తెలంగాణలో 10రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి 22 వ తేదీ వరకూ ఇది అమలులో ఉంటుంది. పది రోజుల తర్వాత పునఃసమీక్ష చేసుకొని తదుపరి పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారు. ప్రతిరోజూ 20 గంటల పాటు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకూ కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. కొన్ని సేవలకు వెసులుబాటు కల్పించారు. లాక్ డౌన్ విధించకుండా కర్ఫ్యూ ద్వారానే కరోనాను కట్టడి చెయ్యాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి నుంచి చెబుతున్నారు.
Also read: స్టాలిన్ కు శుభాకాంక్షలు
అనివార్యమైన నిర్ణయం
కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో, వివిధ రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించిన ప్రభావంతో, ఎట్టకేలకు లాక్ డౌన్ శరణ్యమని ముఖ్యమంత్రి కె సి ఆర్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కొన్ని రోజులు ముందుగానే రాత్రిపూట కర్ఫ్యూను అమలులోకి తెచ్చారు.కేవలం రాత్రిపూట కర్ఫ్యూ విధించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. హైకోర్టు కూడా కఠిన చర్యలపై దృష్టి సారించమని పదే పదే సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం విధించిన లాక్ డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయింది. అటు ప్రభుత్వ- ఇటు ప్రైవేట్ వ్యవస్థలదీ ఒకే తీరులో సాగింది. ఈ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ప్రధానమంత్రి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకూ అందరూ లాక్ డౌన్ ను చివరి ఆయుధంగా భావించారు. మారణహోమం, మరణమృదంగాల మధ్య, ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు.
Also read: మనసుకవికి శతవత్సర వందనం
కొత్త బెడద బ్లాక్ ఫంగస్
ఇది సాహసోపేతమైన నిర్ణయమే అయినప్పటికీ వేరే దారిలేదు. మన పొరుగు రాష్ట్రాల్లోనూ కేసులు పోటీపడుతున్నాయి. కర్ణాటకలో కేసులు మహారాష్ట్రను దాటేస్తున్నాయి. ముంబయిలో పరిస్థితులు మెల్లగా అదుపులోకి వస్తున్నాయి. ముంబయి ఆచరించిన విధానాలను అనుసరించాలని మిగిలిన రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. కరోనా కేసులతో సతమతమౌతున్న ప్రపంచానికి ‘ బ్లాక్ ఫంగస్’ కేసులు తోడవుతున్నాయి. ఇవి రెండూ కలిసి మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. దిల్లీ, పుణే, అహ్మదాబాద్ లో బ్లాక్ ఫంగస్ కేసులను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం, మధ్యప్రదేశ్ లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. కోవిడ్ -19 నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ పెరిగిపోతున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు.
Also read: అనివార్యమైన లాక్ డౌన్
జమిలి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి
కళ్ళు ముక్కు ఎర్రబారటం, నొప్పిరావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి అందకపోవడం, రక్తవాంతులు, మతిస్థిమితం దెబ్బతినడం మొదలైనవి బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా తెలుస్తున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడడంతో పాటు పలు కారణాలను నిపుణులు గుర్తించారు.కరోనాకు బ్లాక్ ఫంగస్ తోడవడం కూడా మానవ తప్పిదాల ఫలితమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంటోంది. వాతావరణం, పర్యావరణాన్ని పాడుచేయడంతో పాటు, కరోనా నుంచి కూడా మనిషి పాఠాలు నేర్చుకోకపోవడమే ప్రధానమైన తప్పిదంగా డబ్ల్యూ హెచ్ ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యనాథన్ భావిస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం, విశృంఖలంగా ప్రవర్తించడం వల్లనే భారత్ లో ఉధృతి పెరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు.
Also read: అంతా ఆరంభశూరత్వమేనా?
వైరస్ వ్యాపిస్తున్న కొద్దీ సమస్యలు
వైరస్ వ్యాపిస్తున్న కొద్దీ కొత్త రకాలు వెలుగులోకి వస్తూనే వుంటాయని ఆమె అంటున్నారు. భారీస్థాయిలో రూపాంతరం చెందే వైరస్ రకాలపై వ్యాక్సిన్లు పెద్దగా పనిచేయకపోవచ్చని ఆమె చెబుతున్నారు. నిజంగా, ఇది సంభవిస్తే, ప్రపంచం మరోసారి పెద్దముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరిస్తున్నారు. స్వామినాథన్ మాటలను కొట్టిపారెయ్యకూడదు. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడుగా భావించే ఎమ్ ఎస్ స్వామినాథన్ కుమార్తె సౌమ్య. అదే సమయంలో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల వల్ల కూడా కొంత ప్రయోజనం ఉందని ఆమె చెబుతున్నారు. వాతావరణంలో సహజంగా ఉండే మ్యూకోర్ అనే ఫంగస్ వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుంది. ఇది మనుషులకు అరుదుగా సోకే ఫంగస్. కరోనా నుంచి బయటపడిన కొందరికి ఈ ఫంగస్ సోకడమే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం.
Also read: ఈ సారైనా వలస కార్మికుల గురించి ఆలోచించారా?
లాక్ డౌన్ పాఠాలు నేర్చుకోవాలి
లాక్ డౌన్ వల్ల వ్యాప్తిని అరికట్టడంలో ప్రయోజనాలు ఉన్నాయన్నది వాస్తవమే. కానీ, గత లాక్ డౌన్ కష్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ప్రభుత్వం, ప్రజలు ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇదంతా ఒకఎత్తైతే, ఎంతోకొంత ఉపయోగకరమని భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా ఆందోళన కలిగిస్తోంది. ఇది నత్తనడకన సాగుతోంది. లాక్ డౌన్, కర్ఫ్యూల మధ్య వాక్సినేషన్ లో పాల్గొనడం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే 144 సెక్షన్ మొదలు అనేక నిబంధనలు అమలులో ఉన్నాయి. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో బారులు తీరడం సాధ్యమా, అది ఎంతవరకూ క్షేమదాయకం అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
Also read: కోరలు చాచుతున్న కరోనా
వాక్సినేషన్ నిబంధనలతో ఇబ్బందులు
తొలి డోస్ తీసుకున్న చాలామందికి రెండవ డోస్ అందుబాటులో లేక మానసికంగానూ నలిగిపోతున్నారు.45ఏళ్ళు దాటినవారికి,18ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సిన్లు గగనకుసుమంగా మారిపోయాయి. ఆన్ లైన్ బుకింగ్ విధానం కూడా గందరగోళంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులను మూసేశారు. రాకపోకలను నిలిపివేశారు. కోవిడ్ రోగులున్న అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో ఆపడం, తిరిగి వాళ్ళను వెనక్కు పంపించివేయడం పరమ అమానుషమైన చర్య. దీనిపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
Also read: మళ్ళీ కమ్ముకొస్తున్న కరోనా మహమ్మారి
మానవీయ కోణాన్ని మరువరాదు
చట్టాల్లో ఎన్ని నిబంధనలు ఉన్నా, విధుల్లో ఎన్ని నియమాలు ఉన్నా, మానవీయ కోణాలను మరువడం మనిషితనం కాదు. ఆర్ధిక సాయాలు ఎలా ఉన్నా, ప్రజలను నిబంధనల పేరుతో భయభ్రాoతులకు గురిచేడం పాడికాదు. లాక్ డౌన్, కర్ఫ్యూలో నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగాసాగేనా? వైద్య సేవలు సక్రమంగా అందేనా అనే అనుమానాలు అలుముకుంటున్నాయి. ఆక్సిజన్ కొరత కూడా చాలా ఆందోళనకరమైన అంశం. మనకంటెదురుగా ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోతున్నారు. బెడ్లు దొరక్క, చికిత్స అందక నానా అవస్థలూ పడుతున్నారు.
Also read: మనిషి మారకపోతే మహమ్మారే
ఆక్సిజన్ కోసం ప్రధానికి మొర
ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి పలుమార్లు లేఖలు రాశారు. ప్రధాని నిర్వహించిన సమీక్షా సమావేశాల్లోనూ గుర్తు చేశారు. కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. వ్యాక్సినేషన్ పై జాతీయ విధానం ఎంత ముఖ్యమో, రాష్ట్రాల డిమాండ్లు కూడా అంతే ముఖ్యం. కరోనా వైరస్ -బ్లాక్ ఫంగస్ నుంచి ప్రజలను సత్వరం రక్షించే విధంగా ప్రభుత్వాలు కీలకమైన చర్యలు చేపట్టకపోతే జరగబోయే ముప్పును ఎవ్వరూ ఆపలేరు.
Also read: చేజేతులా తెచ్చుకున్న ముప్పు