ఆవు పేడ తిని, గోమూత్రం తాగుతున్న హరియాణా డాక్టర్లు
ఈ దేశానికి కొత్త వైరస్ సోకింది.
జాగ్రత్తగా ఉండండి!
ఇది ప్రశ్నను కాపు కాచి హత్య చేస్తుంది
ముస్లింలు, మైనార్టీలు, దళితులపై
బాహాటంగానే దాడి చేస్తుంది
ఊపిరి పీల్చుకుంటే వదలనివ్వదు
వదిలితే పీల్చుకోనివ్వదు ఈ వైరస్!
గడ్డకట్టే చలిలో అక్కడ
రైతులకు రక్తపరీక్ష చేస్తుంది
బ్యాంకులో నాలుగు డబ్బులుంటే చాలు
లాగేసుకుని, నిన్ను రోడ్డున పడేస్తుంది
కాపలాదారు వైరస్ రూపంలో వచ్చి
చేతిలో చిల్లిగవ్వ ఉండనివ్వడు
వైరస్ ‘చాయ్ వాలా’గా వచ్చేసి
మన చాయ్ మనల్ని తాగనివ్వదు.
ఈ వైరస్ ఇంటికి ఎలా వస్తుందో
మనకే తెలియట్లేదు-
గ్యాస్ బండతో వస్తోందా?
కూరగాయలతో వస్తోందా?
బండిలో పెట్రోల్ తో వస్తోందా?
సరుకులతో వస్తోందా?
జనాలతో కలిసి మెలసి ఉండొద్దని
చెపుతోంది వైరస్-
కులాల పేరుతో, మతాల పేరుతో
వేరు చేస్తుంది వైరస్-
మనుషులంతా ఒక్కటే అన్నవాణ్ణి
పక్కదేశం పొమ్మంటోంది వైరస్.
ఆవు పేడ పూసుకుని…ఈ వైరస్,
ఆవు మూత్రం తాగుతుంది!
నినాదాల్లేవ్, హక్కుల్లేవ్, పోరాటాల్లేవ్
ఎక్కువ మాట్లాడితే,
నువ్వు ఈ దేశం పౌరుడివని రుజువేంటి?
అని ప్రశ్నిస్తుంది వైరస్!
దేశభక్తి – చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుంది
చదువుకున్న వారి చదువులన్నీ
ఈ వైరస్ తో చంకనాకి పోతాయ్
అబద్ధాల ఫ్యాక్టరీలో ఉన్నతాధికారులవుతారు.
చెవుల్లో పూలు పెట్టి వైరస్,
వీరితో భజనలు చేయిస్తుంది
శరీర భాగాల్లో కాకుండా ఈ వైరస్,
కేవలం మెదడ్లలో తిష్ట వేస్తుంది-
ఆలోచనల్ని తొలిచేసి డొల్లగా చేస్తుంది.
రోడ్డు మీద మనుషులు తిరగాలి
కానీ ఎవరిలోనూ మనిషితత్వం ఉండకూడదు.
మానవత్వం మిగలకూడదు
అయితే మరి, ఇప్పుడ ఏం చేద్దాం?
నువ్వూ, నేనూ సానిటైజర్ రుద్దకుంటూ
కూర్చుంటే కాదురా తమ్ముడూ!
లే… దేశాన్ని కేకెయ్! అందరినీ పిలువ్…
ఈ దేశాన్ని సానిటైజ్ చేయాల్సి ఉంది!
రండి! ఈ దేశాన్ని సానిటైజ్ చేద్దాం!! రండి…రండి!!