బ్రెజిల్ లో లూలా విజయం వామపక్షవాదులకు ఆనందం కలిగించే వార్త. మితవాదులకు మింగుడుపడని కబురు. ప్రపంచవ్యాప్తంగా సుమారు పదేళ్ళుగా విస్తరించి వేళ్ళూనుకున్న రైటిస్టు శక్తులకూ, మతశక్తులకూ, నిరంకుశ శక్తులకూ ఎదురు దెబ్బ. ప్రత్యర్థి కంటే లూలాకు రెండు శాతం కంటే తక్కువ ఓట్లే అధికంగా వచ్చి ఉండవచ్చు. కానీ ఈ అంతరం కంటే ఆయన విజయం ప్రభావం ఎక్కువ.
అక్టోబర్ 30న జరిగిన ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు లాలూ ద సిల్వా అప్పటి అధ్యక్షుడు జయిర్ బోల్సోనారో పై విజయం సాధించారు. ఎన్నికలలో ఓటింగ్ కు ఒక రోజు ముందు లూలాకు సమర్థనగా శాంటియాగోలో జరిగిన ఊరేగింపులో ఆయన అభిమానులు చాలా హడావుడి చేశారు. అన్ని రంగులవారూ, అన్ని వయస్సులవారూ, అన్ని వృత్తులవారూ ఆ ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక ట్రక్కు మీద ఎక్కి రోడ్ షోలో సాగుతున్న లూలా చిరునవ్వు చెదరకుండా తనపైన విసిరిన బేస్ బాల్ టోపీలపైనా, టీషర్టులపైనా సంతకాలు (ఆటోగ్రాఫ్ లు) చేస్తూ కనిపించారు. ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు హుషారుగా ‘లూలా…లూలా…లూలా’ అంటూ నినాదాలు చేశారు. ‘లూలా హదాద్’ అనే నినాదాలు రాసిన పతాకాలు వేల సంఖ్యలో మిన్నంటాయి. బాల్కనీలలో నిలిచి హుషారుగా చేతులు ఊపుతున్నవారూ, కిటికీలలో నుంచి బయటికి చూస్తూ సంతోషం వ్యక్తం చేసినవారూ లాలూ విజయానికి సంకేతాలుగా నిలిచారు.
పోలింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు అధ్యక్షుడు బోల్సోనారో మిత్రులు రాబర్టో జఫర్సన్, పార్లమెంటు సభ్యురాలు కార్లా జాంబెల్లీ పిస్తోలుతో కాల్పులు జరిపారు. బోల్స్ నారోకు సన్నిహితుడంటూ చాటుకునే జఫర్సన్ సుప్రీంకోర్టును దుర్భాషలాడారు. అందుకే విజయం ప్రకటించిన తర్వాత లూలా, ‘‘మేము ఒక అభ్యర్థిని ఓడించలేదు. మొత్తం బ్రెజిల్ ప్రభుత్వ యంత్రాంగంపైన విజయం సాధించాం’’ అని వ్యాఖ్యానించారు.
ఓటమిని అంగీకరించే ప్రసక్తి లేదంటూ బోల్సోనారో తరచుగా ప్రకటించడంతో ఏదైనా తిరుగుబాటు చేయిస్తారేమోననే అనుమానాలు అంతర్జాతీయ పరిశీలకులను సంవత్సరం పొడవునా వేధిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ బ్రెజిల్ లోని అభ్యుదయ శక్తుల సంఘీభావం, సమష్టి కృషి కారణంగా ఈ విజయం సాధ్యమైంది. రెండవ గులాబీ విప్లవం సంభవించింది. ప్రపంచం అంతటా స్వైరవిహారం చేస్తున్న మితవాద శక్తులతో బాధపడుతున్న అనేక దేశాలకు బ్రెజిల్ లో లాలూ విజయం ఒక శుభవార్త. ‘‘నిరంకుశత్వాన్నీ, ఫాసిజాన్నీ ఓడించి ప్రజాస్వామ్యానికి బ్రెజిల్ మళ్ళీ పట్టం కట్టింది’’ అని లాలూ ప్రకటించారు.
లూలాకు 50.8 శాతం ఓట్లు పోలైతే బోల్సోనారోకు 49.2 ఓట్లు పడ్డాయి. లూలాకు లభించిన ఆధిక్యం 1.6 శాతమే. బోల్సోనారో హయాంలో కోవిద్ మహమ్మారి కారణంగా అనేకమంది ప్రజలు దుర్మరణం చెందారు. దీనికి చాలావరకూ బోల్సోనారో ప్రభుత్వ వైఫల్యమే కారణం. లాటిన్ అమెరికా దేశాలలో అతి పెద్దదైన బ్రెజెల్లో శాంతి, ప్రజాస్వామ్యం, అవకాశాలు పెరగాలని నూతన అధ్యక్షుడు ప్రజలకు పిలుపునిచ్చారు. 3.31 కోట్లమంది ఆకలితో అలమటిస్తున్నారనీ, ఆర్థిక చక్రం పూర్తిగా తిరగాలని లూలా అన్నారు. శాశ్వతంగా చీలిపోయిన దేశంలో నివసించడం ఎవ్వరికీ క్షేమదాయకం కాదని 77 ఏళ్ళ లూలా వ్యాఖ్యానించారు. కొలంబియా, చిలీలో వామపక్షవాదులు ఇటీవల సాధించిన విజయాలకు బ్రెజిల్ గెలుపు వన్నె తెచ్చింది. ఫ్రెంచి అధ్యక్షుడు ఎమాన్యువల్ మాక్రన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత ప్రధాని నరేంద్రమోదీ, తదితరులు లూలాను అభినందించారు.