అంబ! నవాంబుజోజ్జ్వల కరాంబుజ! శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి! ప్రకటస్ఫుట భూషణ రత్న రోచిరా
చుంబిత దిగ్విభాగ! శ్రుతి సూక్త వివిక్త నిజప్రభావ, భా
వాంబర వీధి విశ్రుత విహార! ననున్ కృపజూడు భారతీ!
ఎఱ్ఱాప్రగడ
మహాభారతం
అరణ్యపర్వశేషం
శరదృతు భానోదయాన అరణ్య వాటికల్లోని స్వచ్చమైన సరస్సుల్లో తామరలు వికసిస్తున్నవి. ఉజ్జ్వలమైన భారతీదేవి కరాంబుజంలో మెరిసి పోతున్న సరసీరుహ శోభను తలపిస్తున్నవీ తామరలు.
Also read: శాంతి యాత్ర
Also read: నా తెలంగాణా
శరత్పూర్ణిమా సమయాన, స్వచ్ఛ సుందర శరదిందు చంద్రికలతో నిశాతలం వెలిగిపోతున్నది. శారదాదేవి మనోహర వదనాన్ని ఈ వెన్నెలరేయి స్ఫురింప జేస్తున్నది.
చంద్రుడు లేని రాత్రులు సైతం అసంఖ్యాక నక్షత్ర కాంతులతో మిఱుమిట్లు గొలుపుతున్నవి. సరస్వతీ మాత “ప్రకటస్ఫుట భూషణ” రత్న రోచిస్సులను ఈ నక్షత్ర హార కాంతులు ప్రతిబింబిస్తున్నవి.
ఉషోదయ గగనంలో విహరించే పక్షుల కల కూజితాలు భావాంబర వీధుల్లో విహరించే వేదజనని ప్రాపలుకుల వలె మార్మ్రోగుతున్నాయి.
తార్క్ష్యుడనే ముని సరస్వతీ దేవిని ఆరాధించగా ఆమె అతని యెదుట ప్రత్యక్ష మౌతుంది. పరవశించి, ఆ తల్లిని తార్క్ష్యుడు స్తోత్రం చేస్తున్నప్నుడు, రమణీయమైన శరత్కాలపు శోభను అణువణువునా వెదజల్లుతున్న దుర్గమారణ్యము, ఆ అరణ్యంలో కంటికి కనబడే మనోహర వస్తు సంచయము, అన్నీ అదృశ్యమై, కేవలం ఒకేయొక ఆధ్యాత్మిక భావన శారదా స్వరూపాన్ని పొంది మునీంద్రునికి సాక్షాత్కరిస్తుంది.
Also read: ఉత్తరాభిమన్యుల వివాహంలో తెలుగుదనం
“నీ కరకమలాన్ని జననీ! నవ వికస్వర శతపత్రం సముజ్జ్వలం గావిస్తున్నది”.
“నీ సుందర మూర్తి శరచ్చంద్రికా ప్రఫుల్లమైనది మాతా!”
“నిశాగగనంలో మిఱుమిట్లు గొలిపే నక్షత్రాలు
నిన్ను అందంగా అలంకరించిన రత్న ఖచిత భూషణ గణం వలె వున్నవి దేవీ!”
“అమ్మా! నీ కమనీయ వేదఘోషతో దిగంతాలు మారు మ్రోగుతున్నవి. నన్ను కృప జూడు భారతీ!”
ఇది మూలానికి సరియైన వ్యాఖ్యానమో కాదో నాకు తెలియదు. ఇట్లా వుంటే బాగుండునేమో అని తనివితీరా నా మనస్సు మాత్రం ఉవ్విళ్ళూరుతున్నది.
“శారద రాత్రులతో, ఉజ్జ్వల లసత్తర తారక హార పంక్తులతో, వికసిత కైరవ సమూహాలతో, వాటి సుగంధాలను నలుదిక్కులా వ్యాపింపజేసే శీతల సమీరాలతో, గాలిలో తేలే పుష్పపరాగాలతో, తెల్లని కర్పూరంవలె క్రమ్ముకొంటున్న సుధాంశుని కాంతి పూరములతో” మహాకవి నన్నయ తెలుగు సాహితీ జగత్తును వీడ్కొల్పితే, “స్ఫురదరుణాంశు రాగరుచి పొంపిరి పోయే నిరస్త నీరదావరణ” శరత్కాలపు ఉషోదయ రోచిర్నివహంతో ఎఱ్ఱాప్రగడ భారత రచనకు శ్రీకారం చుడతాడు. ఈ పద్యపరంపరలో కేవలం మహాముని తార్క్ష్యుడే గాక, అగస్త్య మహర్షి సైతం అగస్త్య నక్షత్ర దీప్తులతో మన కట్టెదుట ప్రత్యక్షమౌతాడు.
Also read: మనుచరిత్ర అవతారిక – కృష్ణరాయల పరిచయం
నా పాఠశాల రోజుల్లో ప్రార్థనా సమావేశాల్లో కంఠతా చేసిన పద్యమిది. ఏ బమ్మెర పోతన వ్రాసినదో అనుకునే వాణ్ణి చాల కాలం.
అచ్చం దీనివలెనే, మనోహరమైన దేశ ప్రకృతిని భారత మాతృస్వరూపంలో దర్శించి తరించిన గీతం వున్నది. రచయిత, కవి, యుగ ప్రవక్త, బంకించంద్ర ఛటర్జీ గారిది. మనందరి జిహ్నాగ్రాలపై నర్తించే గీతం.
“శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీ!
ఫుల్ల కుసుమిత దృమదళ శోభినీ!
సుహాసినీ! సుమధుర భాషిణీ!
సుఖదాం! వరదాం! మాతరం!
వందే మాతరం!”
తార్క్ష్యుడు ముని పుంగవుడైతే, ఆయనలో పరకాయప్రవేశం చేసి “అంబ! నవాంబుజోజ్జ్వల కరాంబుజ” అంటూ భారతీదేవిని ఆద్యంతం మనోహరంగా స్తోత్రం చేసిన ఎఱ్ఱాప్రగడ కూడా ఋషి పుంగవుడే!
ఒకానొక వెన్నెల రేయి భారత పుణ్యభూమిపై పయనిస్తూ, ఆ సౌందర్యాన్ని కన్నులారా దర్శించి, ఆ సస్యశ్యామల ధాత్రిలో, మాతృస్వరూపాన్ని సాక్షాత్కరింప జేసుకున్న బంకిం చంద్ర ఛటర్జీ కూడా ఋషి పుంగవుడే.
ఎఱ్ఱాప్రగడ పద్యం బడిబడిలో పాడే పద్యం.
బంకిం గారి గీతం కోట్లాది జాతిజనుల గుండెల్లో నిత్యం ఘూర్ఢిల్లే గీతం.
ఒకప్పుడు జాతి విముక్తి కోరిన నరనారీ చరితార్థుల నాలుకలపై నర్తించిన తారక మంత్రం.
“జాగృతి” చలనచిత్రంలో మనందరి దేశభక్తినీ తట్టి లేపే గీతమున్నది. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించేది:
“ఆవో బచ్చే తుమే దిఖాయీ
ఛాతీ హిందుస్తాన్ కీ!”
“ఇస్ మిఠ్ఠీసే తిలక్ కరో!
ఏ ధర్తీ హై బలిదాన్ కీ!”
‘వందేమాతరం! వందే మాతరం!”
Also read: తుం గ భ ద్రా న ది
నివర్తి మోహన్ కుమార్