- భారత సంతతి అభ్యర్థి రిషి సునాక్ ఓటమి
- 47 శాతం ఓట్లు సునాక్ కు, 53 శాతం ఓట్లు ట్రస్ కు
- కొత్త మంత్రిమండలిలో చేరబోనన్న రిషి సునాక్
- మంగళవారం మధ్యాహ్నం రాణితో సమావేశం
అష్టకష్టాలలో ఉన్న బ్రిటన్ ను ఒడ్డుకు చేర్చే విధంగా కొత్తప్రధానితో సహకరించాలని కన్సర్వేటివ్ పార్టీ సభ్యులకు పరాజితుడైన భారత సంతతి పార్లమెంటు సభ్యుడు రిషీ సునాక్ విజ్ఞప్తి చేశారు. తాను ఓడిపోయినట్టు తెలియగానే ట్విట్టర్ చేతిలోకి తీసుకొని సందేశాలు పంపడం ఆరంభించారు. తనకు మద్దతు ఇచ్చినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు.
‘‘కన్సర్వేటీవ్ లు అందరూ ఒకే కుటుంబ సభ్యులని నేను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నా. కొత్త ప్రధాని లిజ్ ట్రస్ వెనక మనమంతా దన్నుగా నిలబడటం మన బాధ్యత. ఆమె దేశానికి సారథ్యం వహిస్తారు. ఆమెను మనం బలపరచాలి,’’ అని బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి ఉద్బోధించారు. 47 ఏళ్ళ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా 42 ఏళ్ళ సునాక్ కి 60,399 ఓట్లు వచ్చాయి. మొత్తం 1,72,437 టోరీ ఓట్లలో 654 ఓట్లను తిరస్కరించారు. మొత్తం కన్సర్వేటివ్ పార్టీ ఓటర్లలో 82 శాతం మంది ఓటు చేశారు. పోలైన ఓట్లలో ట్రస్ కు 57శాతం రాగా, సునాక్ కు 42 శాతం దక్కాయి. బ్రిటన్ చరిత్రలో ఒక మహిళ ప్రధాని కావడం ఇది మూడో సారి. తొలి మహిళా ప్రదాని,ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న మార్గరెట్ థాచర్. రెండో మహిళా ప్రధాని థెరిసా మే. మూడో మహిళా ప్రధానిగా ట్రస్ ఎన్నికైనారు.
తాను ఈ పోటీలో ఓడిపోతే తన పని కొత్త ప్రధానిని బలపరచడమేనని ఆదివారంసైతం రుషి సునాక్ అన్నారు. కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వానికి పోటీ పడుతున్న అభ్యర్థిగా బీబీసీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో తాను యార్క్ షైర్ లోని రిచ్ మాండ్ కు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతాననీ, తన నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తాననీ సునాక్ వ్యాఖ్యానించారు.
భారత సంతతికి చెందిన బ్రిటిష్ హోమ్ మంత్రి ప్రీతీపటేల్ ప్రధాని పోటీ ఫలితాలు వెలువడిన కొన్ని గంటలకు తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఫలితాలు ప్రకటించిన తర్వాత కొత్త ప్రధాని టిజ్ ట్రస్ తన మంత్రిమండలి నిర్మాణం గురించి సహచరులతో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత మంగళవారం మధ్యాహ్నం ఆమె పాత ప్రదాని బోరిస్ జాన్సన్ తో కలసి ఎలిజబెత్ రాణి నివాసానికి వెడతారు. ఆమె ప్రస్తుతం స్కాంట్లాండ్ లోని బాల్ మొరల్ క్యాజిల్ లో ఉన్నారు. అక్కడ ఎలిజెబెత్ రాణి -2 జాన్సన్ రాజీనామా స్వీకరించి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ట్రస్ ను రాణి ఆదేశిస్తారు. ఇప్పుడున్న మంత్రిమండలిని పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 43-57 శాతం తేడాతో ఓడిపోయిన రుషి సునాక్ మంత్రిమండలిలో చేరమని అడిగితే మంత్రిగా చేరబోనని ఒకటికి రెండు సార్లు స్పష్టం చేశారు. తాను ప్రచారం చేసిన తీరుకు తాను గర్విస్తున్నానని ఆయన అన్నారు. ‘‘ఆర్థిక మంత్రిగా దేశం కష్టాలలో ఉన్నప్పుడు సమర్థంగా పని చేసినందుకు గర్వంగా ఉంది. కోవిద్ ఊపిన ఊపు నుంచి దేశాన్ని రక్షించినందుకు సంతోషిస్తున్నాను’’ అని బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు.
దేశంలో అత్యున్నత పదవికి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ జరిపిన కన్సర్వేటివ్ పార్టీ ప్రతినిధులకు ట్రస్ ధన్యవాదాలు చెప్పారు. సునాక్ కు కూడా ధన్యవాదాలు చెప్పారు. జాన్సన్ ను పొగిడారు. జాన్సన్ కేటినెట్ లో ఆర్థికమంత్రిగా ఉంటూ తన పదవికి సునాక్ రాజీనామా చేశారు. ఇది జాన్సన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి సృష్టించింది. అందువల్ల జాన్సన్ సునాక్ పైన ఆగ్రహంగా ఉన్నాడు. ట్రస్ విదేశాంగమంత్రిగా జాన్సన్ కేబినెట్ లో కొనసాగారు. అందువల్ల జాన్సన్ ఆమె పట్ల సదభిప్రాయంలో ఉన్నాడు. ఈ అంశం సునాక్ ఓటమికీ, ట్రస్ విజయానికి దోహదం చేసి ఉండవచ్చునని పరిశీలకుల అంచనా. ‘‘బోరిస్, మీరు బ్రెక్సిట్ సాధించారు. (అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చారు).లేజర్ పార్టీ నాయకులు జెర్మీ కార్బీన్ ను చిత్తుగా ఓడించారు. టీకా మందు సకాలంలో అందించారు. వ్లాదిమీర్ పుతిన్ ను ఎదిరించి నిలబడ్డారు. మిమ్మల్ని క్వీవ్ నుంచి కార్లిసిల్ వరకూ ప్రజలందరూ అభిమానిస్తున్నారు,’’ అని తన విజయోత్సవ ప్రసంగంలో ట్రస్ మాజీ ప్రధానిని శ్లాఘించారు. ‘‘నేను కన్సర్వేటివ్ గా ప్రచారం చేశాను. కన్సర్వేటివ్ గానే పరిపాలిస్తాను,’’అని ఆమె వ్యాఖ్యానించారు.
ట్రస్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ లో ప్రధాని నివాసంలోకి త్వరలో ప్రవేశిస్తారు. మంగళవారం సాయంత్రం ప్రారంభోపన్యాసం చేసిన మీదట ఆమె తన మంత్రిమండలి సభ్యులను పరిచయం చేస్తారు. అటార్నీ జనరల్ సువెల్లా బ్రేవ్ మాన్ ఒక్కరే లిజ్ ట్రస్ కేబినెట్ ఉండబోయే భారతీయ సంతతి వ్యక్తి అని చెప్పుకుంటున్నారు. గోవాకు చెందిన బ్రేవ్ మాన్ ప్రీతీపటేల్ హోమ్ మంత్రిగా స్థానంలో చేరవచ్చు. ప్రీతీపటేల్ జాన్సన్ కు సన్నిహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. కనుక ఆమె కొత్త కేబినెట్ లో ఉండకపోవచ్చు. రక్షణ మంత్రి బెన్ వాలేస్, అంతర్జాతీయ వాణిజ్య మంత్రి అనె-మారీ ట్రెవెల్యాన్ , సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కదీన్ దోరీస్ కొత్త కేబినెట్ లో కూడా కొనసాగవచ్చు. ట్రస్ సన్నిహితురాలు థెరెసీ కాఫే ఆరోగ్య మంత్రిగా కొత్త మంత్రిమండలిలో స్థానం పొందవచ్చునని భోగట్టా.