• కోట్లాది రూపాయల అమ్మకాలు
• ప్రభుత్వానికి భారీగా ఆదాయం
• కరోనాను కూడా లేక్కచేయని మందుబాబులు
తెలంగాణలో కొత్త సంవత్సరం పేరు చెప్పి మందుబాబులు రెచ్చిపోయారు. తెల్లారితే మళ్లీ మందు దొరకదేమో అన్నంతగా స్థాయికి మించి తాగారు. ఇక ఏముంది వైన్ షాపు యజమానులకు ప్రభుత్వానికి కాసుల పంట పండింది. వేడుకలకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందన్న భయంతో నాలుగు రోజులు ముందే తాగడం మొదలెట్టారు. గత నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 760 కోట్ల విలువైన మద్యాన్ని తాగినట్లు ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది. 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీరు కేసులు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదికన్నా 200 కోట్ల ఆదాయం ఎక్కువ వచ్చినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు.
ఇది చదవండి: నవోదయం, శుభోదయం !
పోలీసుల తనిఖీలు:
నాలుగు రోజుల్లో హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఏకంగా 300 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కొత్త సంవత్సర వేడుకల పేరుచెప్పి ఇళ్ళలోనే మద్యం సేవించినట్లు తెలుస్తోంది. దీనికితోడు డ్రంక్ అండ్ డ్రైవ్ లతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతో చాలా వరకు ప్రమాదాలను నివారించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలుగుతల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, పంజాగుట్ట ఫ్లైఓవర్లను మూసివేశారు.
మందుకోసం క్యూలైన్లు:
మందుబాబులు కొనుగోళ్లకు ఎగబడటంతో దుకాణాల్లో సరుకు గంటల వ్యవధిలోనే ఖాళీ అయిపోయాయి. అమ్మకాలకు భారీ గిరాకీ ఉండటం, నాలుగు రోజుల్లో కోట్లాది రూపాయల ఆదాయం రావడంతో వైన్ షాపుల యజమానులు ఖుషీ అయ్యారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేసులకు కేసులు మద్యం సీసాలను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక 31 నాడు అర్ధరాత్రి వరకే మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో మద్యం దొరకకపోతే కొత్త సంవత్సరం లో కిక్కు ఉండదని మందుబాబులు భావించారు. దీంతో కరోనాను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. తమకు నచ్చిన బ్రాండ్ల మందు అయిపోతుందనే ఆతృతలో మాస్కులు పెట్టుకోవడం కూడా మానేశారు.
ఇది చదవండి: గడ్డు ఏడాది గడిచిపోయింది