భగవద్గీత – 74
నిన్న! నేడు! రేపు!
నిన్న ఏమి జరిగిందో, ఒక అంతర్మథనం. రేపు ఏమి జరగబోతుందో అనే ఒక చింత. ఈ రెండింటి మధ్యలో జారిపోయే నేడు. మన కోపాలు తాపాలు అన్నీ నిన్నజరిగిన విషయాలు గుర్తుకు తెచ్చుకునే కదా.
ఎవరినో చూస్తాము. ఇదుగో నువ్వు ఫలానా రోజున ఇలా చేశావు, నీవలన నాకు ఇంత బాధ కలిగింది అని, వాడిని చూడగనే మనస్సు మూలిగి తదనుగుణంగా ప్రవర్తింపచేస్తుంది. … reactive behavior… కదా!
జరిగిపోయినదేదో జరిగిపోయింది. అది తలచితలచి, వగచి ఏమి లాభం? ఏమయినా తిరిగి వస్తుందా? గతం గతః. Let bygones be bygones.
Also read: సంకల్పాలు త్యజించినవాడే యోగి!
ఒకడుంటాడు. వాడికి భవిష్యత్తుమీద అన్నీ అనుమానాలే. ఏమో, తాను ఏమి కానున్నాడో. తన ఆర్ధిక పరిస్థితి ఏమవుతుందో? కొడుకులు చూస్తారో, చూడరో? ఈ సంపదలు ఎవడైనా ఎత్తుకుపోతాడో ఏమో? ‘‘నా’’గతి ఏం కానున్నదో? అని అనుకుంటూ ఏదోరకంగా డబ్బుపోగేసుకుంటాడు. దాన్ని కాపలా కాయలేక నానా తిప్పలూ పడతాడు.
భర్తృహరి చెపుతాడు కదా!
భోగే రోగభయం. కులే చ్యుతిభయం. విత్తే నృపాలాద్భయం. మానే ధైన్యభయం. బలే రిపుభయం. రూపే జరాయా భయమ్. శాస్త్రే వాదిభయం. గుణే ఖలభయం. కాయే కృతాంతాద్భయం. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్య మే వాభయమ్…
భోగాలనుభవించాలంటే రోగాలొస్తవేమో అని భయం. ఖాదర్ వలీ గారు చెప్పినట్లు చేస్తే పోలా. మంతెనగారిని follow అయితే పోలా. రోగం వస్తుందో రాదో తెలియదు. రేపేమిటో తెలియదు. కానీ ఈ రోజే భయం.
Also read: రజోగుణము మోహావేశపరమైనది
మన కులంవాళ్ళంతా ఒకటి. మన కులపోడు ఏమి చేసినా ఒప్పే. ఇది నేటి జాడ్యం. సరే అలా అనుకున్న తరువాత మనము ఎవడితో కలిసి తిరిగినా మన కులపోళ్ళుచూసి ‘‘రేపు’’ నన్ను వెలివేస్తే?
మేనేజరుగారూ కాస్త ఇన్కమ్ టాక్సు పడకుండా మీరే ఏదో ఒక అక్కౌంటులోవేసి నాకు కావలసినప్పుడు ఇయ్యండి ఇలా అనేవాళ్ళను నా సర్వీసులో కోకొల్లలుగా చూస్తున్నాను. విత్తానికి రాజుభయం. సంపాదించినది ఏ టాక్సు కట్టాలో అని భయం. బలవంతుడికి శత్రుభయం. అమెరికా, రష్యా, చైనాలు అన్ని వేల అణ్వాయుధాల కుప్పలమీద కూర్చోవడానికి ఇదే కారణం. రేపెవడు మీదపడతాడో అని.
రూపవంతుడికి ముసలితనం భయం. Anti wrinkles cream వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లటానికి ఈ భయమే కారణం. ఇట్లా ప్రపంచం మొత్తం ‘‘రేపటి’’ భయంతో అల్లల్లాడిపోతున్నది.
Also read: స్వభావం ప్రధానం
ఇక మొగుడు పెళ్ళాల కొట్లాటలన్నీ నిన్నటి మాటలు. రేపటి uncertainties మీదనే. ఎప్పుడో జరిగిన పెళ్ళిలో మీ వాళ్ళిట్లా చేశారు. రేపు ఒకవేళ నేనుపోతే మా అమ్మను చూస్తావా…. ఇవే తగాదాలు.
ప్రపంచమంతా నిన్న, రేపు అనే బండరాళ్ళమధ్య తన వర్తమానాన్ని నలిపి నాశనం చేసుకుంటున్నది.
You sip tea while you are sipping tea. ఏదో ఆలోచిస్తూ తాగితే మూతికాలుతుంది. తాగే టీలోని మాధుర్యాన్ని enjoy చేయలేవు కదా! So Live in the present Live the moment you are in!
వర్తమానాన్ని చక్కగా గడుపు భవిష్యత్తు ఆనందమయమవుతుంది. ఇదే నిన్ను నీవు ఉద్ధరించుకోవడమంటే, నా దుఖాలకు కారణమెవడు? ‘‘నేను.’’ నా సుఖాలకు కారణమెవడు? ‘‘నేను.’’ కాబట్టి ‘‘నేను’’ మాత్రమే నన్ను బాగు చేయగలడు…
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః
ఉద్ధరేత్=ఉద్ధరించుకొనుము. ఆత్మనా=నీవే స్వయంగా నీ మనస్సు ద్వారా. ఆత్మానం=నిన్ను నీవే. న=కాదు. ఆత్మానం=(ఎవరికి వారే)నిన్ను. అవసాదయేత్=పతనం చేసుకొనుట. ఆత్మా=నా మనస్సే. ఏవ=ఖచ్చితంగా. హి=నిజముగా. ఆత్మనః=మన యొక్క. బంధు:=చుట్టము. ఆత్మా=నా మనస్సేనా. ఏవ=నిజముగా. రిపుః=శత్రువు. ఆత్మనః=నా యొక్క.
నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్దరించుకోనుము అంతేకాని పతనమైపోవద్దు ఎందుకనగా నీ మనస్సే నీ మిత్రుడు.
మరియు -నీ మనస్సే నీ శత్రువు
కాబట్టి ’’ నేను ’’ ఈ క్షణాన్ని purposeful గా జీవిస్తాను అని తీర్మానించుకోండి.
Also read: పని నేర్చుకున్న తర్వాతనే పర్యవేక్షణ