గొలుగొండ మండలం: AIARLA అనకాపల్లి జిల్లా
ఈరోజు ‘జగనన్నకు చెప్పుకుందాం’ అనే పేరుతో గొలుగొండ మండలంలో వినతి పత్రాల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ లతోపాటు ముఖ్యమైన అధికారులందరూ ఇందులో పాల్గున్నారు. మన అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం తరఫున గొలుగొండ మండలం సభ్యులతో కలిసి ఈ కింది అంశాలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.
1. గొలుగొండ మండలం మండల సర్వేయార్, అదే మండలంలో తాసిల్దారుగా పనిచేసే, తదుపరి చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ గారి ఆశీస్సులతో రోలుగుంట మండలం, ప్రస్తుతం బుచ్చి పేట మండలంలో పనిచేస్తున్న కే వెంకటేశ్వరరావు, వీరు ఇరువురూ కలిసి ఉన్నతాధికారులకు ఇచ్చిన తప్పుడు నివేదికలపై విచారణ జరపమని బాధిత ఆదివాసీలు చాలా కాలంగా కోరుతున్నారు. గొలుగొండ మండలం పాత మల్లంపేట గ్రామంలో సర్వేనెంబర్ 850లో ఆదివాసీలు గత 50 సంవత్సరాలుగా సాగులో ఉండగా ఈ ఇద్దరు అధికారులు అమెరికా నుండి వచ్చిన ఒక NRI మరియు నర్సీపట్నం కు చెందిన ఒక భూమి బ్రోకర్, వీరి ఇరువురికి సంధానకర్త కొయ్యూరు మండలం అధికార పార్టీ జిల్లా పరిషత్ సభ్యుడు, వీళ్లకు అనుకూలంగా ఈ ఇద్దరు అధికారులు నివేదికలు తయారు చేశారు. వీరిపై విచారణ జరపమని భూమిశిస్తూ కమిషనర్, ST కమిషన్, కమిషనర్ సర్వే & భూమి రికార్డుల శాఖ ఆదేశించినా నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరపలేదు. ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చి సంవత్సరం గడుస్తున్న ఎటువంటి ప్రగతి లేదు. ఇప్పటికే ఆదివాసీలు సంఘం నాయకత్వంలో స్పందనలో అనేకసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
2. పాతమల్లంపేట సర్వే నంబర్ 850లో ఆదివాసీల సాగు విషయమై ఎంజాయ్మెంట్ సర్వే జరిపి నివేదిక ఇవ్వమని ఈ సంవత్సరం మే నెలలో ప్రాజెక్ట్ అధికారి, ITDA, పాడేరు ఆదేశించిన నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎటువంటి సర్వే ని జరిపించలేదు.
3. చీడికాడ మండలం, కోనాం శివారు కొత్త వీధి గ్రామంలోని ఆదిమ తెగల ఆదివాసీల సాగు అనుభవం ఉండగా మొత్తం 37 ఎకరాల భూమిని 2022 జూన్ 13వ తారీఖున ఆదివాసీలకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అప్పటి చీడికాడ మండలం తాసిల్దార్ గిరిజనేతర్ల పేర్లతో రికార్డు మార్చేశారు. దీనిపై విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వమని భూమిశిస్తూ కమిషనర్ గత సంవత్సరం ఆగస్టు నెలలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వమని ఇప్పటివరకు మూడుసార్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ను, ప్రాజెక్ట్ ఆఫీసర్ను ఆదేశిస్తూ లేఖలు రాశారు. కానీ నేటి వరకు ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ కార్యాలయం తీసుకోలేదు.
4. ప్రధానమంత్రి PVTG మిషన్, అనే కేంద్ర పథకంలో ఆదిమ తెగలకు చెందిన ఆదివాసీల కోసం కేంద్ర ప్రభుత్వం 15 వేలపాట్ల రూపాయలు కేటాయించింది. అనకాపల్లి జిల్లాలో ఏడు మండలాల్లో PVTG ఆదివాసీలు 68 గ్రామాలలో ఉన్నట్లుగా గుర్తించాము. వీరందరికీ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మౌలిక వసతులు కల్పన ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రాజెక్ట్ ఆఫీసర్ పాడేరు వారికి గతంలో ఒక వినతి పత్రం ఇచ్చాము.
పై అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ గారికీ, జిల్లా కలెక్టర్ గారికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారికి సమస్యలను వివరించడం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే ఎంజాయ్మెంట్ సర్వే జరిపిస్తామని, విచారణకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ఇక జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆదిమ తెగల ఆదివాసీలు ఉన్న మండలాల్లో ఎండీవోలతో, ప్రాజెక్ట్ ఆఫీసర్ తో మాట్లాడి ఒక సమావేశం ఏర్పాటు చేస్తామనీ, కేంద్ర పథకానికి ప్రతిపాదనల సిద్ధం చేస్తామనీ హామీ ఇచ్చారు.
ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం గొలుగొండ మండలం కార్యకర్తలు గోరా సూరిబాబు, కవల చెంచయ్య మరియు గదబపాలెం గ్రామ కమిటీ సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.