Thursday, November 21, 2024

కృష్ణా నదీ జలాల్లో న్యాయమైన వాటా సాధనకై బుధవారం టీజేఎస్ నాయకుల దీక్ష

తెలంగాణా జానా సమితి పార్టీ కార్యాలయం– కేర్ దవాఖాన పక్కన, నాంపల్లి, 11-1-2023న

కృష్ణా నదిని కేవలం ఒక నదిగానే  చూడలేము.  చూడకూడదు. ఆ నది తెలంగాణ జీవధార. తెలంగాణ  చరిత్రకు ఆనవాలు. తెలంగాణ అభివృద్ధికి దారి. దురదృష్ట వశాత్తు ఇవ్వాళ కృష్ణమ్మతో తెలంగాణకు  ఉన్న పేగు బంధం తెగిపోతున్నది. తెలంగాణకు దక్కవలసిన నీటి వాటాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచినా పొందలేక పోవడమే అందుకు కారణం. నదీ జలాల్లో వాటాను సాధించడంలో మన ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది.

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట ట్యాగ్ లైన్ నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న విషయం అందరికీ తెలుసు. ఇంకా ఇవి కాక అస్థిత్వం, ప్రజాస్వామ్యం అనే మరో రెండు అంశాలు కూడా వున్నాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెట్టి అసలు సమస్య గురించి మాట్లాడుకుందాం. నీళ్ళకు సంబంధించిన పోరాటం ప్రధానంగా కృష్ణా నదిలో వాటాకు సంబంధించిన పోరాటంగానే సాగింది. అప్పటికి కృష్ణా నదీ  జలాలు రాజోలిబండ, జూరాల, నాగార్జున సాగర్ నుండి మాత్రమే తెలంగాణకు నీళ్ళు దక్కినాయి. ఇవికాకుండా మధ్య తరహ ప్రాజెక్టులు, చెరువుల కింద కొంత సాగు ఉన్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 68.50 శాతం తెలంగాణలో ఉండగా సీమాంధ్ర ప్రాంతంలో  పరీవాహక ప్రాంతం కేవలం 31.50. నది పరీవాహక ప్రాంతంలో మూడుపాళ్ళు తెలంగాణాలో ఉన్నా దక్కిన నీళ్ళు కేవలం 37 శాతమే. సీమాంధ్రకు 512 టీఎంసీలు వాటా దక్కింది. కాగా తెలంగాణా వాటాకు కేవలం 299 టీఎంసీ నీళ్ళు మాత్రమే వచ్చినాయి. కృష్ణా నదిలో  ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన నీళ్ళలో 63 శాతం సీమాంధ్ర, 37 శాతం తెలంగాణా వాడుకున్నాయి. రాజోళి బండ, జూరాల ప్రాజెక్టుల కింద నీటిని పూర్తి సామర్థ్యం వాడుకోలేక పోయినం. ఆ లెక్క తీస్తే మనకు దక్కిన వాటా మరింత తగ్గుతుంది.

కుప్పకూలిపోయిన తెలంగాణ సాగునీటి వ్యవస్థ

తెలంగాణాలో చెరువుల కింద ఉన్న ఆయకట్టు మొత్తం 8.33 లక్షల ఎకరాలు. అయితే రకరకాల కారణాల చేత చెరువులు శిథిలమై ఆయకట్టు  క్షీణించింది. అందువలన భారీ నీటి పారుదల ప్రాధాన్యత పెరిగింది.  భారీ నీటి ప్రాజెక్టుల నుండి నీళ్ళు తెచ్చి చెరువులు నింపితే తప్ప తెలంగాణలో సాగునీటి వ్యవస్థను స్థిరీకరించే పరిస్థితి లేదు. చాలా సూటిగా చెప్పాలంటే తెలంగాణ సాగునీటి వ్యవస్థ కుప్పకూలిపోయింది. అది కూడా అంతకు ముందున్న వర్షాధార పంటలు పోయి, నీళ్ళు ఉంటే తప్ప పండని వ్యాపార పంటలు వచ్చిన నేపధ్యంలో ఈ సమస్యలు వచ్చినాయి. అందువలన నీళ్ళ లేమి తెలంగాణాలో తీవ్రమైన ఆర్థిక, సామాజిక  సంక్షోభాన్ని తీసుకొచ్చింది. రైతుల ఆత్మహత్యలకు ఇదీ నేపధ్యం. నీళ్ళు లేక వేసిన పంటలు ఎండిపోయి, పెట్టిన పెట్టుబడి వెళ్లక, అప్పులు మీద పడి  రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. సాగు నీరు  ఇవ్వడమే ఈ సమస్యలకు పరిష్కారమని గుర్తించి నీళ్ళ కోసం పోరాటం చేసినం.

కృష్ణా నదిలో వాటా దక్కక పోవడంతోనే దక్షిణ తెలంగాణ భారత దేశంలోకెల్లా అత్యంత కరువు పీడిత ప్రాంతంగా మారిపోయింది. బతుకు దెరువు లేక బతకపోవలసిన పరిస్థితి దాపురించింది. మహబూబ్  నగర్ వలసల జిల్లాగా మారిపోయింది. నల్గొండ ఫ్లోరోసిస్ బాధిత జిల్లాగా మారింది. తాగు, సాగు నీరు ఇస్తే తప్ప ప్రజలు ఆత్మగౌరవంతో బతకడం సాధ్యం కాదని ఈ జిల్లాల ప్రజలు 1980 దశకంలో నిర్వహించిన జలసాధన ఉద్యమాలు తేల్చి చెప్పినాయి. ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్ళు ఇచ్చి దక్షిణ తెలంగాణను ఆదుకోవచ్చునని ఇంజనీర్లు ఉన్న పరిజ్ఞానాన్ని పరిచయం చేసినారు. అయినా ఆంధ్రా పాలకులకు దయ రాలేదు. పోరాటాలు బలపడిన తరువాత కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పథకాలు మంజూరైనా పనులు వేగంగా నడువ లేదు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణా పోరాటం సాగింది. తెలంగాణా వస్తే మన నీళ్ళు మనకు వస్తాయని ఆశ పడినం. మన ప్రాజెక్టులు తొందరగా పూర్తి అయిపోతాయని అనుకున్నాం. అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి.

నీటి కేటాయింపులు లేక పూర్తి కాని ప్రాజెక్టులు

తెలంగాణా ఏర్పడిన నాటికి పెండింగులో నున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన మొత్తం తక్కువే. నెట్టెంపాడు పూర్తికి 242 కోట్ల రూపాయలు, కోయిలసాగర్పనులు కావడానికి 107 కోట్ల రూపాయలు, ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు కోసం 100 కోట్ల రూపాయలు, కల్వకుర్తి కొరకు 1613 కోట్ల రూపాయలు, ఉదయ సముద్రం కొరకు 268 కోట్ల రూపాయలు, ఎస్. ఎల్. బి. సి సొరంగం పూర్తిగా తవ్వడానికి 729 కోట్ల రూపాయలు చాలు. మొత్తం మీద 3059 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 5.37 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. ఇంకొక 28,796 కోట్ల రూపాయలు కేటాయిస్తే పాలమూరు-రంగారెడ్డి పథకం, డిండి ప్రాజెక్టు, సీతారామ లిఫ్టు పథకం కూడా పూర్తి అయ్యేవి. ఇంకొక 22.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఏర్పడేది. కానీ నిధులు మంజూరు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చినట్టే ఇక్కడ కూడా నిధులు మంజూరు చేస్తే ప్రాజెక్టులు అయిపోయేవి కదా అని అడిగితే ఇంజనీర్లు చెప్పే సమాధానం పైన జాగ్రత్తగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. అనుమతులు లేకపోవడంతో ఈ ప్రాజెక్టులకు రుణాలు దొరకడం లేదని అంటున్నారు. అనుమతులు ఎందుకు లేవంటే నీటి కేటాయింపులు లేక పోవడం వల్లనే అనుమతులను సాధించ లేక పోయామంటారు. తెలంగాణ విషయానికొస్తే కృష్ణా నదిలో మనకు వాటా కేటాయిస్తే తప్ప మన ప్రాజెక్టులు పూర్తి కావన్నమాట.

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేమి

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. రెండు రాష్ట్రాలు విడిపోయి దాదాపు 9 సంవత్సరాలు గడిచినా కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పోరాటం చేయడం లేదు. మన తరఫున పోరాడగల ప్రభుత్వం లేకనే అన్యాయం జరిగిందని కోట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మన ప్రభుత్వమే అధికారంలో ఉన్నా తెలంగాణా సోయితో వ్యవహరించడం లేదు. ఎంతసేపటికి వారి దృష్టి వ్యక్తిగత వ్యాపారాల మీదనే ఉన్నది. అందుకు లిక్కర్ కుంభకోణం ఒక సాక్ష్యం. ఈ తొమ్మిదేండ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉంటే నీటి వివాదాలు పరిష్కారమై, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి  అవసరమైన పైసలు కూడా తక్కువేనని పైన తెలుసుకున్నాం. అనుమతులు వస్తే లోన్లు దొరికేవీ ప్రాజెక్టులు పూర్తయ్యేవి.

మన పరిస్థితి ఇట్లా వుండగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పొత్తి రెడ్డి పాడు సామర్థ్యాన్ని పెంచే పనులను మొదలు పెట్టింది. పనులు పూర్తయితే రోజుకు కృష్ణ నుండి 10 టీఎంసీల నీళ్ళను ఆంధ్ర ప్రదేశ్ మళ్లించుకొని పొగలదు. అప్పుడు తెలంగాణా తన వాటాను శాశ్వతంగా కోల్పోతుంది. ఈ ముప్పు ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేదు.

కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ దుర్మార్గం

వివాదాలను పరిష్కరించి, నీటి పంపకాలను పూర్తి చేయడంలో విఫలమైన  కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరొక దుర్మార్గానికి పూనుకున్నది. మొత్తం కృష్ణ, గోదావరి నదుల నిర్వహణను, ప్రాజెక్టుల నిర్వహణను తన చేతుల్లోనికితీసుకున్నది. నదులపైన, ప్రాజెక్టుల పైన రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాన్ని, 15 జులై 2021 నాడు ఒక గెజిట్  ద్వారా కైవసం చేసుకొన్నది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అనుమతులు లేని ప్రాజె్క్టులను ఆపివేయమని ఆదేశించింది. ఈ గెజిట్ కారణంగా ఉన్న అసమానతలు కొనసాగుతాయి. దురదృష్ట కరమైన పరిస్థితి ఏమిటంటే ఈ కీలక సమయంలో మన కొరకు కొట్లాడగల శక్తి లేకుండా పోయింది.

భారస జాతీయ స్థాయి ఆశలు

రాష్ట్ర ప్రభుత్వం నీటి సాధనకు చిత్తశుద్ధితో పనిచేయదన్న అనుమానాలు ఇప్పుడు ఇంకా పెరిగినాయి. ఇప్పుడు తెరాస తన పేరును  భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని జాతీయ పార్టీ అయిపోయింది. తెరాసగా ఉన్నప్పుడే మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదని ప్రకటించి ఉద్యమ ఆకాంక్షల సాధన కర్తవ్యాన్ని గాలికి వదిలేసింది. ఇప్పుడు అది జాతీయ పార్టీగా మారింది. ఆంధ్రాలో కూడా బలమైన పార్టీగా ఎదగాలని ఇప్పుడు భారసప్రయత్నిస్తున్నది. ఈ పరస్థితిలో మనకోసం కొట్లాడే అవకాశం లేదు. ఎంతసేపు తమ రాజకీయ ప్రయోజనాల పైనే దృష్టి తప్ప తెలంగాణా సంక్షేమం పైన పట్టింపు లేదు. అందుకే తెలంగాణా ప్రజలు, తెలంగాణవాదులు ఐక్యం కాకుండా తెలంగాణాకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇంతవరకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం, సదస్సులు, సమావేశాలు జరిపినం. తెలంగాణాలో ఉన్న సంఘాలతో పాటు అమెరికాలో ఉన్న తెలంగాణ వాదులు కూడా తెలంగాణాకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు  ఎన్ని ఉత్తరాలు రాసినా అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రం కానీ స్పందించ లేదు. కృష్ణా నదిలో న్యాయమైన వాటా సాధన కోసం, పెండింగు ప్రాజెక్టుల పూర్తి కోసం పోరాటం తప్పదు. లక్ష్య సాధన కోసం ఈ నెల, జనవరి నెల, 11వ తేదీ నాడు దీక్ష చేపట్టినం. మీరంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.

కృష్ణా నది జలాల్లో తెలంగాణా వాటా తేల్చాలి

కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి

కృష్ణా, గోదావరి నదులపై కెనదద్రం తెచ్చిన గెజిట్ ను ఉపసంహరించుకోవాలి

కృష్ణా నదీజలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడదాం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles