వారణ మాయిరమ్-2
ఆండాళ్ తిరువడిఘళే శ్శరణం ఆండాళ్ దివ్యపాదాలకు ప్రణామాలు
ఆళ్వార్ తిరువడిఘళే శ్శరణం, ఆళ్వార్ దివ్యపాదాలకు ప్రణామాలు
రెండో పాశురం: నిశ్చితార్థం
నాళై వదువై మణమెన్ఱు నాళ్ ఇట్టు
పాళై కముగు పరిశుడై ప్పన్దల్ కీళ్
కోళరి మాదవన్ కోవిన్దన్ ఎన్బానోర్
కాళై పుకుత క్కన్నా క్కణ్డేన్ తోళీ నాన్
ప్రతిపదార్థము
తోళీ ఓ చెలీ, నాళై = రేపే, వదువై మణమెన్ఱు = కన్యకకు వివాహమని, నాళిట్టు = శుభ కల్యాణ ముహూర్తమును నిశ్చయించి, పాళైక ముగుడై పరిశు = పండ్లగుత్తులతో కూడిన పోకచెట్లతో అలకరించిన, పందఱ్కీళ్ = పందిరిలో, కోళ్ = బలపరాక్రమ సంపన్నమైన, అరి = సింహమువంటి, మాదవన్ = లక్ష్మీవల్లభుడైన రసికావతంసుడు, కోవిన్దన్ ఎమ్బెరు ఓర్ కాళై=గోవిందుడను యువకుడు, పుగుద = ప్రవేశించినట్లు, నాన్ కనాక్కణ్డేన్ = నేను కలగన్నానే.
ఓ సఖీ చూసావా, రేపే కన్యకకు వివాహ ముహూర్తమని, పోక చెట్లతో మనోహరంగా అలంకరించిన పెళ్లిపందిరికింద, పరిణిత యౌవ్వనుడైన బలపరాక్రమ సంపన్నుడు, పురుష సింహుడు మాధవుడు ప్రవేశించినట్టు కల గన్నానే.
వధూమని, నవయవ్వన సుందరి గోదాదేవి. వరుడు యువకిశోరం, రసికావంతసుడు, మాధవుడు, నరసింహుడు, పురుషోత్తముడు అయిన లక్ష్మీవల్లభుడు. పోకచెట్లతో అందంగా అలంకరించిన పందిరి. ఆ పోకచెట్లకు పోక పండ్లగుత్తులు రాలకుండా ఉన్నాయి. ఆ పందిరి రమణీయంగా ఉంది. విప్రోత్తముల మధ్య కన్యకకు శ్రీరంగనాథుడికి వివాహ ముహూర్తము నిశ్చయించినట్ల నాకు కల వచ్చిందే చెలీ అని వివరిస్తున్నారు గోదాదేవి.
తెలుగు కవిత
కన్యక నేనుకాగ, కమనీయరమణీయ కల్యాణమూర్తి
అన్యులు గెలవలేని హరి నరసింహుడు వరుడు రేపు
వన్యఫలయుత పోకశాఖాలంకృత పందిరి ఛాయలన్
ధన్య చేగొను ఘడియజెప్పుదురని, నే కలగంటినే చెలీ.
శ్రీమాన్ పప్పల కృష్ణమూర్తిగారి తెలుగు పద్యం.
సీ. కమలనాభునికిచ్చి కన్యకామణి పెండ్లి
మరుసటి దినమున మధురఘడియ
శుభమంచు లెక్కించి సుముహూర్తకాలము
నిశ్చయించె బుధులు నిబ్బరమున
పండ్లగుత్తులు పోక పాదపములు దెచ్చి
పనుపరుల్ గట్టిరి పందిరంత
పందిరికాందను బలమైన సింగంబు
పగిదిని నరహరి పాదముంచె
తే.గీ. చేరియున్నట్టి వారెల్ల చేష్టదక్కి
వచ్చెగోవిందుడాశ్రిత వరదుడంచు
పలికె మాధవువీక్షించి పరవశించి
చెలియ నేనొక్కకలగంటి చిత్రమాయె
వివాహ మహోత్సవంలో మరో ప్రక్రియ గురించి రెండో పాశురం ప్రస్తావిస్తున్నది.
Also read: గోదాదేవి రచించిన వారణమాయిరమ్ – వేయేనుగుల కల