Thursday, November 7, 2024

లోకాంబ …ఓ పల్లె కొయిలై నిలిచింది!

ముంగిట్లో  నులక మంచం  మూలిగి వాలి వున్నది. పక్కన గుంజకు తన తల వాల్చి నేలపై పడి ఉన్నది  లోకాంబ. నాడు తనకు ఏమీ తెలియని చిన్నవయసులోనే తనను  కన్నవాళ్ళు పుస్తె కట్టించి వదిలించేసుకున్నారు. కట్టుకున్నోడు అర్థాంతరంగా కాటి కెళ్ళిపోయాడు. నా అనుకుని నమ్ముకున్న మెట్టినింటి వాళ్ళు గతించి పోయారు.  సర్వస్వం అనుకుని తాను కని పెంచిన   కన్నపిల్లలు రెక్కలొచ్చి ఎగిరివెళ్లిపోయారు. నా అనుకున్నవారు ఎవ్వరూ లేని  తన ఒంటరి ప్రయాణాన్ని తలచి  గుండె బరువెక్కినింగికెగసి  ఆగిపోయింది అని అనుకుంది లోకాంబ. లోకాంబ  ఊపిరి  ఆగినా….కన్నీళ్లు ఆమె కండ్ల నుండి ఉబికి ఏరులై పారాయి.

Also read: నిజమైన ప్రేమ …

ఆఖరు కు ఉన్నఅర ఎకరం  పొలం లాగేసుకుంది సర్కారు భూస్వాముల పేరు చెప్పి. పరమేశం పంతులు తాను పోగొట్టుకున్న పొలం రాబట్టుకోవడానికి  వకీలుచుట్టూ చెప్పులు అరిగేలా..తిరుగుతున్నాడు . ఇంటికి వచ్చిలోపలకి వెళ్లకుండా ఇంటి గుమ్మం ముందు అరుగుపై కూర్చున్నాడు పరమేశం పంతులు. కోర్టు తీర్పు ఎలా వస్తుందో అన్న వ్యధతో లోలోపలే నలిగి  పోతున్నాడు. ఇంట్లో కి వెళితే తన  పిల్లల ఆకలి తీర్చమని  తన భార్యపెట్టె   ఆర్తనాదాలు తన మెదడును తొలచి వేస్తున్నాయి. తన పక్కన అయిన అలికిడికి తిరిగి చూసాడు పరమేశం పంతులు . రాగి చెంబుతో నీళ్లు పట్టుకుని శాంతమ్మ కనిపించింది .

 మా తమ్ముడు  వెంకటాచలం  వస్తున్నాడు సాయంత్రానికి మన లోకి తల్లి కోసం  పెండ్లి సంబంధం తీసుకుని అన్న కబురుని తన భర్త చెవిన పడేసింది శాంతమ్మ. తన భార్య చేతి లోని  చెంబు అందుకుని అరటి పాదు వద్ద కాళ్ళు కడిగి లోపలకి నడిచాడు పరమేశం పంతులు  .

లోకాంబ  భారాకాష్ట తన తోటి స్నేహితురాళ్లు తో ఆడుకుంటూ ఉన్నది. లోకి చెల్లి సరోజినీ వచ్చి”అక్కా నీకు పెళ్లి” అనిచెప్పింది. ఆడుతున్న అట మథ్యలో ఆపేసి లోకాంబ ఇంట్లోకి పరుగులు తీస్తూ వెళ్ళింది లోకాంబ. ఇంట్లో ఎక్కడా తన తల్లి కనిపించలేదు లోకాంబకి. పెరటిలో ఉన్న బావి దగ్గర నీళ్లు చేదుతూ కనిపించింది. “అమ్మా, చెల్లి చెప్పింది నిజమేనా?” అని అడిగింది లోకాంబ. నీళ్లు చేది గుండిగలో పోసి… పక్కనే ఉన్న బండరాయిపై కూర్చున్నది  శాంతమ్మ. తన తల్లి వడిలో తలను ఉంచి  నేలపై కూర్చున్నది లోకాంబ. తన కూతురు తల నిమురుతూ …”చూడు తల్లీ… ఏనాటికైనా ఒక ఇంటికి వెళ్ళల్సిందే కదా. మనది అడ బతుకు.. ఈ నాడు  కాకుంటే మరో నాడైనా పంపాల్సిందేగా ..  నిన్ను . లోకాలని ఏ లే ఆ తల్లి పేరు పెట్టా నీకు మెట్టినింటయినా సుఖపడాలి నీవు.  నా బంగారు తల్లివి నువ్వు ” అని అన్నది  లోకాంబతో. శాంతమ్మ కంట కారే కన్నీరు లోకాంబ చెంపను తడిపింది. కన్నీళ్లను తుడుస్తూ “ఎందుకమ్మా ఏడుస్తావు?” అన్నది  లోకాంబ.

Also read: బాయ్ కాట్ …?!

‘రాఘవయ్య మాస్టారు వచ్చారమ్మా’ అని సరోజిని వంటగదిలో ఉన్న తల్లి తో చెప్పింది.  శకుంతలమ్మ హడావిడిగా వంటగది నుండి బయటకు వచ్చి రాఘవయ్యను కూర్చోమని కుర్చీ చూపించింది .  ‘‘ఈ వేళ బళ్లోకి ఎందుకు రాలేదు లోకాంబ?” అని రాఘవయ్య శాంతమ్మను అడిగాడు . శాంతమ్మ నేలచూపులు చూస్తూ  తాను అలికిన  నేలపై మౌనాక్షరాలు తన బొటన వేలితో దిద్దింది. “ఆరోతరగతి ఫైనల్ పరీక్ష రేపు. బడికి పంపండి. బాగా చదివే పిల్లని ఇలా వచ్చాను’’ అని చెప్పి అక్కడనుండి  వెళ్ళిపోయాడు  రాఘవయ్య. తన తల్లి వెనకనే నిలబడి  అంతా విన్నది  లోకాంబ. ఇంట్లోకి వస్తున్నతల్లి తో “అమ్మ రేపు బళ్ళో కెళ్ళిపరీక్ష రాస్తాను” అని చెప్పింది  లోకాంబ. “రాసి ఏమి చేయాలి కనుక!” అని అన్నది శాంతమ్మ లోకాంబతో. పొద్దుటే లేచి బడికి తయారై తన పుస్తకాల సంచి భుజాన మోసుకుని బడికి పరుగు తీసి వెల్లింది  లోకాంబ. “వచ్చావా లోకాంబా. శుభం ఇదుగో ప్రశ్నల  పత్రం  అని లోకాంబకు అందించాడు రాఘవయ్య పంతులు.  లోకాంబ పరీక్ష బాగా రాసిన అనందంతో తన ఇంటికి పరుగు పరుగున వెళ్ళింది  

  తన బావమరిదితో వచ్చిన కుర్రాడు బాగున్నాడు అని చెబుతూనే .. కాస్త మాట తడబడినా..అని తన మనసులో మాటను తెలియజేశాడు పరమేశం . “కుర్రాడు మంచివాడు. మన పిల్ల సుఖ పడుతుంది. కూర్చుని తిన్నా .. తరగని పొలం  పుట్రా..మాగాణి” ఉన్నాయి అని  చలం నచ్చ చెప్పాడు బావతో. పరమేశం తన భార్య  వంక చూశాడు . “దూరపు సంబంధం “అన్నట్లు చూసింది శాంతమ్మ. “ఆంత దూరం అని జంకొద్దు. మన పిల్ల సుఖపడాలి అనుకొండి. నాదీ పూచీ” అని నచ్చజెప్పాడు  చలం.  పరమేశం సరే అన్నట్లు తల ఆడించాడు తన భార్యకేసి చూస్తూ. “నిశ్చింతగా ఉండండి.  కాణీ ఖర్చులేకుండా.. ఆ మూడు ముండ్లు వేయిస్తా.. మన కోర్టు ఖర్చులు మిగులు పై చిలుకు మూడు వందలు దాకా ముట్టచెప్పిస్తాను మీకు” అని చెప్పి వెళ్ళిపోయాడు  వెంకటాచలం.   

కోయంబత్తూరులో పెండ్లికి సిద్ధం చేశాడు వెంకటాచలం. మాయవరం నుండి  ఎడ్ల బండిపై ఆడ పెండ్లి వారు బయలు దేరి వెళ్లారు. పెండ్లి తంతు ముగిసింది. లోకాంబను పెండ్లి కొడుకు నరసింహయ్య చేతిలో  పెట్టి అప్పగింతలు చేసేశారు రామేశం, శాంతమ్మ దంపతులు. లోకాంబ తన “పరీక్ష ఫలితాల”ను ఎట్లా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు? అని ఆలోచించింది. ఇదే విషయాన్ని తనను విడచి వెళ్ళిపోతున్న తల్లిని అడిగింది.

Also read: అభ్యుదయ సీత

నరసింహయ్య అక్క సుబ్బమ్మ లోకాంబను హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెల్లింది.”నీ మలయాళం గోడు నా చెవికెక్కదు,” అని చెప్పింది సుబ్బమ్మ లోకాంబ కేసి ఎగాదిగా చూస్తూ. “మా తమ్ముడిని బాగా చూసుకో” అని చెప్పింది  సుబ్బమ్మ లోకాంబతో. సుబ్బమ్మ మాటలు విన్నసుబ్బమ్మ మొగుడు  నారాయణయ్య “అది చిన్న పిల్ల!” అని నవ్వాడు. పిల్లలు లేని మన ఆర్తి తీర్చడానికి మన ఇంటికి  వచ్చింది ఈ లోకాంబ అని అన్నాడు నారాయణయ్య. “మేముండేది ఈ పక్క పల్లెనే. నాతో వస్తే రోజు పని పాటనేర్పిస్తా”  అని చెప్పింది సుబ్బమ్మ లోకాంబతో.  

సుబ్బమ్మ కేకలు వేసినా  ఆమెలో తన తల్లిని చూసుకుంది లోకాంబ. రోజులు గడిచే కొద్దీ ఆమె వెనకే అడుగేసి చేలోకెళ్ళి పనులు చేసేది లోకాంబ. మాగాణిలో కూలోళ్లతో కలిసి కలుపు తీసేది.  పొద్దుటే లేచి నారాయణయ్య చేసే రాగాలాపనలో తన గొంతు సవరించి సరిగమలు చెప్పింది లోకాంబ.  సంతానం  లేని నారాయణయ్య  లోకాంబను తండ్రి వాత్సల్యంతో చూసేవాడు. ఆగని కాలంతో… లోకాంబ వయసు తో పాటు  స్వర పటిమ కూడా పరిణతిని పొందింది.  లోకాంబ ఆ పల్లె కోయిలై నిలిచింది .

 ఓ సందె పొద్దు లోకాంబ గానానికి నరసింహయ్య పులకించి పోయాడు. “నీవేనా …నీదేనా ఈ మధుర గానం?  ఎక్కడ దాచావు ఇన్నాళ్లు” అని అడిగాడు  నరసింహయ్య లోకాంబని.  ఇన్నాళ్లకు నారాగం  మీ అనురాగ ప్రాప్తికి  నోచుకున్నది”  అని తన మనసులో మాటను తెలిపింది  లోకాంబ భర్తకు. నరసింహయ్య అనురాగానికి  లోకాంబ ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చింది. 

ఒక నాడు నరసింహయ్య తనప్రాణ  స్నేహితుడు  మెట్టు సింహయ్యకు  ఆరోగ్యం బాగాలేదని తెలిసి చూడటానికి అతని ఇంటికి వెళ్ళాడు . కాలం  విషమై చిమ్మి నరసింహయ్యకు  క్షయ రోగం  అంటుకున్నది.  గ్రామంలో సరైన వైద్య సదుపాయం లేక నర్సింహయ్య తన పిల్లలనూ,  లోకాంబ బాధ్యతనూ తన అక్క చేతిలో పెట్టి ప్రాణాలు వదిలేశాడు.  ఊరి చివర బావి దగ్గర “లోకాంబకు గుండు కొట్టించాలని” లోకాంబను  తీసుకు వెళ్ళింది  సుబ్బమ్మ.  “లోకాంబ మనం పెంచిన మన పిల్ల అది” అని నారాయణయ్య సుబ్బమ్మను మందలించాడు. సుబ్బమ్మ “ససేమిరా చేయవలసిందే శాస్త్రం చెప్పినట్టు” అని పంతం పట్టింది. ‘‘కట్టు బాట్ల పేరుతో గుండు గీయిస్తే నేను ఉరి వేసుకుంటాను’’ అని నారాయణయ్య సుబ్బమ్మను బెదిరించి లోకాంబకు గుండు గీయించడాన్ని ఆపేశాడు.

భర్తను కోల్పోయిన దుఃఖంతో …తన వదినను తనకు అండగా తమతోనే వచ్చి ఉండమని లోకాంబ అడిగింది  . అప్పటి వరకు అప్పుడప్పుడు  పుట్టింటింటికి వస్తూ పోతూ ఉండే  సుబ్బమ్మ తన భర్తతో కలసి తన కాపురాన్ని లోకమ్మ ఉండే తన పుట్టింటికి మార్చేసింది . “తనకు సంతానం లేకపోవడంతో  తమ్ముడు పిల్లనే  తన పిల్లలుగా  చూసుకుని మురిసిపోయింది సుబ్బమ్మ.  

 లోకాంబకు భోజనం వడ్డిస్తూ అన్నం ఇతర  పదార్థాలను పైనుంచి  విసిరి వడ్డన చేసేది. వడ్డించిన అన్నం విస్తరిలో పడక నేలపై పడేది ఒక్కోసారి. లోకాంబ నేలపై పడిన అన్నానికి అంటిన మట్టిని  ఊదుకుని తినేది. ప్రతి  రోజు లోకాంబ తెల్లవారుజామునే  లేచి చేలోకి వెళ్ళేది పనికి.  ఒక నాడు చలి బాగా ఉండటం వల్ల స్నానానికి వేడి నీళ్లు పోసుకుందామని పెరటి లో పొయి రాజేసుకున్నది. “విధవలకు వేడి నీళ్లు ఎందుకు?’’ అని రంకెలు వేసింది సుబ్బమ్మ. లోకాంబ మారు మాట్లాడకుండా చన్నీళ్లతోనే స్నానం చేసి పోసాగింది నాటి నుంచి. లోకాంబ కష్టాలు చూసిన నారాయణయ్య మనో వేదనతో మంచం పట్టి ఆనతి కాలం లోనే కాలం చేసాడు  

 లోకాంబ పిల్లలకు  ఏది కావాలన్నా సమకూర్చి పెట్టేది సుబ్బమ్మ. చదువు కుంటే రేపటి రోజు కష్టపడకుండా ఉద్యోగాలు చేసుకుంటారు అని ఇద్దరు మగపిల్లలకు చదువు చెప్పించింది సుబ్బమ్మ. లోకాంబకు పుట్టిన  ఒక్కగానొక్కకూతురు సామ్రాజ్యానికి  కలిగిన చోట సంబంధం చూసి పెండ్లి చేసింది సుబ్బమ్మ.

ఒకనాడు లోకాంబ చిన్న కొడుకు ప్రకాష్ చదువుకోకుండా నిద్రపోతున్నాడు. ప్రకాష్ ని లేపిచదువుకోమని  అరుస్తుంది సుబ్బమ్మ .  ఆ కోపం తో  ప్రకాష్ “ఇంట్లో నుండి నేను  వెళ్ళిపోతాను” అని  ఇల్లు వదిలి వెళ్లి పోతాడు. “తండ్రి లేని వాడివని చేరదీస్తే చెడు సావాసాలు పట్టావు నీవు.  ఇది నీకు తగని పని” అని  ప్రకాష్ వెంట పడి చెబుతుంది సుబ్బమ్మ.  తన సావాసగాండ్రతో కలిసి పేకాటకు బానిస అవుతాడు ప్రకాష్ .తాను  ఆడే పేకాట పందానికి “ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వెండి  సామాను ఎత్తుకుని పోబోతాడు ప్రకాష్. పొలం నుండి అప్పుడే వస్తున్న సుబ్బమ్మ ప్రకాష్ ని  అడ్డుకున్నది.  ప్రకాష్ ని ఆపబోయి  సుబ్బమ్మ కింద పడిపోయింది. ఆమె వెన్నెముక విరిగిపోయింది.

మంచం పట్టిన  సుబ్బమ్మను చూసి “కాడె విరిగిన నాగలినయ్యాను” అని రోదిస్తుంది  లోకాంబ.  లోకాంబను ఓదారుస్తూ. ‘‘ఏడవకు. ఈ సంసారాన్ని లాగగలిగినంత వరకు లాగాను మగరాయుడిలా ఇంతకాలం!” అని వాపోయింది  సుబ్బమ్మ  లోకాంబతో. చిన్నోడికి చదువు అబ్బడం లేదు. పెద్దోడు గోపాలమే నీకు దిక్కు” అని కన్నీటి తో పాటు వెళ్ళిపోయింది సుబ్బమ్మ. 

గోపాలానికి పట్నంలో ఉద్యోగం వచ్చింది.  ఆనతి కాలంలోనే గోపాలానికి పెండ్లి చేసింది లోకాంబ. తన పని ఒత్తిడుల వల్ల గోపాలం తల్లిని చూడటానికి వెళ్లడం మానేసాడు. తన తమ్ముడు ప్రకాష్ కే  పొలం బాధ్యతలు అప్పజెప్పేశాడు  గోపాలం. ప్రకాష్  కి పెండ్లి చేస్తే బాగు పడతాడని పక్క ఊరిలో ఓ పిల్లని చూసి పెళ్లి చేసింది లోకాంబ. పెండ్లి అయిన తరువాత ప్రకాష్ తన వ్యసనాలు మానుకోలేక ఉన్న పొలం అంతా తల్లికి చెప్పకుండా  అమ్మేశాడు. ఈ విషయం తెలిసి నిలదీసిన తన తల్లిని విదిలించి వెళ్ళిపోతాడు ఓ నాడు ప్రకాష్ .

 ప్రకాష్ చేసే ఘాతుకాలని గోపాలానికి చెప్పడానికి గోపాలం వద్దకు వెళ్ళింది  లోకాంబ. గోపాలం “ఎందుకు వచ్చావు?” అన్నట్టు చూశాడు తల్లిని. ‘‘మొన్న అక్క అడిగింది నన్ను నీకు గాజులు చేయించమని. విధవవి రేపో మాపో కాటికెళ్లే నీకు గాజులెందుకు?” అని తన తల్లి ముఖాన్నే హేళన గా అన్నాడు  మందు మైకంలో మునిగి తేలుతూ .. 

గోపాలం అన్న మాటలు, ప్రకాష్  ఈసడింపులు లోకాంబ హృదయాన్నితొలచి వేసాయి.  లోకాంబ బస్సు దిగి  తన ఇంటి ముందుకు వెళ్లి  నిలబడినది. “రాత్రి పెద్ద వర్షం కురిసింది కుండపోతగా… ఆ గాలికి మన  కప్పు కూలిపోయింది ..” అని చెప్పాడు పాలేరు నరసయ్య. “నాకు కాస్త కూలి ఇప్పించమ్మా” అన్నాడు లోకాంబతో నరసయ్య. లోకాంబ తన చెంగు ముడి విప్పి నరసయ్య చేతిలో పెట్టింది. చేతికి అందినంత డబ్బులు ఇచ్చేసింది. తన ఇంటి తాళాన్ని  తీసి ముంగిట్లో ఉన్నమంచాన్ని  వాలుస్తూ నేలకు వాలిపోయింది లోకాంబ.   లోకాంబ  “ఉట్టిపై మజ్జిగ నా గొంతులో పొయ్యరా…” అని సైగ చేసింది నరసయ్య తో… “అమ్మోరు మీరు బామ్మలు గదా …!! నేనెట్లా మీ ఉట్టి తాకేది” అన్నాడు లోకాంబతో నరసయ్య. లోకాంబ సైగలు నింగిని అంటి అరిచాయి మౌనంగా.. మేఘమా నీవు మౌనంగా వర్షిస్తావు .. నా లాగే! నా  ప్రేమ… కడుపు తీపి… తెలిసేలా  నను కన్నవాళ్లకు నేను కన్నవాళ్లున్న చోట కురవవే? నా పైనే కురిశావే…! నిలవనీడలేకుండా చేసి నీలో కలుపుకోవడానికా!?

Also read: నడిచే దారి ….!?  

Radhika Phani Vangara
Radhika Phani Vangara
అమెరికాలో కేటీ నగరంలో నివాసం. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. గార్డెనింగ్, కథానికలు రాయడం ఇష్టం. రేడియోకోసం ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. పిల్లలు అంటే ఇష్టం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles