(From The Prophet by KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
——–
మార్గం కష్ట తరమైనా
నిటారుగా ఎక్కేదైనా గాని —
ప్రేమ నీకు సైగ చేస్తే , అనుసరించు !
ప్రేమ, రెక్కలతో కప్పివేస్తే,
వాటి మధ్య దాగున్న ఖడ్గం గాయం చేసినా సరే
లొంగిపో !
ఉత్తర పవనాలు, వనాలను ధ్వంసం చేసినట్లు–
ప్రేమ గళం నీ కలలు కల్లలు చేసినా
ప్రేమ నీతో మాట కలిపితే, విశ్వసించు !
ప్రేమ నీకు కిరీటం పెట్టనూ గలదు!
శిలువ వేయనూ గలదు !
నీ ఉన్నతికి కారణమవగలదు
నీ పతనాన్ని నిర్దేశించనూ గలదు !
నీ అంత ఎత్తుకెగిరి, సూర్య రశ్మి లో వణికే నీ సున్నితమైన కొమ్మలను లాలించగలదు!
నీ వేరుల్లోకి దిగి, మూలాలను పెకలించి వేయనూ గలదు !
జొన్న మొక్కల మోపుల్లా నిన్ను తన లోకి కట్టి వేసుకో గలదు !
నిన్ను బహిర్పరచటానికి నూర్పిడి చేస్తుంది .
ఊకను జల్లెడ పడుతుంది.
మెరుపు కోసం సాన పడుతుంది.
భగవాన్ విందుకు
రొట్టె కోసం పవిత్రాగ్నిలో కాలుస్తుంది.
హృదయ రహస్యాలు నీకు తెలియటానికి
గుండెలో భాగమయ్యేట్లు నిన్ను తయారు చేస్తుంది !
నీ భయంలో,
ప్రశాంత ప్రేమను, ఆనందాన్ని మాత్రమే కోరుకుంటే, నీ నగ్నత్వాన్ని కప్పుకో !
ప్రేమ పరీక్షలకు దూరంగా పో !
అర్ధ హాసంతో, అర్ధ రోదనతో
కాలాతీత మైన లోకంలో పోయి దాక్కో!
ప్రేమ ఏమీ ఇవ్వదు—ప్రేమ తప్ప
ఏమీ తీసుకోదు ప్రేమ మినహా !
ప్రేమ —
ఏమీ స్వంతం చేసుకోదు
ఎవరికీ స్వంత మవదు !
—ప్రేమకు ప్రేమ చాలు !
ప్రేమిస్తే– “నా హృదయంలో దైవం ఉన్నాడ”నకు
“దేవుని గుండెలో నేనున్నాన”ని చెప్పు !
ప్రేమ మార్గం నువ్వు నిర్దేశించకు !
విలువ గ్రహిస్తే, ప్రేమే నిన్ను నడిపిస్తుంది!
ప్రేమకు,
పరిపూర్ణత సాధించడం తప్ప
వేరే ఆకాంక్షలు ఉండవు!
ప్రేమిస్తూ
—ఆకాంక్షలు పెట్టుకోదలిస్తే
ఈ చెప్పేవి — నీ ఆకాంక్షలుగా ఉంచుకో
‘—–కరిగిపోయి, నిశీధిలో శ్రావ్య గానం చేసే సెలయేరులా ప్రవహించడం,
—–అతి సున్నితత్త్వం లోని బాధను తెలుసుకోవడం,
——ప్రేమ కోసం మనః పూర్వకంగా, సంతోషంగా రక్తమోడ్చడం,
—–ఉప్పొంగే హృదయంతో ఉషోదయాల్లో మేల్కొని, ప్రేమకు మరో రోజు లభించినందుకు,
కృతజ్ఞతలు చెప్పుకోవడం,
——అపర్ణాహంలో విశ్రాంతిగా ప్రేమ పారవశ్యాన్ని ధ్యానించుకోవడం,
—–సాయం సంధ్యలో కృతజ్ఞతతో
గృహోన్ముఖుడవడం,
—–నీ హృదయంలో ప్రేయసి కోసం ప్రార్ధన చేస్తూ, పెదవులపై ప్రశంసా గీతంతో
శయనించడం! ‘
Also read: ఇట్లు అమ్మ
Also read: అనాచ్ఛాదితము
Also read: విపణి వీథి
Also read: వాంఛ
Also read: నా లోని నిజం