ఆకాశవాణిలో నాగసూరీయం -23
నదిని చూడాలంటే నది దగ్గరకి వెళ్లాలి… సముద్రం చూడాలంటే సముద్రం దగ్గరకి వెళ్ళాలి… అయితే ఆకాశం చూడాలంటే ఆకాశం దగ్గరకు వెళ్ళక్కరలేదు. మనం ఎక్కడనుంచైనా ఆకాశాన్ని చూడవచ్చు – అయితే ఆకాశం మనకు కనబడేలా స్థలాన్ని వెతుక్కుని చూడాలి! పగలు కనబడే ఆకాశం వేరు, రాత్రి కనబడే ఆకాశం వేరు! అలాగే రాత్రులు కూడా పున్నమి రోజు ఆకాశం వేరు, అమావాస్య ఆకాశం వేరు! మరిన్ని చుక్కలు కనబడాలంటే అమావాస్య ఒకటే సరిపోదు… మనం చూసే ప్రదేశంలో చుట్టుపక్కల కాంతి (యాంబియంట్ లైట్) తక్కువ వుండాలి. పెద్ద పట్టణాల్లో, నగరాల్లో బయట కాంతి విపరీతంగా ఉంటుంది కనుక ఆకాశం, చుక్కలు చూడాలంటే జనావాసాలకు దూరంగా వెళ్ళాలి. ఆకాశ దర్శనం చెయ్యాలంటే ఇది తప్పనిసరి!
సైన్స్ బ్రాడ్ కాస్ట పట్ల ఆసక్తి
1995లో కొంతకాలం నేను న్యూఢిల్లీ నుంచి సైన్స్ కార్యక్రమాన్ని ఆకాశవాణి అన్ని కేంద్రాలకు రూపొందించాను. దేశవ్యాప్తంగా ఆకాశవాణి మిత్రుల నుంచి సైన్స్ అంశాలు ఆహ్వానించి వాటి ఆధారంగా ఆ కార్యక్రమం తయారయ్యేది. సైన్స్ బ్రాడ్ కాస్ట్ మీద ఆసక్తి ఉంది కనుక అవకాశం లభించినపుడు సంబంధింత విషయాలు తారసపడినప్పుడు అధ్యయన దృష్టితో పరిశీలించే వాడిని. అలా తెలిసిన విషయం ఏమిటంటే రేడియో ద్వారా ఆకాశ దర్శనం గురించి అవగాహన కల్గించే కార్యక్రమాలు అప్పటికే చాలా భాషలలో ప్రసారమయ్యాయని బోధపడింది. మరాఠి, తమిళం, కన్నడం వంటి పొరుగు భాషలలో ఆ ప్రయత్నం బాగానే జరిగింది. అయితే, ఏ కారణం చేతనో తెలుగులో అసలు జరగలేదని అర్థమయ్యింది. విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో స్కైవాచ్ చాలా ప్రధానమైన మార్గం. మరి తెలుగులో ఆ రకమైన కృషి జరుగకపోవడం కించిత్ బాధ కల్గించేది. ఇదీ నేపధ్యం!
Also read: నింగిని పరికిద్దాం!
తిరుపతిలోనే కుదిరింది
సరే, అలాంటి ప్రయత్నం 2016 మార్చి 6న నెల్లూరు మిత్రుల సాయంతో జరిగిన విషయం ఇదివరకే వివరించాను. మరి ఆకాశవాణిలో ఎప్పుడు చేశాను? నేను ఉద్యోగరీత్యా తెలుగు ప్రాంతాలలో అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, కడప, మద్రాసు, తిరుపతి నగరాలలో పని చేశాను. ఎక్కడా సాధ్యం కానిది, తిరుపతిలో 2017లో 22 సంవత్సరాల తర్వాత వీలయ్యింది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి తిరుపతిలో రీజినల్ సైన్స్ సెంటర్ ఉండటం, రెండవది ఆసక్తి ఉన్న నేను ఈ కార్యక్రమాన్ని కీలకవ్యక్తిగా రూపొందించే అవకాశం కలగడం! నెలకోసారి చొప్పున కొన్నినెలలపాటు ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసి ప్రసారం చేశాం. తొలి కార్యక్రమం నిర్వహించగానే ‘ది హిందూ’ వంటి దినపత్రికలు చాలా ప్రధానంగా వార్తాంశంగా ప్రచురించాయి. దేశవ్యాప్తంగా నా మిత్రులు ఎంతోమంది ఈ సమాచారాన్ని తెలుసుకున్నారు. దీనికి నా ఫేస్ బుక్ అకౌంట్ ఎంతో దోహదపడింది. దీని పరాకాష్ట ఏమిటంటే ఆకాశవాణి సిఈఓ అభినందిస్తూ ట్విట్టర్ లో సందేశం పెట్టడం. ఈ విషయం కూడా మద్రాసు ఆకాశవాణి మిత్రుల ద్వారా నాకు తెలిసింది.
Also read: తెలుగు కథానిక శతవార్షిక సందర్భం
తిరుపతి పట్ల శంకర్ దయాళ్ శర్మ ప్రత్యేక ప్రేమ
తెలుగు ప్రాంతాలలో ఉండే రీజినల్ సైన్స్ సెంటర్ తిరుపతిలో 1993లో మొదలైంది. అప్పటి భారత రాష్ట్రపతి శంకరదయాళ్ శర్మ ప్రారంభించినట్టు గుర్తు. అంత క్రితం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగవర్నర్ గా ఉన్నప్పుడు తిరుపతి పట్ల ప్రత్యేక ప్రేమను చూపడం కూడా మనకు తెలుసు. తొలుత ఇప్పుడు తిరుపతిలో ఆర్ టిసి బస్టాండు ఉన్న చోటుకు దగ్గర అని ఆలోచించి, చివరకు కొంచెం దూరంగా అలిపిరికి దగ్గరగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అలిపిరి – జూపార్క్ రోడ్డు మీద వేద విశ్వవిద్యాలయానికి దగ్గరగా ఈ సైన్స్ సెంటర్ ఉంది. బెంగుళూరు వెళ్ళే (తిరుపతికి వెళ్ళని) బస్సులు ఇదే మార్గంలోనే వెడతాయి.
Also read: తెలుగు నాట స్వాతంత్ర్య సమర పోరాటం
రీజియనల్ సైన్స్ సెంటర్
ఇద్దరు వ్యక్తులు కలవడం వేరు, రెండు సంస్థలు కలసి పనిచేయడం వేరు. సైన్స్ మ్యూజియం సైన్స్ అండ్ టెక్నాలజి శాఖలో ఉంటుందని భావిస్తాం. కానీ కాదు. మినిస్ట్రి ఆఫ్ కల్చర్ అజమాయిషీలో ఇది ఉంటుంది. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నికల్ మ్యూజియం, బెంగుళూరు, వారి పర్యవేక్షణలో పనిచేస్తుంది తిరుపతి రీజినల్ సైన్స్ సెంటర్. తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఏమాత్రం వీలున్నా సైన్స్ సెంటర్ కి వెళ్ళడం నాకు ఇష్టం. అక్కడ సైన్స్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మనం హైస్కూలు దాకా చదువుకున్న సైన్స్ సూత్రాలు అక్కడ ఆసక్తిగా, ఆడుకుంటూ పరీక్షించవచ్చు. ఆ పని చేస్తున్నట్టు కూడా అనిపించదు. అలా ఉంటుంది అక్కడ కాలక్షేపం. అంతేకాక బయట కూడా తోట చాలా విశాలంగా, కంటికింపుగా ఉంటుంది.
మణిగండన్ ప్రత్యేక ఆకర్షణ
ఈ ఆకర్షణలకు మించిన ఆకర్షణ ఆ మ్యూజియం క్యూరేటర్ మణిగండన్. తమిళనాడులో కుంభకోణం వారి సొంతఊరు. వారి యిల్లు శ్రీనివాస రామానుజన్ ఇంటి దగ్గర ఉంటుంది. నేను స్కైవాచ్ ఆలోచన చెప్పగానే ఆయన అభినందించి ఆహ్వానించారు. అలా ‘రండి చూసొద్దాం తారామండలం’ కార్యక్రమం రూపుదిద్దుకుంది. తిరుపతి ఆకాశవాణిలో ఓ రెండురోజులు ముందునుంచే ఈ కార్యక్రమానికి బాలబాలికలను తీసుకురమ్మని రేడియోలో ప్రకటనలు ఇచ్చేవాళ్ళం. అలా రాత్రి ఏడున్నరకు సైన్స్ మ్యూజియం ఆవరణకు పిల్లలు, పెద్దలు రాగానే కార్యక్రమం మొదలయ్యేది. టెలిస్కోపులో పిల్లలు చూస్తూ అడిగే ప్రశ్నలకు నిపుణులు జవాబులు చెప్పేవారు. అలా పిల్లల ప్రశ్నలు, ప్రవీణుల జవాబులతో సైన్స్ ప్రోగ్రాం రికార్డు చేసేవాళ్ళం. రికార్డు చేసిన విషయాలు కుదించి మరుసటిరోజు కొన్ని రోజులపాటు మంచి వ్యాఖ్యానం జోడించి శ్రోతలకందించేవారం. ఇది కొన్ని నెలలు సాగింది. గొప్పగా చేశామని కాదు, మంచి ఆలోచనతో తెలుగు ఆకాశవాణి కేంద్రాలలో చేసిన తొలి కార్యక్రమం ఇది! ఈ విషయం సంబంధించి నేనెంతో గౌరవించే డా పి ఎస్ గోపాలకృష్ణ నుంచి అభినందనలందుకోవడం ఒక తృప్తి!
Also read: కదంబ కార్యక్రమాలకు పునాది
విషాదం
తర్వాత ‘అడగండి – తెలుసుకోండి‘ అంటూ శ్రోతల సైన్స్ ప్రశ్నలకు శాస్త్రవేత్తల జవాబులను సభలో వినిపించేవారం. దీని రికార్డింగు కూడా కుదించి శ్రోతలకు ప్రసారం చేశాం! ఇదో తృప్తి, ఆనందం!
ఏప్రిల్ 10 మణికందన్ బర్త్ డే! ఫేస్ బుక్ గ్రీటింగ్స్ కూడా చెప్పాను. అయితే ఒకరోజు ఆలస్యంగా తెల్సింది ఏమిటంటే 59 సంవత్సరాల మణికందన్, 2021 ఏప్రిల్ 9న కోవిడ్ తో కనుమూశారని. నాకూ తనకు ఒక సంవత్సరం పైచిలుకు తేడా! ఈ వార్త తెలియడంతో ఒకటే విషాదం, బాధా! అదే ఈ వ్యాసాన్ని రాయించింది!
Also read: రేడియోకూ, పత్రికలకూ పోలిక ఉందా?
డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్: 9440732392