మానసికంగా కలిసి ఉంటూ, కుటుంబ పరంగా దూరంగా ఉంటే సంతృప్తి, సంతోషాలతో కుటుంబాలుంటాయి. ఆ వాతావరణంలో ఉన్న వారి ఆలోచనలు, మంచి వైపు ప్రయాణిస్తూ, ఉన్నతము, ఉత్తమమయిన పథంలో నడుస్తాయి! అది కుటుంబాలకు, సమాజానికి ఎంతో మేలు చేసే కారణం అవుతుంది. ఇదే ప్రగతి భావన! అభ్యుదయపు ఆలోచన!
కులగోత్రాలు ఇతివృత్తం ప్రగతిశీల ఆదర్శం
అలాగే కులగోత్రాలు చిత్రాన్ని పరిశీలించినా పెద్దరికం పేరుతో కులగోత్రాలు తెలియని అమ్మాయిని కోడలుగా స్వీకరించడానికి ఒప్పుకోని తండ్రిని, ఎదిరించిన (?) యువకుడు తీసుకున్న నిర్ణయం పరువు, ప్రతిష్టలనే సంప్రదాయపు సంకెళ్లలో బందీలయిన పెద్దలకు, అదో తిరుగుబాటుగా, కుటుంబ విప్లవంగా అనిపిస్తుందే తప్ప ప్రేమ కోసం అమ్మాయికి ఇచ్చిన మాటగా, ఒక ఆదర్శమైన ఆలోచనగా నీతికి నిజాయితీకి నిలబడే ప్రగతి భావనగా అనిపించదు. అది సహజం! కానీ మార్పుతోపాటు పాతకాలపు, అంటే చాదస్తమైన (నేటి కాలానికి పనికిరానివి) భావాలను మార్చాలి అన్న ప్రయత్నం చేస్తే ఆ కాలపు ఆలోచనల పంజరాల తలుపులు తెరుచుకుంటాయి! ప్రగతి కిరణాలతో వారి మనసులు అభ్యుదయపు వెలుగుతో ప్రకాశిస్తాయి. ఈ ప్రయత్నమే అంటే ఇలాంటి ప్రగతి, ఆ పెద్దలలో రావాలనే ఆ చిత్ర కధానాయకుడు నిశ్శబ్ద పోరాటం సాగిస్తాడు! కొన్ని సందర్భాలలో వ్యక్తిగత కక్షలు, దూషణలకన్నా సహనం, శాంతము ఆయుధాలవుతాయి. ఇది చరిత్రలో ఎన్నోసార్లు ఋజువయిన నిజం! కానీ అంతిమంగా, సమాజంలో గానీ, కుటుంబంలో గానీ కోరుకున్న విజయం (ప్రగతి) లభిస్తుంది.
Also read: పూర్తిగా రాజకీయమే కథావస్తువుగా ‘భారత్ బంద్’
ఈ ధోరణిలో మరికొన్ని చిత్రాలు వచ్చాయి. సూటిగా ప్రగతి – అభ్యుదయం, అన్న పదాలు వాడకుండా, ఆ చిత్రాల కధా కధనాలుండటం విశేషం. ఇక సంసారం చదరంగం ఇతివృత్తం కూడా ఇలాంటిదే! ఇందులో ‘‘కుల’’ ప్రస్తావన లేకున్నా ఆదర్శ భావం ఉంది.
ప్రగతి సాధనలో జాప్యం అనివార్యం
కానీ మతం కులం, ఏ దేశానికైనా పట్టుగొమ్మలుగా ఉంటున్నప్పుడు, ఆ రెండిటికున్న బలాన్ని స్వార్ధానికి ఉపయోగించుకునే సంఘ పెద్దలున్నప్పుడు ‘‘ప్రగతి – అభ్యుదయం’’ అనేవి రావడానికి కాలయాపన జరుగుతుంది! ఈ రెండు రాకుండా అనేక శక్తులు అనేక రూపాలలో అడ్డుకుంటూ ఉంటాయి. ఈ అడ్డుకునే అడ్డుగోడలను కూల్చివేయడానికి, విశ్వాసం సడలని మేధోశక్తి, ఆలోచనా బలం కావాల్సి వస్తుంది. అలాంటి వ్యవస్ధను మార్చడం, ఒక వ్యక్తి వల్ల కాదు – ఏకరూప భావనలున్న వ్యక్తుల అవసరం అవుతుంది. వారే ప్రగతి కాముకులు! అన్ని రంగాలలో అభ్యుదయం కోరుకునే స్వయంచోదిత శ్రామికులు!
యువతరంలో ప్రగతి భావనలున్న చిత్ర కథా కథనాలు
ఏ దేశానికైనా యువత అన్ని రంగాలలో అభ్యుదయ పథంవైపు సాగే మార్గదర్శిగా ఉంటే ఆ జాతి, ఆ దేశం ప్రగతి బాటలో పయనిస్తోందన్నది నిస్సందేహం! ఎందుకంటే దేశ జనాభాలో యువత పాత్ర అన్ని రంగాలలోనూ ఆవశ్యకమైనది. ఆ యువతను ఒక నిర్దేశిత గమ్యంవైపు శ్రేయోదాయకమైన లక్ష్యం వైపు నడిపించే సారథి ఉన్నప్పుడు, ఆ సమాజం, ఆ దేశం సమస్త రంగాలలోనూ సగర్వమైన పరిణితి సాధించడమే కాదు, సాటి వారికి కూడా మార్గసూచికలా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు! అందుకే జాతిని నడిపే చోదక శక్తి యువత అంటారు. యువతకున్న శక్తియుక్తులను, సక్రమంగా వినియోగించుకున్నప్పుడు ఏ దేశాన్నయినా, జాతినయినా పట్టి పీడిస్తున్న సమస్యలు, అవి ఎలాంటివైనా, సమూలంగా నిర్మూలనం అవుతాయనడం నిజం. అయితే యువత అన్నప్పుడు వారిలోని ఉద్రేక, ఉద్వేగాలు, ఆవేశ కావేశాలు గుర్తుకు రావడం సహజం! అది యువతకున్న సహజ లక్షణం! స్వభావం! అందుకే అంటారు ఉరకలెత్తే ఆలోచనలను, ఉత్సాహంతో పొంగే ఆవేశాన్ని సరి అయిన దారిలోకి మళ్ళిస్తే సంఘానికి సత్ఫలితాలు అందుతాయి. శ్రేయోరాజ్యం ఏర్పడటానికి, మానవత్వం, సమానత్వం కలిగిన సమాజం ఆవిర్భవించడానికి అవకాశం కలిగించిన వాళ్ళం అవుతాము!
Also read: రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం
అలా కాకుండా, యువతలోని ఉద్రేకాలని, ఆవేశాలని అపార్ధం చేసుకుని, అపోహలు పెంచుకుంటే యువశక్తి వ్యర్ధమవుతుంది. యువచేతన, చైతన్యం కుంటుపడతాయి. ఒక్కోసారి ఆ యువత సంఘం మీద తిరుగుబాటుదారులుగా మారతారు. ఇంకా చెప్పాలంటే వారికి కొందరు సంఘ విద్రోహ శక్తులుగా ముద్రవేస్తారు. ఇదంతా ఆహ్వానించదగని పరిణామాలకు దారితీయడం సహజం! ఇటువంటి అనర్ధదాయక పరిణామాలు, ఏ సమాజానికి మేలు చేకూర్చవు సరికదా, ప్రగతి బాటకు నిరోధక శక్తులుగా రూపుదిద్దుకుంటాయి. అభ్యుదయానికి అభ్యంతరకర అడ్డుకట్టలుగా నిలుస్తాయి. అందుకే యువతను, యువశక్తిని, తగిన విధంగా సంఘానికి మలచుకుంటే సమాజానికి గొప్ప ఉపయోగకరంగా ఉంటుంది, భావితరాలకు ఒక ఆలంబనగా ఉంటుంది!
ఇప్పుడు అలాంటి యువశక్తిని, యువ చైతన్యాన్ని, ప్రగతి భావనలు కలిగిన చిత్ర ఇతివృత్తాలను పరిశీలించినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
డా. మాదాల రంగారావు చిత్రాలు
వాణిజ్య కథాచిత్రాల సూత్రాలకు దూరంగా ఈ ధోరణి చిత్రాలు, అంతకు ముందు కొన్ని వచ్చినా పూర్తిగా ప్రగతి భావనలు, అభ్యుదయపు ఆలోచనలు ఉన్న చిత్ర ఇతివృత్తాలకు, మూడు దశాబ్దాల క్రితం శ్రీకారం చుట్టిన నిర్మాత, నటుడు డా. మాదాల రంగారావు అనే చెప్పాలి!
చిత్ర నిర్మాణం వ్యయ ప్రయాసలతో కూడినది అని అందరికీ తెలిసిందే! ఇది వ్యాపారాత్మక కళ అని అంటారు. నిర్మాత తను పెట్టిన పెట్టుబడి మీద, కొంత లాభం ఆశించడం సహజం. న్యాయం కూడా. అయితే లాభాల మాట అటుంచి, పెట్టుబడి అయినా రావాలంటే ఆ చిత్రాన్ని అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించాలి. అప్పుడే చిత్ర నిర్మాణ వ్యయం వస్తుంది. మరి ప్రేక్షకులు చూడాలంటే వారికి అలవాటుపడిన వాణిజ్య కధా సూత్రాలు (కమర్షియల్ ఎలిమెంట్స్) ఉండాలి. అటువంటివి ఒక నిబద్ధత (కమిట్‌మెంట్)తో ప్రగతి భావనతో ఆదర్శం మిళితమైన అభ్యుదయ చిత్రాల్లో ఉండవు. మరి అలాంటప్పుడు అటువంటి చిత్రాల నిర్మాణం చేయడం ఏటికి ఎదురీదడం అవుతుంది! కానీ నిజాయితీ కూడిన నిబద్ధతతో అటువంటి చిత్రాలు కూడా నిర్మిస్తే తప్పక విజయవంతం అవుతాయని గాఢంగా విశ్వసించిన డా. మాదాల రంగారావు ఆ క్రమంలో నిర్మించిన చిత్రాలలో చాలా భాగం విజయవంతమయ్యాయి! ప్రేక్షకుల అభినందనలు అందుకున్నాయి. గత మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్రరంగంలో ప్రగతి భావ ధోరణి చిత్రాలు రావడానికి డా. మాదాల రంగారావు పునరంకురార్పణ చేశాడంటే అతిశయోక్తి కాదు! యువతరం కదిలింది చిత్రం డా. మాదాల రంగారావు నిర్మాణ సారధ్యంలో రావడం, ఆ చిత్రాన్ని యువత మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ఆదరించడం ప్రగతి భావాలకు హారతిపట్టడం వంటిది!
Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’
జీవితం ఎప్పుడూ సంఘర్షణల సమాహారం! ఆ సంఘర్షణలను ఐక్యశక్తితో ఎదుర్కొన్నప్పుడు సమాజంలోని అసమానతలు పోవడమే కాకుండా యువత భవిత వెలుగుబాట వైపు ప్రయాణిస్తుంది. ఆరోజు యువశక్తి సంఘానికి చైతన్యదీప్తి అవుతుంది. సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇదే డా. మాదాల రంగారావు నిర్మించిన చిత్రాలలోని కధా కధన సూత్రం! ఈ బాటను అభ్యుదయ మార్గంగా భావించడంలో తప్పులేదు. ఇలాంటి మేధో సంబంధమైన కధా చిత్రాలు రావాలి, కావాలి అని నమ్మిన డా. మాదాల రంగారావు ఆ తరహా చిత్రాలే నిర్మించడం జరిగింది.
రగిలే చైతన్యం
ఆయన నిర్మాణంలో వచ్చిన చిత్రాలలో కధా కధనాలు అన్నీ ప్రగతి భావన వైపే నడిచాయి. ఒక్కో చిత్రంలో ఒక సాంఘిక సమస్య! ఆ సమస్య పరిష్కారానికి యువతలో చైతన్యం రగిలించడం, వారిని ఏకోన్ముఖులను చేయడం, కథానాయకుని పాత్ర తీసుకున్న బాధ్యతగా రూపొందించడం జరిగింది. ఈ ధోరణి చిత్రాలకు వ్యాపారాత్మకంగా ఆదరణ ఉంటుందా అన్న సందేహాలను పటాపంచలు చేసిన నిర్మాత, నటుడు డా. మాదాల రంగారావు!
Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు
నిబద్ధతతో, నిజాయితీగా సాంఘిక కోణాలను స్పృశించే కథలతో చిత్రాలు నిర్మిస్తే అవి విజయవంతమవుతాయని నిరూపించిన నిర్మాత డా. మాదాల రంగారావు!
ఇక ఆయన చిత్రాలలోని గీతాలు కూడా చైతన్య స్ఫూర్తిని రగిలించి సమాజాన్ని ముందడుగు వేయించే భావదీప్తితో ఉండటం ఆ చిత్రాల కథా కథనాలకు మరింత బలం చేకూర్చేవిగా ఉండటం గమనిస్తే ఆ చిత్రాల పట్ల ఆయనకున్న సమగ్ర నిబద్ధత అర్ధం అవుతుంది!
విమర్శలను స్వాగతించిన నటుడు, నిర్మాత
వర్తమాన సాంఘిక, రాజకీయ వ్యవస్ధలలోని అనేకానేక రుగ్మతలు, దురాగతాలను తూర్పారపడుతూ, నిర్భయంగా తన చిత్రాల ద్వారా వెలుగులోకి తీసుకువస్తూ ప్రేక్షకులు అనబడే ప్రజలకు నగ్న సత్యాలను తెలియచెప్పిన ధీశాలి డా. మాదాల రంగారావు అని విమర్శకులు కూడా ఏ భేషజం లేకుండా అంగీకరించడం ఆయనకు దక్కిన అభిమాన గౌరవాలు!
Also read: తెలుగు చలనచిత్రాలలో ప్రగతి కిరణాలు!
ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేసుకుంటే ఆసక్తికరమైన జవాబులు దొరుకుతాయి. ఆ ప్రశ్నలు మరేవో కావు – డా. మాదాల రంగారావు ఇటువంటి చిత్రాల నిర్మాణం వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? ఏ కారణాలు, మరే పరిస్ధితులు ఆయన్ని ప్రేరేపించాయి? ఒకవేళ ఇటువంటి చిత్రాలు తీయాలని ఆయన అనుకున్నా, అందుకు సహకరించిన పరిస్ధితులు ఏమిటి? అందులో ముందుగా ఆర్ధికం అంటే చిత్ర నిర్మాణానికి కావలసిన పెట్టుబడి గురించి అనుకోవాలి. మరి ఈ ప్రశ్నలకు ఒకదాని తరువాత ఒకటిగా జవాబులు ఏమిటో పరిశీలిస్తే ఎన్నో విషయాలు నిర్మాతగా, నటుడుగా డా. మాదాల రంగారావు గురించి తెలుస్తాయి.
దోపిడీ,దౌర్జన్యాలపై అధ్యయనం
ముందుగా డా. మాదాల రంగారావు విద్యాధికుడు. అంతేకాక కాలేజీ రోజుల నుంచి ఆయనకు సమకాలీన సమాజంలో జరిగే దోపిడీ దౌర్జన్యాల మీద పరిశీలనాసక్తి ఉండేది. వామపక్ష భావాలు అని చెప్పుకునే ప్రగతి భావుకత పట్ల ఆయన ఆకర్షితుడవడం కూడా ఒక కారణం! మానవత్వం – సమానత్వం ఉన్నచోట ఏ సమాజమైనా ఎక్కువ, తక్కువ భేదాలు లేకుండా పది కాలాలపాటు నిలదొక్కుకుంటుందన్న భావన మరో కారణం. అన్నిటికి మించి చదువు వల్ల వచ్చిన విజ్ఞానంతో ప్రపంచంలోని సమాజాల పోకడ అర్ధం చేసుకునే అవకాశం కలగడం మరో ముఖ్య కారణం.
పెట్టుబడిదారుల చేతుల్లో వారి బూర్జువా (దోపిడి) భావాలతో నలిగిపోతున్న సమాజంలోని కొందరి జీవితాలు ఏవిధంగా శలభాలుగా మారిపోతున్నాయో డా. మాదాల రంగారావు సునిశిత దృష్టికి రావడం. దశాబ్దాలుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు, సమాధానాలు వెతికి వాటిని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలనే కోరిక కలగడం, అందుకు సినిమా అనేది శక్తివంతమైన వాహిక (ఛానల్) అన్న నిర్ణయానికి రావడం. ఇలా కొన్ని ముఖ్యమైన కారణాలు డా. మాదాల రంగారావును ఇటువంటి చిత్రాల నిర్మాణానికి ప్రేరణలుగా నిలిచాయి. అన్నిటిని మించి ప్రజా నాట్యమండలితో ఉన్న అనుబంధం సాహచర్యం, సాన్నిహిత్యం, ఆ మండలిలోని వారితో ఉన్న గాఢానుబంధం ఇవి కూడా ప్రధాన కారణాలుగా చెప్పాలి.
ఉదాత్త ఆశయంకోసం చిత్రనిర్మాణం
ఒక ఉదాత్త, ఉత్తమ ఆశయానికి అందులోనూ సమాజ హితవు కోరుతూ ఆ దిశగా చిత్ర నిర్మాణానికి ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలు డా. మాదాల రంగారావుకు ముందు కొందరున్నా వారు ఒకటి, రెండు చిత్రాలకు మాత్రమే పరిమితం అవడం గమనించాల్సిన విషయం. కానీ డా. మాదాల రంగారావు ఈ ధోరణి చిత్రాలను ఒక ఉద్యమంలా నిర్మించడం ఆయన్ని ప్రత్యేకంగా నిలబడేట్టు చేసింది.
ఇక చిత్ర నిర్మాణం విషయంలో ఆర్ధికంగా జయాపజయాలు ఎవరూ నిర్ణయించలేరు. పెద్ద, చిన్న అని లేకుండా నిర్మాణ సంస్ధలు ఆర్ధికంగా ఒడిదొడుకులు ఎదుర్కోవడం సహజంగా జరుగుతున్నదే! ఈ విషయంలో డా. మాదాల రంగారావు కూడా మినహాయింపు కాదు. ఆయన తొలి చిత్రం యువతరం కదిలింది ఓ సంచలనం రేపింది ఆరోజుల్లో! నిజానికి అటువంటి కథా కథనాలతో యువతలో ఉన్న ఉద్వేగ, ఉద్రేకాలతో చిత్రం తీయడం ఒక సాహసం! అయితే లాభనష్టాలనే వాణిజ్య సూత్రాలను పక్కనపెట్టి తన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని ఆ చిత్ర రూపంలో ప్రజల వద్దకు తీసుకువెళ్ళడం మరో సాహసం అని చెప్పాలి. కానీ ఆయన ధైర్యమే ఆ చిత్రాన్ని విజయపథంలోకి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.
వికృత చేష్టలు లేకపోయినా సినిమా విజయం
చిత్రాలలో కనిపించే ప్రేమ సన్నివేశాలు, యుగళ గీతాలు, హాస్య నటీనటుల వింత చేష్టలు, ద్వంద్వార్ధ సంభాషణలు, ఇవేవీ ఈ చిత్రంలో కనిపించకపోయినా, నిర్మాత దర్శకుల (దర్శకుడు ధవళ సత్యం) నిబద్ధతతో కూడిన సంకల్పానికి సముచిత విజయం లభించడం విశేషం!
ఆ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో డా. మాదాల రంగారావు ముందే చెప్పినట్టు ఒక ఉద్యమంలా ఆ బాటలోనే మరికొన్ని చిత్రాలు నిర్మించారు. ఇంచుమించుగా చాలా చిత్రాలలో ఆయన ప్రధాన పాత్ర ధరించడం జరిగింది. నిజానికి ఆయన పర్సనాలిటీ ఆ ఉద్వేగపూరిత పాత్రలకు ఎంతో సహాయపడింది అని చెప్పాలి.
డా. మాదాల రంగారావుని ఆయన చిత్రాలను అభిమానించే వారందరూ ఆయనను “రెడ్‌స్టార్“ అని పిలవడం, ఆయన ప్రేక్షక లోకంలో సాధించిన విజయంగా భావించడంలో తప్పులేదు. చివరి వరకు తను నమ్మిన ఆలోచనలతోనూ, సిద్ధాంతాలతోనూ ప్రయాణిస్తూ, ఎప్పుడూ, ఎక్కడా రాజీపడని చిత్ర నిర్మాణ సారథిగా, కథానాయకుడుగా పేరు తెచ్చుకున్న డా. మాదాల రంగారావు అక్షరాలా రెడ్‌స్టార్! సినీ వినీలాకాశంలో ప్రగతి భావ చిత్రాలకు వేగుచుక్క!
ఎర్రెర్రని చిత్రాలు ఎన్నెన్నో
డా. మాదాల రంగారావు నిర్మించి ఆయన నిర్వహణతో నటించిన చిత్రాలు యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, మహాప్రస్థానం, ప్రజాశక్తి, వీరభద్రుడు, స్వరాజ్యం, మరో కురుక్షేత్రం, ఎర్రసూర్యుడు, జనం మనం, ఎర్ర పావురాలు ఈ చిత్రాలన్నిటిలో డా. మాదాల రంగారావు పోషించిన పాత్రలను పరిశీలిస్తే ఒక్కో చిత్రంలో ఒక్కో సామాజిక సమస్యను కథాంశంగా తీసుకుని ఆ సమస్య వల్ల సామాన్య ప్రజానీకం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో చెప్పడం జరిగింది. ఆ సమస్యలకు పరిష్కారమూ సూచించడం ఆ చిత్రాల ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
ఆయన చిత్రాలలో పాత్రలు జీవన సమరం చేస్తాయి. తమకు న్యాయంగా, చట్టరీత్యా, ప్రజాస్వామ్యబద్ధంగా అందవలసిన ప్రయోజనాల కోసం పోరాటం చేస్తాయి! ఆ పోరాటం చేసే పాత్రల నిబద్ధత, నిజాయితీ, వారి నిమగ్నత ప్రేక్షకులను ఆలోచింప చేస్తాయి! మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కార్మికులు, వీరంతా డా. మాదాల రంగారావు చిత్రాలలో తమ హక్కుల కోసం, వాటిని సాధించుకునే లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటారు. ఆ ధ్యేయంలో వారికి ఎటువంటి ఆటంకాలు, ఏ రూపంలో, ఎవరి వల్ల ఎదురైనా వాటిని అధిగమించి, ఒక్కోసారి ప్రాణ త్యాగం చేసయినా సాధించుకోవడానికి, సంసిద్ధులవుతారు. అందుకే డా. మాదాల రంగారావు చిత్రాలలోని ప్రతి పాత్ర సజీవంగా మనకు నిత్యం సమాజంలో కనిపించే పాత్రల్లాగా కనిపిస్తాయి. ప్రేక్షకులు అందుకే ఆ పాత్రలను తెరమీద పాత్రలుగా భావించరు! అదే డా. మాదాల రంగారావు చిత్రాలలోని చైతన్య సందేశం! ప్రగతిని ప్రతిబింబించే ప్రజా చిత్రాలుగా అందుకే అవి పేరు తెచ్చుకున్నాయి. డా. మాదాల రంగారావుని తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిపాయి. ఈ ధోరణిలో ఇలా సమాజంలోని అన్ని వర్గాలవారిని జాగృతం చేసి ప్రగతిభావ చిత్రాల నిర్మాణానికి డా. మాదాల రంగారావు మార్గదర్శి!
Also read: యడవల్లి రచన: తెలుగు సినిమాలలో ప్రగతి కిరణాలు