Saturday, December 21, 2024

శ్రమజీవుల జీవితాలే సార్థకం

                         My Confession

                         ————————-

                                                By Leo Tolstoy

                            నా సంజాయిషీ

                             ——————–

                                               లియో టాల్స్టాయ్

   తెలుగు అనువాదం:

  డా. సి. బి. చంద్ర మోహన్

  డా. బి. సత్యవతీ దేవి

                               చాప్టర్ 10

                               ————-

నేను ఇది అర్థం చేసుకున్నాను గాని నాకు పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదు. హేతువుని నిరాకరించమని అడగని (ఎందుకంటే అది అసత్యం కాబట్టి) ఏ విశ్వాసాన్నయినా అంగీకరించడానికి నేను ఇప్పుడు సిద్ధం. నేను బౌద్ధమతం, మహమ్మదీయ మతాలను పుస్తకాల్లో చదివాను. వాటికన్నా ఎక్కువగా క్రిస్టియన్ మతాన్ని పుస్తకాలు నుండి, నా చుట్టూతా ఉన్న  మనుషుల నుండి చదివాను.

సహజంగానే నేను మొదట నా సర్కిల్లో ఉన్న సనాతన వాదుల వైపు దృష్టిసారించాను (వారంతా బాగా పాండిత్యం ఉన్నవారు): చర్చి వేదాంతులు, సన్యాసులు, కొత్తగా తయారైన వేదాంతులు, ఇవాంజెలికల్స్ (విమోచన ద్వారా మోక్షం కల్పిస్తామని ప్రకటించేవారు). నేను ఈ విశ్వాసులని పట్టుకొని వారి నమ్మకాల గురించి, వారు అర్థం చేసుకున్న జీవితం గురించి ప్రశ్నించాను.

Also read: అందరం జ్ఞానం కలిగిన అవివేకులం

నేను ఎన్ని మినహాయింపులు ఇచ్చినా, వివాదాలు తలెత్తకుండా చూసినా వారి విశ్వాసాన్ని నేను అంగీకరించలేకపోయాను. విశ్వాసం పేరుతో వారు చెప్పేది జీవితం యొక్క అర్థాన్ని వివరించకపోగా — దాన్ని ఇంకా అస్పష్టం చేసింది. వారి విశ్వాసం జీవితం యొక్క అర్ధాన్ని చెప్పదని స్పష్టపరిచారు. వారి ఉద్దేశాలు నాకు తెలియ రాలేదు.

 నేను వారిని తరచుగా కలియడం వలన నాకు కలిగిన ఆశ  తరువాత, మరలా నేను  నిరాశాజనక స్థితిలోనికి తోసి వేయబడతాననే  ఒక బాధాకరమైన భావన అనుభవించడం నాకు ఇంకా గుర్తుంది.

వారి సిద్ధాంతాలు వారు నాకు సంపూర్ణంగా వివరించిన కొద్దీ వాటిలోని తప్పులు నేను స్పష్టంగా చూడగలిగాను. వారి ‘విశ్వాసం’ జీవితానికి అర్థం వివరింపబడుతుందన్న ఆశ పెట్టుకోవడం నిష్ఫలం అని గ్రహించాను.

వారు, వారి క్రిస్టియన్ మత సూత్రాలలో (అవి నాకు నచ్చుతాయి) — అనవసరమైన హేతు విరుద్ధ మైన విషయాలు కలగలిపారని కాదు — నేను వాటికి వికర్షితుడనయ్యింది. వారు కూడా నేను గడిపినట్లే జీవితం గడుపుతున్నారు. వారి బోధనలలో వివరించబడిన నైతిక సూత్రాలకు — ఏమాత్రం అనుగుణంగా వారి జీవితాలు లేవు. వారు — నాలాగానే జీవితం జీవించడానికి తప్ప — (అందినంతవరకు దొరకపుచ్చుకోవడం) వేరే అర్థం చెప్పలేకపోయారు. వారికి నిజంగా జీవితానికి అర్థం తెలిస్తే — పోగొట్టుకుంటామనే బాధ , భయం, మరణం –వీటికి భయపడేవారు కాదు. కానీ వారు (మా సర్కిల్లో విశ్వాసులు) నాలాగానే సమృద్ధిగాను, అతిశయంతోనూ బ్రతుకుతూ వాటిని కాపాడుకుంటూ, పెంచుకుంటూ పోతున్నారు. నాలాగానే లేమి, బాధ, మరణం  — వీటికి

భయపడుతున్నారు. నాలాగానే, ఇంకా నాలాంటి అవిశ్వాసుల్లాగానే వారి కోరికలు సంతృప్తి పరచుకుంటానికి జీవిస్తున్నారు. అవిశ్వాసులు ఎంత చెడుగా బ్రతుకుతారో, వీరూ అలాగే బ్రతుకుతున్నారు.

వారి ‘ విశ్వాసం ‘ లో ఉన్న సత్యాన్ని గురించి ఏ రకమైన వాదనలు నన్ను ఒప్పించలేకపోయాయి. నాకు భయంకరంగా కనిపించే పేదరికము, రోగము, మరణములను భయపడకుండా వాటిలో జీవితానికి అర్థం చూపే పనులు — నన్ను ఒప్పించి ఉండేవి. కానీ అలాంటి పనులు నా సర్కిల్లో ఉన్న విశ్వాసుల్లో నాకు కనబడలేదు. దానికి విరుద్ధంగా నా సర్కిల్లో ఉన్న పూర్తి అవిశ్వాసులు ఆ పనులు చేయగా చూశాను. విశ్వాసులు మాత్రం ఎన్నడూ చేయలేదు.

Also read: అహేతుక జ్ఞానమే విశ్వాసం

మనుషుల్లో ఉన్న నమ్మకం, నేను వెతుకుతున్న విశ్వాసం కాదని నాకు అర్థం అయింది.

వారి విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. జీవితానికి అదొక ఎపిక్యూరియన్ ఓదార్పు.

మరణశయ్య మీద పశ్చాతాపంలో ఉన్న సాల్మనుకు ఈ విశ్వాసం ఒక ఓదార్పు కాకపోయినా, దృష్టి  మరల్చడానికైనా పనికి రావచ్చు; కానీ ఇతరులు శ్రమను ఆనందిస్తూ దోచుకోకుండా, జీవితాన్ని సృష్టించుకోవాలనుకునే అశేష ప్రజానీకానికి ఇది సరిపోదు. చదువుకోని, సామాన్య, పేదరికంలో ఉన్న మామూలు జనాలలో విశ్వాసుల గురించి తరచి చూడడం ప్రారంభించాను:

తీర్థయాత్రీకులు, సన్యాసులు, ఇంకా రైతులు మొదలైనవారు. ఈ సామాన్య ప్రజానీకం యొక్క విశ్వాసం మా గ్రూపులో ఉన్న నకిలీ విశ్వాసులు అనుసరించే మత విశ్వాసమే. వారిలో కూడా క్రిస్టియన్ మత సత్యాలతో పాటు పెద్ద మూఢనమ్మకాలు ఉండడం చూశాను; కానీ మా సర్కిల్లో ఉన్న విశ్వాసులకి, ఈ రైతులకు తేడా ఏమిటంటే — మా సర్కిల్ లో ఉన్న వారికి ఉన్న మూఢవిశ్వాసాలు, వారికి పూర్తిగా అనవసరమైనవి మరియు వారి జీవితాలకు అనుగుణంగా ఉండవు. అది కేవలం ఎపిక్యూరియన్(భోగ లాలసత్వం) వేడుక లాంటిది. అవే మూఢనమ్మకాలు రైతుల్లో చూస్తే అవి లేకుండా వారు బ్రతకలేరనిపిస్తుంది. వారి జీవితాలకు ఆ మూఢనమ్మకాలు తప్పనిసరి షరతు లాగా అనిపిస్తుంది. మా సర్కిల్ లో ఉన్న నకిలీ విశ్వాసుల పూర్తి జీవితం, వారి మత విశ్వాసాలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అదే శ్రమజీవుల్లో ఉన్న విశ్వాసాలను చూస్తే — వారి విశ్వాసానికి, జీవితార్థానికి వైరుధ్యం కనపడదు. నేను వారి జీవితం, విశ్వాసాల గురించి దగ్గరగా పరిశీలించడం మొదలుపెట్టాను. చూసినకొద్దీ నేను నమ్మింది ఏమిటంటే వారి విశ్వాసం నిజమైనది. ఇంకా వారికి అవసరం కూడా. అది ఒక్కటే వారి జీవితాలను అర్థవంతం చేస్తుంది మరియు వారి జీవనాన్ని సుసాధ్యం చేస్తుంది. దానికి విరుద్ధంగా మా సర్కిల్లో విశ్వాసం లేకుండా కూడా జీవితం సాధ్యం. వీరిలో వెయ్యి మందిలో ఒకడు మాత్రమే విశ్వాసిగా కొనసాగగలడు.  అదే సామాన్య జనాల్లో అయితే వేయికి ఒకడు కూడా అవిశ్వాసి ఉండడు. మా సర్కిల్లో జనం సోమరులుగా, వినోదంగా, అసంతృప్తితో జీవితం కొనసాగిస్తూ ఉంటారు. దానికి విరుద్ధంగా సామాన్య జనం వారి జీవితం మొత్తం శ్రమతో కొనసాగిస్తూ ఉంటారు. పైగా ఆ జీవితంతో వారు తృప్తి పడతారు. మా సర్కిల్ లో ఉన్నవారు దురదృష్టాన్ని వ్యతిరేకిస్తారు. లేమిని, బాధలను గురించి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. కానీ దానికి విరుద్ధంగా సామాన్య జనాలు మాత్రం రోగాన్ని, దుఃఖాన్ని ఏ విధమైన కలవరపాటు, వ్యతిరేకత లేకుండా గట్టి నమ్మకంతో అంతా మన మంచికే అని — స్వీకరిస్తారు.

Also read: ఎంతకీ అర్థం కాని జీవితం!

మా సర్కిల్ లో ఉన్న విశ్వాసులు తెలివైన వారమనుకుంటూ జీవితాన్ని తక్కువ అర్థం చేసుకుంటారు. బాధలు, మరణం — ఇవన్నీ చెడు మరియు వ్యంగ్యంతో కూడిన జీవితం మన మీద రుద్దపడింది అనుకుంటారు. దానికి విరుద్ధంగా సామాన్య ప్రజానీకం బ్రతుకుతారు. బాధలు పడతారు. వారు మరణాన్ని, దుఃఖాన్ని ప్రశాంతంగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో సంతోషంగా కూడా తీసుకోగలరు. మా సర్కిల్లో ఉన్న విశ్వాసుల్లో భయానకము, నిరాశ జనితము కానీ ప్రశాంత మరణము చాలా అరుదు. ప్రజానీకాలలో బాధామయమైన, దుఃఖకరమైన, పోరాటంతో కూడిన మరణం చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి మామూలు జనాలకు (మనకు, సాల్మన్ కు లాగా కాక)  పైన చెప్పిన ప్రశాంత మరణం ఒక్కటే వారి జీవితాల్లో అతి గొప్ప ఆనందకరమైనది. అటువంటివారు కోట్లాదిమంది ఉంటారు. నేను నా చుట్టూరా పరికించి  చూశాను. పూర్వము, ఇప్పుడు కూడా అటువంటి ప్రజల జీవితాలను పరిశీలించాను. జీవితం అర్థం చేసుకోవడం, బ్రతకడం, మరణం లాంటివి కొన్ని లక్షల మందిలో పరిశీలనగా చూశాను. వారంతా వారి వారి మర్యాదలు, చదువు, వారి ఆలోచన, వారి పరిస్థితులు — అన్నీ వేరుగా ఉన్నా — అందరూ ఒకే లాగా (నా అజ్ఞానానికి విరుద్ధంగా) జీవితాలని అర్థం చేసుకోవడం, శ్రమ పడటం, లేమిని, బాధలను సహించడం — చేస్తూ జీవితం వ్యర్థం అనుకోకుండా జీవించారు. తనువులు చాలించారు.

నేను వారిని ప్రేమించడం నేర్చుకున్నాను. వారి జీవితాల గురించి (బ్రతికున్న వారి, చనిపోయిన వారి) తెలుసుకొన్నకొద్దీ, వారి మీద నాకు ప్రేమ ఎక్కువైంది. నాక్కూడా జీవితం తేలికైనట్టు అనిపించింది. ఇలా రెండేళ్లు గడిపాను. ఎప్పటినుండో నాలో మొలకెత్తుతున్న ఒక మార్పు జరిగింది. మా సర్కిల్లో గడిపే జీవితం (ధనిక మరియు జ్ఞానవంతమైన) ఒక్కసారిగా నాకు రుచించడం మానివేయడమే కాక — నా దృష్టిలో అర్థం లేని జీవితం అయింది. మా అందరి వ్యవహారాలు, చర్చలు, సైన్సు, కళలు ఇవన్నీ నాకు కొత్త వెలుగులో కనపడసాగాయి. ఇదంతా స్వీయ ఆనందమని నాకు అర్థమైంది. దానిలో అర్థం వెతకడం అసాధ్యం. అదే సమయంలో  —  మొత్తం శ్రమజీవుల జీవితాలు (జీవితాన్ని సృష్టించే మానవాళి అంతా) ప్రాముఖ్యంగా కనపడ్డాయి. అదే సిసలైన జీవితమని నాకర్థమైంది. ఆ జీవితానికి ఇచ్చిన అర్థం నిజమైనది. దాన్ని నేను అంగీకరించాను.

Also read: శాక్యముని అడిగిన మౌలిక ప్రశ్నలు

                ————-    ————-

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles