వోలేటి దివాకర్
ఈనాడు అధిపతి, మార్గదర్శి సంస్థల చైర్మన్ సిహెచ్
రామోజీరావుకు ఆయురారోగ్యాలు కలగాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రార్థించారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సిఐడి విచారణ సందర్భంగా బెడ్ పై ఉన్న రామోజీరావు పరిస్థితి చూసి చలించిపోయానని, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని దేవుడ్ని ప్రార్థించినట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రామోజీరావుపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని పునరుద్ఘాటించారు. చిట్ ఫండ్ సంస్థలకు మార్గదర్శి లాంటి వ్యక్తి చట్టవిరుద్ధమైన పనులు చేస్తే ఇతర సంస్థలు కూడా ఆయన బాట పట్టే అవకాశం ఉందన్నదే తన ఆందోళన అని అన్నారు. మార్గదర్శి లాంటి సంస్థలను ఉపేక్షిస్తే జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ లాంటి సంస్థలు పుట్టుకొస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి సహా ఇతర చిట్ ఫండ్ సంస్థలను సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా చిట్ ఫండ్ నిధులను ఇతర వ్యాపారాలకు మళ్లిస్తున్న రామోజీరావు తప్పును గుర్తించి కనీసం ఒక్క రూపాయి జరిమానా విధించినా ఇతర సంస్థలు తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాయన్నదే తన ధ్యేయమన్నారు. మార్గదర్శి సంస్థల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే రామోజీరావు చట్టవిరుద్ధ పనులు తెలిసిపోతాయని, ఇందుకు విచారణ కూడా అవ సరం లేదని ఉండవల్లి చెప్పారు.
Also read: రామోజీరావుది తప్పే…. తేల్చేసిన చాట్ జిపిటీ
మార్గదర్శి వ్యవహారంలో సంస్థల చార్టెడ్ అక్కౌంటెంట్ సంస్థల్లో సోదాలు జరిపితే చార్టెడ్ అక్కౌంటెంట్లు తనను విమర్శించడంపై ఉండవల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో విద్యావంతులైన చార్టెడ్ అక్కౌంటెంట్లు వ్యక్తిగత విమర్శలకు దిగడం శోచనీయమన్నారు. మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు కూడా లేదన్న వాదనలపై ఆయన స్పందిస్తూ 60 ఏళ్లుగా మద్యం సేవించి కారు నడుపుతున్న వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయడం తప్పన్నట్లుగా ఉందన్నారు. తాగి నడపడం కేసు కాదని చట్టసవరణ చేస్తారా అని, అలాగే పత్రికలు, మీడియా నడిపే వారికి ఆర్థిక నేరాల కింద చట్టాలు వర్తించవని చట్టాలను సవరిస్తే రామోజీరావుపై ఎలాంటి కేసులు ఉండవన్నారు. అగ్రిగోల్డ్ పై తాను స్పందించలేదన్న విమర్శలను ప్రస్తావిస్తూ అగ్రిగోల్డ్ కేసులో తాను చేసేందుకు ఏమీ లేదని, అప్పటికే నిర్వాహకులను అరెస్టు చేశారన్నారు. అలాగే తాను తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లిస్తానన్నా విజయ్ మాల్యాను ఆయనపై నిధుల మళ్లింపు కేసులు ఎత్తివేయలేదని గుర్తు చేశారు.
Also read: ఉండవల్లి డిమాండ్ చేస్తారు… జగన్ నెరవేరుస్తారు!
రామోజీవు గోవిందుడి కన్నా గొప్పవారా?
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద కలియుగ దైవం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామికి కేంద్ర ప్రభుత్వం రూ. 10 కోట్ల జరిమానా విధించి, రూ. 3కోట్లు వసూలు చేసిందని ఉండవల్లి చెప్పారు. రామోజీరావు చట్టానికి అతీతుడా… శ్రీ వెంకటేశ్వరస్వామి కన్నా గొప్పవార? అని ఉండవల్లి ప్రశ్నించారు. మార్గదర్శి సంస్థల్లో చట్టవిరుద్ధ వ్యవహారాలు జరుగుతున్నాయని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, అప్పటి ఆర్బిఐ గవర్నర్ ప్రకటించారని ఉండవల్లి గుర్తు చేశారు. సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు ఇదే తరహా వ్యవహారాల వల్ల జైలు పాలయ్యారని గుర్తుచేశారు. తాను మార్గదర్శి వ్యవహారాన్ని బహిర్గతం చేసినప్పుడు బుక్ వాల్యూ ప్రకారం మార్గదర్శి సంస్థల ఆస్తులు రూ. 2300 కోట్లు ఉన్నాయని, ఆస్తులు జుప్తు చేస్తే వీటి విలువ మరింత తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో అలాగే జరిగిందని ఉండవల్లి చెప్పారు. అయితే రూ. తమకు 15వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని మార్గదర్శి సంస్థ చెబుతోందన్నారు.
Also read: రామోజీరావుకు భారతరత్న అయినా ఇవ్వండి లేదా … మార్గదర్శిలో తేడాలు తేల్చండి!