అమ్మకంటే సుతారంగా ఎత్తుకునే నాన్న
గట్టిగా హత్తుకుంటే బిడ్డ నలిగి పోతుందనుకునే నాన్న
రెండు చూపుడు వేళ్లు చూపిస్తూ అడుగులు వేయించే నాన్న
భయం కలిగితే గుర్తొచ్చే నాన్న
ఆనందంగా బడికి తీసుకు వెళ్లి తెచ్చే నాన్న
బడిలో అర్థం కానివన్నీ ఇంట్లో చెప్పే నాన్న
అవసరమైనవన్నీ కొనిపెట్టే నాన్న
తన గురించి పట్టించుకోకుండా
నీ కోసం కష్టపడే నాన్న
నీ పెళ్లికోసం తన జీవితమంతా తపన పడే నాన్న
నువ్వు ఎదిగి ప్రయోజకురాలైనందుకు
గర్వించే నాన్న
నీ పెళ్ళి జీవిత సాఫల్య పురస్కారంగా భావించే నాన్న
నీకంటే నీ బిడ్డలను అపురూపంగా భావించే నీ నాన్న
రిటైరై వెనక్కి పోతాడు
అప్పటిదాకా అన్ని నిర్ణయాలను తీసుకున్న నాన్న
పాతబడి పోతాడు
ఆయనకు కావలసినవి
ఆయన చేయవలసినవి
భార్యా పిల్లలే నిర్ణయిస్తారు.
ఇంటి పెద్ద అనే స్థానం పోయి
ఓ పడక కుర్చీ ఆసరా అవుతుంది
సలహాలు చెబితే అసహనం ఎదురవుతుంది
అలిగితే అవమానం జరుగుతుంది
మొండిగా ఉంటే దెబ్బలు
వృద్ధాశ్రమాలకు ఉద్వాసన
వదిలి విదేశాలకు పలాయనం
భార్య అనుకూలవతై గౌరవంగా చూస్తే తప్ప
జీవితం నుండి తప్పుకుంటే బాగుంటుందనే వేదన
ఇదీ నాన్న జీవిత ప్రయాణం.●
(జూన్ 20, ఫాదర్స్ డే)
Also read: “కావాలి”
Also read: “శుద్ధి”
Also read: “ఓట్ల పండగ”
Also read: శ్రీ శ్రీ
Also read: “జీవిత సాఫల్య పురస్కారం”