మాడభూషి అనంత శయనం అయ్యంగార్ పేరును బట్టి ఆయన తమిళుడని భావించేవారున్నారు. కానీ తాను అచ్చమైన తెలుగు వాడినని ఆయనే అనేకసార్లు చెప్పుకునేవారు.`నా పేరు చివరి మాట (అయ్యంగార్) ను బట్టి నేను తెలుగువాడిని కాను అనుకోకండి. నా పేరు చివరన మొదట ఆచార్యులు అనే ఉండేది’ అని చమత్కరించేవారు. తిరుపతి సమీపంలోని తిరుచానూరులో 4 ఫిబ్రవరి 1891న జన్మించిన ఆయన తండ్రి వేంకటాచారి చిన్నతనంలో కాలం చేయడంతో సోదరుడి సంరక్షణలో పెరిగారు. తిరుపతిలో పాఠశాల విద్యపూర్తిచేసిన అనంత శయనం మద్రాసు పచ్చయప్ప కళాశాలలో పట్టభద్రులై, అక్కడి న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. 22వ ఏట మేనమామ కూతురు `సింగారం`తో వివాహంకాగా తరువాత ఐదేళ్లకు ఆమె కన్నుమూశారు. ఆ తర్వాత తమ్ముడు, చెల్లెలు, కుమారుడు పోవడంతో కుంగిపోయారు. హితైషుల సలహ మేరకు మరో మేనమామ కుమార్తె చూడమ్మాళ్ ద్వితీయ వివాహం చేసుకున్నారు
ఉపాధ్యాయుడి నుంచి సభాపతి :
అనంత శయనం న్యాయవాది వృత్తి చేపట్టడానికి ముందు కొంతకాలం గణిత ఉపాధ్యాయుడిగా పనిచే
శారు. ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా పనిచేసిన ఆయన చిత్తూర పురపాలక సంఘం చైర్మన్ గా రాజకీయ జీవితం ప్రారంభించి లోక్ సభ సభాపతి స్థాయికి చేరారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేశారు. 1946-47లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఆదర్శ సభాపతి:
లోక్ సభ సభాపతిగా అనంతశయనం అన్ని పక్షాల మన్ననలు అందుకున్నారు. అధికారికంగా ప్రతిపక్షనేత లేకపోయినా ప్రతిపక్షంలోని ఆచార్య జేబీ కృపలానీ, డాంగె, గోపాలన్, హీరేన్ ముఖర్జీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి హేమాహేమీలను గౌరవంగా చూసేవారు. వారు ఆయన పట్ల అదే గౌరవభావంతో ఉండేవారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సమన్వయం, సమతూకం పాటించారు మాడభూషి. 1948లో తాత్కాలిక పార్లమెంట్ కు ఉపసభాపతిగా ఎన్నికయ్యారు. తొలి లోక్ సభకు (1952) జీవీ మౌలాంకర్ సభాపతిగా, మాడభూషి ఉప సభాపతిగా ఎన్నికయ్యారు. మౌలాంకర్ మరణానంతరం ఆయన స్థానంలో సభాపతిగా (1956 ఫిబ్రవరి 27) ఎన్నికయ్యారు. పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ ఆయన పేరును ప్రతిపాదించగా, ప్రతిపక్ష నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ బలపరచడంతో సభ్యుల హర్షధ్వానాలతో సభామందిరం చప్పట్లతో మార్మోంగిపోయింది. `ఈ పదవికి మీరు కొత్తవారు కాదు. సభా సంప్రదాయాల గురించి ఈ సభలో అందరికంటే ఎక్కవు మీకే తెలుసు`అని ఆయనను స్పీకర్ స్థానం వద్దకు తీసుకు వెళ్లిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు.
నిష్పక్షపాత వైఖరి:
`చట్టం దృష్టిలో ప్రధాని అయినా, చిరుద్యోగ కానిస్టేబుల్ అయినా ఒక్కటే`అన్నది అయ్యంగార్ అభిప్రాయం. నిర్ణయాలు, తీర్పులు నిష్పక్షపాతంగా ఉండేవి. ఈ విషయంలో కొన్ని సందర్భాలలో ప్రధాని నెహ్రూను సైతం లక్ష్యపెట్టేవారు కాదట. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి ఆర్థికమంత్రి టి.టి. కృష్ణమాచారిని కాపాడాలన్న నెహ్రూ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి టి.టి. మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని చెబుతారు.
విదేశీ పార్లమెంట్ సందర్శన:
విదేశీ పార్లమెంట్ సందర్శనకు వెళ్లే సభ్యుల బృందానికి అయ్యంగార్ నేతృత్వం వహించారు. ఒట్టావాలో కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన ఆయన చైనా, చెకోస్లోవేకియా, రుమేనియా, బల్గేరియా, పోలండ్ పార్లమెంట్ లను సందర్శించిన బృందాలకు (1956), ఆస్ట్రేలియాలో జరిగిన (1959) కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ మహాసభలకు వెళ్లిన బృందానికి, టోక్యోలోని 49వ అంతర్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (1960 సెప్టెంబర్)కు హాజరైన ఎంపీల బృందానికి నాయకత్వం వహించారు. అయ్యంగార్ 1962లో మూడవసారి ఎంపీగా నెగ్గినా బీహార్ గవర్నర్ గా నియమితులు కావడంల వల్ల ఆ పదవికి రాజీనమా చేయవలసి వచ్చింది.
గవర్నర్ గా బాధ్యతలు:
కులతత్త్వ వాదన, ఇతర కారణాలతో అస్తవ్యస్థంగా ఉన్న బీహార్ లో ముఖ్యమంత్రితో సమన్వయంతో వ్యవహరిస్తూ, తగు సూచనలు, సలహాలతో పరిస్థితిని చక్కదిద్దారు. ఆయన హయాంలో రాజభవనపు విందులలో మాంసాహారం నిషేధించారు. ప్రజావసరాలు తెలుసుకునేందుకు జిల్లాల్లో పర్యటించేవారు. మంచి గవర్నర్ గా ప్రధాని నెహ్రూతో అనేకసార్లు మెప్పుపొందారు. ఆ రాష్ట్ర ప్రజలకు సన్నిహితులై వారి అభిమానాన్ని పొందారు. ఆ రాష్ట్ర గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తరువాత కూడా సలహాలు, సూచనలు చేసేవారు. ఆయన పట్ల గౌరవ సూచకంగా పాట్నాలోని ఒక పార్కుకు `అయ్యంగార్ ఉద్యాన్`అని పేరు పెట్టారు.
న్యాయవాదిగా
తిరుమల తిరుపతి దేవస్థానం వారి పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన న్యాయవాద వృత్తి పట్ల ఆసక్తితో చిత్తూరులో ప్రముఖ న్యాయవాది దొరస్వామి అయ్యంగారు వద్ద 1915లో న్యాయవాదిగా చేరి పనితనం,తన ఆదర్శాలతో అనతి కాలంలోనే ఆయన మెప్పు పొందారు. సత్తా గల న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఒక కేసు విషయంలో గురువుకే వ్యతిరేకంగా వాదించవలసి వచ్చింది. అది వృత్తిగతమైన స్పర్థగానే పరగణించారు. గాంధీజీ పిలుపు మేరకు న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి స్వరాజ్య సమరంలో పాల్గొన్నారు.
స్వరాజ్య సమరయోధుడు:
1940లో వ్యక్తి సత్యాగ్రహంలో అరెస్టయి 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో డిటెన్యూగా 28నెలల జైలు జీవితం గడిపారు. ఆ కాలంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం శిష్యబృందంతో కలసి రామాయణ భాగవతాలు చదివేవారు. ఆయన జైలు జీవిత కాలంలో కుటుంబం దుర్భర దారిద్ర్యం అనుభవించిది. వర్షాభావంతో పంటలు పండకపోవడంతో ఆయన వాటాకు వచ్చే ధాన్యం ఆరు మాసాలకే సరిపోయేది. దానికితోడు పెద్ద కుటుంబం.
పాత్రికేయుడిగా…
ఆయన పరిశీలనాశక్తి, స్పష్టమైన రాతలు, లోతైన ఆలోచనలు, వివేచనం లాంటి గుణాలను గమనించి
న్యాయవాద వృత్తిలో గురువు దొరస్వామి అయ్యంగార్ సూచన మేరకు `శ్రీవేంకటేశ్వర పత్రిక` అనే వార పత్రికను (1919)లో ప్రారంభించి, గాంధీజీ భావజాలంతో కూడిన వ్యాసాలను ప్రథమ ప్రాధాన్యంగా ప్రచురించారు. పత్రిక నిర్వహణ అనుభవంతోనే `మన పార్లమెంట్`అనే గ్రంథాన్ని ఆంగ్లంలో రాశారు. దానిని పార్లమెంట్ సభ్యులకు రాజకీయశాస్త్ర విద్యార్థులు కరదీపికగా పరిగణించేవారు. అయ్యంగార్ రాజకీయ ప్రస్థానానికి కూడా ఒక రకంగా ఈ పత్రిక స్ఫూర్తినిచ్చిందంటారు.
నిరాడంబరత:
ఉన్నత పదవులు అధిరోహించినా నిరాడంబర జీవితాన్ని కోరుకున్నారు. ఎలాంటి న్యూనతాభావానికి లోనుకాలేదు. సొంత ఖర్చులు తక్కువ. రాజకీయాలలోనూ ఆర్ధికేతర పద్ధతులలో పనులు పూర్తి చేసేవారు తప్ప డబ్బును దుర్వినియోగం చేసేవారు కారు. పేదరికం అనుభవాలు మరువక, ఆదా చేసిన సొమ్మును దీనజన సేవకు ఉపయోగించేవారు.
ఇదీ చదవండి:పంచాయతీ వ్యవస్థలో మహిళా సాధికారిత పేరుకే! పురుషులదే పెత్తనం!
కుష్టురోగులకు చేయూత:
`మానవ సేవే మాధవ సేవ`అనే సూక్తిని అక్షరాల పాటించారు. తాను పుట్టిపెరిగిన తిరుచానూరు, తిరుపతిలో వివిధ దేవాలయాల వద్ద యాచకులుగా మారిన కుష్టురోగుల పరిస్థితి అయ్యంగార్ ను కదిలించింది. చిత్తూరు జల్లా కలెక్టర్ తో మాట్లాడి 1938లో చిత్తూరు, తిరుపతిలో కుష్టు వ్యాధి నివారణ కేంద్రం ఏర్పాటు చేశారు. వారికి వైద్య సాయంతో పాటు వారి పిల్లల కోసం పాఠశాల,కూరగాయలు, గోధుమ పండించుకునేందుకు తహసీల్దార్ తో మాట్లాడి పది ఎకరాల ప్రభుత్వ భూమిని సంపాదించారు. వారికి పింఛన్ కూడా మంజూరు చేయించడంతో పాటు వారికి అవసరమైన పాదరక్షలను ఆర్కాట్ లో తయారయ్యేలా చూశారు. రాజ్యాంగ పదవుల నుంచి వైదొలగి 1967లో తిరుపతిలో స్థిరపడిన ఆయన కుష్టు రోగుల సంక్షేమం పట్ల మళ్లీ దృష్టి పెట్టారు. మహిళా రోగులకు కుట్టు మిషన్ లు అందచేశారు. హరిజన సేవక సంఘాధ్యక్షుడిగా హరిజన సేవక సంఘం (నేటి పరిభాషలో దళిత సంఘం)అధ్యక్షుడిగా కొన్నాళ్లు పని చేశారు. వారి ఆర్థిక, సాంఘిక అభ్యున్నతికి సహకరించే కార్మక్రమాలను రూపొందించారు.
స్త్రీ స్వాతంత్ర్యం-ముచ్చటైన కుటుంబం:
స్త్రీలు కేవలం వంటింటికి, కుటుంబ వ్యవహారాలకే పరిమితం కారాదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. `స్వరాజ్య సముపార్జన, దళితుల దేవాలయల ప్రవేశం` లాంటి గాంధీజీ ఆదర్శాలను భార్యకు వివరించి, శిక్షణ ఇచ్చేవారు. భార్యాబిడ్డలపై తన అభిప్రాయాలను రుద్దకుండా వారికి స్వేచ్ఛనిచ్చారు. వారూ ఆయన నమ్మకాన్ని నిలిపారు. భార్య నుంచి ఆయనకు సంపూర్ణ సహకారం లభించింది. కుటుంబసభ్యులందరిదీ ఒకేమాట, ఒకేబాట. కుటుంబ వ్యవహారాలు ఆయనను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు. అదే సమయంలో అధికారిక విధుల్లో ఉన్నప్పుడు కుటుంబం గురించి ఆలోచించేవారు కారు.
హాస్యచతురత:
అనంతశయనం అయ్యంగార్ స్వతహా హాస్య చతురులు. హాస్యంతో సభలో వాతావరణాన్ని చల్లబరచి సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రయత్నించేవారు. `గౌరవ సభ్యులు సభలో నిద్రపోవడం తప్పుకాదు కానీ, గుర్రు మాత్రం పెట్టరాదు`అని ఒకసారి రూలింగ్ ఇచ్చారట. ఇందులో చతురతతో పాటు చురకా ఉందన్నదనే విషయం తెలిసిందే. మరో సందర్భంలో శూన్యగంట (జీరోఅవర్)లో పెద్ద సంఖ్యలో సభ్యులు బయటకు వెళ్లడాన్ని గమనించి `ఎందుకయ్యా అలా వెళతారు? మీ సీట్లలో ఎవరో మిరపకాయలు చల్లినట్లు`అని చమత్కరించారు. బీహార్ గవర్నర్ హోదాలో పాట్నాలో కుటుంబ నియంత్రణ ఆవశ్యకతపై మాట్లాడుతూ, `నాకు పన్నెండు మంది సంతానం. మీరెవ్వరూ నన్ను అనుసరించకండి` అని, `సోషలిస్టు నేత అశోక్ మెహతా మార్గాన్ని అనురించకండి. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి (ఆ సభకు మెహతా ముఖ్యఅతిథి) అని నవ్వులు పూయించారు.
ఆంధ్రోధ్యమంలో…
జాతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఉద్యమాన్ని బలపరిచి ఉద్యమంలో అయ్యంగార్ పాల్గొన్నారు. గుంటూరు మహాసభకు అధ్యక్షత కూడా వహించారు. `అయ్యంగార్ గొప్ప న్యాయవాది, విశిష్ట దేశభక్తుడు. ఉత్తమ సభానిర్వాహకుడు`అని `ఆంధ్రకేసరి` ప్రకాశం పంతులు ప్రశంసించారు. `శంకరంబాడి` ఇంటి పేరిట వారు ఆయన మాతామహులు.`మా తెలుగుతల్లికి…`గీత రచయిత సుందరాచారి ఆయనకు సమీప బంధువు. `తెలుగుతల్లి` రచనకు అయ్యంగారే స్ఫూర్తి అని సుందరాచారి చెప్పేవారు. వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసిన అయ్యంగార్ అనారోగ్యంతో 19 మార్చి 1978న 87వ ఏట పరమపదించారు.
(ఫిబ్రవరి 4 అనంతశయనం అయ్యంగార్ జయంతి)
ఇదీ చదవండి:ఆరు స్తంభాల ఆత్మ నిర్భర బడ్జెట్