తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 8వ భాగం
అభ్యుదయ భావాలు కలిగిన ఇరువురు మేధావులు గౌతమ్‌ఘోష్, బి. నరసింగరావు కలయికలో వచ్చిన మాభూమి చిత్రం నాటి నిజాం పాలనలో అప్పటి జమిందారులు, బడుగు, బలహీన వర్గాలు, ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు అంటే ఒకటి, రెండు ఎకరాలున్న రైతుల పట్ల, శిస్తు వసూలు పేరుతో ఎంత క్రూరంగా, నీతి నియమాలను కూడా వదిలేసి ఎలా ప్రవర్తించే వారో, కళ్ళకు కట్టినట్టుగా చూపే చిత్రం మాభూమి
వేల ఎకరాలున్న జమిందారులు నాటి ప్రభువుల దన్ను చూసుకుని, గ్రామాలలో సాగించిన కిరాతక చర్యల వల్ల ఇల్లూ, పిల్లలతో పాటు జీవనాధారమైన అరకొర ఎకరం భూమి కూడా కోల్పోయిన సంఘటనలను ప్రేక్షకుల ముందుకు మాభూమి రూపంలో తీసుకురావడం జరిగింది.
Also read: వ్యవసాయం ఇతివృత్తంగా అనేక సినిమాలు
ఓ చిన్నకారు రైతు కుటుంబంలోని యువకుడు, జమిందారు దుర్మార్గాలకు, అకృత్యాలకు సర్వం కోల్పోయి, ఉన్న ఊరును కూడా వదిలి వెళ్ళిపోయి ఆకలి చంపుకోవడం కోసం పనివాడుగా మారడం, ఆ ఒక్క యువకుడి పరిస్ధితే కాదు ఆనాటి జమిందారుల కర్కశత్వానికి బలి అయిపోయిన అనేక మంది యువకుల పరిస్ధితి అని కధానుక్రమంగా తెలియచెప్పడం, ఇతివృత్తంలోని బలం, దర్శకుని మేధావితనం తెలియచేస్తాయి!
కాలం మారింది! నాటి నిజాం పాలన చరిత్ర పుటల్లో కలిసిపోయింది! కానీ ఆనాటి జమిందారులు – మరో రూపంలో వారి ఆగడాలు, కుట్రలు, దుర్మార్గాలు, ఇంకోరకంగా చిన్న సన్నకారు రైతులను ఇవాళ్టికీ పీల్చి పిప్పి చేస్తుండటం వర్తమాన చరిత్ర!
దశాబ్దాలు మారుతున్నా రైతు దశ మారకపోవడంఅనేది నిష్టుర సత్యంలా మిగిలింది! భూమిని నమ్ముకున్న రైతు బతుకును, అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించిన చిత్రం మాభూమి. ప్రేక్షకులకు ఆలోచన, ప్రభుత్వాలకు హెచ్చరికగా నిర్మాణం అయ్యే మాభూమి లాంటి చిత్రాలు ప్రగతి కిరణాలను ప్రసరించిన చిత్రాలుగా చెప్పుకోవాలి అంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు!
కార్మిక ప్రగతి ఇతివృత్తంగల చిత్రాలు
కడుపు నిండటానికి కర్షకుడు ఎంత ముఖ్యమో ఒక జాతి పారిశ్రామికంగా ప్రగతి సాధించడానికి, ప్రగతిబాటలో సాగడానికి కార్మికుడు అంత ముఖ్యం! పారిశ్రామిక విప్లవానంతరం కార్మికులను ఉద్దేశిస్తూ ఒక గొప్ప వాక్యం పుట్టింది!
సంపద సృష్టించేది కార్మికులే. అది అక్షర సత్యం! ఎన్నో రంగాలు ముందుకు సాగడానికి, అభివృద్ధి ఫలాలను అందించడానికి, సమాజంలోని ఆర్ధిక అసమానతల వెతలు పోగొట్టడానికి, కార్మికులే ముందు వరసలో ఉంటారు. పెట్టుబడిదారుల కోరలలో చిక్కుకుని, పనిచేస్తున్నా ఎప్పటికప్పుడు జాగృతమవుతూ, తమ శ్రమకు తగిన సౌకర్యాల కోసం, సంపాదన కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రపంచవ్యాప్తంగా ఒకేరకంగా ఉండటం విశేషం! వేషభాషలు వేరయినా, పనిచేసే ప్రదేశాలు మారినా, కార్మిక జీవితంలోని పరిస్ధితులు ఎన్నో దశాబ్దాలుగా మారని వైనం, కళ్ళముందు కనిపిస్తున్న కఠోర సత్యం!
Also read: ప్రతి ప్రయత్నం ఒక వియత్నాం
ఎన్నో పోరాటాల తర్వాత ఎన్నో ఘర్షణల తరువాత కార్మికుల జీవనంలోని జీవన విధానం కొంత మెరుగుపడింది! అయితే తాము చేస్తున్న పనికి, అందవలసిన ప్రతిఫలం కోసం కార్మికులు ఇంకా పోరాటాలు చేసే పరిస్ధితులలోనే ఉన్నారనడమూ కాదనలేని నిజం. ఇదిగో ఇలాంటి పరిస్ధితులలోనే ట్రేడ్ యూనియన్లు ఆవిర్భవించాయి. ఇవిపూర్తిగా కార్మిక సంక్షేమం కోసం, కార్మికులే ఏర్పాటు చేసుకున్న కార్మిక సంఘాలు!
పట్టణాలలోని కార్ఖానాలలో పనిచేసే కార్మికులు ఇంచుమించుగా పల్లెల నుంచి వలస వచ్చిన వారే అయి ఉంటారు. ఎన్నో కారణాల వల్ల పల్లెలలో జీవనోపాధి దొరకక, పట్నాలలోని యంత్రాగారాల్లో పనిని వెతుక్కుంటూ వచ్చిన వారిలో అక్షరాస్యత తక్కువ ఉన్నవారే ఉండటం చెప్పుకోదగిన విషయం! భృతి కోసం, కుటుంబ పోషణ కోసం పనిలో చేరి కార్మికులుగా మారిన వారిని యజమానులు ఎన్నోరకాలుగా దోపిడీ చేయడం వారి హక్కులా భావిస్తారు. ముఖ్యంగా శ్రమ దోపిడీ గురించి చెప్పుకుంటే అసంఘటిత కార్మికుల పరిస్ధితి దయనీయంగా ఉండేది. వారి బాధలను, హక్కులను ప్రశ్నించడానికి అవకాశమే ఉండేది కాదు. అయినా ఆ చాలీచాలని రాబడితోనే, తమ జీవితాలను, యజమానులకు యంత్రాగారాలకు అంకితం చేయడం కార్మికుల జీవితంలో భాగమైపోవడం విషాదం.
అయితే కార్మికుల హక్కుల అణచివేత, సౌకర్యాల కొరత, వేతనాల కోత, వీటన్నిటిపై తమ గొంతు వినిపించేందుకు పుట్టిన కార్మిక సంఘాలు (ట్రేడ్ యూనియన్స్) చేసిన (ఇప్పటికీ కొన్ని రంగాలలో చేస్తున్న) పోరాటాల ఫలితంగా కార్మిక జీవితాలు కొంతవరకు మెరుగుపడ్డాయి! అయితే కార్మికులు సాధించవలసిందీ, సాధించుకోగలిగినవీ మరెన్నో ఉన్నాయి!
Also read: పూర్తిగా రాజకీయమే కథావస్తువుగా ‘భారత్ బంద్’
ఇక్కడొక విషయం ప్రస్తుతాంశంగా చెప్పుకోవాలి! కార్మిక సమస్యలు అన్నది ప్రపంచ వ్యాప్తమైనది. అంటే ఒక రాష్ట్రానికో, దేశానికో పరిమితం కాదు అంటే ఇదెంతటి ముఖ్య సమస్యో తెలుస్తోంది. కానీ చిత్రరంగానికి వచ్చేసరికి, ఎన్నో సమస్యలు, మానవ భావోద్వేగాల మీద బలమైన ఇతివృత్తాలున్న చిత్రాలు రావడం (ఇంకా వస్తుండటం) జరిగింది. కానీ కార్మిక సమస్యలనే ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని వచ్చిన చిత్రాలు అసలు లేవనే చెప్పాలి.
మనుషులు మారాలి వంటి ఉదాత్తమైన చిత్రంలో కూడా కార్మిక సమస్య అన్నది కధలోని ఒక ప్రధాన భాగం, కథ మలుపు తిరగడానికి దోహదం చేసిన విషయంగానే చూపించడం జరిగింది.
Also read: రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం
ఇక ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు నిర్మాణతలో వచ్చిన సీతారాముల చిత్రకథా వస్తువులో కార్మిక సమస్యలు, వారి గురించి కథలో ఒక భాగంగా, ముఖ్యంగా కధానాయకీ నాయకుల మధ్య ఘర్షణ రావడానికి గాను ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఒక కుటుంబ కధాచిత్రంలో ఈ కార్మిక సమసయ అనేది ప్రధాన కధలో ముఖ్యపాత్రల మధ్య భావోద్వేగాలు రగిలించడానికి మాత్రమే కారణమయ్యాయి అని తెలుస్తుంది.
ఇదే విషయాన్ని 1960వ దశకంలో వచ్చిన ఇల్లరికం చిత్రంలో కూడా భార్యాభర్తల మధ్య అపార్ధాలు, అపోహలు, ఎడబాటు కలిగించడానికి, కార్మిక సమస్యను స్పృశించడం జరిగింది.
ఈ పైన పేర్కొన్న చిత్రాలు ఏవీ కూడా సంపూర్ణంగా కార్మిక సమస్యలున్న చిత్ర ఇతివృత్తాలు కాకపోవడం, కార్మిక సమస్యల పరిష్కారానికి సూచనలు చేసే సన్నివేశాలు, సంఘటనలు లేకపోవడం గమనించదగిన అంశంగా పరిగణించాలి!
దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకులు, రచయితలకు కార్మిక సమస్యలతో (గాఢమైన) పరిచయం లేకపోవడం అనుకోవచ్చు. అంతేకాకుండా ఆంధ్ర ప్రాంతంలో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) నగరాలు, కర్మాగారాలూ తక్కువ కావడం మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
స్వాతంత్ర్యానంతరం దాదాపు రెండు దశాబ్దాల తరువాతే ఈ ప్రాంతంలో కార్మిక సంఘాలు పురుడు పోసుకోవడం ప్రారంభించాయి. ఆ సంఘాలు బలపడి, శక్తి పుంజుకోవడానికి మరికొంత సమయం పట్టింది. తరువాతి రోజుల్లో ఎన్నో రంగాలలో ఏర్పడిన కార్మిక సంఘాలు, క్రమంగా మనవైపు కూడా విస్తరించడం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం విశేష కృషి చేస్తుండటం అందరికీ తెలిసిందే.
ఒక సీనియర్ పాత్రికేయుడు ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఇతివృత్తాలున్న చిత్రాలు రాకపోవడానికి కారణం ఇలా చెప్పారు:
‘‘కార్మిక సమస్య అనేది ప్రధానంగా ధనిక వర్గానికి, మధ్య తరగతి వర్గానికి పరిచయం లేనటువంటిది! చిత్రాలు తీసేది ధనికవర్గం! చూసేది ఎక్కువగా మధ్యతరగతి వర్గం! వారికదే వినోద ప్రత్యామ్నాయం! కాబట్టి నిర్మాత, దర్శకులు గానీ, మధ్య తరగతి ప్రేక్షకులు గానీ ఈ కార్మిక సమస్యల గురించి విశేషంగా ఆలోచించడానికి, అవకాశం లేకపోయింది. అందుకే ఆరకమైన చిత్రాల నిర్మాణం అనుకున్నంతగా అనుకున్న విధంగా జరగలేదు.’’
ఈ అభిప్రాయంలో వాస్తవం ఎంతైనా ఉన్నది అని ఏకీభవించే వారుంటారు!
Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’
కుటుంబ చిత్రాలలో ప్రగతి – ఆదర్శం గల కధాచిత్రాలు
మన భారతీయ సంస్కృతిలోని కుటుంబ వ్యవస్ధ ప్రపంచానికే ఆదర్శమైనది అని ఎన్నో సందర్భాలలో ఎందరో శ్లాఘించడం జరిగిందీ నిజమే! మానవ సంబంధాలను బలీయం చేసేది కుటుంబ వ్యవస్ధ! ఆ వ్యవస్ధలో ఎన్నో విభిన్న మనస్తత్వాల వారున్నా అంతర్లీనంగా ఒక ఏకసూత్రత ఉంటుంది. అదే ఒకరంటే ఒకరి మధ్య ఉన్న అనుబంధం! రక్తసంబంధం! ఈ రెండే కుటుంబ వ్యవస్ధని తరతరాలుగా, వంశపారంపర్యంగా నడిపించే సాంఘిక జీవన సూత్రాలు! కుటుంబ వ్యవస్ధకు నేత్రాలు!
గ్రామీణ భారతంలోని కుటుంబ వ్యవస్ధ, ఇప్పటికీ బలమైన ఉద్వేగ బంధాలతో కొనసాగుతోంది అన్నది నిర్వివాదాంశం! అయితే మారుతున్న కాలంతోపాటు జీవన సరళి మారుతూ రావడంతో పల్లెలను విడిచి (కొందరు పూర్తిగా పల్లెను మరిచి) పట్టణాలకు జీవనోపాధి కోసం కొందరు వస్తే మరింత మెరుగైన విద్యా, ఉద్యోగ సౌకర్యాల కోసం మరి కొందరు రావడం మొదలైన తరువాత కుటుంబ వ్యవస్ధలో ఊహించని మార్పులు రావడం మొదలు అయ్యాయి అని చెప్పడం సత్యదూరం కాదు.
పల్లె, పట్టణాల్లోని కుటుంబ వ్యవస్ధలో ఒక దగ్గరితనం, సమీప సాన్నిహిత్య భావన, సహాయ సహకారాల ఆలోచన, పొరుగువారి శ్రేయస్సు గురించి కూడా యోచించడం వంటి అంశాలు ప్రాధాన్యతగా ఉంటాయి. అవి అనూచానంగా అంటే తరం నుంచి తరం వరకూ సూత్రబంధంలా కొనసాగడం విశేషం. అందుకే గ్రామాల్లోని కుటుంబ వ్యవస్ధల్లో ఆత్మీయత, ఆపేక్షలు, అనుబంధాలు, ఆశ్రిత వత్సలత, సౌజన్యత, సమానత్వం, అన్నిటికి మించి ‘‘మానవత్వం’’ ప్రతిఫలిస్తుంటాయి!
ఇవన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలు, ఒకరి సమస్యలను, సంతోషాలను ఒకరికొకరు పంచుకోవడాల్లోనూ కనిపిస్తుంటాయి! ఒక కుటుంబంలో రెండు తరాల వారు, ఒక్కోచోట మూడు తరాల వారు కలిసి ఉండటానికి, పైన చెప్పిన సందర్భాలే సకారణాలవుతున్నాయి! దీనివలన కుటుంబంలోని వారి మధ్య హృదయగత మైత్రిబంధం ఏర్పడటానికి అవకాశం ఉంది. ఓ సమస్య వచ్చినపుడు ఓ కలత, కలహం వంటివి ఏర్పడినపుడు, తీవ్ర వివాదాల వరకు పోకుండా, నలుగురు కలిసి సామరస్యంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. అందువల్ల సమస్యలు, కలతలు, కలహాలకు పరిష్కారం దొరుకుతుంది. నలుగురికీ నచ్చే సమాధానం లభిస్తుంది! అనవసర ఉద్విగ్నతలు, ఉద్రేకాలు రగలకుండా, ఓ శాంతి వాతావరణం వెల్లివిరుస్తుంది.
Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు