బరువైన కనురెప్పలను బలవంతంగా తెరిచాను.
ఒక చిక్కని వెలుగు బంతి … కళ్ళు చెదిరాయి!
తెలియని దారుల్లో ఇక నా ప్రయాణం మొదలు…
ఎంత దూరమో, ఎంత కాలమో?
ఎక్కడ నేను మొదటి అడుగు వేస్తానో,
ఎక్కడి వరకు వెళతానో …
పూర్వ ప్రయాణాలు ఎన్నో?
ఏ దగ్థ దిగంత ద్వారాల కావలి నుండి వచ్చానో
ఏ అదృశ్య చేతనా ఝరి లో కొట్టుకొని వచ్చానో…
ఎక్కడికో, ఎందుకో?
ఏమో… నా గత జ్ఞాపకాలు
ఆఖరి మజిలీ లోనే గతించాయి.
రహస్యాలన్నీ మరచిపోతానని ఒట్టు పెట్టానో,
విస్మృతి పత్రం లో సంతకం పెట్టానో…
సరేనని తలఊపి కదిలానో… ఏమో
మంద మతికి గుర్తేమి ఉంటుంది?
ఆలోచనలు పక్కన పెట్టి ముందు కు చూసాను…
రెండు జతల కళ్ళు…
నిర్లిప్తంగా, నిశ్చలంగా, నిశితంగా నా వైపే చూస్తూ…
ముఖం పై తెల్లని ముసుగులు…
చేతులలో తీగలు కట్టిన నెత్తురు ఓడుతున్న
మిల మిల లాడే కత్తులు…
గుండెగుభిల్లు మంది.
ఇంతలో నా బలహీన మైన వీపుపై
ఓ మెత్తటి చరుపు… తరువాత ఇంకోటి
మరిన్ని వేగం గా…
ఫట, ఫట, ఫట… తప, తప, తప
“ఓహ్ ఆపండి!” గట్టిగా అరిచాననుకున్నా…
అయినా శబ్దం రాలేదు…
ఏమైంది నా గొంతుకు…
నా వీపుపై దెబ్బలు పడుతూనే ఉన్నాయి…
మెత్తటి శబ్దాలు, వేగంగా, మరింత వేగంగా…
ఈసారి నా పొట్టపై కూడా…
నా బలహీనతకు, నిస్సహాయతకు
దుఃఖం పొంగి వచ్చింది…
గట్టిగా కేకలు వేయాలనిపించింది…
ప్రయత్నించాను… మరల ప్రయత్నించాను…
ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేటట్లు
కెవ్వుమని అరిచాను…
వాళ్ళు వేగం తగ్గించారు…
మెల్లగా, ముని వేళ్ళ తో తాళం వేస్తున్నట్లు…
ఎదో ముసలి గుర్రం నా వెనుక వీథిలో
మెత్తగా అడుగులు వేస్తున్నట్లు…
గాలికి నేరేడు పండ్లు రాలి పడుతున్నట్లు…
లేత పచ్చికను తట్టి లేపుతున్న వర్షపు జల్లులా,
లయబద్ధంగా, కొంచం మృదువుగా,
కొంచం కఠినంగా…
ఈ సారి మరింత గట్టిగ,
నా నాభి నుండి పెకలించిన
ఒక పెను రావం చేసాను…
నన్ను కొట్టడం ఆగిపోయింది.
నిశ్శబ్దం…
నన్ను చుట్టు ముట్టిన వారూ
ముక్త కంఠం తో ఒక్కసారి గా అరిచారు.
“బిడ్డ ఏడ్చింది, బిడ్డ ఏడ్చింది!”
Also read: అట, అకటా
Also read: మందల
Also read: లోహ(క)పు బిందె
Also read: ఇల్లు
Also read: జ్ఞాపకాలు