Tuesday, November 5, 2024

శివాజీలాగా రాహుల్ గాంధీ కూడా ఒక చివరి నుంచి నరుక్కొస్తున్నాడు. అది చిన్నాచితకా రాజకీయమా?

మధ్యతరగతి అన్నది లావుగా ఉండే మధ్యభాగం కాదు. భారత సమాజంలో సన్నగా, పీలగా కనిపించే భాగమన్నమాట. అంచుల రాజకీయం భారత దేశంలో ప్రధాన స్రవంతి రాజకీయం. ప్రధాన స్రవంతి అంచుల ద్వారా ప్రవహిస్తుంది.

యోగేంద్ర యాదవ్

ఒక వృద్థ మహిళ దగ్గర యుద్ధవ్యూహాన్ని శివాజీ ఎట్లా తెలుసుకున్నాడో తెలిపే ఒక సుప్రసిద్ధమైక కథ వ్యాప్తిలో ఉంది. పలు విఫల సైనికదాడులతో విసిగిపోయి అడవులలో తిరుగుతున్న శివాజీ ఒక వృద్ధ మహిళ ఇంటి గుమ్మం దగ్గర భోజనం కోసం ఆగాడు. ఆమె అతణ్ణి గుర్తుపట్టలేదు. వేడివేడి వంటకాలతో ఆమె అతనికి భోజనం వడ్డించింది. భోజనం చేయడం ప్రారంభించిన శివాజీ మధ్యలో నుంచి తినడం, వేళ్ళు కాల్చుకోవడం గమనించిన ఆ వృద్ధ మహిళ, ‘‘యువసైనికుడా, నువ్వు కూడా నీ రాజులాగానే ఉన్నావు. శత్రువు కుంభస్థలంపైన కొట్టడానికి ప్రయత్నించి ప్రతిసారీ విఫలుడైనాడు మీ రాజు. అన్నం అంచు నుంచి తింటూ మధ్యకు చేరుకోవడం తేలిక. ఆ విధంగా ఎందుకు ప్రయత్నించవు?’’ అని అడిగిందట. ఆ వృద్ధ మహిళ సలహాను ఆ రోజు భోజనం చేయడానికి వినియోగించుకోవడమే కాకుండా దరిమిలా చేసిన యుద్ధాలన్నింటిలో ఆ సలహా పాటించి రణతంత్రాలు రచించి విజయాలు సాధించాడు శివాజీ. తక్కినదంతా చరిత్ర.

Also read: గణతంత్రం మరణించింది, గణతంత్రం జయహో!

నాడు ఆ వృద్ధ మహిళ శివాజీకి ఇచ్చిన సలహాను నేడు రాహుల్ గాంధీ పాటిస్తున్నాడా? ముందుగా అంచులను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా? మణిపూర్ లో యాత్రలో చేరినప్పుడు నాకు అదే విధంగా అనిపించింది. ఎన్నికల ప్రాముఖ్యం లేని ఈశాన్య ప్రాంతంలో, అందులోనూ మణిపూర్ లో,  యాత్ర ప్రారంభించడంలోని ఔచిత్యాన్ని రాజకీయ పండితులు గట్టిగా ప్రశ్నించారు. భౌతికంగా, రాజకీయంగా కూడా ఆ నిర్ణయం ప్రమాదభూయిష్టమైనది. మణిపూర్ ఇప్పటికీ మండుతూనే ఉంది. యాత్రమీద సమాజంలో ఉన్న మిలిటెంట్లకైనా, అజ్ఞాతంలో ఉన్నవారికైనా దాడి చేయడం తేలిక. పైగా ఈ రోజు కాంగ్రెస్ ఈశాన్య గుట్టప్రాంతాలలో నామమాత్రవశిష్టంగా మాత్రమే ఉంది. దశాబ్దం కిందటి బలంతో పోల్చుకుంటే కాంగ్రెస్ నీడగా మాత్రమే మిగిలి ఉంది. యాత్రకు ప్రజలను సమీకరించడానికి పార్టీ దోహదం చేయలేదు. రాహుల్ గాంధీకి ఇది నైతికతతో కూడిన ఆదర్శవాదానికి సంబంధించిన ప్రశ్న. దేశం మొత్తం మీద కొన్ని మాసాలుగా దారుణమైన రాజకీయ అన్యాయానికి  గురి అవుతున్న ప్రాంతాన్నీ, రాజ్యం ప్రారంభించిన అంతర్యుద్ధం రగులుతూ ఉంటే, హింసాకాండ యధేచ్ఛగా సాగుతూ ఉంటే అదే రాజ్యం మౌనవ్రతం పాటించడం వంటి నిర్దయకు గురి అవుతున్న రాష్ట్రాన్ని విడిచి పెట్టి న్యాయయాత్ర చేయడం ఎంత కపటమో, నిజాయితీ రాహిత్యమో రాహుల్ కి తెలుసు.

ప్రమాదభూయిష్టమైన  ఈ నిర్ణయాన్ని ప్రజలు ఎట్లా స్వాగతించారో తెలుసుకోవాలంటే ఆ దృశ్యాలను చూసితీరాలి. జాతీయ ప్రధాన స్రవంతికి చెందిన మీడియా (అంటే నోయిడాలో ఉండే వార్తాచానళ్ళు)సంస్థలు రాహుల్ యాత్రను ఎట్లాగూ చూపించవు. అందుకని యూట్యూబ్ చానళ్ళపైనే ఆధారపడాలి. సామాన్య ప్రజలు పోటీలు పడి రాహుల్ గాంధీకి ఎట్లా స్వాగతం చెప్పారో కనిపిస్తుంది. సేనాపతి జిల్లాలో కుకీలు నివసించే ప్రాంతానికి రాహుల్ యాత్ర ప్రవేశించినప్పుడువారు వ్యవహరించిన తీరును నేను ఎన్నటికీ మరువలేను. అంతకు ముందు సాయంకాలం యాత్రకు మైటీలు అధికంగా నివసించే ప్రాంతంలో బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. ఇది (కుకీల స్వాగతం) జీవితంలో ఒకే ఒక్క సారి లభించే ఆలింగనం. ఈ దారిలోనూ, దాని చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలందరూ రోడ్ల మీదికి వచ్చారు. వారి కళ్ళనిండా నీరుంది. అందులో ఆశాభావం తొణికిసలాడింది. భారత రాజ్యంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తినైనా గట్టిగా పట్టుకుందామనే ప్రయత్నం వారిలో కనిపించింది. మహిళలు యాత్ర బస్సులోకి వచ్చి రాహుల్ ఎదుట తమ మనస్సులోని మాట చెప్పారు. పిల్లలు  పోస్టర్లు పట్టుకొని నిలబడ్డారు. హింసాకాండ వల్ల దీర్ఘకాలిక సమస్యలను సామాజిక కార్యకర్తలు వెల్లడించారు. వారు తమ డిమాండ్లను తెలిపారు. వారిలో దుఃఖం ఉంది. బాధ ఉంది. ఆగ్రహం ఉంది. కానీ తమ గాయాలకు రాహుల్ గాంధీ లేపనం పూయగలడనే ఆశాభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. నాకు మాత్రం అది జాతీయ సమైక్యతా క్షణం.

Also read: బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’ కు మూడు రణక్షేత్రాలలో మూడు వ్యూహాలు

ఇది మణిపూర్ కే పరిమితమైన పరిణామం కాదని నాగాల్యాండ్ నిరూపించింది. మేము యాత్ర కంటే కాస్త  ముందుగా వోఖా అనే గ్రామంలో ఉన్నాం. రాహుల్ రాకకోసం ఎదురు చూస్తున్న ప్రజలతో మాట్లాడుతున్నాం. భతూరా, పూరీ మిశ్రమమైన స్థానిక వంటకం ఆలూ పూరీ తినాలని టీస్టాల్ అతను బలవంతంగా ఒప్పించాడు. మాబోటి యాత్రికుల దగ్గర డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. రాహుల్ గాంధీని ఒక్కసారి చూడడం కోసం మహిళలు తమ పిల్లల్ని ఎత్తుకొని గంటలకొద్దీ నిరీక్షించారు. ఆ చిన్న పట్టణంలో ఉన్న అందరూ రోడ్ల మీదనో, ఇంటికప్పులపైనో ఉన్నారు. దేశంలో మరెక్కడైనా జరిగినట్టే ఇక్కడా జరిగింది. ఇది నాగాల్యాండ్ అనీ, భారత రాజ్యంపైన తొలి తిరుగుబాటు జరిగిన ప్రాంతమనీ, ఎవరైనా సందర్శకుడు కనిపిస్తే ‘ఇండియా నుంచి ఎప్పుడు వచ్చారు?’ అని ప్రశ్నించే ప్రాంతమనీ, అజ్ఙాత సాయుధుల ముఠాలు ఇప్పటికీ చురుగ్గా, స్వేచ్ఛగా విహరించే ప్రాంతమనీ మీరు నమ్మరు. నలభైమంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కడంటే ఒక్క సభ్యుడు కూడా లేని రాష్ట్రమని కూడా అనిపించదు. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో పరిస్థితి ఇంత అధ్వానం కాదు. కాంగ్రెస్ ఎంతో కొంత ఉనికి కలిగి ఉంది. కానీ న్యాయయాత్రకు లభించిన ఆదరణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ఎన్నికల బలాన్ని మించి చాలా ఎక్కువగా ఉన్నది. భారత్ జోడో యాత్రలో కన్యాకుమారిలో జనసముద్రం, కశ్మీర్ లో జనసందోహం నాకు గుర్తుకు వచ్చాయి.

భూభాగాల సరిహద్దులకు తగినట్టు భారత్ జోడో మొదలు కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఇంకా మిగిలి ఉన్న ఆదరణ ఫలితంగా అది అదే విధంగా మొదలయింది. సమాజంలో అట్టడుగున నివశించే ప్రజలతో రాహుల్ గాంధీకి ఉన్న అనుబంధం కూడా ఈ యాత్రల విజయానికి దోహదం చేసింది.

అంచుల నుంచి ప్రధానస్రవంతికి

మేము అస్సాంలో ప్రవేశించి ‘చికెన్ నెక్’ గుండా ప్రయాణం చేసే సమయానికి మార్జిన్ (అంచులు) అనే మాట మరో అర్థాన్ని సంతరించుకున్నది. సమాజంలో అట్టడుగున ఉన్నవారిపైన మొదటి యాత్రలో దృష్టి పెట్టాం. మతపరమైన అల్పసంఖ్యాకులు మాత్రమే కాదు. ముస్లింలతో రాహుల్ గాంధీకి ప్రత్యేక అనుబంధం ఉన్నది. సంకేతపరంగా వారిని మెప్పించే ప్రయత్నం రాహుల్ ఏ మాత్రం చేయరు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల నుంచి యాత్ర సాగాలని కాంగ్రెస్ ప్రణాళిక వేసుకున్నదంటూ బీజేపీ చేసిన ప్రచారంలో వాస్తవం లేదు. కిషన్ గంజ్, మాల్దాలు ఎందుకున్నాయంటే వాటికి కాంగ్రెస్ నాయకులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు కనుక.  కనిపించిన ప్రతి దర్గానూ రాహుల్ సందర్శించడం లేదు. గడ్డం పెంచుకున్న మౌల్వీలు రాహుల్ చుట్టూ ఉండటం లేదు. ఆయన ప్రసంగాలలో షేర్-ఓ-షయారీ ప్రస్తావన లేదు. మామూలు నమస్తేకి మించి ఏమీ లేదు. అయినప్పటికీ పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలనే విధానానికి రాహుల్ కట్టుబడి ఉన్నాడనే విశ్వాసం ముస్లింలలో ఉంది. సంప్రదాయ లౌకిక రాజకీయవేత్తలకన్నా మిన్నగా రాహుల్ బీజేపీ-ఆరెస్సెస్ కూటమిని శక్తిమంతంగా ఎదిరించగలడనే విశ్వాసం ఉంది. వారు పెద్ద సంఖ్యలో రాహుల్ సభలకు హాజరవుతున్నారు. అతను చెప్పే ప్రతి వాక్యాన్నీ వంటబట్టించుకుంటున్నారు. వాక్యాల మధ్య అర్థాన్ని అన్వయించుకుంటారు. ఆయన తరఫున  అభ్యర్థులు ఎవరైనా నిలబడితే, వారికి విజయావకాశాలు ఉంటే, అటువంటి అభ్యర్థులకు మద్దతు నిస్తారు.

Also read: రాజ్యం-జాతీయత నమూనా ఇప్పటికీ ఆదర్శప్రాయమే 

ఈ న్యాయయాత్ర దృష్టి అంతా సామాజికార్థిక నిచ్చెనలో చివరి మెట్టుపైన ఉన్నవారిపైనే. పిరమిడ్ అడుగుభాగంలో నివశిస్తున్నవారిపైనే. ఆదివాసీలు, దళిత్ లు, తమ సొంత చేతులతో పనులు చేసే పేదల మధ్య రాహుల్ హాయిగా ఉండటం వారితో అనుబంధం బలోపేతం కావడానికి దోహదకారి అవుతుంది. బీజేపీ పెద్ద అన్నలాగా, పితృవాత్సల్యంతో ఆదివాసీలను వనవాసీ కల్యాణం అంటూ ఆదుకున్నట్టు నటిస్తున్నదని రాహుల్ దాడి చేస్తున్నారు. దానికి తగినట్టు అతను ఆదివాసీలతో కలసిపోతాడు. సంపన్న భారతంలోని నిచ్చెనమెట్ల కులవ్వవస్థను రాహుల్ అదేపనిగా ప్రశ్నించడం ఇంకా దళితులదాకా, ఇతర వెనుకబడిన వర్గాలదాకా చేరి ఉండకపోవచ్చును. కానీ ఓబీసీ, దళిత్, ఆదివాసీ కార్యకర్తలపైన విశేషమైన ప్రభావం చూపుతోంది. అస్సాంలో టీ గార్డెన్ కూలీలతోనూ, పడవలు నడిపేవాళ్ళతోనూ రాహుల్ జరిపిన సమాలోచనలు, పశ్చిమబెంగాల్ లో ఎంనెరేగా కార్మికులతో జరిపిన చర్చల తీరు, బిహార్ లో రైతులతో మాట్లాడిన పద్ధతి, జార్ఖండ్ లో బొగ్గుబావుల కార్మికులతోనూ, చిన్న బొగ్గువ్యాపారులతోనూ జరిగిన సంభాషణ తీరుతెన్నులు ‘లాభార్థి’ (ప్రయోజనం పొందేవారు) అనే బీజేపీ మార్కు రాజకీయానికీ, ఇది తమ హక్కు అనీ, హుందాగా పొందవలసిన ప్రయోజనమనే ఎరుకతో జరిగే రాహుల్ మార్కు రాజకీయానికి మధ్య తేడా ఉంటుంది. వచ్చే కొన్ని వారాలలో జరిగే ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందని చెప్పడం కష్టం. ఇవన్నీ ఆధిక్యరాజకీయాలకు వ్యతిరేకంగా నిర్మించే అడ్డుగోడలు అని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ దేశంలో అటువంటి అడ్డుగోడలు అవసరం.

కరుడుకట్టిన రాజకీయ పశువులకు ఇది నచ్చకపోవచ్చును. ఇదంతా బాగానే ఉంది కానీ ప్రధాన స్రవంతి రాజకీయం మాటేమిటి? అని అడుగుతారు. ఈ అంచులను పట్టించుకునే రాజకీయం చిన్నాచితకా రాజకీయం కాదా? బీజేపీ రాజ్యశక్తినీ, వీధులలో పోరాడే కండబలాన్నీ, ధనం, మీడియాలు కలసిన మహాశక్తినీ, వారి రాజకీయ వ్యూహాలనూ, సంస్థాగత శక్తినీ ఎట్లా ఎదుర్కొంటారు?

సరిగ్గా ఇక్కడే అంచుల రాజకీయం తలకిందులు అవుతుంది. అమెరికాలో నల్లవారూ, ఇతర జాతి జనులైన అల్పసంఖ్యాకవర్గాలలాగా కాకుండా దళిత్, ఆదివాసీ, ఓబీసీలు, మతపరమైన అల్పసంఖ్యాకవర్గాలూ కలిస్తే భారత జనాభాలో అత్యధిక సంఖ్యాకులు అవుతారు. అగ్రవర్ణ హిందువులది చాలా స్వల్పమైన అల్పసంఖ్యాకవర్గం. యూరోప్ నుంచి స్వీకరించిన కార్మిక రాజకీయ ఉదంతాలు ఇక్కడ పని చేయవు. ఆర్థిక పిరమిడ్ లోని అడుగు దాదాపు నాలుగింట మూడువంతులు ఉంటుంది. మధ్యతరగతిగా చెప్పుకునే పాలకవర్గం లావుగా ఉండే మధ్యభాగం కాదు. భారత సమాజంలో అదొక చిన్న భాగం. సమాజం వడ్డించిన విస్తరి అయితే కిచిడీలన్నీ అంచులలో ఉంటాయి. భారత దేశంలో అంచుల రాజకీయ ప్రధాన స్రవంతి రాజకీయం. ప్రధాన స్రవంతి అంచుల గుండా ప్రవహిస్తుంది మరి!

Also read: హిందూమతవాదానికీ, బహుజనవాదానికీ మౌలికమైన తేడా ఉంది 

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles