తిరుప్పావై సిరినోము -15
మాడభూషి శ్రీధర్
30 డిసెంబర్ 2023
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్
తెలుగు మాడభూషి శ్రీధర్ భావార్థ గీతిక
‘కులుకుపలుకుల చిన్నారి చిలుక నీకింక కునుకేల’
’చెవులుజల్లన అరవకే, నేనిపుడె వచ్చెదనులేవే‘
’కలికి నెరజాణ నీ మాట తెలివి మాకు తెలుసులేవే‘
’మీకన్నజాణలు వేరెవ్వరే, పోనీ మీరే పరిపూర్ణులేలే‘
’తెమిలి ఇకనైన రమ్ము‘, ’మరి చెలులెల్ల వచ్చినారొ?‘
’అనుమానమేల సఖీ నీవె వచ్చి లెక్కించుకోవచ్చులే‘
కువలయాపీడమ్ముగూల్చి కంసాది రాక్షసుల కడతేర్చిన
బాలకృష్ణుడి భక్తి సేవించ రారమ్మ గొల్ల భామలారా
తిరుమంగైయాళ్వార్ మేలుకొలుపు
మనము పలికిన పలుకులనే మళ్లీ పలికేది చిలుక. ఈ పాశురములో తిరుమంగైయాళ్వార్ ను మేలుకొలుపుతున్నారు.
తిరుమంగై ఆళ్వార్ చోళదేశమందలి తిరుక్కరయలూర్ గ్రామవాసి. శూద్రుడని అంటారు. సా.శ. 776 కాలంనాటిఅనుకుంటారు. పూర్వాశ్రమంలో శృంగార పురుషుడు. తరువాత భక్తుడై పెరుమాళ్ళను స్తుతించాడు.తిరుమంగై అల్వార్ ను తిరుమంగై మన్నన్ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వారులలో చివరివాడు.అతనికి అద్భుతమైన కవితా “నర్కవి పెరుమాళ్” అనే బిరుదు ఉంది. అతనికి పరకాలయోగి అని కూడా పిలుస్తారు.
పద్మాంశమున జన్మించిన కుముదవల్లి నాచ్చియార్లను వివాహం చేసుకున్నారు. శ్రీవైష్ణవ ఆరాధన చేస్తూనే పూజా ద్రవ్యములకోసం దొంగతనాను చేసేవారు. ఆయన్ను పరీక్షించడానికి పెండ్లి కుమారుని వేషములో వచ్చిన శ్రీమహావిష్ణువుని కూడా దోచి స్వామి పాదస్పర్శచేసి జ్ఞానోదయాన్ని సాధించారు. “నాన్‌కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్ఱుం నామమ్” అని తిరుమంత్రమును కూడా ఆయన ప్రకాశింపజేసారు.
చోళరాజు వద్ద సేనాధిపత్యము కూడా వహించాడు. కొన్ని సంవత్సరాలు, దేశాటనపరుడై సుమారు 80 పుణ్యస్థలములను దర్శించారు. విష్ణుసంకీర్తనలను జేసినాడు. పెరియ తిరుమొణ్, తిరుక్కురుందాండకం తిరునెడుందాండకం, చిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరువేము కూరిరుక్కై అనే షట్ప్రబంధములను రచించి, మహాకవియై నార్కవిప్పెరుమాన్, అనగా చతుర్విధ కవితా చక్రవర్తి అనుపేరొందినాడు.
జైన బౌద్ధమతాలను, శైవాన్ని కూడా ప్రతిఘటించి వైష్ణవ మతవ్యాప్తిలో ప్రముఖులు. ఒక బౌద్ధమతాలయము లోని స్వర్ణవిగ్రహమును చెరిపించి, ఆసొమ్ముతో శ్రీరంగనాధుని ఆలయమునకు తృతీయ ప్రాకారనిర్మాణము చేయించినాడట. శైవులు శివ పారమ్యాన్ని నిరూపించడానికి ఆయన దక్షిణ వామాంగములలో బ్రహ్మ విష్ణు ఉద్భవించినారని అంటారు, ఈతడు విష్ణువే సృజించి, మూర్తిత్రయ రూపములు దాల్చివిశ్వవ్యాప్తి ఉన్నారనీ శమ దమాదులతో కలిగి ధర్మమార్గమున ఏకైక భక్తి వాడికి. ముక్తి సాధిస్తారని ప్రతిపాదించారు.
నమ్మాళ్వార్ ‘‘శ్రీమతే శఠగోపాయనమః’’
ఇక్కడ గురుపరంపరా వాక్యము ‘‘శ్రీమతే శఠగోపాయనమః’’. నమ్మాళ్వార్ ఆళ్వారులందరిలో చిన్నవారు. తిరువాయ్ మొళి నాకు సంతచెప్పి నాచే పలికించారని వీరు చెప్పుకున్నారు. నమ్మాళ్వార్ ఒక తమిళ కవి. దక్షిణ భారతదేశంలోని వైష్ణవ సంప్రదాయానికి చెందిన 12 మంది ఆళ్వార్లలో ముఖ్యులు. 9వ శతాబ్దంలో జీవించారు. భక్తి స్తోత్రాలకు విష్ణువుకు అంకితం చేసారు. 4,000 నాలాయరం అనే శ్లోకాల సమాహారమైన దివ్య ప్రబంధంతో రూపొందించారు.తమిళ సాహిత్యంలో గొప్ప కవులలో ఒకరిగా పరిగణించబడ్డాడు, వారి రచనలు దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
Also read: ఆకాశవర్ణునికి ఆరాధనలు జేసి మంగళమ్ములు పాడ
నమ్మాళ్వార్ తమిళనాడులోని తిరుక్కురుగూర్ (ప్రస్తుత ఆళ్వార్తిరునగరి) పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. విష్ణువు సైన్యానికి ప్రధాన సేనాధిపతి అయిన విష్వక్సేనుడి అవతారం. పురాణాల ప్రకారం, నమ్మాళ్వార్ తన జీవితంలో మొదటి 16 సంవత్సరాలు మాట్లాడలేదు మరియు విష్ణువును ధ్యానిస్తూ గడిపాడు.నమ్మాళ్వార్ బోధనలు నేటికీ ప్రజలను ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి. వారి కీర్తనలు ఇప్పటికీ తమిళనాడు అంతటా దేవాలయాలలో పాడబడుతున్నాయి.
నమ్మాళ్వారుల శ్రీ సూక్తులనే వీరు అనుసరించి, అనుకరించి సాధించినారు. కనుక వీరే చిలుక, ఇళంకిళియే లేత చిలుక. చిలుక పలుకుల వలె వీరి సూక్తులు అతి మధురములు. 16 సంవత్సరాలు నిద్రించి ఉన్నారు కనుక ఇంకా నిద్ర సరిపోలేదా ‘‘ఇన్న మురంగిదియో’’ అన్న వాక్యం సరిపోతుంది. వీరు పరిపూర్ణులు కనుక నంగైమీర్ అనే సంబోధన కూడా సరిపోతుంది.
భాగవత సహవాసం వల్లనేగురుకృప
తమిళ పదాలు తెలుగు అర్థాలు
ఎల్లే ఇళంకిళియే= ఓ లేత చిలుకా, ఇన్నం =ఇంకను, ఉఱంగుదియో = నిద్రించుచున్నావా, (అపుడు లోనున్న గోపిక) శిల్ ఎన్ఱ్ = జిల్లుమని, అరైయేన్మిన్ = పిలవకండి, నంగైమీర్= పూర్ణురాలా, పోదరుగిన్ఱేన్ =వస్తున్నాను, వల్లై = ఓ నేర్పుగలదానా, ఉన్ కట్టురైగళ్ = నీనేర్పుగల మాటలను, పణ్డే = ముందే, అఱిదుమ్ = ఎఱుగుదుము, వల్లీర్గళ్ = నేర్పరులు, నీంగళే =మీదే, నానే తాన్ = పోనీ నేనే, ఆయిడుగ = అగుదునుగాక, (బయటిగోపికలు) ఒల్లై = వేగముగా, నీ =నీవు, పోదాయ్ = రమ్ము, ఉనక్కు = నీకు, ఎన్న = ఏమి, వేఱుడైమై = వేఱే ప్రత్యేకత, (లోని గోపిక)
ఎల్లారుం = అందరునూ, పోందారో = పోయినారో,(బయటిగోపికలు) పోందార్ = పోయిరి, పోంద్ = బయటకు వచ్చి,-ఎణ్ణిక్కోళ్ = లెక్కపెట్టుకో, వల్లానై = చాలా బలముగల ఏనుగును, కొన్ఱానై = చంపిన వాడు, మాత్తారై = శత్రువుల, మాత్తు = బలము, అలిక్కవల్లానై =నశింపచేయ సమర్థుడైన, మాయనై = మాయావి యగు, ప్పాడ= కీర్తించి పాడడానికి, ఏలోర్ ఎమ్బావాయ్ =వ్రతమునకు లేచి రమ్ము.
భావార్థాలు
బయటవేచి ఉన్న గోపికలకు లోన ఉన్నటువంటిగోపికలకు మధ్య సంభాషణతో కొనసాగుతుందీ పాశురం. మాయనై లీలామానుష విగ్రహుడై శ్రీకృష్ణుడిని కీర్తించడానికి కదలి రమ్మని బయట ఉన్న గోపబాలికలు పిలుస్తున్నారు.సహనం తోసాధన చేస్తే నే ఏదైనా సాధ్యం. భాగవత సహవాసం వల్ల సహనం వస్తుంది. ఆచార్యకటాక్షం లభిస్తుంది. ఆచార్యుని దయ కలగడానికి ముందు ఏం చేయాలో వివరించే పాశురం ఇదిలోపల ఉన్న గోపికను వాకిలి బయటనుంచి పిలుస్తున్నారు అక్కడ చేరిన గోపికలు. నిన్న తమతో చేరిన గోపబాలికతో కలిసి పంకజనేత్రుని పుండరీకాక్షుని వర్ణిస్తూ ఉంటే విన్న లోని గోపిక తాను బయటకు వస్తే ఈ శ్రీకృష్ణ గానామృతాన్ని ఆపుతారేమోనని లోపలనుంచే తానూ గొంతు కలుపుతుందట. అది విని, మేలుకొని ఉన్నా బయటకు రాలేదని వీరు కోపిస్తారు.
Also read: పదితలలు గిల్లివేసె రామమూర్తి
బయటగోపికలు: “ఎల్లే!” ఏమే, “ఇళంకిళియే!” తీయనిమాటల లేత చిలకా! “ఇన్నంఉఱంగుదియో” అందరూ వచ్చిన తరువాత కూడా ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా? (చిలకవంటి గొంతుగల ఆ గోపిక తమ వెంట ఉంటే శ్రీ కృష్ణుడు సులభంగా లభిస్తాడని వీరి ఆశ, కనుక పరోక్షంగా పొగుడుతున్నారు)
లోపలి గోప బాలిక: చెవులు జిల్లుమనేట్టు పిలవవద్దు. మీ అందరినీఎడబాసి బాధతో నేనుంటే మీరు నన్ను పొగడటం సరికాదు (శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నారేమో అని అనుమానించి) “శిల్ ఎన్ఱు అరైయేన్మిన్” ఏమిటీ అల్లరి శ్రీకృష్ణుడు నా దగ్గరేమీ లేడు “నంగైమీర్!” పరిపూర్ణులు మీరే. “పోదరుగిన్ఱేన్” నేనే వస్తున్నాను లెండి.
బయటిగోపిక:”వల్లై”మహాసమర్దురాలివే, మంచి నేర్పరివే, “ఉన్ కట్టురైగళ్” “పండేయున్ వాయఱిదుమ్” కటువైన మాటలు, నేర్పు మాకు ఎప్పటినుంచో తెలుసులే.
లోపల గోప బాలిక: “వల్లీర్గళ్ నీంగళే” నేనేం కాదు మీరే సమర్థులు, నన్నా సమర్థురాలని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటువల్ల బాధలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, “నానే తాన్ ఆయిడుగ” రాకపోవడం నాదే తప్పు. పోనీ నేనే కఠినరాలిననుకోండి.
బయటి వారు: “ఒల్లై నీ పోదాయ్” సరే అలా అయితే రా మరి, “ఉనక్కెన్న వేఱుడైయై” నీకే ప్రత్యేకత ఉంది?
లోపల గోపబాలిక: “ఎల్లారుం పోందారో” అంతా వచ్చారా
బయటి గోపబాలిక: “పోందార్” అందరూ వచ్చారు, కావాలంటే నీవు బయటికి వచ్చి లెక్కించుకో నీ దర్శనం మాకు కావాలి.
లోపల గోప బాలిక: “పోంద్-ఎణ్ణిక్కోళ్” ఏం చేద్దాం అందరం
బయటివారు: “వల్లానై కొన్ఱానై ” బలీయమైన ఏనుగు -కువలయాపీడం “మాత్తారై మాత్తరిక్కవల్లానై” దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు “మాయనై” చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని, “ప్పాడ” పాడుదాం.
Also read: సీతను విడదీసిన రావణుని దునిమాడిన దాశరథి
విశేషార్థాలు
నిన్న పంకజనాభుని కీర్తిస్తూ పాడిన స్తోత్రాలను విని పరవశించిపోయి లోనున్న గోపిక కూడా మధురంగా పాడడం మొదలు పెట్టింది. ‘ఏమాశ్చర్యం నిన్ను లేపడానికి మేం వస్తే మమ్మల్ని మైమరిపించే విధంగా ఉంది నీ కంఠ మాధుర్యం. ఈ చిలుకపలుకులున్నా నీవు చిన్నారి చిలుకవు. శ్రీ కృష్ణుని సాంగత్యంలేని శరీరం నోరు తెల్లబడి ఉంటాయి. కాని నీవు లేతచిలుక పచ్చని మేని రంగుతో ఎర్రని నోటితో ఉన్నావు. అంటే నీవద్ద శ్రీ కృష్ణుడున్నట్టే కదా. మేమంతా వచ్చిన తరువాత కూడా నిద్రిస్తున్నావా? శ్రీకృష్ణుడి విరహంతో బాధ పడుతున్న మాకు నీ స్నేహం లేకపోవడం కూడా తోడైంది. మామాటలు విని కూడా నీకు నిద్ర ఎలా వస్తున్నదమ్మా?’ అని ప్రశంసాపూర్వకంగా ఆక్షేపిస్తున్నారు గోద, ఆమెతో వచ్చిన గోపికలు.
భగవంతుడి గుణానుభవంలో ఉన్న లోపలి గోపికకు చిన్నారి చిలుకా అన్న పిలుపు జిల్లుమనిపించింది. భగవద్గుణకీర్తనానందంలో తూగుతున్నవారికి భగవంతుని రాకకూడా ఆటంకం వలె ఉంటుందట. కనుక చిరాకు కలిగించేలా పిలవకండి అంటున్నదామె. నీ చతురత మాకు తెలుసు తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగానూ చెప్పగల నేర్పరివి. ఈ విధంగా వాద ప్రతివాదాలు కొనసాగాయి. తనది తప్పని ఎవరైనా అంటే వెంటనే ఒప్పుకుని ఎదురు చెప్పకపోవడం ఒక వైష్ణవ లక్షణం. ఇది అహంకార రాహిత్యం. దాసోహం అని భావిస్తారు.
రామానుజుపైన రాజ నిషేధం
ఈ సందర్భంలో ఒక సంఘటనను దేవనాథన్ గారు ఉదహరించారు. క్రిమికంఠ చోళుని వైష్ణవ ద్వేషం వల్ల రామానుజుడు దేశం విడిచిపోవలసి వచ్చింది. రామానుజునితో సంబంధం ఉన్న వారెవరూ శ్ర్రీరంగప్రవేశం చేయరాదని నిషేధం విధించారు. ఓరోజు కూరత్తాళ్వార్ శ్రీరంగని సేవకు ఆలయానికి వెళ్లారు. కావలి వారు రాజాజ్ఞను వివరించి, అయినా నీవు ఎవరికీ విరోధివికావు కనుక లోపలి వెళ్లవచ్చు అన్నారు. శ్రీమద్రామానుజుని సంబంధం తెంచుకుని నేను లోనికి వెళ్లను అని వెనుదిరిగిపోయారా స్వామి, ఎంత త్యాగశీలి. భాగవత వ్యతిరేకమయిన భగవద్విషయం అనుష్ఠాన యోగ్యం కాదని కూరత్తాళ్వార్ చాటారు. ఇది భక్తి.
అయిదో పాశురం నుంచి గోదాదేవి మాయనై అని శ్రీకృష్ణలీలలను వివరిస్తూ వచ్చారు. పది పాశురాల్లో ఆశ్చర్యకరమైన ఘట్టాలను ప్రస్తావిస్తారు. ఈరోజు పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను ఆండాళ్ పరిచయం చేసిందని వివరించారు జీయర్ స్వామి. యోగ్యులు, జ్ఞానులూ అయిన వారితో కలిసి ఉంటూ వారు చూపిన దారిలో నడిస్తేనే శ్రేయస్సు. అటువంటి భాగవతుల సాహచర్యం కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే అసలు తిరుప్పావై అంటూ, ఇంక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలని రచించారని జీయర్ స్వామి వివరించారు.
ఆచార్యుడే చిలక
యతులను, భక్తులను, భగవద్గుణానుసంధానం చేసే ఉత్తములయిన భాగవతోత్తములను దర్శించుకోవడం ముఖ్యం. ఈ పాశురం భాగవతుల పారతంత్ర్యం గురించి వివరించింది. ఎల్లే ఇలంగిళియే= చిన్నారి చిలుకా అంటే భాగవతుల దర్శనం వారి మాటలు వినడం పరమలక్ష్యం అని. చిలుక అంటే భగవంతుని సారూప్యమును పొందిన ఆచార్యుడికి ప్రతీక. చిలక పలుకులంటే భగవద్విషయంలో రుచి కలిగినవారి మాటలని అర్థం. భాగవతులందరితో కలిసి ఉండాలి, ఇన్నమ్ ఉరంగుదియో = ఇంకా నిద్రపోతున్నావా అంటే భాగవతుల సహవాసం లభించినప్పడికీ వాళ్లతో చేరకపోవడం దోషమని. నీ ప్రత్యేకతేమిటి? అంటే పూర్వాచార్యులు నడిపిన దారిలో నడవాలని, ప్రత్యేకంగా వ్యవహరించరాదని భావం.
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ గుణ కీర్తనం చేసేప్పుడు భగవంతుడు వచ్చినా ఓర్చుకోవడం కష్టం. నంగైమీర్ పోదరు గిన్ఱేన్ భగవద్విషయంలో ఆహ్వానిస్తున్నవారిని భక్తిపురస్సరంగా ఆహ్వానించాలి. నానేదాన్ ఆయిడుగ = నేనే వాక్చాతుర్యంగా ఉండనీ భక్తులను వదులకుని శ్రీ మహావిష్ణువును ఆశ్రయించడం తగదు కనుక నిందనైనా ఒప్పుకుని వారిని కలవడం ప్రధానం. ఆచార్యవాక్యము, భాగవతులతో కలిసి ఉండడం అనే రెండే ఆచార్య ప్రాప్తికి కారణాలు. ఎల్లారుం పోందారో = అందరూ వచ్చారా అంటే తారతమ్యాలు లేకుండా అందరూ వైష్ణవులే అని భావించాలి. పోన్దెణ్డిక్కొళ్ =లెక్కపెట్టుకో అంటే ఏ ఒక్క భక్తుడు రాకపోయినా భగవదనుభవానికి కొరతే. మాయనై పాడు = మాయావిని కీర్తించు కువలయాపీడము = లోకాన్ని పీడించే అహంకారము, చాణూర ముష్టికులు= కామక్రోధాలు, వాటిని నిర్మూలించిన మాయాచేష్టితుడైన శ్రీకృష్ణుడిని తిరునామాలను కీర్తించడమే భోజనం.
Also read: నిరంతరం యవ్వనంలో ఉన్న గోకులంలో గోవులన్నీ
గోదమ్మ పాదాలె మనకు శరణు