Tuesday, January 21, 2025

దశరధ కుమారుడిగా అవతరిస్తానని దేవతలకు హామీ ఇచ్చిన విష్ణు

రామాయణమ్…3

మహర్షీ ! నారదుని వలన నీకు ఏవిధముగా రామ కధ చెప్పబడెనో ఆ విధముగనే  రామ కధను నీవు చెప్పుము.

రాముడుధర్మాత్ముడు, లోకములో ఏవైతే శ్రేష్ఠమైన గుణములు అని మనము చెప్పుకొంటామో అవి అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి!

రాముని గూర్చిన అన్నివిషయములు నీకు తేటతెల్లము కాగలవు!

కురు రామకధాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్”

మనస్సును రమింపచేసేది,పుణ్యప్రదము అయిన రామకధను అక్షర బద్ధము చేయుము. నీవు వ్రాసిన ప్రతి విషయము అక్షరసత్యము కాగలదు!.

యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే

తావద్రామయణకధా లోకేషు ప్రచరిష్యతి!

….ఎప్పటి వరకైతే భూమిమీద పర్వతములు నిలచి ఉంటాయో!

ఎప్పటివరకైతే భూమి మీద నదులు పారుతూ ఉంటాయో

అప్పటివరకు పుడమి మీద రామకధ ప్రాచుర్యంలో ఉంటుంది!

అప్పటివరకు నీవుపుణ్యలోకాలలో స్వేచ్ఛగా సంచరించగలవు!

అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనారు.

Also read: రామకథ రచించమని వాల్మీకికి విరించి ఉద్బోధ

బ్రహ్మదేవుని వరమువలన మహర్షి మనోఫలకం మీద ( మనసు తెర మీద) రామచరిత మొత్తం కనపడజొచ్చింది!

రామకధను అక్షరబద్ధము గావించటానికి మహర్షి సంకల్పించుకొన్నారు!

పూర్వము ఇక్ష్వాకులు అని ఒక రాజవంశముండేది! వారు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొని  కోసలదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు.

(అయోధ్య అనగా శత్రువు యుద్ధముచేయటానికి సాధ్యము కానిది అని అర్ధము)

విశాలమైన రాజమార్గాలతో శోభాయమానంగా ఉండే పట్టణం అయోధ్య!

ఉన్నతమైన కోట బురుజులు, వందలకొద్దీ శతఘ్నులు మొహరించి ఉండేవి! రాజ్య రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉండేది. ప్రజలంతా ధనధాన్యసమృద్ధితో, సుఖసంతోషాలతో, ఆనందంగా ఏ లోటులేకుండా జీవనం సాగించేవారు.

దేవేంద్రుడిలాగా దశరధుడి పాలన

ఆ సమయంలో దశరధుడు దేవేంద్రుడిలాగా రాజ్యపాలన చేస్తున్నాడు. ప్రజలను కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవారాయన! దశరధమహారాజు వద్ద ఎనమండుగురు మంత్రులుండేవారు! వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు! ఎదుటివ్యక్తి ముఖకవళికలను బట్టి వారి మనస్సులోని ఉద్దేశ్యము గ్రహించేవారు!

రాజుకు మేలు కలిగించేవి, హితకరంగా ఉండేవి, ఆయనకు ప్రియమైన పనులు చేయటంలో వారు కడు సమర్ధులు.

వారు వరుసగా, ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్దుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు.

వసిష్ఠ, వామదేవులు ప్రధాన ఋత్విక్కులు.

మంత్రులందరూ అత్యంత నిబద్ధతో మెలిగేవారు. పటిష్ఠమైన గూఢచార వ్యవస్థ కలిగి, రాజ్యము నలుమూలలా ఏమి జరిగినా క్షణాలలో తెలిసేటట్లుగా ఏర్పాటు గావించుకొన్నారు. ఆ మంత్రులు, స్వయముగా తమ పుత్రులు తప్పు చేసినా వారిని దండించడంలో వెనుకాడేవారుకాదు!  వ్యక్తులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేస్తూ ఉండేవారు!

బలవంతుడయిన వ్యక్తి, బలహీనుడయిన వ్యక్తి ఒకే తప్పు చేసినట్లయితే బలవంతుడికి శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండేది! (సరిగ్గా నేటి వ్యవహారానికి పూర్తి వ్యతిరేకము). రాజ్యము, రాజ్యాంగము అంటే భయభక్తులతో మెలిగేవారు! రాజ్యమందు ఎక్కడా కూడా ప్రజలలో అసంతృప్తి లేకుండా అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కలిగి మహేంద్రవైభవంతో పరిపాలన సాగిస్తున్నాడు దశరధమహారాజు!.

……

మరొకవైపు ….

బ్రహ్మ, విష్ణువులను వేడికొన్న దేవతలు

దేవతల బాధలు చెప్పనలవిగాకుండా ఉన్నవి , రావణాసురుడు వరగర్వితుడై ముల్లోకాలను పట్టి పీడిస్తున్నాడు ! వాడి పీడ వదిలించుకొనే మార్గం తెలియక  యమయాతన పడుతున్నారు దేవతలు.  చివరకు వారందరూ కలసి నిర్ణయించుకొని వాడికి వరములిచ్చిన విధాతనే ప్రార్ధింప నిశ్చయించుకొన్నారు. అనుకొన్నదే తడవు ఆయన వద్దకు వెళ్ళారు. అంజలి ఘటించి నిలుచుని తాము వచ్చిన పని ఆయనకు ఎరుక పరచినారు!

దేవా! రావణాసురుడు బలదర్పితుడై ,వర గర్వముతో నీచే ఏర్పరుపబడిన మా మా విధులు కూడా నిర్వర్తించనీయకుండా మమ్ములను భయభ్రాంతులకు గురిచేయుచున్నాడు !

సూర్యుడు అతనికి వేడికలిగించలేడు! వాయువు అతని ప్రక్కన మసలటానికే భయపడుతున్నాడు! ఉత్తుంగ తరంగాలతో తీవ్రమైనఘోషతో నిత్యం సందడిగా ఉండే సముద్రుడు తన తరంగాలను స్తంభింపచేసుకొని కూర్చున్నాడు!

వారి మొరాలకించిన బ్రహ్మదేవుడు  విష్ణుమూర్తిని ప్రార్దించమని వారికి సలహా ఇవ్వగా ,అందరూ ఆ దేవాధిదేవుని శరణుజొచ్చి దీనముగా ప్రార్దించారు.

అంత ఆ విష్ణువు తాను మానవ రూపంలో జన్మించి వాడి పీడనుండి మిమ్ములను కాపాడతానని అభయమిచ్చాడు. తాను దశరధమహారాజుకు పుత్రుడుగా జన్మిస్తానని చెప్పి వారిని ఊరడించి పంపివేశాడు.

దశరధుడి అశ్వమేధం, అనంతరం పుత్రేష్ఠి

అదే సమయములో దశరధమహారాజు సంతానార్ధియై అశ్వమేధము పూర్తిచేసి పుత్రేష్ఠి చేస్తున్నాడు. అప్పుడు యజ్ఞకుండమునుండి ఒక తేజోమయమైన భూతము ఆవిర్భవించింది. ఆ భూతము చేతిలో ఒక స్వర్ణపాత్ర ! అందులో పాయసమునిండి వున్నది! ఆ భూతము ఆ పాయసపాత్రను దశరధుడికి అందచేసింది. భార్యలచేత ఆ పాయసాన్ని సేవింప చేశాడు దశరధుడు! మొదట సగము కౌసల్యకు , ఆ సగములో సగము అనగా మొత్తములో నాల్గవ వంతు సుమిత్రకు ,ఆ నాల్గవ వంతులో సగము అనగా మొత్తములో ఎనిమిదవవంతు కైకకు ఇచ్చి ,ఇక మిగిలిన ఎనిమిదవ వంతును రెండవసారి సుమిత్రకు ఇచ్చినాడు.

N.B

రావణుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అని అర్ధం, దేవతలు అనగా ప్రకృతి శక్తులు!  నిత్యమూ వ్యాపించే గుణమున్న ఒకానొక శక్తి వాటి సమతుల్యాన్ని కాపాడుతుంది! అది విష్ణుస్వరూపము! ఎప్పుడెప్పుడు ప్రకృతి తన సమతుల్యాన్ని(Balance) కోల్పోతుందో అప్పుడప్పుడు సర్వవ్యాపకమైన మహాశక్తి తనను తాను సృజించుకొని ప్రకృతిని కాపాడుతుంది. ఇది ధర్మము!

నేటి నాగరకత రావణుడి మనోధర్మమే! ఇది ప్రకృతి మొత్తాన్ని చీడపురుగులాగ నాశనం చేస్తున్నది. ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటానికి  భగవానుడు ఎప్పటికప్పుడు అవతారాలు ఎత్తుతుంటాడు. ఆ సమయానికి ఏ రూపమయితే ప్రకృతిని పునరుద్ధరిస్తుందో ఆ రూపంలో తాను వ్యక్తమవుతాడు పరమాత్మ!  పరమాత్మ అవతారము మానవరూపంలోనే ఉండవలసిన అవసరం లేదు ఏ రూపమయినా కావచ్చును.

….అందుకే భారతీయుల పురాణాలలో అన్ని అవతారాలు. ఒకసారి మత్స్యముగా ఒకసారి వరాహముగా ….ఇలా!!

Also read: రామాయణం -1

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles