మాడభూషి శ్రీధర్
మన ప్రభుత్వం ఎల్ ఐ సి ని అమ్మేస్తుందట. మన అధికార పార్టీ అత్యంత అద్భుతమైన చరిత్ర సంస్కృతి కలిగిన ఈ దేశ స్వరూపాన్ని రక్షిస్తుందని, మన ధర్మాన్ని బతికిస్తుందని మనలను నమ్మించి అధికారంలోకి వచ్చిన పార్టీ. బుల్లెట్ ట్రైన్ ప్రతినట్టూ జపాన్నుంచి కొంటుందట. మనభారత రైల్వేను విడివిడిగా అమ్మేస్తుందట. మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని నినాదాలిచ్చే ప్రభుత్వం మన ఇండియాలో ప్రజలంతా మనఃస్ఫూర్తిగా నమ్మి తమ జీవితాలకు భీమా ఇదే అనుకునే తమ ప్రియమైన జీవిత భీమా సంస్థలో వాటాలు అమ్మేసి, ఉన్న ఒక్కగానొక్క జాతీయ సంస్థను విజాతీయ విభాగీయ దేశ విదేశీ ప్రభుత్వేతర సంస్థగా మార్చేస్తుందట. ఇంతకన్న దివాలాకోరు విధానం మరొకటి ఉండదు. గత ఆర్థిక సంవత్సరంలో మన ప్రభుత్వానికి డివిడెండ్ గా 13586 కోట్ల రూపాయలు ఇచ్చిన ఎలైసీని అమ్మకానికి పెట్టింది. ఎవరు కొంటారో, ఈ బంగారు గుడ్లు పెట్టే బాతును ఎందుకుతెగనరుకుతున్నారో అందరూ ఊహించవచ్చు.
ఎలైసీ 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన అతి పెద్ద భారతీయ సంస్థ. దీని వాటాలు విక్రయించిదేశకేపిటల్ మార్కెట్లో అతి పెద్ద వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక పాలనా యంత్రాంగమా వ్యాపార సంస్థా అనిపించేట్టు ఉంది. పనికి రాని విధానాలతో లోటు బడ్జెట్ తేవడం, లోటు పూడ్చడానికి ఎల్ ఐ సిలో వాటాలు అమ్మడం. ఇది మన ఆర్థిక మంత్రిగారి నీతి. మనం చాలా గర్వించే మహిళామణి దేశ ఆర్ధికమంత్రి ఈ ఏడాది బడ్జట్ ప్రసంగంలో బడ్జట్ లోటును తీర్చడానికి అనేక ప్రభుత్వరంగ పరిశ్రమల వాటాలను అమ్ముతున్నామని ఇదే ఈ కేంద్ర ప్రభుత్వ విధానం అని చెప్పనే చెప్పారు.
పివి నరసింహారావు పాలనలో పాతాళానికి పడిపోయిన ఆర్థిక రంగాన్ని నిలబెట్టడానికి ప్రవేశ పెట్టిన ప్రయివేటీకరణ విరాట్ స్వరూపం ఇప్పుడు చూస్తున్నాం. లాభాలిచ్చే సంస్థలను ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టి, పనికిరాని సంస్థలను జాతీయ సంస్థలుగా దాచుకునే దారుణ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్నాది. విచక్షణా రహితంగా నవరత్నాల్లాంటి మన సంస్థల వాటాలను తెగనమ్ముతున్నది. ఈ ప్రభుత్వానికి ప్రజల నిరసన పట్టదు. ఎందుకంటే వారు అయోధ్యలో రామాలయం కట్టినందుకు, ఓటింగ్ జరిగే రోజున కాషాయవస్త్రాలతో కేదార్ నాథ్ ను సందర్శించిన ఫోటోలు పెట్టినందుకు ఓట్లేసే అంధ ప్రజల మూఢమూర్ఖ ఓట్ల ఆధారంగా అధికారం సంపాదించగలననే నమ్మకం చాలా సుదృఢంగా ఉంది. 2014లో ఒక మోస్తరుగా మొదలైన అమ్మకాలు 2019 తరువాత ఇప్పుడు కుంభవృష్టిగా జరుగుతున్నాయి.
మిగిలిన సంస్థల వలె కాకుండా ఇప్పటికీ నూటికి నూరు శాతం ప్రభుత్వ వాటాలున్న అతి పెద్ద ప్రభుత్వ సంస్థ ఎల్‌ఐసినే. మిగిలిన సంస్థలకు లేని ప్రత్యేకత ఎల్‌ఐసికి మరొకటి ఉంది. అందులో ప్రజలు దీర్ఘకాలం, అంటే 35 సంవత్సరాల వరకు తమ పొదుపు మొత్తాన్ని దాచుకుంటారు. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో పాలసీహోల్డర్ చనిపోతే, మొత్తం సొమ్ము బోనస్‌తో సహా నామినీకి చెల్లించాలి. ఇన్ని సంవత్సరాలు పాలసీహోల్డర్ డబ్బు కడుతుంటే ఎల్‌ఐసి వారికి తిరిగిచ్చేది మాత్రం ఆఖరునే. అంటే, సుదీర్ఘకాలం కేవలం ఒక హామీని మాత్రమే ఆ సంస్థ వారికిస్తోంది. వాస్తవంగా జీవితబీమా అంటేనే దీర్ఘకాల కాంట్రాక్టు. అనేక ప్రైవేట్ కంపెనీలు ఈ కాంట్రాక్టుకు భిన్నంగా ప్రజలకు సొమ్ము చెల్లించకుండా ఎగ్గొట్టేస్తుంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేయాలని ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండు వచ్చింది. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ ఆనాడే ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలని సూచించి జాతీయకరణకు పట్టుపట్టారు. దరిమిలా వాటిని జాతీయం చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం ద్వారా 1956 సెప్టెంబర్ ఒకటిన ఎల్‌ఐసిని ఏర్పాటు చేశారు.
ఎల్ ఐ సి లక్ష్య వాక్యం యోగక్షేమం వహామ్యహం అనే భగవద్గీతా వ్యాక్యం. కుటుంబం అనేచిరుదీపాన్ని సంపాదించే వాడు హటాత్తుగా పోతే ఆర్థిక తుఫాన్లు, సుడిగాలుల్లో ఆరిపోకుండా రెండు చేతులు అడ్డు పెట్టి కాపాడే స్నేహశీలియైన సంస్థ ఎలైసీ. జీవిత భీమాను కూడా ప్రయివేటీకరించినపుడు, ఎన్ని విదేశీ సంస్థలు వచ్చి పోటికి నిలిచినా, భారతీయులంతా తమ బతుకులకు భరోసా అని నమ్మిన సంస్థ ఎలైసీ.
జనం ఆదరణ ఉండే ప్రభుత్వం సంస్థ ఏ విధంగా ఉంటుందో చూడాలంటే ఎలైసీ ఒక నమూనా. మచ్చుతునక. ఆదర్శ ఉదాహరణ. మిత్రుడు అజశర్మ రాసినట్టు ‘‘ఇప్పటి వరకు ఒక ప్రభుత్వసంస్థకు, ప్రవేట్‌సంస్థకు మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడానికి ఎల్‌ఐసి ఒక నమూనాగా నిలిచింది. క్లెయిమ్‌ల పరిష్కారంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది….. సుదీర్ఘకాలం వారి పొదుపు సొమ్మును ట్రస్టీగా కాపాడుతోంది. చిన్న మొక్కగా నాడు ఐదు కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రస్థానం నేడు ఇంతింతై, అంతింతై మహావృక్షంగా ఎదిగి 32 లక్షల కోట్ల రూపాయల పైగా ఆస్తులతో సంస్థ పటిష్ఠంగా ఉన్న సంస్థ.
ఈ దేశాన్ని వారి ఆర్థిక విధానాల్ని, బాంకులను, వారి వాగ్దానాలను నమ్మకుండా తమ పొదుపును మాత్రమే నమ్ముకుని బతికినందున ఎలైసీని ప్రభుత్వం నమ్ముకుంటే ఏటా 13న్నర కోట్ల రూపాయల ఆదాయం ఇస్తుంది, ఇది ఒక తిరుమలేశుని హుండీ వంటి సంస్థ. జనం డబ్బులతో అది ఎప్పుడూ నిండుతూనే ఉంటుంది. జనం నమ్మకానికి గుడి వంటి ఈ చిరుదీపాన్ని నమ్ముకోకుండా అమ్ముకోవడానికి చర్యలుతీసుకుంటున్న ఈ దుర్మార్గ విధానాన్ని జనం వ్యతిరేకించాలి. ఎలైసీ దీపం దివాళాకోరు విధానాల ప్రభంజనానికి ఆరిపోకుండా జనం రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడుకోవాలి.
అజశర్మ చెప్పినట్టు ఎల్‌ఐసిని ఒక పరస్పర ప్రయోజనకర సొసైటీ కిందే చూడాలి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పంచవర్ష ప్రణాళికల కోసం ప్రభుత్వానికి అవసరమైన నిధులను సమకూర్చడంలో అగ్రగామిగా ఉందీ ఎలైసీ. 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి మొత్తంగా 27.75 లక్షల కోట్ల రూపాయలు సమకూర్చింది. 13వ పంచవర్ష ప్రణాళిక కోసం ఏకంగా 28లక్షల కోట్ల రూపాయల సహాయాన్ని అందిస్తోంది. మౌలిక వసతుల కల్పన, గ్రామీణ పట్టణ ప్రాంతాభివృధ్ధి, ఇతర సామాజిక పథకాలకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తూ, ప్రజలకే కాకుండా దేశానికి కూడా బీమా కల్పిస్తోందని అజశర్మ వివరించారు. మనకు తెలియని మరోకోణాన్ని అజశర్మ ఆవిష్కరించారు. ఉద్యోగ నియామకాలలో కూడా సామాజిక న్యాయం పాటిస్తోంది. నేడు మొత్తం ఉద్యోగులలో 20 శాతం మందికి పైగా మహిళలే. ఇంత సామాజిక దృక్పథంతో పని చేయడం, ప్రజల పొదుపుసొమ్ముకు భద్రత కల్పించడం ఒక్క ప్రభుత్వసంస్థ ద్వారానే సాధ్యమైంది. లాభమే పరమావధిగా భావించే ఏ ఇతర ప్రైవేట్ సంస్థ దీని దరిదాపు కూడా చేరలేదు. ఇదీ! అలాంటి సంస్థను నేడు వాటాల అమ్మకంతో ప్రారంభించి క్రమేణా ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించాల్సిందే.
బడ్జెట్ లోటు తీర్చుకోవడానికి ఎలైసీని అమ్మి 96 వేలకోట్ల సొమ్ము చేసుకుంటారట. తాతలు సంపాదించిన సొమ్ము తెగనమ్ముకునే వాడు పరమ అసమర్థుడు. ఇంటి బంగారం అమ్మి బియ్యం పప్పుకొనుక్కునే వాడు అసలు దరిద్రుడు. ఎలైసీ అభివృద్ధి పూచిక పుల్ల సాయం చేయని ప్రభుత్వాలు, దశాబ్దాల కాలంగా జనం పెట్టుబడితో నిలబడి, అందరికీ ఆశ్రయం కల్పిస్తున్న కల్పవృక్షం. ఊడలుదిగి స్థిరంగా నిలదొక్కుకున్న మర్రిచెట్టు. అజశర్మ గారు అన్నట్టు ఈ గంగిగోవు వంటి సంస్థను అంబానీకో అదానికో అమ్ముకుందామనుకుంటున్నారు. 23 ప్రయివేటు కంపినీలు జీవితా భీమా వ్యాపారాన్ని మింగేయాలని ఎంతప్రయత్నించినా పావలా వాటా కూడ పొందలేక చతికిల పడ్డాయి. ఇప్పుడు మన ప్రభుత్వ దివాలాకోరు విధానాల పుణ్యమా అని మొత్తం ఎలైసీనే కబళించాలని చూస్తున్నాయి.
ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రథాన కార్యదర్శి అజ శర్మగారు ఈ విధంగా అన్నారు. ఇది జరగడానికి గాని అనుమతిస్తే, ఇక 1956 ముందునాటి పరిస్థితే ఏర్పడుతుంది. ప్రజల సొమ్ముకు భద్రత ఉండదు. ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు నిధులుండవు. సామాజిక న్యాయం అసలే ఉండదు. సంస్కరణ విధానాలలో భాగమే ఇదని ప్రభుత్వం సమర్ధించుకుంటుంది. ఎక్కడైనా సంస్కరణలంటే ప్రజలకు మేలు జరిగేలా ఉండాలి గాని, కీడు జరిగేలా ఉండకూడదు. ఆర్ధిక సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి నిధులు సమకూర్చే ఎల్‌ఐసి వంటి సంస్థలు ఉంటేనే దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఆశ్చర్యకరంగా మోదీ సర్కార్ అటువంటి సంస్థలనే అమ్మేయాలని కంకణం కట్టుకుంది. నిత్యం దేశభక్తి మంత్రం జపించే పాలకులకు ఇది ఏ రకమైన దేశభక్తిగా కనపడిందో వారికే తెలియాలి. ఎల్‌ఐసి నినాదం సంస్కృతంలో ‘యోగక్షేమం వహామ్యహం’. అంటే ‘మీ సంక్షేమమే మా బాధ్యత’ అని అర్థం. నేడు ఈ సంక్షేమం స్థానంలో సంక్షోభాన్ని సృష్టించడానికి ప్రభుత్వం పూనుకుంది. కాపాడవలసినవారే గొంతు నులిమేస్తుంటే, ప్రభుత్వరంగాన్ని, అందులోనూ ఎల్‌ఐసిని కాపాడుకునే బాధ్యత ఇక ప్రజలదే.
మీరు ఎలైసీని కాపాడుకోండి, ఎలైసీ మిమ్మల్ని కాపాడుతుంది. ఎలైసీ రక్షతి రక్షితః అని గుర్తు పెట్టుకోండి. ఎలైసీని అమ్ముకుని తినే ప్రభువులు ఎంత సమర్థులో ఆలోచించండి. భారతీయతను కాపాడుకోవాలంటే, భారతీయ జనతాను కాపాడుకోవాలంటే ఎలైసీని కాపాడుకోండి. పార్టీలను కాపాడడం మన కర్తవ్యం కాదు. మనను ఆదుకున్న సంస్థలను రక్షించడం మన కర్తవ్యం.