చిక్కటి కాఫీ లాంటి సినిమా
‘లవ్ స్టోరీ’ సినిమా చూశాక ఆ కథా రచయితను అభినందించకుండా ఉండలేము. ప్రేమతో పాటు అనేక విషయాలను చక్కగా కథలో కలిపి సమాంతరంగా నడిపించారు.
శాస్త్రీయం కాని నాట్య గానాల ప్రాధాన్యం కలిగిన చిత్రం.
ఉద్యోగం దొరకలేదని బాధపడక చేతనైన (విద్య) నాట్యాన్ని జీవనాధారం చేసుకుని బ్రతకొచ్చని చూపిస్తాడు నాయకుడు.
గ్రామీణ వాతావరణంలో పెరిగి ఇంగ్లిష్ రాక ఉద్యోగం సంపాదించ లేని నాయిక నిరుద్యోగులకు ఒక సందేశాన్ని అందిస్తుంది.
ఎంత చదువుకున్నా మనసులో ఏమూలో దాగి క్లిష్ట సమయాల్లో అప్రయత్నంగా బయటపడే కుల, మత, అంతస్తుల వ్యత్యాసాలు అరుపులు, కేకలు లేకుండా సున్నితంగా చూపబడ్డాయి.
పసి పిల్లలలను కూడా కాముకతకు బలి చేస్తున్న క్రూరత్వాన్ని, వావి వరుసలు కూడా లెక్క చేయని అటవికతను భీభత్సం సృష్టించకుండా మన మనసులు కృంగేటట్లు చూపించారు.
పరిధులు దాటలేని నాయకుడి తల్లి, నాయిక తండ్రి ఒక వైపు, పరిధులు దాటిన నాయికా నాయకులు మరొక వైపు కనిపిస్తుండగా, పరిధిలో నుండి అప్పుడే బయటపడ్డ నాయిక తల్లి వాస్తవ జీవితంలోని పాత్రల ప్రతీకలుగా నిలుస్తారు.
గ్రామీణ జీవనంలో పెత్తందార్ల జులుంను ఎదుర్కోవడానికి బ్యాంకులో అప్పు తీసుకోవడం మరొకరితో కలసి వ్యాపారం మొదలు పెట్టడం సమాజానికి రచయిత చూపిన మార్గాలు.
వివిధ థీమ్ లు మేళవించిన కధను ఎక్కడా ఎక్కువ తక్కువలు రానివ్వని సమతూకంతో హృద్యంగా మలచిన నిర్దేశకుడు శేఖర్ కమ్ముల కూడా అభినందనీయుడు.నాయిక నృత్య కౌశలం అపూర్వం. ఇందులోని ఒక గొప్ప పాట గురించి అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చిక్కటి కాఫీ లాంటి సినిమా.