తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంక్షిప్త రూపం ‘మా’. ఇందులో సుమారు 900 మందికి పైగా సభ్యులు ఉన్నారు.రెండేళ్ల కొకసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.ఈ క్రమంలో, వచ్చే సెప్టెంబర్ లో ఎన్నికలు జరగాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నికలు సంచలన వార్తలకు కేంద్రాలుగా మారాయి. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఎన్నికలు, అభ్యర్థుల మధ్య పోటీ మొదలైనవి ఉన్నా అవి బయట ప్రపంచానికి పెద్దగా తెలిసేవికావు. మీడియా,సోషల్ మీడియా పెరిగిన నేపథ్యంలో ఆ వివాదాలు,విభేదాలు బయటకు ఎక్కువగా పొక్కుతున్నాయి. సభ్యులు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో మామూలు ప్రజలు ఎవరూ ఓటర్లు కారు. కేవలం మా అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నవారే ఓటర్లు. ఎన్నికల తంతు కేవలం వారికే సంబంధించిన అంశం. ఐనప్పటికీ, సినిమా వ్యక్తులు, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల పట్ల ప్రజలకు మక్కువ ఎక్కువగా ఉండడం సహజం. అది అత్యంత ఆకర్షణీయమైన రంగం కాబట్టి, ప్రతి ఘటనా సంచలనం అవుతోంది. ఎవరు అధ్యక్షులుగా ఎంపికవుతారో? ఎవరి ప్యానల్ గెలుస్తుందో? అనే ఉత్సుకుత సామాన్యప్రజల్లో పెరిగిపోతోంది. ఎన్నికలు జరిగినప్పుడేకాక, అసోసియేషన్ సమావేశాలు జరిగినప్పుడు చోటుచేసుకొనే పరిణామాలు వార్తా వస్తువులవుతున్నాయి. సంచలనాలు అవుతున్నాయి. మసాలా బాగా పండుతోంది. లక్షలమంది వాటిని ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. ఈసారి ఎన్నికల హడావిడి మూడు నెలల ముందే మొదలైంది. అదే ఒక సంచలనమయ్యింది. పరభాషీయుడైన ప్రకాష్ రాజ్ అధ్యక్షుడి రేసులోకి రావడం అదొక సంచలనంగా మారింది. తెలంగాణ వాదంతో అధ్యక్షబరిలోకి నటుడు సీవిఎల్ నరసింహారావు రావడం మరో సంచలనానికి తెరదీసింది. ప్రస్తుతం పదవుల్లో ఉన్న నరేష్ వర్గంపై విమర్శలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అధ్యక్షుడి రేసులో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత ఉన్నారు. వీరేనా? ముందు ముందు ఇంకా ఎవరైనా తెరపైకి వస్తారా వేచి చూడాలి. ఈ నలుగురులోనూ కొందరు వెనకడుగు వేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవ్వన్నీ ఇలా ఉంచుదాం.
Also read: భారత్ మెడకు తాలిబాన్ ఉచ్చు
తెలంగాణవాదం
తెలంగాణకు ప్రత్యేక విభాగం కావాలనే డిమాండ్ ను నరసింహారావు తెరపైకి తెచ్చిన క్రమంలో విజయశాంతి మద్దతు పలుకుతున్నారు. దానితో ఆట కొత్తరూపు తీసుకుంటోంది. తెలంగాణ సినిమా విభాగాన్ని “టెలివుడ్”గా ఎందుకు పిలువకూడదు? అని సీవీఎల్ అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో అన్ని విభాగాలు రెండుగా ఏర్పడ్డాయని, తెలుగుసినిమా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా రెండు విభాగాలుగా ఏర్పడడం న్యాయమైన డిమాండ్ గా ఆయన చూస్తున్నారు. ప్రస్తుతం ‘మా అసోసియేషన్’ లో సుమారు 150మందికి పైగా తెలంగాణకు చెందినవారు ఉన్నారని సమాచారం. ఈ వాదం ఎంతవరకూ ముందుకు వెళ్తుందో, ఆ దిశగా నిర్మాణంపై సాధ్యాసాధ్యలపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని నాగబాబు బలపరుస్తున్నారు. దానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ ఆశీస్సులు కూడా ఉన్నాయనే మాటలు బాగా ప్రచారంలో ఉన్నాయి. మహిళా అభ్యర్థిని నిలబెడితే వారికే మద్దతు ఇస్తామని ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ అంటున్నారు. ‘మా’ భవన నిర్మాణం చేపడితే 25 శాతం ఖర్చు భరిస్తానని మంచు విష్ణు ప్రకటించారు. దాసరి నారాయణరావు వంటి పెద్దదిక్కు ఇప్పుడు లేకపోవడం ప్రధానమైన లోటని ఎక్కువమంది గుర్తుచేసుకుంటున్నారు. దాసరి జీవించి వున్న సమయంలో జరిగిన ఎన్నికల సందర్భంలోనూ సభ్యుల వివాదాలు జరిగాయి. ఐనప్పటికీ, ఎన్నోఏళ్ళుగా అనేక సమస్యల పరిష్కారంలోనూ, నైతికంగా బలాన్ని ఇవ్వడంలోనూ దాసరి వ్యవహారశైలి, స్థానం విశిష్టమైందనే చెప్పుకోవాలి. మొత్తంగా మా అసోసియేషన్ ఎన్నికలు వేడిని పెంచుతున్నాయి. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న 900 మందిలో అందరూ ఐశ్వర్యవంతులు కారు. ఆర్ధికంగా కష్టాలు పడుతున్నవారు ఎక్కువమందే ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచీ వాళ్ళ కష్టాలు మరింత పెరిగాయి. మొత్తం పరిశ్రమే కష్టాల్లో ఉంది. అందే సాయాలు అంతంత మాత్రమే. కరోనా దుష్ప్రభావం నుంచి బయటపడి మామూలు రోజులు వచ్చేంత వరకూ పరిశ్రమలోని చాలామందికి దినగండం నూరేళ్ళ ఆయుష్షే. అప్పటి వరకూ వారిని ఆదుకోవడమన్నది ఆషామాషీ కాదు. సంస్థాగతంగా మా అసోసియేషన్ ను శక్తివంతం చెయ్యడం ఎంతముఖ్యమో, పేద,మధ్యతరగతి కళాకారుడి పట్ల నిలుచోవడం అంతకంటే ముఖ్యం. పరిశ్రమను కాపాడుకోవడం మరీ ముఖ్యం.
Also read: కశ్మీర్ లో కింకర్తవ్యం?
గౌరవం పెంచాలి
ఎన్నికలు రెండు సంవత్సరాలకొకసారి జరగాలని చట్టబద్ధమైన నియమం కూడా పెట్టుకోలేదని సమాచారం. ఆనవాయితీగానే నిర్వహిస్తున్నారు. ఇటువంటి అంశాల పట్ల కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా నియమనిబంధనలు నిర్మించుకోవడం అవసరం. ఇన్ని గ్రూపులు,ఇన్ని గొడవలు, వివాదాలు, విభేదాలు పెట్టుకోవడం పెంచుకోవడం తెలుగు సినిమా పరిశ్రమ గౌరవాన్ని తగ్గిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యులందరూ కూర్చొని మాట్లాడుకొని, ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవడమే మంచి విధానమని భావించాలి. పదవుల పంపకంలో సమతుల్యతను పాటించడం ముఖ్యం. పరిశ్రమలోని అధికవర్గానికి ఎవరి పట్ల ఎక్కువ గౌరవం,విశ్వాసం ఉంటాయో అటువంటి వారిని అధ్యక్షస్థానంలో కూర్చోపెట్టడమే ఉత్తమమైన మార్గం. తెలంగాణకు ప్రత్యేక విభాగం ఉండాలా అనే అంశం పట్ల కూడా పరిశ్రమలోని చిన్నా,పెద్ద మధ్య చర్చ జరగాలి. తదనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏది ఏమైనా, ‘మా’ ఎన్నికలు తెలుగు సినిమా పరిశ్రమ గౌరవానికి మచ్చగా మిగలకూడదు. ఐక్యతను సాధించడం ముఖ్యం. పరిశ్రమలోని అందరి కష్టాలకు ఊతంగా నిలుస్తూ, ప్రగతికి మూలంగా నిలబడడం ఉన్నతమైన ఆలోచనా విధానం.
Also read: దేశానికి దిశానిర్దేశం చేసిన దీపస్తంభం పీవీ