Sunday, December 22, 2024

ప్రేమికుల రోజు వర్ధిల్లాలి!

ప్రేమికుల రోజు (ఫిబ్రవరి -14) న బజరంగ్ దళ్, విశ్వ హిందూపరిషత్ కార్యకర్తలు ప్రేమ జంటలకు బలవంతంగా వివాహాలు జరిపించటం చర్చనీయాంశం అవుతుంది. ప్రేమికులపై వీరి సోషల్ పోలీసింగ్ ఏమిటని? ఇలా బలవంతంగా పెళ్లిళ్లు చేయడం సరైనదేనా? అని మహిళా సంఘాలు, అభ్యుదయవాదుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బజరంగ్దళ్ వారి ఉద్దేశం ఏమైనాప్పటికీ, ప్రేమ లేని పెళ్లి చేస్తే తప్పుగానీ పెళ్లి చేస్తున్నది ప్రేమికులకే  కాబట్టి ఆక్షేపించాల్సిన పని లేదనే వారు కూడా లేకపోలేదు. సరే బలవంతంగా ప్రేమికుల పెళ్లిళ్ళు చేయడం సరైనది కాదనుకున్న మరి పెద్దల అంగీకారంతో జరిగే పెళ్లి చూపుల పెళ్లిళ్లు సరైనవేనా? పెద్దలు జరిపే వాటిలో ఎన్ని బలవంతం పెళ్లిళ్లు జరగటం లేదు? మరి ఇలాంటి వాటిపై ఎందుకు ప్రశ్నలను సంధించడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి మన సమాజంలో పెళ్లిళ్లు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయి? అనే దాన్ని ముందుగా పరిశీలిద్దాం.

తొలి అర్హత కులం

పెళ్లికి మొదటి అర్హత కులం. అంటే అబ్బాయి, అమ్మాయి ఒకే కులమై  ఉండాలి. ఆ తర్వాత పెద్దలు చూసే విషయాలు ఆస్తులు, హోదాలు. రూపురేఖలు మూడవ స్థానాన్ని కలిగి ఉంటాయి. ఆఖరి స్థానం గుణగణాలకు ఇస్తారు. అంటే వివాహానికి ముందుగా చూడాల్సిన విషయాలు ఆఖరున ఉంటాయి. ముఖ్యంగా ఆస్తులు, డబ్బులు పునాదిగా వివాహ సంబంధాలు నిర్ణయం అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి అంశాలపై కుల పెద్దలు కుదుర్చు వివాహాల కన్నా కులం, డబ్బు ప్రస్తావన లేని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమికులకు బజరంగ్దళ్ వారు వివాహాలు జరిపించడం మంచిదే కదా!

పురాణాలలో ఏం జరిగింది?

దీనికి సంబంధించి మన పురాణ చరిత్ర లో ఏం జరిగిందో చూద్దాం. మన సమాజం మొదటి నుండి ఒక్క మహాభారత కాలంలో తప్ప ప్రేమ వివాహాల్ని ప్రమాదకరమైన వాటిగా చూస్తూనే ఉంది. మహాభారతంలో కూడా పెద్ద కులాల పురుషులు హిందుకులాల స్త్రీలను పెళ్లిళ్లు చేసుకుంటారు. దుష్యంతుడు బెస్త కన్యను, వశిష్ఠుడు అరుంధతిని, శ్రీకృష్ణుడు జాంబవని కుమార్తెను వివాహాలు చేసుకున్న సందర్భాలను చూస్తాం. కానీ పైకులాల స్త్రీలు కింది కులాల పురుషులను పెళ్లి చేసుకున్న సందర్భాలు కనిపించవు. మరి ఎందుకని మన సమాజం స్త్రీలు తమ కంటే తక్కువ కులం వాడిని పెండ్లి చేసుకోనివ్వదు?

 ఎందుకంటే స్వకుల  వివాహాలు కుల వ్యవస్థనే కాక ఆస్తి సంబంధాలను కూడా కాపాడుతాయి. మన కుల వ్యవస్థ కులాల మధ్య సామాజిక అంతరాలు, హోదాలు, గౌరవాలను ఏర్పాటు చేసింది. ఇవి యధావిధిగా కొనసాగాలని పై కులాలు భావిస్తాయి. కానీ కులాంతర వివాహాల వల్ల అప్పటివరకు కొనసాగుతున్న గౌరవాలు హోదాలు భగ్నమవుతాయి. అందుకే కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ కులంలోనే పెళ్లిళ్లు జరిగే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ విధంగా తమ కుల గౌరవం, ఆస్తులు చెడిపోకుండా ఉండటం కోసం వీర సైనికులు లాగా మారుతారు.  దీనికి భిన్నంగా వ్యవరిస్తే తమ సొంత బిడ్డలను కూడా చంపటానికి తల్లిదండ్రులు ఏమాత్రం కూడా వెనుకాడరనీ చరిత్ర నిరూపిస్తుంది.అయినప్పటికీ మనుషుల మధ్య ప్రేమలు కలగటం సహజం. ఆ ప్రేమను పండించుకోవడం కోసం అక్కడక్కడ యువతీ యువకులు ముందుకు వస్తున్నారు. అందుకే ప్రేమ వివాహాలలో 90 శాతం కులాంతర వివాహాలే ఉంటున్నాయి. అందుకే తల్లిదండ్రులే ప్రేమ వివాహాల కోసం ప్రయత్నించిన తన బిడ్డలను కర్కశంగా చంపటానికి తెగబడుతున్నారు. వీటికి గౌరవ హత్యలనే ముద్దుపేరు ఉంది.

అభ్యుదయవాదుల ద్వంద్వవైఖరి

మరి తమ బిడ్డలను ఇలా చంపమని ఏ ధర్మం చెప్పింది? సుమారు 3000 సంవత్సరాల కిందట కులాంతర వివాహాల(ప్రేమ వివాహాల)ను నిషేదించాలని, వీటిని ఏమాత్రం అనుమతించినా కూడా కుల వ్యవస్థకు ముప్పు తప్పదని మనుదర్మశాస్త్రములోని 1వ స్మృతి 16 శ్లోకంలో చెప్పింది. అలాగే కుల రక్షణ కోసం స్వకుల వివాహ వ్యవస్థను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అనుసరించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా కింది కులాలకు చెందిన పురుషులు పైకులాల చెందిన స్త్రీలతో వివాహం ద్వారా బిడ్డలను కంటే వారిని అస్పృశులుగా పదిగనించబడతారని కూడా హెచ్చరించింది. ఇలాంటి హెచ్చరికలను నేడు అభ్యుదయవాదులు తీవ్రంగా ఖండిస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ తమ దగ్గరికి వచ్చేసరికి సొంత కులం వారినే పెళ్లి చేసుకుంటున్నారు.

ఏది నీతి, ఏదవినీతి?

 కాబట్టి మన సమాజంలో ఉన్న దుష్ట సంప్రదాయాలలో అత్యంత అభివృద్ధి నిరోధక సాంప్రదాయం అంటే స్వకుల వివాహాలే నన్న విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. ఇంత పెద్ద విషయాన్ని వదిలిపెట్టి చిన్న చిన్న వ్యసనాలైన మందు తాగటం, సిగరెట్ తాగటం, చిల్లర దొంగతనాలు, అక్రమ సంబంధాలు కలిగి ఉండటం వంటి అంశాలను నీతి బాహ్య విషయాలుగా పరిగ నిస్తున్నారు. అలాగే కట్నం తీసుకోవటమును నేరంగా చూస్తున్నారు.  ఇలాంటి వాటిని పాటించకూడదనే నిబంధనలు కూడా పెట్టుకున్నారు. వాస్తవానికి కట్నం ఇవ్వటం అనేది ఒక కులములోని దగ్గర బంధువులకు ఆస్తి బదిలీ చేయటం వంటిదే తప్ప మరొకటి కాదు. ఈ సమస్య కూడా వారి అత్యాశల నుండి పుట్టిందే. కానీ వరకట్నాలను వ్యతిరేకిస్తున్న వారు వరకట్న నిర్మూలనకు కులాంతర వివాహాలే పరిష్కారమైన విషయాన్ని గుర్తించడం లేదు. అలాగే కుల వ్యవస్థ కొనసాగటానికి స్వకుల వివాహ పద్ధతి పునాదిగా ఉంటున్న విషయాన్ని గమనించడం లేదు. దేనినీ తప్పుగా భావించాలో దాన్ని సహజమైనదిగా చూస్తున్నారు. ఈ విధంగా సకుల వివాహం చేసుకోవడం ద్వారా వేల ఏండ్ల క్రితం’ మనవు’ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే  మనువాద సైనికులుగా మారుతున్నారు.

మనువాదానికి సహజరక్షకులు

ఇక కులాంతర వివాహాల గురించి చర్చ ముందుకు రాగానే బలవంతంగా చేయకూడదనో, మైనారిటీ సమస్యను ముందుకు తేవటమో, కులాంతర వివాహాల వల్ల పురుషాధిక్యత పూర్తిగా నశించదనో, మా కులం వారు ఏమనుకుంటారనో, పెద్దలు అంగీకరించరనో, ఆర్థికంగా నిలదొక్కకోకుండా ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోకూడదనో, అసలు విప్లవం కోసమే పని చేస్తున్నవారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదనో ఇలా రకరకాల సాకులు వెతుకుతూ పరిమితులు వివరిస్తూ మనువాదానికి సహజ రక్షకులుగా మారుతున్నారు. పైగా వీరు ప్రాచీన సంప్రదాయాలకు, చాందస భావాలకు ఆర్ఎస్ఎస్ ప్రతీకని నిందిస్తుంటారు. కానీ సకల వివాహాలు చేసుకోవడం ద్వారా కుల వ్యవస్థను తద్వారా హిందూ మతాన్ని కాపాడాలనే మతోన్మాదులు లక్ష్యాన్ని కాపాడుతున్నామని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ విధంగా నాటి నుంచి నేటి వరకు అన్ని కులాల వారు ప్రేమ ఆధారంగా కాక ‘ మను’చెప్పిన స్వకుల వివాహాలే చేసుకుంటూ, కులాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

దీనికి భిన్నంగా బజరంగ్దళ్ వారు ప్రేమికులకు బలవంతంగానైనా వివాహాలు జరిపించడం పురోగమన స్వభావం కలిగినదే. అయితే వారు కేవలం ఫిబ్రవరి 14నే కాకుండా ప్రతిరోజు ప్రేమికులకు వివాహం జరిపించాలి. ఎందుకంటే, ఫిబ్రవరి 14 రోజున మాత్రమే ప్రేమించుకొని మిగతా రోజులలో ప్రేమించుకోరా ఏమి? ప్రేమ జంటలకు ప్రతిరోజు ప్రేమికుల రోజే.

బజరంగ్ దళ్ కు కొన్ని ప్రశ్నలు

ఇక్కడ కొన్ని ప్రశ్నలను బజరంగ్దళ్ వారికి వేయాల్సి ఉంది. ప్రేమించుకోవటాలు ఆ తర్వాత పెళ్లి చేసుకోవటాలు విదేశీ సంస్కృతినే భావనతో బజరంగ్దళ్ వారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారా? మరి ప్రేమ, పెళ్లి అనేది హిందూమత సంస్కృతిలో లేవా? ప్రేమకు సింబాలిక్ గా శ్రీకృష్ణుని చూపిస్తారు కదా! మరి ఆయనది ఏ రకమైన ప్రేమ? బజరంగ్దళ్ వారు వ్యతిరేకిస్తుంది దేన్ని? సంవత్సరములో ఒక రోజును వేడుకగా జరుపుకోవటం విదేశీ సంస్కృతి అనుకున్నట్లయితే, ప్రతిరోజును ప్రేమికుల రోజుకు జరుపుకోమని పిలుపు ఇవ్వచ్చు కదా! అప్పుడు వారు 360 రోజులు ప్రేమ పెళ్లిళ్లు చేసే మహాభాగ్యమును కూడా పొందవచ్చు. ఇలా ప్రేమ జంటలకు వివాహాలు చేసుకుంటూ పోతే కొద్దికాలంలోనే కులం నిర్మూలించబడుతుందంటలో సందేహం లేదు.

వాస్తవాల్ని స్త్రీవాదులు గుర్తించాలి

నిజంగా స్త్రీ స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోరుకునేవారు చేయాల్సిన పని ఇదే. మనదేశంలో స్త్రీ స్వేచ్ఛకు కుల నిర్మూలనకు విడదీయబడిని సంబంధం ఉంది. ఎందుకంటే ‘మనవు’ కుల రక్షణ కోసం జెండర్ను ఆయుధంగా మలిచాడు. అందుకు అనుగుణంగానే స్త్రీ చుట్టు కుల గౌరవం, ప్రాతిపత్యం వంటి నియమాల ద్వారా దడిని ఏర్పాటు చేశాడు. ప్రతి స్త్రీ తనకు తానే ఈ బానిసత్వములో ఇమిడే విధంగా సంస్కృతి, సంప్రదాయాలను నిర్మించాడు. అందుకని ఈ కులవాద చట్రం నుండి స్త్రీలు బయటకు రానంతకాలం వారికి విముక్తి లేదు.  మనువాదానికి ,స్త్రీ బానిసత్వానికి ఉన్న సంబంధాన్ని బద్దలు చేస్తే తప్ప స్త్రీ విముక్తి జరగదు. కాబట్టి స్త్రీ విముక్తి ఉద్యమాలు మనువాద వ్యతిరేక ఉద్యమాలను చేస్తూ కుల నిర్మూలన ఉద్యమాలతో పెనవేసుకొని పోవాల్సి ఉంది. ఈ విషయాన్ని విప్లవవాదులే కాదు, స్త్రీవాదులు కూడా ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. ఒకవేళ వీరు ఈ పనినీ చేయటానికి ముందుకు రాకపోతే బజరంగ్దళ్ వారు వారి పద్ధతుల్లో వారు చేయటానికి ఫిబ్రవరి 14 సిద్ధంగా ఉంది. అందుకే ప్రేమికుల రోజు వర్ధిల్లాలి.

 డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు

అసోసియేట్ ప్రొఫెసర్

9959649097

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles