ఈ దేశానికి కొత్త వైరస్ సోకింది.
జాగ్రత్తగా ఉండండి!
ఇది ప్రశ్నను కాపుకాచి హత్య చేస్తుంది
ముస్లింలు, మైనారిటీలు, దళితులపై
బాహాటంగానే దాడి చేస్తుంది
ఊపిరి పీల్చుకుంటే వదలనివ్వదు
వదిలితే పీల్చుకోనివ్వదు ఈ వైరస్!
గడ్డకట్టే చలిలోఅక్కడ
రైతులకు రక్తపరీక్షలు చేయిస్తుంది
బ్యాంకులో నాలుగు డబ్బులుంటే చాలు
లాగేసుకుని, నిన్ను రోడ్డున పడేస్తుంది
కాపలాదారు వైరస్ రూపంలో వచ్చి
చేతిలో చిల్లి గవ్వ ఉండనివ్వడు
వైరస్ ‘చాయ్ వాలా’గా వచ్చేసి
మన చాయ్ మనల్ని తాగనివ్వడు
ఈ వైరస్ ఇంటికి ఎలా వస్తుందో
మనకే తెలయట్లేదు-
గ్యాస్ బండతో వస్తోందా?
బండిలో పెట్రోలుతో వస్తోందా?
కూరగాయలతో వస్తోందా?
సరుకులతో వస్తోందా?
జనాలతో కలిసిమెలసి ఉండొద్దని
చెపుతోంది వైరస్
కులాల పేరుతో, మతాల పేరుతో
వేరు చేస్తుంది వైరస్-
మనుషులంతా ఒక్కటే అన్నవాణ్ణి
పక్కదేశం పొమ్మంటుంది వైరస్
ఆవుపేడ రాసుకొని …ఈ వైరస్,
ఆవుమూత్రం తాగుతుంది!
నినాదాల్లేవ్, హక్కుల్లేవ్, పోరాటాల్లేవ్
ఎక్కువ మాట్లాడితే
నువ్వు ఈ దేశ పౌరుడవని రుజువేంటి?
అని ప్రశ్నిస్తుంది వైరస్!
దేశభక్తి – చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటుంది
చదువుకున్నవారి చదువులన్నీ
ఈ వైరస్ తో చంకనాకి పోతాయ్
అబద్ధాల ఫ్యాక్టరీలో ఉన్నతాధికారులవుతారు.
చెవుల్లో పూలు పెట్టి వైరస్,
వీరితో భజన చేయిస్తుంది
శరీరభాగాల్లో కాకుండా ఈ వైరస్,
కేవలం మెదడ్లలో తిష్టవేస్తుంది-
ఆలోచనల్ని తొలిచేసి డొల్లగా చేస్తుంది
రోడ్డు మీద మనుషులు తిరగాలి
కానీ, ఎవరిలోనూ మనిషతత్వం ఉండకూడదు
మానవత్వం మిగలకూడదు
అయితే, మరి ఇప్పుడు ఏం చేద్దాం?
నువ్వూ, నేనూ సానిటైజర్ రుద్దుకుంటూ
కూర్చుంటే కాదురా తమ్ముడూ!
లే, దేశాన్నికేకెయ్, అందర్నీ పిలు
ఈ దేశాన్ని సానిటైజ్ చేయాల్సి ఉంది!
రండి! ఈ దేశాన్ని సానిటైజ్ చేద్దాం!! రండి…రండి!!
Also read: సంత్ కబీర్ మానవవాద కవితలు