Sunday, December 22, 2024

వీరవిధేయుడు ఖర్గేకే పార్టీ పగ్గాలు

  • ఎవరు ఎన్నికైనా తుది నిర్ణయం రాహుల్ దే
  • గెహ్లోత్ అనుభవంతో మరింత అనిశ్చితి, అభద్రతాభావం

కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక అంశంపై సుదీర్ఘకాలం నుంచి డ్రామా నడుస్తోంది. అధ్యక్షస్థానంలో అధికారికంగా గాంధీ కుటుంబ సభ్యులు బరిలో లేకపోవడం కూడా డ్రామాగానే ఎక్కువమంది భావిస్తున్నారు. దానికి వ్యూహమనే ముద్దుపేరు కూడా పెట్టుకోవచ్చనే మాటలు కూడా వినపడుతున్నాయి. రాహుల్ గాంధీయే అధ్యక్షుడుగా ఉండాలన్నది, అన్నీ కలిసి వస్తే అతనే ప్రధానమంత్రి కావాలన్నది సోనియమ్మ హృదయంలో ఉండే ప్రధానమైన కోరికలు. పాతతరం నేతల్లో ఎక్కువమందికి రాహుల్ తో పొసగడం లేదు. తర్వాత తరం, కొత్తతరం వారు రాహుల్ వైపే ఎక్కువగా నిల్చుంటున్నారు. ఆయన మాత్రం గతంలో పార్టీ చవిచూసిన ఓటమి భయంతో లేదా దానికి తానే బాధ్యుడననే భావనతో లేదా వ్యూహంతో అధ్యక్ష స్థానంలో కూర్చోడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ప్రియాంక గాంధీ కూడా వెనుకడుగు వేస్తున్నారు. సరే! సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండడం లేదు.

Also read: కరవుకాలం దాపురిస్తోందా?

గాంధీకుటుంబం అధ్యక్ష పదవికి దూరం

గాంధీ కుటుంబమే ఎల్లకాలం అగ్రాసనంలో కూర్చోవడం ఏంటి? అనే విమర్శలకు సమాధానం చెప్పేందుకైనా గాంధీకుటుంబేతర వ్యక్తికి అధ్యక్షుడిగా పట్టం కట్టాలని గాంధీ కుటుంబం నిర్ణయించుకున్నట్లుగా భావించాలి. అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియ ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని నమ్మే పరిస్థితుల్లోనూ ఎక్కువమంది లేరు. పరిణామాలు దానికి అద్దం పడుతున్నాయి. ఈ ప్రహసనంలో బోలెడు పేర్లు గాలిలోకి వదిలారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి తిరువనంతపురం ఎంపీ శశిథరూర్, ఝార్ఖండ్ మాజీ మంత్రి కే ఎస్ త్రిపాఠీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్లు బరిలో ఉన్నాయి. మల్లికార్జున ఖర్గే వైపే అధిష్ఠానం / గాంధీ కుటుంబం మొగ్గు చూపినట్లు బలంగా వినిపిస్తోంది. దానికున్న ఏకైక/ప్రధానమైన అర్హత ‘వీర విధేయత’ మాత్రమేనని గట్టిగా భావించాల్సి వస్తోంది. మిగిలిన వారెవరిపై గాంధీ త్రయానికి ఆ స్థాయిలో విశ్వాసం లేదని అనుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ తిరుగుబాటుతో అధిష్టానం మరింత అప్రమత్తమైంది. సోనియాగాంధీకి విధేయుడనే మాట తాజా పరిణామంతో కొట్టుకుపోయింది. గహ్లాత్ ను అధ్యక్షుడిని చేసి, సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రిని చేయాలనే యోచనలో ఉన్న పార్టీ పెద్దలకు గహ్లాత్ పెద్ద షాక్ ఇచ్చాడు. రాజస్థాన్ లో రాజకీయం వేడెక్కిన సందర్భంలో ఆయన దిల్లీ వెళ్లి అధినేత్రిని కలిశారు. క్షమాపణలు కూడా చెప్పారు. వెనువెంటనే రాజస్థాన్ యువనేత పైలెట్ కూడా ‘మేడమ్’ ను కలిశాడు. రాజస్థాన్ లో వచ్చిన /తెచ్చిన తిరుగుబాటుతో గహ్లాత్ ముఖ్యమంత్రి పదవి ఎంతకాలం ఉంటుందో కూడా చూడాలి. కాకపోతే,ఆయనను పదవి నుంచి దించేస్తే పంజాబ్ తరహా పరిణామాలు చోటుచేసుకుంటాయనే భయాలు పార్టీ దిల్లీ పెద్దలకు వున్నాయి.

Also read: ‘సుకవి’ జాషువా

సోనియా అస్తిత్వ సమస్య

రేపటి అసెంబ్లీ,సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ లో తమ ఉనికిపై గాంధీ కుటుంబానికి ముఖ్యంగా సోనియాగాంధీకి భయం పట్టుకున్నట్లు అర్థమవుతోంది. అభద్రతాభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ ప్రభావం, పర్యవసానమే నేడు ఉన్నపళంగా ఖర్గే పేరు పైకి రావడమని భావించాలి. శశిథరూర్ మొదలు మిగిలినవారు తమ మాట ఏ మాత్రం వింటారో అనే సందేహాలు కూడా కాంగ్రెస్ అధిష్ఠానంలో పెరిగినట్లు అనుకోవాలి. ప్రస్తుతం ఉన్నవాళ్ళల్లో వీర విధేయతలో మల్లికార్జున ఖర్గేదే అగ్రస్థానమని చెప్పాలి. ఈయనేమి కనీసం నడివయస్సులో కూడా లేరు. 80 ఏళ్ళ వృద్ధుడు. కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. కర్ణాటకకు చెందిన దళిత నేత. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవికి చేరువ దాకా వెళ్లి ఆగిపోయారు. అయినా పార్టీపై తిరుగుబాటు చేయకుండా సహనంగా ఉన్నారు. అధిష్ఠానం ఏ బాధ్యత /పదవి ఇస్తే దానిని శిరసావహిస్తూ వచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే పార్టీని నమ్ముకుంటూ జీవించారు. 2014 లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందిన దశలోనూ ఆయన ఎంపీగా గెలిచారు. దీనితో లోక్ సభలో ప్రతిపక్షనేతగా అవకాశం వచ్చింది. కానీ, 2019లో పార్టీతో పాటు ఆయన కూడా ఓటమి పాలయ్యారు. రాజ్యసభకు ఎంపిక చేసి పార్టీ ఆయనను గౌరవించింది. రాజ్యసభ ప్రతిపక్షనేతగా కూర్చోపెట్టింది. అలా 2014 నుంచి ఆయన వార్తల్లో వ్యక్తిగా పైకి లేచారు. 2014 లో ఆయన జీవితంలో కీలకమైన మలుపు నమోదైంది. నేడు అధ్యక్షుడిగా ఎంపిక అధికారికంగా పూర్తయితే కాంగ్రెస్ వంటి ఘన చరిత్ర కలిగిన పార్టీకి అధ్యక్షుడై చరిత్ర కాగితాల్లోకి ఎక్కుతారు. ఫలితాలు ఎలా ఉన్నా ప్రతిపక్షనేతగా ఉభయ సభల్లో, వివిధ సందర్భాల్లో పార్టీ తరపున తన వాణిని వినిపిస్తూ తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం విజయవంతంగానే చేశారు. హిందీ బాగా మాట్లాడగలడు. సౌమ్యుడు, మృదుస్వభావి, వివాదరహితుడు గానూ పేరుంది.

Also read: భద్రతామండలిలో భారత్ కు స్థానం దక్కేనా?

నడి సముద్రంలో నావ కాంగ్రెస్

వీటన్నింటి కంటే ముఖ్యమైన అర్హత సోనియాగాంధీ కుటుంబానికి వీరవిధేయతగా చెప్పుకుంటున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రాలలోనూ, దేశంలోనూ ఏమాత్రం బాగాలేదు. జీ -23 గా ప్రచారంలో ఉన్నా … పార్టీ తీరుతెన్నులపై అసంతృప్తిగా ఉన్న పెద్ద నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. పార్టీకి ఎంతో ముఖ్యుడు, ఆప్తుడని భావించిన గులాం నబీ ఆజాద్ మూటముల్లె సర్దుకొని సొంత దుకాణం పెట్టుకున్నారు. గహ్లాత్ పెద్ద తిరుగుబాటే చేశారు. కపిల్ సిబల్ వంటి పెద్ద నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చి సరికొత్త దారులు వెతుక్కున్నారు. ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్న రాహుల్ గాంధీ రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. ప్రియాంక గాంధీ పూర్తి బాధ్యతలు తీసుకున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయింది. 2014 లో మోదీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ పతనం మొదలైంది. చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఇప్పటికీ ఆశావహమైన శకునాలు ఎక్కడా కనిపించడం లేదు. ఖర్గే వచ్చినా? ఎవరు వచ్చినా ఆలోచనా విధానాలు, సిద్ధాంతాల్లో మార్పు రాకపోతే, నాయకుల పట్ల, అధిష్ఠానం పట్ల విశ్వాసం కలిగించకపోతే కాంగ్రెస్ సంగతి అంతే సంగతులు! నేడు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు అక్టోబర్ 8వ తేదీ వరకూ గడువు ఉంది. అక్టోబర్ 19వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. విధేయతతో పాటు వీరత్వం, సమర్ధత ముఖ్యం. నడిసంద్రంలో నావలా ఉన్న కాంగ్రెస్ ను అందరూ కలిసి ఏ తీరానికి చేరుస్తారో చూద్దాం.

Also read: రక్తపోటు నియంత్రణలో భారత్ మేటి!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles