జెండా వందనం మన సంప్రదాయంలో చాలా విలువైన భాగం. దేశభక్తిని చాటుకోడానికి, ఐకమత్యాన్ని నింపుకోడానికి, దేశ స్వేచ్ఛ కోసం త్యాగాలు చేసిన మహానీయులను గుర్తు చేసుకోడానికి, భారతీయతను ఆణువణువునా గుండెల్లో నిలుపుకోడానికి మన మువ్వన్నెల జెండా మూలాధారం.
తెలుగు నేలపైనే తొలి రెపరెపలు
అది నిర్మాణమై, తొలిగా తెలుగునేలపైనే రెపరెప లాడింది. దాన్ని నిర్మించింది కూడా మన తెలుగువాడే.ఈ అద్భుతమైన ఘట్టం జరిగి వందేళ్లు పూర్తయింది. జాతి మొత్తం దీన్ని గొప్ప వేడుకగా జరుపుకోవాల్సిన శుభ సందర్భం. తెలుగువారికి పర్వదినం, తెలుగు నేలకు పుణ్యఫలం. ముందుగా, మన మూడు రంగుల జెండాకు, దాని రూపకర్త పింగళి వెంకయ్యకు మనసా వచసా శిరసా వందనాలు సమర్పించుకుందాం.
విజయవాడ ఏఐసీసీ సభలు
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సమావేశాలు మార్చి 31,ఏప్రిల్ 1వ తేదీన విజయవాడలో జరిగాయి. ఆ సందర్భంగా, మేరు నగధీరులైన స్వాతంత్ర్య సమరవీరుల సమక్షంలోనే మన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని జాతిపిత మహాత్మాగాంధీకి సభక్తికంగా సమర్పించారు. నాడు యావత్తు భారతదేశమంతా విజయవాడవైపు, పింగళి వెంకయ్య వైపు అబ్బురంగా చూసింది. బ్రిటిష్ వారితో భీకరంగా పోరు జరుగుతున్న వేళ, మన ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పతాకం నిలిచింది. నేడు, తెలుగువారంతా వడలు మరచి, తలపైకెత్తి చూడవల్సిన మహా సందర్భం. ఈరోజు మనం ఎగుర వేసుకుంటున్న ఈ జెండా కేవలం మూడు గంటల్లోనే పూర్తయింది. దీని వెనుక ఎంత చరిత్ర వుందో, అంత శ్రమ ఉంది. ఎంతటి సృజన వుందో అంతటి పట్టుదల ఉంది. అన్నింటికీ మించిన అఖండ దేశభక్తి ఉంది.
Also Read : మహారాష్ట్రలో మహానాటకం
త్యాగఫలం, యోగాఫలం
ఈరోజు మనం అనుభవించే స్వేచ్ఛలు ఊరికే రాలేదు. ఎందరో కర్మయోగుల త్యాగఫలం. ఎందరో పుణ్యమూర్తుల యోగఫలం. జాతీయ పతాకం నిర్మాణం వెనుకాల వేదన కూడా దాగి వుంది. కలకత్తా వేదికగా 1906లో భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగినప్పుడు వందన సమర్పణకు మనకంటూ ఒక జెండా కూడా లేదు. బ్రిటిష్ వారి పతాకానికి నమస్కరించాల్సిన దుస్థితి వచ్చింది. దాదా భాయ్ నౌరోజీ వంటి పెద్దలు మనసులోనే కలత చెందిన చీకటి రోజు అది. ఆ శోకంలో ఒక శ్లోకం పలికె..
పింగిళి వెంకయ్య సంకల్పం
ఆ చీకటి ఎదలో దీపం వెలిగె.. అన్నట్లుగా, అక్కడే వున్న పింగళి వెంకయ్యకు మనకంటూ ఒక జెండా ప్రత్యేకంగా ఉండాలనే సంకల్పం మదిలో రగిలింది. తన ఆశయాన్ని పార్టీ పెద్దలందరికీ చెప్పారు. అందరికీ నచ్చడంతో, జెండా నిర్మాణంపై ఏకాభిప్రాయం వచ్చింది. అప్పటి నుంచి వెంకయ్య
పరిశోధన, నిర్మాణం
జెండా రూపకల్పనపై పరిశోధన, అధ్యయనం ప్రారంభించారు. అది 1921కి సంపూర్ణంగా కార్యరూపం దాల్చింది. తర్వాత చిన్న చిన్న మార్పులు జరిగి, ఈనాడు మనం ఎగుర వేస్తున్న జెండా రూపకల్పన జరిగింది.ఈ మార్పులు చాలా చిన్నవి. మూలం, అసలు స్వరూపమంతా మన పింగళివారి సృష్టించిందే. జెండా నిర్మాణం చెయ్యాలని ఆలోచన వచ్చిన వెంకయ్య విస్తృతమైన పరిశోధన చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల జెండాలన్నింటినీ అధ్యయనం చేశారు. వాటితో పాటు మన దేశానికి ఉండాల్సిన జెండా ఎలా ఉంటే బాగుంటుందో? రకరకాలుగా మనసులో ముద్రించుకున్నారు. వీటన్నిటిని క్రోడీకరిస్తూ 1916లో ఇంగ్లిష్ లో ఒక పుస్తకం రాశారు.
Also Read : మయన్మార్ మారణహోమం
దాని పేరు వేరు
దాని పేరు ” ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా “. దాన్ని మహాత్మాగాంధీకి, పలువురు పెద్ద నేతలకు కూడా చూపించారు.తర్వాత జరిగిన ప్రతి సమావేశంలోనూ గాంధీ – వెంకయ్య మధ్య జెండా గురించి చర్చలు జరిగేవి. అయ్యదేవర కాళేశ్వరరావు ప్రోద్బలం, పట్టుదలతో అఖిల భారత కాంగ్రెస్ సమితి సమావేశాలకు విజయవాడ వేదికయ్యింది. అది వరకూ, ఆ సభలన్నీ ఉత్తర భారతంలోనే జరిగేవి. ఈ సమావేశాలు విజయవాడలో జరగడానికి, ఊహలకు అతీతంగా విజయవంతంగా సంపూర్ణమవ్వడానికి అయ్యదేవరవారి పాత్ర చాలా కీలకమైంది.
జెండాతో పాటు నిధులు కూడా
జెండా రూపకల్పనతో పాటు, జాతీయ ఉద్యమ నిర్వహణకు కావాల్సిన నిధులు అప్పటికప్పుడు ఆ సమావేశాల్లోనే పోగయ్యాయి. కోటి మంది సభ్యులు ఏర్పాడాలనే సంకల్పానికి గట్టి పునాదులు అక్కడే ఏర్పడ్డాయి. విజయవాడలో జరిగిన ఆ రెండు రోజుల సమావేశాలపై ప్రత్యేక రచనలు చేయాల్సిన అవసరం వుంది. ఈ తరాలకు, ముఖ్యంగా తెలుగువారందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా వుంది. గాంధీకి – వెంకయ్యకు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే మంచి పరిచయం ఉంది. ఆ పరిచయం అలా పెరిగింది. జెండా నిర్మాణ దశలో అది మరింత వృద్ధి చెందింది.
గాంధీజీ వత్తిడి
విజయవాడ సమావేశాల సందర్భంగా, అప్పటికప్పుడు జెండా నమూనా కావాలని పింగళివారిపై గాంధీ వత్తిడి తెచ్చారు.కేవలం మూడు గంటల సమయంలో, మూడు రంగులతో జెండా నమూనా తయారుచేసి, ఆయన గాంధీకి సమర్పించారు. బందరు జాతీయ కళాశాలలో చిత్రలేఖనం ఆచార్యుడైన ఈరంకి వేంకటశాస్త్రి సహకారంతో రంగులు అద్దారు. మూడు రంగుల ఎంపికలో… మత సామరస్యతకు పెద్దపీట వేశారు.
Also Read : బంగ్లాదేశ్ తో బలపడుతున్న బాంధవ్యం
భారతీయ చింతనకు ప్రతిరూపం
భారతీయుల ఆలోచనా విధానం, తాత్వికత, గ్రామసీమల జీవనం,హృదయం దాగి వున్నాయి. మధ్యలో తామర పుష్పాన్ని పెట్టాలని పింగళివారు ఆలోచన చేశారు. ఖద్దరు ఉద్యమానికి ప్రతీకగా రాట్నం ఉండాలని గాంధీ సలహా మేరకు రాట్నాన్ని పొందుపరిచారు. మొదటగా ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులతో తీర్చి దిద్దారు.1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో రంగులపై సిక్కులు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు. దీనితో, ఎరుపు బదులు కాషాయ రంగుగా మార్పు చేశారు.
రాట్నం స్థానంలో అశోక చక్ర
తర్వాత, రాట్నం స్థానంలో అశోక చక్రం చేరింది.1947, జులై 22వ తేదీ నాడు జవహర్ లాల్ నెహ్రు ఆధ్వర్యం లో, రాజ్యంగ పరిషత్ లో జాతీయ పతాకంపై తీర్మానం పెట్టారు. దానికి అప్పుడే ఆమోదం లభించింది.కానీ, 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత,భారత డొమినియన్ కు అధికారిక పతాకంగా శాశ్వతమైన ఆమోదముద్ర పడింది.కాషాయం త్యాగానికి గుర్తుగా, స్వచ్ఛమైన మన ప్రవర్తనను చూపించే వెలుగుగా తెలుపును, సత్యానికి ఆలంబనగా ఆకుపచ్చ రంగులు విలసిల్లుతాయని సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు వివరించారు.
అంతేగాక, మనిషితో పాటు ఎన్నో జీవరాశులు ఆధారపడే చెట్లకు సాక్షిగానూ ఆకుపచ్చ రంగు నిలుస్తుందని ఆయన తాత్పర్యం చెప్పారు. అశోక చక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం, అహింసలను ఆచరించడానికి మన పతాకమే స్ఫూర్తి.చక్రం చలనానికి, చైతన్యానికి చిహ్నం. ఇన్ని అర్ధవంతమైన ఆలోచనల, ఆశయాల పునాదిగా మన మువ్వన్నెల జెండా నిర్మాణం జరిగింది.మన జెండా ప్రాముఖ్యతపై గురజాడ అప్పారావు ఒక గేయాన్ని కూడా రాశారు.
Also Read : భారత్ – పాక్ సంబంధాలలో సామరస్యమే ప్రధానం
“ఇదియే జాతీయ జెండా. జాతికిదియే ప్రాణం.. మానం ఇదియే..” అంటూ ఈ పాట సాగుతుంది. బేహాగ్ రాగంలో దీన్ని స్వర పరిచారు. నాడు, ఉద్యమ స్ఫూర్తితో ఎందరో ఈ గీతాన్ని ఆలపించేవారు.ఛత్రపతి శివాజీ కాలం తర్వాత, 200ఏళ్ళ పాటు మనకంటూ ఒక జెండా లేకుండానే మనం నడిచాం. ఆ లోటును తీర్చిన మహనీయుడు పింగళి వెంకయ్య.1921లో విజయవాడలో, విక్టోరియా మహల్ వేదికగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరగడానికి మూల పురుషుడు మన అయ్యదేవర కాళేశ్వరరావు. వీరంతా మన తెలుగువారు కావడం మన భాగ్యం. మన జెండా పండుగకు వందేళ్లు సంపూర్ణమైన సందర్భంగా, జాతీయ జెండాకు, జాతి నేతలందరికీ వందనాలు సమర్పిద్దాం.