ముకుళితమై నిశాకరుని ముగ్ధ దరస్మిత రేఖ మాసెనే!
బకములు దేవకన్యలటు వ్రాలు సరస్సున లేత ప్రొద్దునన్
వికసితమయ్యు మంచుతెర వీడదు పంకజబాల; దాని మే
నొక కిరణమ్ము సోకి అరుణోదయమైనది లోకబాంధవా!
సకల వనాంత వృక్షము లచంచల యోగినులై, తుషార మౌ
క్తిక శరదిందుకాంతి పులకించె నయా! రజనీ సుగంధ వే
దిక, జననీ లతాంకమున, తెల్లని మంచు ద్రవించు పుష్పబా
లిక చిరుచెంపలన్ తడిమి, లేతసమీరము ప్రీతి గూర్చినన్!
అనిల దినాంత వీచికల, ధ్యాన కవాటము మేలుగాంచు ని
ర్జన వనధాత్రిపై తరులు వ్రాల్చిన కొమ్మలు రెమ్మలేరి, మూ
పున గొనిపోవు దీనులకు మోమును చాటొనరింతువో ప్రభూ!
తొనకుచు, తొట్రుబాటగుచు, తోయజ బాంధవు డస్తమింపగన్!
నివర్తి మోహన్ కుమార్
Also read: మానవత్వాన్ని అన్వేషిస్తున్న మానవుడు మరణించిన రోజు!